ఆ జీవితాలు విషాద గీతికలు!

 ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో వచ్చే సాహిత్యం ,విమర్శ – స్థాయి విషయమై కొన్ని ప్రశ్నలు వచ్చినా, ఈ మాధ్యమం యొక్క పరిమితి ,వెసులుబాటు అర్థం చేసుకుని కవులు ,రచయితలు తమ సాహిత్య ప్రస్థానం సాగిస్తూనే వున్నారు . అలాంటి ఒక రచయిత్రి డాక్టర్  భార్గవి.

భార్గవి ఎంచుకునే విషయాలు ఒక అంశానికే పరిమితం కాలేదు. సంగీతం లోని రాగాలు, తను సందర్శించిన ప్రదేశాలు, కలసిన విషయాలు, ఆరోగ్య విషయాలు, సినిమాలు — ఇలా వైవిధ్యమైన విషయాలు తన పోస్ట్ లలో కనిపిస్తాయి. అలా భార్గవి వివిధ సందర్భాలలో  రాసిన 15 వ్యాసాలు ఒక మణి హారం లా గుదిగుచ్చినది ఈ పుస్తకం ‘అలా కొందరు ‘.

భార్గవి ఏ వ్యాసం రాసినా దానికి కావాల్సిన సమాచారం పోగేసుకుని, పరిశోధన చేసి, విషయాన్ని ఆకళింపు చేసుకుని  తనదైన శైలి లో మన ముందు ఉంచుతుంది. విషయం లోని గాఢత, తేలికపాటి భాష , సమగ్ర రూపంతో ఈ వ్యాసాలూ చదువరులకు తృప్తి నిస్తాయి.

ఈ పుస్తకం లో 15 మంది సంక్షిప్త జీవిత చరిత్రలు ఉన్నాయి. ఇందులో 10 మంది భారతీయులు ,మిగతా వారు విదేశీయులు. అయితే ఈ ఎంచుకున్న వ్యక్తులందరిలోను ఒక సామ్యం కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా తమ స్వ శక్తి పై ఆధారపడి, కృషి చేసి తమ తమ రంగాలలో శిఖరాలకు చేరిన వారే! ఈ  జీవితాలలో మరో సామ్యం గాఢమైన విషాదం . అందరూ వ్యక్తిగత జీవితంలో చుట్టూ వంద మంది వున్నా ఒంటరిగా వున్నా వారే ! ఒక్క మినహాయింపు తమ గురువుగారైన ఈ. ఎన్.బి. శర్మ గారు. వారి కథలోనూ వారి అసామాన్య ప్రతిభ, మానవీయత  వారికి శత్రువులను తెఛ్చి పెట్టింది.

ఈ వ్యాస పరంపరలో ఎక్కువ మంది స్త్రీలు. వీరందరూ శాపగ్రస్తులైన కళాకారులు. మార్లిన్ మన్రో, మాతహరి, గీతాదత్, గౌహర్ జాన్, అంజని బాయి, మీనా కుమారి, పర్వీన్ బాబీ, రీటా హేవర్త్ — అందరూ ప్రపంచమంతా ఆరాధించిన అందగత్తెలు. వారి అందానికి, వారి లోని కళకి గొప్ప గొప్ప వాళ్ళు దాసోహమన్నారు. కాసుల వర్షం కురిసింది. కానీ విధి వక్రించో, తమ చుట్టూ వున్నవారు మోసం చేసో, ప్రేమ లేక ఒక దయనీయమైన స్థితి లో మరణించిన వారే ! ఈ  జీవితాలు చూస్తే సమాజం స్త్రీల విషయం లో మరింత క్రూరంగా నిర్దయగా  ఉంటుందేమో అనిపిస్తుంది.

గూఢచారి అని చంపబడిన మాతహరి, భారత దేశంలో మొట్టమొదటి గ్రామఫోన్ రికార్డ్ ఇచ్చి, కచేరీకి మూడు వేలు  తీసుకుని మహారాణిలా బ్రతికి,చివరిలో ఆస్థి అంతా పోయి నెలకి 500/- తీసుకుని, అది కూడా పూర్తిగా అందాకా కష్టాలు పడ్డ గౌహర్ జాన్, సంగీత కచేరీలు దూరమయి శిష్యులను తయారు చెయ్యడంలో తృప్తి పడ్డ అంజని బాయి, చిత్ర రంగంలో వెలిగి ,చివరికి మతి స్థిమితం పోయిన పర్వీన్ బాబీ, రీటా హేవార్త్ .మద్యానికి బానిసయిన మీనాకుమారి — అందరూ సున్నిత మనస్కులే. వారి జీవితాలు విషాద కావ్యాలే.

మరో వ్యాసం లో చక్రపాణి గారి గురించి, ఓ.పి .నయ్యర్ జీవితాల గురించి రాశారు. ఇద్దరూ పెద్దగా చదువుకోక పోయినా అసమానమైన ప్రతిభావంతులు. వారిదంటూ ఒక ముద్ర వారు పని చేసిన రంగం లో ఉన్నాడని నిర్ద్వందంగా అనగలము.

గీతా దత్, గురుదత్ -ఇద్దరు ప్రేమ పొంది కూడా వారి ప్రలోభాల వల్ల , మోహాల వలన సున్నిత మనసు వలన తమ జీవితాలను దుఃఖమయం చేసుకున్నారు. ఇక మరో వ్యాసం ‘శారద ‘ అనే కలం పేరుతో రాసిన  నటరాజన్ కథ. దయనీయమైన పేదరికంలో వుండి, తన మాతృ భాష కాకపోయినా తెలుగులో చిరకాలం వుండిపోయే రచనలు చేశారు.

ఇక మొదటి వ్యాసం అమెరికన్ల ను గడగడ లాడించి ఒక పెద్ద నేర ప్రపంచం సృష్టించి దానికి రారాజుగా వెలిగిన పాబ్లో ఎస్కోబార్ కథ. ఇతని కథ జీవితం ఎలా జీవించ గూడదో తెలియ జేసే కథ.   నేరాలు చేసి సంపాదించినా డబ్బు చివరికి ఎందుకు పనికి రాకుండా అతని మరణానికి, కుటుంబం దురవస్థకు కారణం అయ్యింది.

ఈ పదిహేను కథలు మనకి జీవితంలోని అన్ని రంగులు ,కళలు చూపుతాయి. జీవితంలోని ఉత్థనా పతనాలను ఒక చిత్ర పాఠంలా భార్గవి మన ముందు ఉంచుతారు. వారి జీవిత కథలను ఒక నాటకీయత జోడు చేసి వాస్తవాలకు తన వ్యాఖ్యలు కలిపి ఆసక్తికరంగా రాసింది . తేలికైన భాష , సహజంగా వుంటూ, క్లుప్తంగా, స్పష్టంగా విషయం వివరిస్తూ సాగుతుంది ఆమె కథనం. ఈ పుస్తకం ఛాయా బుక్స్ వారు మనకు అందించారు.

*

ప్రసూన బాలాంత్రపు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు