దూరమున్న దూది ఆకాశమే హాయి…

వళ వర్ణం చీరలో నువ్వట్టా నడుస్తూ వస్తుంటే
మల్లెపూల బుట్ట నడిచొచ్చినట్టుగానే ఉంది
చీరంచుకు మోదుగుపూలను మూటకట్టుకొచ్చావేమో
మెరుస్తున్న లేతబానుడు తీరుగా ఉంది నీ చీర కొంగు
నీవట్టా నడుస్తుంటే నీ వీపు వైపు నుండి చూసి
ఒకసారి తిరిగి చూస్తే బాగుండునుకున్నా గానీ…
నీవు తిరిగి నా ఎదురుగా వస్తుంటే
అమాంతం పెరిగిన హృదయస్పందన
నిన్నెట్టా చూడాలో
చూస్తూ చూస్తూ క్రితంలోని మన కలయికకు
భిన్నంగా అసహజంగా ప్రవర్తించడం ఎట్లానో
తెలియక ప్రాణమంతా ఉక్కిరిబిక్కిరి ఐతుంది
ఊపిరాడనటువంటి స్థితిలో నేను హృదయాన్ని
గట్టిగా అదిమి పట్టుకున్న…
మొదటి సారి నీవున్న స్థలం నుండి నేను
దూరంగా వెడితే బాగుండు
భారంగానే అయినా కాసింత
నీ జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి కాకుండా
జీవించవచ్చని కోరుకున్నది.
ఎదురుగా నీవుంటే నీ ముఖాన్ని చూడకుండా ఉండే విద్యను,
నీ ముఖాన్ని చూడకుండా మాట్లాడటం నేనింకా నేర్చుకోలేదు.
నీ మాటను వినకుండా చెవులను తప్పించుకునే కళ నాలో లేదు.
నీ ముఖాన్ని చూస్తూ, నీ మాటను వింటూ
ఏదో పరిచిత మనిషిగా అసహజంగా నీతో పలకరింపు చేయలేను.
నీవు నాకు ప్రాణం కదా!
ప్రాణంతో ఎవరైనా అసహజంగా స్పందిస్తారా చెప్పు.
నీవెదురుగా ఉన్నపుడు అసహజంగా,
ఏదో బాహ్య ప్రాణంతో స్పందించినట్టుగా స్పందించడం కంటే
ఊహల్లో నీ రూపాన్ని నా కళ్ళనిండా నింపుకుని,
ఇద్దరం కూడున్నపుడు నీవన్న మాటలను గుర్తుకు తెచ్చుకుని
నీ మాటలను నేనే పలికి వాటికి స్పందనను నేనే తెలిపి
నీవు నాలోనే ఉన్నావనే ఆశతో గడపడం హాయిగా ఉంది
హాయిగా ఉందంటే బాధలేదు అని కాదు
నీవెదురుగా ఉన్నప్పటి దూరం కంటే
దూరంగా ఉన్నప్పటి
నాలో నిన్ను
నేను చూసుకునే దగ్గరితనం హాయిగా ఉంది.
*
2

ప్రేమ పొంగు…

చిట్టి తల్లీ…

ఈ వేళకాని వేళలో నీకు ఏ సందేశాన్ని పంపి

నీ హాయైన కలలను చెరపలెను

నీవు నీ ప్రశాంతమైన నిద్రను ఆసాంతం ఆస్వాదించాకే

ఈ శుభాకాంక్షలు నీకు చేరాలని కోరుకుంటున్న

నీ పుట్టిన రోజు అనగానే ఎన్నెన్ని ఊహలు

ఎన్నెన్ని ఆలోచనలో లోలోన

ఎన్నెన్నో చెప్పాలనుకుని

ఏది ముందు చెబితే ఇంకేదో మరిచిపోతాననే

కంగారుగా ఉంది తెల్సా…

చిట్టి తల్లీ…

నీవేదుగుతున్న తీరు చూస్తుంటే

దూరమైన బాల్యమంతా ఒక్కసారిగా

కళ్ళముందు గింగిరాలు కొడుతుంది

తుర్రుమని మాయమైన పిట్టోలే

బాల్యమంతా క్షణకాలపు జ్ఞాపకంగా

కళ్ళమీద మసకమసకగా వస్తుంది

నీవు నీదైన ఏ క్షణాన్ని

ఏ కారణం చేత కూడా

వృథా అయిందనే బాధకలగకుండా కాపాడుకోమ్మా

జీవితాన్ని జీవించడంలో ఉండే మాధుర్యాన్ని

నీవెప్పుడూ పోగొట్టుకోవద్దు తల్లి

నీకోసం నీదైన ప్రపంచాన్ని నీవే నిర్మించుకో

అచ్చం ఆ గిజిగాడు గూడల్లుకున్నంత

అందంగా, చాకచక్యంగా నిర్మించుకోవాలి తెల్సా

చిట్టి గువ్వా…

అప్పుడపుడు మన కలల ఆకాశం

పెళ పెలమని పెళ్ళునా విరగవచ్చు

అయినా నీవెప్పుడు ఆ చప్పుళ్లకు బెధరవద్దు

ఉన్న పళంగా మన ఆశల తోటలు వాడిపోవచ్చు

అయినా నీవు కృంగిపోవద్దు

విరిగిపోయిన ఆకాశాలను మళ్ళీ అతికించే క్షణాలను నీవు ఆహ్వానించు

వాడిపోయిన తోటలను మళ్ళీ కొత్తగా

నీ ఆలోచనల, జ్ఞాపకాల నీళ్ళతో వికసింప చేసుకో తల్లీ

బతుకంతా నీవు నడిచే దారిలో

నీ పాదముద్రలే ఉండేలా

ప్రతిక్షణం గమనిస్తూ వెళ్ళు తల్లి

నీ కళ్ళలో నీ కలలకు మాత్రమే చోటివ్వు

నీ ఊపిరి నీకోసమే తీసుకున్నా

జీవితం ఈ సమస్త ప్రకృతి ప్రసాదం అని మరిచిపోకమ్మా

నా మల్లెతీగా…

ఎదుగుతున్న నిన్ను చూస్తుంటే

సమీప కాలంలో నీవిచ్చే పరిమళాల ఊహ మనసులోకి వస్తేనే

మనసంతా మహా హాయిగా ఉంది కన్నా…

నీవేదుగుతుంటే నీకు ఆసరయ్యే వెదురుబద్దగా ఉండటానికి

సదా నన్ను నేను నీకు అంకితం చేసుకోగలనని మాటిస్తున్న బుజ్జితల్లీ…

గులకరాళ్లను తాకి తాళమేసే నీళ్ళలా నవ్వే నీ నవ్వును కొనసాగించు

శిశిరాన్ని సవాలు చేసే మోదుగు పువ్వులా

నిరంతరం నీలో నీవు వికసించు

గురుత్వాకర్షణ శక్తిని తన్ని

నిటారుగా నింగివైపుకు ఉరికే వృక్షాల్లా

ఈ అబద్ధపు లోకాన్ని , అసంబద్ధపు బంధాలను తొక్కుకుంటూ

నీదైన వడితో వడివడిగా సాగిపోవాలని కోరుతూ….

దిలీప్.వి

1 comment

Leave a Reply to గోపాల్ కృష్ణ విద్మహే Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హాయ్ దిలీప్ గారూ
    మీ రెండు కవితలూ చాలా బాగున్నాయి. మీరు మరిన్ని రాయాలని ఆకాంక్షిస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు