దక్కేది కేవలం గాయాలు మాత్రమే

సైఫ్ జీ, “నా రాజు గొప్పవాడు,
నేను నా దేశం కోసం చనిపోవాలి”
అని ఏ గుర్రమైనా గర్వంగా
అనుకుంటుందంటారా?

సైఫ్ జీ, భూమ్మీద చరిత్రలో ఏ గుర్రం కూడా
తనకు ఇష్టం ఉండి
రాజులు చేసే యుధ్ధాల్లో
వాహనాలుగా మారలేదు సార్ .

సైఫ్ జీ, చరిత్ర పుస్తకాలు రాజుల పరాక్రమాన్ని,
గుర్రాల వేగాన్ని వర్ణిస్తాయి కానీ,
ఆ గుర్రం యొక్క “సమ్మతి” గురించి ఎక్కడయినా
రాసాయా?

సైఫ్ జీ, ఇప్పటివరకు భూమ్మీద యుధ్ధాల్లో
గుర్రానికి దక్కేది కేవలం గాయాలు మాత్రమే.

సైఫ్ జీ, మనిషి తన అహంకారాన్ని మోయడానికి
ప్రకృతిని బానిసగా మార్చుకున్నాడు
అనిపిస్తుంది కదా.

సైఫ్ జీ, గుర్రం యుద్ధానికి వెళ్లడం అనేది
ఒక ‘సాహసం’ కాదు,
అది ఒక “మూగ బానిసత్వం.”

సైఫ్ జీ, ఇది నా యుధ్ధం ,
ఇది నా రాజ్యం ,అని ఏ గుర్రమయినా
ఫీలవుతుందంటారా?

సైఫ్ జీ ఈ భూమ్మీద
ప్రకృతిలో ఏ జీవి కీ సరిహద్దులు ఉండవు సార్,

 

సైఫ్ జీ, “గుర్రం పగ్గాలకు బానిస.. అయితే
మనిషి తన భ్రమలకు బానిస

 

సైఫ్ జీ, ఏం ఎఫ్ హుస్సైన్ గుర్రాలు
ఇదే విషయం చెప్తాయేమో కదా మనతో
వాటికి పగ్గాలు ఉండవు,
జీనులు ఉండవు,
వాటి మీద రాజులు అసలే ఉండరు.

సైఫ్ జీ,
ఆ పెయింటింగుల్లో
గుర్రాలు పరుగెడుతున్న తీరు చూస్తుంటే,
అవి ఎవరి యుద్ధం కోసమో వెళ్లడం లేదని,
కేవలం తమ సొంత అస్తిత్వం కోసం,
ఆనందం కోసం పరుగెడుతున్నాయనిపిస్తుంది కదా

సైఫ్ జీ, యుద్ధంలో ఉండే గుర్రాలు
తల దించుకుని బరువును మోస్తూ కనిపిస్తాయి .
కానీ హుస్సేన్ గుర్రాలు
తలలు ఎప్పుడూ పైకి లేచి,
గాలిని ముద్దాడుతున్నట్లు ఉంటాయి.

సైఫ్ జీ, ఇప్పుడు కొన్ని గుర్రాలు
పెళ్ళి భాజా బజంత్రీల వెనక
పెళ్ళికొడుకులను మోస్తూ
తమకు అవసరం లేని
ప్లాస్టిక్ పూలు,
జరీ గుడ్డలు,
మెరిసే కవచాల కింద నలిగిపోతున్నాయి.

సైఫ్ జీ, బహూశా
ఆ గుర్రం మనసులో
వీడి బరువు కంటే
వీడి అజ్ఞానానికి నాకు నవ్వొస్తుంది
అని
ఎవరైనా పెళ్ళికొడుకుని మోస్తూ
అనుకుంటుందంటారా?

సైఫ్ జీ,
యుద్ధంలో గుర్రాన్ని వాడటం
‘క్రూరత్వం’ అనుకుంటే …
పెళ్లిలో గుర్రాన్ని వాడటం
‘పైశాచికత్వం’ అనుకోవచ్చు కదా

 

సైఫ్ జీ కొన్ని గుర్రాలుంటాయి
వేగంగా పరిగెత్తితే లక్ష రూపాయలు
వస్తాయని వాటికి తెలియక పోయిన
పరిగెడుతుంటాయి.

సైఫ్ జీ , తలెత్తి కాకుండా..
ఈ పెళ్లి గుర్రాలు తల దించుకుని,
నడుస్తుంటాయి,
ఆ నడకలో ‘ఠీవి’ ఉండదు,
కేవలం ‘నిస్సహాయత’
తమ రాతను
అనుభవిస్తూ నడుస్తుంటాయి.

*

Image: Rafi Haque

సైఫ్ అలీ సయ్యద్ గోరే

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు