అనువాదాలు.
2005లో, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్-విశాఖపట్నంలో సబ్‌ఎడిటర్‌గా చేరినప్పుడు పరిచయమయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేసే లోకల్ కాంట్రిబ్యూటర్స్ మాకు తెలుగులో పంపే వార్తలను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయడం అక్కడ ఒక డైలీ రొటీన్. దాంతో, పదో తరగతి తరువాత విడిపోయిన తెలుగు భాషతో మళ్ళీ నాకు స్నేహం కుదిరింది.
కానీ, సమస్యంతా ఆ పత్రికా భాషను పాఠకులకు అర్థమయ్యేలా, ఇంగ్లిష్‌లో సరళంగా రాయడంలో ఉండేది. “ఒక వార్త రాస్తున్నప్పుడు అందులో మన భాషా పటిమను ప్రదర్శించడం కాదు, ఆ విషయాన్ని సామాన్య ప్రజలకి సరళంగా చెప్పడమే ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని!” జాబ్ వచ్చిన కొత్తల్లో డాడీ ఇచ్చిన ఈ సలహా ఎందుకో నాకు బండ గుర్తుండిపోయింది. ఆయన అదే ఫాలో అయ్యేవారు. నేనూ కూడా. అలా రోజుకు ఒక కాపీతో మొదలైన నా ప్రయాణం, నెమ్మదిగా 4-6 అనువాదాలతో ముగిసేది. ఆ తరవాతి కాలంలో నేను పనిచేసిన ఇంగ్లిష్ పత్రికలు, మ్యాగజైన్లలో తెలుగు అవసరం పడలేదు.
2021లో, పీపుల్స్ ఆర్కైవ్ అఫ్ రూరల్ ఇండియా (PARI)తో అనువాద ప్రపంచంలో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాయి. అయితే, ఇవి వార్తలు కాదు. కథలు. బతుకుతెరువు కోసం, తమ హక్కుల కోసం పోరాడే బడుగు బలహీన వర్గాల కథలు—కంటతడి పెట్టించేవి; కంటికి నిదురను దూరం చేసేవి. ఇక్కడే, ఫీచర్ రైటర్‌గా నా అనుభవం అక్కరకొచ్చింది. సహజంగా, నేను రాసే కథనాలు పాఠకులతో సంభాషిస్తాయి. ఇది నా శైలి. ఇదే PARIలో నన్ను ముందుకు నడిపిస్తోంది. అయితే, ఇక్కడ ప్రతీ పదాన్నీ తర్జుమా చేయాలి. లేదంటే, మా లాంగ్వేజ్ ఎడిటర్ ఒప్పుకోరు! ఒక్కోసారి ఈ కథలు భలే ముప్పుతిప్పలు పెడతాయి. కానీ, ఒక్కోటీ ఒక కొత్త అనుభవాన్ని అందిస్తాయి. టెక్స్ట్‌బుక్ భాష, వాడుక బాషల కలపోతగా ఇక్కడ నా అనువాదాలు సాగుతాయి.
ఈ కథల్లో, ప్రతీ మనిషినీ గౌరవంగా ప్రస్తావిస్తాను. ఇంగ్లిష్‌లో లేనిది, తెలుగులో ఉన్నది అదే—గౌరవం. అదీకాకుండా, పదవి, డబ్బు, హోదా ఉన్న వ్యక్తులకు వార్తా కథనాల్లో సైతం దక్కే గౌరవం వివక్షకు గురయ్యే మనుషులకు, అణచివేతను ఎదుర్కొనే సముదాయాలు, వర్గాలకు దక్కడం లేదు. అందుకే, ఇది అవసరం అనిపించింది.
అయితే, ఈ మధ్య ఛాయ పబ్లికేషన్స్ కోసం నేను అనువదించిన రెండు అంతర్జాతీయ నవలలూ — ‘ది హీలర్’ (ఫినిష్), ‘జార్ సిటీ’ (ఐస్‌ల్యాండిక్) — ఇప్పటి వరకూ నేను చేస్తున్న పనికి భిన్నంగా ఉంటాయి. రెండిటికీ అవార్డులు వచ్చాయి. నార్డిక్ క్రైమ్ థ్రిల్లర్స్. ఫిక్షన్. వీటిలో ఉండే భాష వేరు. ఎక్స్‌ప్రెషన్ వేరు. స్ట్రక్చర్ వేరు. పైగా, అలంకారాలు, జాతీయాలను విరివిగా వాడి అల్లిన కథలు. అందుకే, ముందుగా టార్గెట్ రీడర్స్ ఎవరో కనుక్కున్నాను. యువత/అర్బన్ రీడర్స్ అని తెలిశాక, వాడుక భాషలో రాద్దామని నిర్ణయించుకున్నాను. వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ‘టెంగ్లిష్’ కంటే మంచి అవకాశం ఇంకేముంది? అయితే, “ఉన్నది ఉన్నట్లు రాయకు. నీ స్టైల్‌లో రాయి. కానీ, ఎక్కడా సారాంశం కోల్పోకూడదు,” అంటూ ఛాయ సీఈఓ అరుణాంక్ లత నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో, నా పని సులువయ్యింది. బహుశా అందుకేనేమో, రెండు నవలలూ 6 నెలల్లో పూర్తి చేయగలిగాను.
ఇదిలా ఉంటే, ఈ నవలల్లోని భౌగోళిక ప్రదేశాలు, పాత్రల పేర్లను పలకడం, రాయడం ఒక హెర్క్యూలియన్ టాస్క్‌గా మారింది. ఒక పదం ఎలా పలకాలో తెలుసుకోడానికి మనం సహజంగా ఫొనెటిక్స్ వాడతాం. అమెరికన్ ఇంగ్లిష్, లేదా బ్రిటిష్ ఇంగ్లిష్ ఆధారంగా ఫొనెటిక్స్ ఉంటాయి. కానీ, నార్డిక్ భాషల్లో ఉచ్చారణ, లిపి చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి, Reykjavı´k (రేక్యవీక్), Audur (ఓవ్‌డుర్), Sörnäinen (సొర్నైనెన్), Jätkäsaari (యత్కసారి) అని పలుకుతారు. అందుకే, రీసెర్చ్ తప్పనిసరైంది. విదేశీ భాషల్లో ఎలా మాట్లాడాలో తెలిపే కొన్ని వెబ్‌సైట్లతో పాటు, లోకల్ యూట్యూబ్ వీడియోలలో ఆ పేర్లను ఎలా పలకుతున్నారో విని, తదనుగుణంగా తెలుగులో రాశాను.
ఈ నవలల్లో ఎదురైన ఇంకో ఇబ్బందికరమైన విషయం: బూతులు. వాటిని మాట్లాడడం వేరు. రాయడం వేరు. రాయడానికి నా జర్నలిస్టిక్ ఎథిక్స్ ఒప్పుకోలేదు. ఇదే విషయమై అరుణాంక్‌తో చర్చించిన్నప్పుడు, “ఒక పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు, ఏ విషయాన్నీ, సందర్భాన్నీ, అంశాన్నీ, వాక్యాన్నీ విస్మరించలేం,” అన్నారు. దాంతో, రోజువారీ భాషలో వాడుతున్న పదాలలోకి కొన్నిటిని తర్జుమా చేశాను. కొన్నిటిని మాత్రం, ఇంగ్లిష్ పదాలకే పరిమితం చేశాను.
అన్నిటికంటే ముఖ్యంగా, అనువాద ప్రక్రియలో, ఒరిజినల్‌లో ఉండే భావుకత, రిలేటబిలిటీ ఫాక్టర్ కోల్పోతాం అన్న నానుడి ఉంది. అయితే, ఈ నవలల ఇంగ్లిష్ అనువాదాలు మూలాల అంత గొప్పగా వచ్చాయని రివ్యూస్‌లో చదివాను. వాటిలోని ఇతివృత్తం, కథాంశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు మానవ సంబంధాలు, మనోభావాలు, మనస్తత్వాలు, సైకాలజీ, జీవనశైలి, సమస్యలు, బతుకు పోరాటాలు, ప్రవర్తనలు… ఇలా ఎన్నో అంశాలు మనకి వర్తిస్తాయి. నా హృదయాన్ని కదిలించాయి. కన్నీరు పెట్టించాయి. ఆలోచింపజేశాయి. అదే భావుకతతో, అంతే హృద్యంగా, అవన్నీ తెలుగులో ప్రతిబింబించేలా రాయడానికి ప్రయత్నించాను. మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.
*








Add comment