కవిమిత్రులకు సుహృల్లేఖ – 1

కొత్త కవిత్వ శీర్షిక ప్రారంభం

ప్పణ్ణుంచో నాకు కవిమిత్రులతో బహిరంగ వేదిక మీదనుంచి మాట్లాడదామని ఉంది. అది ఇప్పటికి కుదిరింది. నేనూ కాస్త కవిత్వం రాసినవాడినే. 1986-92 మధ్యలో నేను రాసినవి ఆంధ్రజ్యోతి వీక్లీలో “ఈ వారం కవిత” శీర్షికలో అచ్చయ్యాయి. ఆనక ఓ పాతికేళ్ళ విరామం. మళ్ళీ ఇటీవల ఓ మూడు నాలుగు రాశాను. అన్నీ కలిపి ఓ ఇరవై కవితలుంటాయేమో!

Rupert Brooke ఓ మంచి మాటన్నాడు. కవిత్వం చదవడమే అన్నిటికన్నా మిన్న అని. ఈ సూక్తిని నేను నమ్ముతాను. నాకు మంచి కవిత్వం చదవడమంటే చాలా ఇష్టం. నేనేమీ విమర్శకుడిని కాను. కనుక నా మాటలున్నాయే, వాటిని కాస్త ఉప్పుతో మిళాయించి తీసుకోండి (Take it with a pinch of salt.). సరే, కవిత్వం అంటే ఇదీ అనో ఇదే అనో ఎవరమూ నిర్వచించలేము. ఆ మహాప్రవాహాన్ని ఓ నిర్వచనమనే చట్రంలో బంధించలేం. కానీ ఒక మంచి కవితను చదవగానే సహృదయులైన పాఠకులు పోల్చుకోగలరు, ఆస్వాదించగలరు. కవులంతా సహృదయులు. చదివినది పెద్ద నచ్చకున్నా చూసీచూడనట్టు ఊరుకుంటారు గానీ ప్రతి నచ్చని రచననూ తెగుడుతూ కూర్చోరు (మౌనేన కలహో నాస్తి!). అంత ఈజీగా పెద్ద యోగ్యతాపత్రమూ ఇవ్వరు (వీడేమైనా శ్రీశ్రీయా!). కుకవినింద ప్రబంధయుగంతోనే అంతరించిపోయింది. కవిమిత్రులు కలిసినప్పుడు మాట్లాడుకునే మాటల్లో మాత్రం ఇది దర్శనమిస్తుంది, ఎవ్వరూ బహిరంగంగా ఫలానా వాడు కుకవి అనరు. (నేను కుకవినిందకై ఇది రాయడంలేదు సుమండీ!).

తెలుగునాట ఇవాళ మొహమాటం రాజ్యమేలుతూంది. నిర్మొహమాటంగా మాట్లాడాలంటే మనకు ఏకాంతం కావాలి, ముందొక అద్దం ఉండాలి. నా అనుకునే చిన్న గుంపు ఉండాలి. ఇదీ “నిరుపహతి స్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం..” లాంటి లిస్టే. అప్పుడే తోటి కవుల రచనలపై మన అసలు అభిప్రాయాలూ assessments బయటికొస్తాయి. నా తరంలో మొదట ధైర్యంగా మూసపోసిన రూళ్ళకర్ర రాజకీయ గొడ్డువచనాన్ని “ఇది కవిత్వం కాదు” అన్న కవి అఫ్సర్. అప్పట్లో అఫ్సర్ కవిగానే కాక విమర్శకుడిగానూ అందరికీ తెలుసు. Great poets create the taste by which they can be enjoyed అని ఇలియట్ అనలేదా, అలాగే కొన్నిసార్లు కాస్త కుకవిత్వనింద చేస్తే తప్ప సుకవిత (సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్!) నిలదొక్కుకోలేదు.

కవికి అన్నిటికన్నా ముందు, ఓంప్రథమంగా ఉండాల్సింది నిజాయితీ. కవిగా ఎదగాలంటే తన సొంతగొంతును పోగొట్టుకోకూడదు. కవిగా ఎదగడం అంటే తోవతప్పిపోవడం కాదు, తను నడిచిన తోవను ఇతరులు సులువుగా గుర్తించేలా విశాలం చేస్తూ పోవడం. కవి ప్రధానంగా బతికేది సహృదయుల హృదయాలలో, భజనపరుల పేలాపనల్లో కాదు. శ్రీశ్రీ కాలంలో శ్రీశ్రీని (శ్రీశ్రీ అంతటివాడినే) అనేకానేకవిధాలుగా విమర్శించినవారుండేవారు. ఇప్పుడలా ఉందా?

నిజమే, ఇప్పుడు కవిత్వానికి పాఠకులు బాగా తగ్గిపోయారు. రాసేవారిలో “యువకవులు” పెద్దగా కనిపించరు. అంతర్జాలంవల్ల అయితేనేం, smart phone వినియోగం ఎక్కువవడంవల్లనయితేనేం, ప్రజ వినోదానికైనా కాలక్షేపానికైనా పుస్తకాలు తెరవడంలేదు. ప్రపంచభాష అయిన ఇంగ్లిష్‌లో రాసిన ఇలియట్ అంతటివాడు కవిత్వానికి చదువరులు ఎప్పుడూ తక్కువే అని వాపోయాడు. భవిష్యత్తులో mathematics మాత్రం చెప్పుకోదగ్గ భాషగా నిలబడుతుందని వాణి వినిపించాడు. దానినీ విమర్శించినవారున్నారు. తతిమ్మా కళాకారుల్లాగే కవులూ సున్నితహృదయులు. ఒక్క ప్రోత్సాహకవాక్యం చూస్తే పొంగిపోతారు. కువిమర్శ కనిపించిందా మండిపోతారు. సద్విమర్శను ఆహ్వానిస్తారు, అది కవి ఎదుగుదలకు నిచ్చెనవంటిది కనుక. నా తాపత్రయమంతా ఈ నిశ్రేణీనిర్మాణప్రయత్నాల గురించే!

ఏకాంతంలో మనసులో నిశ్శబ్దంగా చదివినప్పుడే కవిత్వం పూర్తిగా అర్థమౌతుంది. సభల్లో విన్నప్పుడు దాని అసలు రూపం అంతగా అవగతమవదు. మానసికంగా చేసే దైవప్రార్థనవల్లే పుణ్యం ఎక్కువగా లభిస్తుందని ఓ స్మృతి చెబుతోంది. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడనరూ! అంటే, బిగ్గరగా ఎవరికో వినిపించేందుకు చదివే కన్నా తనకోసం తను చదువుకున్నప్పుడే కవిత నడక, నడత, హొయలు, సొబగు పాఠకులకు వంటబడతాయి. అందులోని music వినిపిస్తుంది. మనసు పెట్టడం ముఖ్యం. నా మటుకు మనసులో చదువుకున్న మంచి కవితలే నాతో ఇవాళ్టికీ ఉన్నాయి.

కవి ఎదుగుదలకు సహకరించే నిశ్రేణీనిర్మాణప్రయత్నం అన్నాను కదా! అదెలా ఉండాలో నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి మీతో పంచుకుంటాను. కవిత మీరు “విని” ఎక్కువ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు. శ్రావ్యంగా పద్యాన్ని గానం చేయడాన్ని నేను కించపరచట్లేదు. దాని విలువ దానికి ఉంది. కవిత (అధునాతన వచన కవిత) విలువ తెలియాలంటే మాత్రం మీకు మీరు చదువుకోవాలి, ఓ రెండు మూడు సార్లు. తరువాత దాని పని అది చేసుకుపోతుంది. అనుభవజ్ఞులైన పాఠకులూ కవులూ దాదాపు వెంటనే స్పందించగలరు. ఆ స్పందనకు మనం ప్రతిసారీ మనకు నచ్చినట్టు వాచ్యరూపం (articulation) ఇవ్వలేకపోవచ్చు. అయితే ప్రయత్నం చెయ్యగలం. ఇదే చెయ్యాలి. ఏ కవి అయినా neglect తట్టుకోలేడు కనుక, ఏదో చెప్పడమే మంచిది. ఈ ప్రోత్సాహం, సద్విమర్శ అందకపోవడంవల్ల బాగా రాయగలిగే చాలామంది రాయడం మానేస్తున్నారు.

ఎంత ఎక్కువ చదువుకున్న కవులు అంత గొప్పగా రాస్తారనే నియమమేమీ లేదు. కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా మంచి రచనలు చెయ్యగలరు. చేమకూర వెంకటకవి విజయ విలాసానికి వ్యాఖ్య రాస్తూ తాపీ ధర్మారావుగారు “ఈ కవి పెద్ద చదువుకున్నట్టుగా కనపడదు” అన్నారు. అయితే మహామహులు బాగా చదువుకున్నవారే, ప్రతిభావ్యుత్పత్తులు పుష్కళంగా ఉండి, బాగా చదువుకొని అభ్యాసం చేసినవారే. కవిత్వానికి కాలదోషముంటుందని నేను నమ్మను. ఇటీవల సూఫీ, జెన్ దార్శనికుల రచనలపై ఇష్టం పాఠకులలో పెరిగింది. కనుక, కేవలం సమకాలీన రచనలు చదువుతూ వాటిల్లోనే కాలయాపన చేసేకన్నా పురాకవనవీథుల్లో తిరగడం కవి అంతరంగానికీ కవి కలానికీ మంచిది.

తెలుగులో ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. మా గొంతు మాది, నా గొంతు నాది అని సర్వత్రా వినిపిస్తున్న కాలం. నాకు దీనితో పేచీలేదు. నిజమే, నేను రాస్తే, నేనే కనిపిస్తాను. కాస్త నా కుటుంబ నేపథ్యమూ మా సొంతూరు కనిపిస్తాయి. నా అనుభవాలే నా రచనల్లో ప్రతిఫలిస్తాయి. I can speak for myself అనడం ఆత్మవిశ్వాసానికి సంకేతమే. అయితే, ఈ ఉద్యమనేపథ్యంలో వచ్చిన రచనలైనా ప్రశ్నలనూ విమర్శనూ ఎదుర్కోవాలి. ఆ విమర్శ “తస్మదీయుల”నుంచి వచ్చినా సరే! మంచి కవిత రాసిన పిమ్మట కవికి ఒక ఉపశమనం (relief) దొరుకుతుంది. అది దొరకలేదంటే ఆ కవితను కొన్నాళ్ళు మగ్గనివ్వాలి. కొన్నాళ్ళయ్యక దానిని మళ్ళీ తాజాగా చూడాలి. అచ్చేసే పత్రికలో సామాజికమాధ్యమాలో ఉన్నాయిలే ఫరవాలేదనుకుంటే తప్పు. కొంచెం feedback ఇచ్చిన తోటి సహృదయుడు మనమా మాటని గౌరవిస్తామనీ మనలో మార్పు తదనంతరం కనిపిస్తుందని ఆశిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.

నేనేమీ poets’ paradise ని ఊహిస్తూ Utopia లో నివసించడంలేదు. కవిత్వవాతావరణం గురించి చెబుతున్నాను. మనకిప్పుడు ప్రతిభ ఉన్న కవులున్నారన్నది నిజం. అయితే, వారి పద్యాలన్నీ ప్రతిభావంతంగా ఉంటున్నాయా? లేదనే చెప్పాలి. దీనికి కారణం ఓ మోస్తరు smugness అని నేననుకుంటాను. ఆ smugness ను వదిలించడానికి ప్రయత్నం చెయ్యమనే ఈ వ్యాసం మనవి.

మళ్ళీ కలుద్దాం.

*

వాసు

13 comments

Leave a Reply to Nagaraju Ramaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సృహుల్లేఖ శుభారంభం గొప్పగా వుంది. ఆగామి సంచికలలో మీ సహృదయాన్ని పంచండి. అభినందనలు.

  • చాలా బాగుంది వాసూ! ఇక విజ్రుంభించు. రెచ్చిపో.

    • ధన్యవాదాలు ప్రసాద్‌గారూ, తప్పకుండా రాస్తాను.
      -వాసు-

  • Superb, superb.
    Excellently precise n, yet comprehensive.
    చాలా అవసరం ఉంది ఇలాంటి educative article కి.
    రచన కు పుటం పెట్టే పరీక్ష, విమర్శ.
    మన అనుకున్నవాళ్ళను పొగిడేయటం, కాదంటే కనీసం acknowledge కూడా చేయకపోవటం.
    “We deserve the government we have ” ఎంత సబబైన మాటో, మనం చూస్తున, చదువుతున్న సాహిత్యం కూడా మనం చేతులారా allow చేసిందే.
    We are either unpardonably passive or shamelessly patronizing.
    Thank you very much.
    You nailed it.
    Gave a clarity sort of thing. Looking forward to more from you in this series.

    • ధన్యవాదాలు పద్మజగారూ. మీరన్నది నిజం! నిజం!!
      -వాసు-

  • ఒక నిఖ్ఖచ్చితనం కవులు అభ్యసించవలసిందే.
    మెప్పు వాద మెక్కువైన సాహిత్య యుగంలో వున్నాం.
    మీ అక్షర విన్యాసం అటుగా మెప్పించగలదని ఆశ వుంది

  • It’s an eyeopner and thought-provoking write-up especially to the contemporary poets. Expecting more from you …Congrats sir.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు