కవన శర్మ “ఆమె ఇల్లు”-2

బాలిక కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ… ప్రతి దశలోనూ ఏదో ఒక అండ ఉండాల్సిందేననీ,
బాధ్యతలే తప్ప, హక్కుల గురించి నోరెత్తరాదనీ, 
తలదాచుకోవడమే తప్ప, తన ఇల్లని యెప్పుడూ భ్రమపడకూడదనీ
కఠినంగా చెప్పే సంకెళ్లమీద 
సహేతుకంగా పడిన సమ్మెట దెబ్బ –   ఆమె ఇల్లు – కవనశర్మ

 

ఆమె ఇల్లు
కవనశర్మ
(రెండవ – చివరి భాగం)

ఆపైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకొన్నాడోగాని ఆమె తండ్రి ఆమె వెళ్లేలోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్సెడ్ డిపాజిట్ మీద వేశాడు. ఆ తర్వాత ఆయన ఏడాదికి పోయాడు.
కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకు వచ్చింది.
“అంచేత అది నా ఇల్లు కాని నీ ఇల్లు కాదంటావు. బాగానే ఉంది. పోనీ బావగారి ఇల్లు నీ ఇల్లే కదా! అక్కడే ఉండు. ఇక్కడెందుకు!” అన్నాడు కృష్ణ.
“అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగార్ని అనమను. ఇల్లు తుడవడానికీ, ముగ్గులు పెట్టడానికీ, తోరణాలు కట్టడానికీ, భర్త శ్రేయస్సు కోరి పూజలు చెయ్యడానికీ కాక, నా మాట చెల్లే నా ఇల్లని, నాకిష్టమైతే నావాళ్లు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయనీ మీ బావగార్ని చెప్పమను. తక్షణం వెళ్తాను. పోతే నన్ను కన్న తండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్ద్వంద్వంగా ఆనాడే తేలిపోయింది. అది తిరగతోడవద్దు,” అంది కమల.
కృష్ణ అక్కడ భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్లి తన రాయబారం విఫలమైందని చెప్పాడు. రామారావు వెంటనే వెళ్లలేదు కమలింటికి. తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పది రోజుల తర్వాత కమల ఇంటికి వెళ్లాడు. వెళ్లి
“ఇంటికి రా!” అన్నాడు.
“ఎవరింటికి?” అని అడిగింది కమల.
“మనింటికి” అన్నాడు రామారావు.
“అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను” అంది కమల.
“ఎప్పుడు కాదన్నాను?”
“లక్షసార్లు” కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది.
రామారావు కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా “మీ ఇంట్లో అట్లాగేమో కానీ…” అంటూ ఉంటాడు. అట్లాగే కమలను వేరు చేస్తూ “మా ఇంట్లో అట్లా కాదు” అంటూ ఉంటాడు. ఎన్నాళ్లయినా ‘మీ’, ‘మా’ లు పోయి ‘మన’ అన్న మాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే “ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి” అనేవాడు.
“నా పుట్టింట్లో ఇది నా ఇల్లంటారు. మీరు కాదంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా ‘మీ ఇల్లు’ ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. వాళ్లేమో అది నాది కాదంటారు. ఈ రెండింటిలో ఏది నా ఇల్లు?” అని అడిగింది కమల ఓ రోజు.
“ఆడవాళ్లకేమిటీ! అన్నీ వాళ్ల ఇళ్లే” అంటూ రామారావు దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేశాడు.
ఎప్పుడైనా కమల అత్తగారు వస్తే ఆవిడా రామారావూ కలిసి కమలని పరాయిదానిగా చూస్తూ ప్రవర్తించేవారు. వాళ్ల ఆస్తి విషయాలు తలుపులు వేసుకుని కమల వినకూడదన్నట్టు మాట్లాడుకునే వారు. ‘ఆవిడా తనలాంటి కోడలే కదా! ఆవిడ ఎట్లా ఇంట్లోది అయింది? తను ఎట్లా పరాయిదైంది? బహుశ తన కొడుకుకి తను ఇంట్లోదీ, తన కోడలు పరాయిదీ అవుతుందేమో! అట్లా కానీకూడదు’ అనుకొంది కమల. అందుకని ఆమె కొడుకుని కోడలుకు దూరం చెయ్యాలని ప్రయత్నించలేదు, తను దగ్గరవాలనీ ప్రయనించలేదు.
కానీ ఒక్కసారి మాత్రం భర్తతో కూతురి తరఫున పోట్లాడింది.
“అది కూడా మీకు పుట్టిందే. మీ సంపాదనలో దానికీ భాగం ఉంది. రెండిళ్లలో ఒక ఇల్లు దాని పేర్న పెట్టండి” అంటూ.
దానికి కారణం కమల తండ్రి పోయాక కొన్నాళ్లు తల్లిని తన దగ్గర ఉంచుకొందామనుకుంది. భర్త ఒప్పుకోలేదు.
“మీ తమ్ముడిదే బాధ్యత” అన్నాడు.
“బాధ్యతలు వేరు, ఆపేక్షలు వేరు” అంది కమల.
“మా అమ్మ మన బాధ్యత, మీ అమ్మ కాదు” అన్నాడు రామారావు.
“బాధ్యతలు మనవి, అధికారాలు మీవి! బావుంది! ఇది మీ ఇల్లు. ఆవిడ మీ అమ్మ. ఆవిడ బాధ్యత మీ బాధ్యత” అంది కమల.
“ఇక్కడ నీకే బాధ్యతా లేకపోతే మీ ఇంటికే పో. ఇక్కడ నువ్వేం ఉండకర్లేదు” అన్నాడు రామారావు కోపంగా, పనిచెయ్యని పనిమనిషిని పన్లోనుంచి మాన్పించే ధోరణిలో.
కమల ఏమీ మాట్లాడలేదు ఆసారికి.
కాని కూతురి విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడివల్ల అటువంటి అవమానం పొందరాదని, ఆర్ధికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మి, కూతురికీ కొడుకుతో సమంగా వాటా పెట్టమంది. అప్పుడు కొడుకు పోట్లాడాడు. కోడలు, “ఇదెక్కడైనా ప్రపంచం మీద ఉందా! ముసలితనంలో మీ ఇద్దర్నీ చూసుకొనేది మేమా? తనా?” అని అడిగింది.
కమల కోడలికేసి జాలిగా చూసింది. ఆపైన నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది.
“మగవాళ్లు చాలా తెలివైన జాతి. అందుకనే ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మనని మచ్చిక చేసుకున్నారు. ఇంత గడ్డి పడేస్తే చాకిరీ చేసే యెద్దుకీ మనకీ పెద్ద తేడా లేదు. కొత్త బానిసని లొంగదీసుకోడానికి పాత బానిసల్ని వాడటం ఓ టెక్నిక్. ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్తా ఆడపడుచులూ కలిసి వంచుతారు. తరువాత ఆ ఇంటి కోడలు ఆడబడుచుల్ని ఆస్తి విషయంలో వంచిస్తుంది. ఇదంతా మగవాడు తన స్వార్ధంతో మన చేత చేయిస్తున్నదే. దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్టు మగవాళ్లు ఆస్తులు పంచుకుంటారు. నా భర్త, మరుదులు నా ఆడబడుచులకి వాటా పెట్టని రోజున అందులో నా స్వార్ధమూ ఉందనుకొని నేను నోరెత్తలేదు. నా తండ్రి నన్ను పరాయిదానిగా లెక్కవేసిన రోజున బాధపడ్డాను. ఈ రోజు నా కూతురికోసం నోరు విప్పాను. నువ్వు అడ్డుపడుతున్నావు ఇప్పుడు. ఇలా మనం ఒకళ్ల కళ్లు మరొకళ్లం పొడుచుకుంటూ ఉంటాం. ఈ ఇంటికి నువ్వూ, నేనూ, నా పుట్టింటికి నా తల్లీ మరదలూ, నా అల్లుడింటికి నా కూతురూ ఏ హక్కులూ లేని నౌకర్లం. ఎక్కడో నూటికీ కోటికో ఒకటీ అరా అదృష్టవంతురాలు ఉండవచ్చు. లేరనను. కానీ మనలో చాలామందికి అత్తిల్లూ మనది కాదు. పుట్టిల్లూ మనది కాదు.”
కానీ కమల ఆ రోజు కూడా భర్త ఇంటినుంచి బయటకి వెళ్లిపోదాం అనుకోలేదు.
‘లోకం మీద ఉన్నదే కదా’ అని సర్దుకొంది.
ఒకరోజున కమల తమ్ముడి కుటుంబం ఆ ఊరు వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. కమల కాఫీ డికాక్షన్ తీసి వాళ్ల కోసం ఎదురు చూడసాగింది. అప్పుడు రామారావు ఆఫీసునుంచి వచ్చాడు. కమలకి కాఫీ పొడి విషయం గుర్తుకు వచ్చింది. “కాఫీ పొడి అయిపోయింది. రేపటికి లేదు. తీసుకువచ్చారా” అని అడిగింది కమల.
“ఇవాళ ఆఫీసుకెళ్తుంటే రేపటిదాకా వస్తుంది అన్నావు కదా! రేపు తేవచ్చునని తీసుకురాలేదు” అన్నాడు రామారావు.
“మీరు ఆఫీసుకు వెళ్లాక మా తమ్ముడి కుటుంబం వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. అందుకని ఉన్న పొడితో డికాక్షన్ వేశాను. వాళ్లు రావాల్సిన టైమైంది. వాళ్లు రాగానే ఒకేసారి అందరికీ కాఫీ కలుపుతాను” అంది కమల.
కృష్ణ కుటుంబం అరగంట గడిచినా రాలేదు.
“నాకు కాఫీ ఇయ్యి. చచ్చినట్టు మళ్లీ వెళ్లి కాఫీ పొడి తీసుకు రావాలి కదా!” అని ట్రాఫిక్‌లో మళ్లీ డ్రైవ్ చెయ్యాల్సి వచ్చిన విసుగు వ్యక్తపరుస్తూ రామారావు అన్నాడు.
కమల కాఫీ ఇచ్చింది. రామారావు బయటికి వెళ్లి కాఫీ పొడి తెచ్చాడు. కృష్ణ కుటుంబం ప్రయాణం మానుకొన్నారు. వాళ్లు రాలేదు.
మర్నాడు పొద్దున్న కమల పాత డికాక్షన్ పారబోసి మళ్లీ తాజాగా డికాక్షన్ తీసింది. కమల, రామారావు కాఫీ రోజుకి కొద్దిసార్లే తాగుతారు. కానీ అది తాజాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. రామారావు అడగనే అడిగాడు, “నిన్నటి డికాక్షన్‌తో చేశావా? అని.
“కాదండీ. అది పనిమనిషికిచ్చేశాను” అంది.
“మర్చిపోయి అడిగాను. నువ్వు దానాల్లో కర్ణుడినీ శిబినీ మించిన దానివి” అన్నాడు రామారావు వెటకారంగా. అందులో అతను క్రితం రోజు కాఫీ పొడికి మళ్లీ బయటికి వెళ్లాల్సిరావటంవల్ల జనించిన కోపం ఉంది.
“మీరు మరి తాగరు కదండీ!” అంది కమల.
“నువ్వు తాగొచ్చుగా! రానివాళ్లు మీ వాళ్లు కదా! వస్తున్నట్టు రాసినవాళ్లు మానుకుంటే ఆ విషయం తెలియజేయవచ్చు కదా! అయినా వాళ్లు వచ్చారో లేదో చూసుకొని డికాక్షన్ వెయ్యవచ్చు కదా! ఇక్కడ ఎవరూ డబ్బు కుప్పలు పోసుకొని కూర్చోలేదు. సంసారపు బుద్ధులు బొత్తిగా లేవు నీకు. ఒక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. సంపాదన ఎంత కష్టమో!” అంటూ రామారావు ఉపన్యాసం ఇచ్చాడు.
ఆ మాటలకి కమల చాలా కష్టపెట్టుకుంది. ఆ రోజున, ఆ వయస్సులో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక రామారావు ఇంకోలా సాధించడం మొదలుపెట్టాడు.
“ఉద్యోగస్తురాలివి కదా!” “పెద్ద ఆఫీసరువి” “మొగుడొకడున్నాడనే విషయం గుర్తుండటం లేదు. ఆలస్యంగా వస్తే అడిగేవాడెవడు, అడ్డేవాడెవడు?” కమలకి సమాధానం చెప్పకుండా ఊరుకోవడం తెలుసు.
రామారావు అక్కగారు వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందాతర్వాత. “నాక్కుదరదు, నువ్వు పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేయి. మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు” అని రామారావు ఆఫీసుకు వెళ్తూ కమలతో చెప్పాడు వాళ్ల అక్క వస్తానన్న రోజున. ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి నాలుగు అవుతుంది.
రామారావు ఆఫీసుకు వెళ్లాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయల్దేరింది. బయల్దేర్తూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది. మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్ తేసుకొని ఇంటికి బయల్దేరింది. దార్లో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది. రోడ్డుమీది జనం ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ అవలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టుకట్టి పంపించారు. అప్పటికి అయిదు దాటింది. ఆమె కొంచెం కంగారుపడినా పక్కింట్లో తాళం చెవి ఇచ్చివచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది. మరో రిక్షాలో రిక్షావాడి సాయంతో ఎక్కి ఇంటికి వచ్చింది. రిక్షావాడే సాయం చేసి దింపాడు. అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది. కట్టు చీరచాటునుంది. అది రామారావుకి కనిపించలేదు. ఆమె ఇంట్లోకి అడుగుపెడ్తుండగా రామారావు, “వస్తున్నావా పెళ్లినడకలు నడుచుకుంటూ నెమ్మదిగా! ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చిన వాళ్లే చచ్చినట్టు అన్నీ చేసుకొంటారని నీ ఉద్దేశం” అన్నాడు.
రామారావు మాటలని పట్టించుకోకుండా, “వదినగారూ! మీకు పక్కింటావిడ తాళం చెవులివ్వలేదా?” అంటూ వదినగార్ని కమల పలకరించింది. ఆవిడ జవాబు చెప్పలేదు. అప్పుడు,
“దార్లో…” అంటూ భర్తకి సంజాయిషీ ఇవ్వబోయింది.
“స్నేహితులు తగిలారు అంతేగా! రోజూకంటే ముందు రమ్మంటే, ఆలస్యంగా వచ్చావు. నీకు నా మాటంటే లెక్కలేదు. నా మాటంటే లెక్కలేకపోతే నా ఇంట్లో ఉండక్కర్లేదు. వేరే ఇల్లు చూసుకు పో! ఇక్కడ నాతో కాపురం చెయ్యదలుచుకుంటే వళ్లు దగ్గర పెట్టుకుని కాపురం చెయ్యి” అని రామారావు కమలని దులిపేశాడు.
రామారావుకి కోపం రావటం కమల అర్థం చేసుకోగలదు. కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడనుకొంది. తనకి దెబ్బ తగిలి కట్టు కట్టించుకొని వచ్చిన విషయం తెలుసుకుని ‘అయ్యో పాపం’ అంటాడనుకొంది. ఆమె పుండుకి కారం రాసినట్టయ్యాయి అతని మాటలు.
ఆ మర్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజు కమలకి దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది. తప్పు చేసినట్టు అర్ధమైంది. కానీ “హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధులట్టుకొని తిరిగితే దెబ్బలూ తగుల్తాయి, మానభంగాలూ జరుగుతాయి” అన్నాడు. రామారావుకి ఆ పరిస్థితుల్లో ఏమనాలో తెలియలేదు. కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది. దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కుని అతనింట్లోంచి బయటపడింది.
కమల భర్త ఇంట్లోంచి బయటకి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకువెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు.
“అమ్మా, పోనీ వచ్చి నా దగ్గర్ ఉండు” అన్నాడు.
“నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది! ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పధ్ధతి నాకు పడదు. నీది కంపెనీ ఉద్యోగం. నువ్వూ నీ భార్యా పార్టీలకి వెళ్తారు. పార్టీలిస్తారు. అవంటే నాకు పడదు. అవి మానమంటే మీరు మానలేదు. నాకోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా” అంది కమల.
“అమ్మా! నా ఇంట్లో నా భార్యకుగానీ, నాకుగానీ పూర్తి స్వేఛ్చ ఉందా? ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరూ కొద్దిగా అయినా సర్దుకోక తప్పదు కదా!” అన్నాడు నారాయణ.
“కావచ్చు. కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు” అంది కమల.
“అమ్మా, మగవాడు డబ్బుకి బానిస, ఆడది మగవాడికి బానిస. భార్య భర్తకి బానిస. భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేఛ్చ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేఛ్చ అంటారు” అన్నాడు నారాయణ.
“నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణా! వ్యవస్థ మారితేగానీ మారనివి కొన్ని ఉన్నాయి నిజమే! కాని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవీ కొన్ని ఉన్నాయి. అలా వాళ్లు మారితే మరి కొందరి జీవితాలు రవ్వంత సుఖవంతమౌతాయి. మగవాళ్లు మాటల్లో, ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకీ ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు, స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి. పూర్వం మనువు ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ‘ అన్నది ఈ రోజున ‘న స్త్రీ గృహమర్హతి ‘ అయింది. చిన్నప్పుడు తండ్రి ఇంట్లోనూ, మధ్యవయస్సులో భర్త ఇంట్లోనూ, ముసలితనంలో కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారి ఇష్టాలు గమనించుకొంటూ, తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తోంది. ‘నా ఇల్లు ఏది’ అనేదానికి సమాధానం వెతుక్కుంటున్నారు,” అంది కమల.
“ఇది నీ ఇల్లా అమ్మా?” నారాయణ అడిగాడు.
“అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది” అంది కమల.
“ముసలితనంలో ఏం చేస్తావు? అప్పుడైనా నా దగ్గరికి రావా?”
“నీ ముసలితనంలో నువ్వేం చేస్తావు? అదే నేనూ చేస్తాను. ముసలితనం అనేది ఆడవాళ్లకే కాదు. మగవాళ్లకి కూడా వస్తుంది కదా! మరి మగవాళ్లకి ‘ఇది నాఇల్లు, ఇష్టం ఉంటే ఉండు – లేకపోతే పో” అని భార్యతోగానీ, పిల్లల్తోగానీ అనగలిగిన ధీమా దేనివల్ల వస్తోంది? అది దేనివల్ల స్త్రీకి లేదు? అంతేకాదు. అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్నూ, మావయ్యని, నాన్నగార్నీ ఎందుకిబ్బంది పెడ్తోంది?”
కమల వేసిన ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు.
“అసలు ఆమె ఇల్లు ఏది?” అన్న ప్రశ్న అతన్ని అతని ఇంటిదాకా వెంటాడింది.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు