నా హృదయం లోపల
ఎప్పుడూ ముడుచుకుని ఉన్న ఒక నీలి లోకం ఉంది.
అది బయట సముద్రం కాదు—
శబ్దం లేని, గాలి లేని,
కానీ నడిచే ప్రతి ఊపిరికి స్పందించే
మరచిపోయిన తరంగాల గర్భం.
వేదనలన్నీ కొండచరియలై
ఆ లోకంలో కూలి కూర్చుంటాయి,
సంతోషాలు మాత్రం చినుకుల్లా పైకి పైకి తేలుతూ
వెలుగుతో ఆడుకుంటాయి.
నిశ్శబ్దంలో కరిగిపోయిన నా కలలు
ఎవరికీ కనిపించని ముత్యాల్లా
కొన్ని ఉదయాలలో పుట్టి,
కొన్ని రాత్రులలో మరణిస్తాయి.
ఆ లోపలి సముద్రం
నా మొదటి హృదయ స్పందనకంటే పాతది,
నా చివరి శ్వాసకంటే శాశ్వతం.
నానా రహస్యాలు, పూర్వజుల జ్ఞాపకాలు
అలల రూపంలో దాగి
కెవ్వెదీ లేని పాటలను పాడుతాయి.
నేను గోడలతో చుట్టుముట్టినపుడు,
మార్గాలు మూసుకుపోయినపుడు
ఈ లోతైన జలరాశి
నన్ను పిలుస్తుంది—
తప్పక వినమని,
తప్పక శ్వాసించమని,
మళ్ళీ జీవించమని.
జీవితపు దిశలు కూలిపోతూ
అంతిమ సరిహద్దు దగ్గర నిలిచినపుడు కూడా
నాకు తెలుసు—
నేను వెతకాల్సిన సముద్రం బయటకాదు,
అది ఎప్పటినుంచో నా లోపలే,
నాతోపాటు ఎగసిపడుతూనే ఉందని.
అక్కడ అంతర్వాహిని కింద
ఓ అద్భుతం నాకంటపడింది.
దివ్యాత్మ సాన్నిధ్యాన్ని ఆశించే
అనేక కారణజన్ముల
ఆత్మ జ్యోతులతో
సాగరగర్భం అంతా దివ్యకాంతితో
దర్శనమిచ్చింది.
2
ఒప్పందాల భాష
ఆలయ ప్రాంగణం వెలుతురు,
గంటల ధ్వని గాలిలో చిందర వందరగా తేలుతూ—
తల్లి చేయి పట్టుకున్న చిన్నారి,
పసి కళ్ళలో మిడి కుతూహలంతో
గుడి ద్వారం దాటింది.
అక్కడ, రాయి దేవుడి ముందు
కొంతమంది మనసులోని భయాలతో మోకాళ్లపై కూర్చున్నారు.
తప్పుల కాయలు పగలగొట్టి,
కొబ్బరి, పూలు, అరటిపండ్లతో
కోరికల చిట్టా విప్పుతున్నారు.
వారి నమస్కారం,
పవిత్రత కంటే వ్యాపార గణన ఎక్కువ.
కొద్దిమంది మాత్రమే ఉన్నారు—
నిశ్శబ్దంగా, స్వచ్ఛంగా,
దైవమంతటి నిశ్చలతను తమలో జ్వలింపజేసినవారు.
కానీ ఎక్కువగా,
దేవుడిని కూడా ఒప్పందాల భాషలో
మాట్లాడే సమాజం.
అదే గుడి మూలలో—
ఏ లోక లావాదేవీలు తెలియని చిన్నారి,
అమ్మమ్మ చెప్పిన మాట ఒక్కటే నమ్మి వచ్చింది:
“గుడిలో దేముడు ఉంటాడు… అన్నీ ఇస్తాడు.”
ఆమె హృదయం—
ఏ కోరికలతోనూ, ఏ దురాశతోనూ
మసకబారని అద్దం లాంటి స్వచ్ఛత.
గుడి అంతటా ఆమె చూపులు విహరించాయి:
పొగడ చెట్టు కొమ్మలపై గువ్వలు
తెలియని భాషలో మురిపెంగా పలుకుతుంటే,
పక్క మండపంలో చిన్న వడుగులు
వేదస్వరాలను సవ్వడులుగా విప్పుతుంటే,
స్తంభాలపై చెక్కిన దశావతారాలు
ఆమె ముందు ప్రత్యక్షమవుతున్నట్టు అనిపించాయి.
అన్నింటినీ చూస్తూ,
దేవుడు ఎక్కడున్నాడు అని
ఏ ప్రశ్నా రాలేదు ఆమెకు—
అన్నిటిలో ఆయనే ఉన్నాడని
ఆశ్చర్యంతో తెలుసుకుంది.
గుడి చుట్టూ కలియతిరిగి అలసిపోయి,
తల్లి ఒడిలో తల వాల్చి నిద్రలో జారుకుంటూ—
తన కలల లోపల
ఆ దైవ దర్శన వైభవాన్ని
అందరికీ నిశ్శబ్దంగా చెప్పింది.
Add comment