ఆ తల్లి కన్నీళ్ళు

నాలుగు చినుకులు కురవంగనే
మట్టి పరిమళాన్ని వెదజల్లే నేలను నిర్మూలించగలవా?

తని కోసం ఎన్ని తనువులు తల్లడిల్లాయో
వాడు స్వయంగా చూసాడు
అతను వేసిన దారిలో
ఎన్ని పాదాలు నడిచి వచ్చాయో
వాడు డేగ కళ్ళతో చూసాడు

వాడు నాటిన నిషేదాల ముళ్ళ కంచెలను కాలితో తన్ని
చంటి బిడ్డలను చంకనేసుకొని
ఎన్ని వందల తల్లులు అతని కోసం నిర్భయంగా తరలి వచ్చారో
వాని కుట్రపూరిత కళ్ళతో స్వయంగా చూసాడు

వాడు ఎంత నెత్తురు పారిస్తున్నాడని
కనీ వినీ ఎరుగని హత్యలు
అడవి కోసం
అడవిలోని సంపద కోసం
ఆదివాసులను గూడులేని పక్షులుగా చేసే అన్యాయం
ఆదిమజాతిని కాపాడాలన్న తపనతో
తలవంచక పోరాడే వీరులను
జంతువులను వేటాడినట్లు వేటాడి
మారణహోమం జరుపుతున్న ఉన్మాదం

ఆ తల్లితో వాడు కలిసి భోంచేసి
చేతులు పట్టుకొని మాట్లాడి
తెల్లవారకముందే
ఆ తల్లి కడుపు పంటను కాల్చేసినవాడు
ఎంతటి కౄరుడై ఉండాలి

నిర్మూలించగలవా?

మనిషిలో పోరాడే చైతన్యాన్ని నిర్మూలించగలవా
అడవిపై వసంతం కురిపించే పచ్చదనాన్ని నిర్మూలించగలవా
సముద్రంలో నిరంతరంగా పుట్టుకొచ్చే అలలను నిర్మూలించగలవా?

నాలుగు చినుకులు కురవంగనే
మట్టి పరిమళాన్ని వెదజల్లే నేలను నిర్మూలించగలవా

దేన్ని నిర్మూలించగలవు నువ్వు?

అణచబడ్డ వాని అంతరంగం నుంచి పుట్టుకొచ్చే
తిరుగుబాటు బావుటాని నిర్మూలించగలవా
ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో
ఇప్పటివరకు దేన్నైనా నీవు నిర్మూలించగలిగావా
నక్సల్ బరిని నిర్ములించగలిగావా
శ్రీకాకుళాలను నిర్మూలించగలిగావా
తెలంగాణను నిర్మూలించగలిగావా
రేపు దండకారణ్యాన్ని నిర్మూలించగలవా

వ్యక్తులుగా ఒక్కొక్కరిని పట్టుకొని
భౌతికంగా నిర్మూలిస్తావేమో గాని
ప్రజలకున్న పోరాడే శక్తిని నువు నిర్మూలించగలవా
ఒక తరం నుండి ఒక తరానికి వారసత్వంగా అందే
ఉద్యమ స్ఫూర్తిని నువు నిర్మూలించగలవా?

ఆ తల్లి కన్నీళ్ళు వృధాగ పోవు

ఆ కన్నీటి బిందువులు నేలపై రాలి
నిప్పు కనికల్లాంటి పోరాట వీరులకు
పునర్జన్మ నిస్తుంది

ఆ తల్లి గుండె కోత వృధాగ పోదు

లక్షల హృదయాలను కలిచివేసి
తిరుగుబాటు ఉగ్గుపాలను నూరిపోస్తుంది
రేపటి తరానికి ఆ వీరుని పోరాటం
మార్గదర్శకమౌతుంది

బిర్సాముండా నుంచి అందిన పోరాట వారసత్వం
గూండాధర్ నుంచి అందిన పోరాట వారసత్వం
రాంజి గోండు నుంచి అందిన పోరాట వారసత్వం
కొమురం భీం నుంచి అందిన పోరాట వారసత్వం
అల్లూరిల నుంచి అందిన పోరాట వారసత్వాల రూపమే
నేటి మడావి హిడ్మా అనే పోరాట రూపం

నువ్వు అతని భౌతిక రూపాన్ని మాత్రమే నిర్మూలించగలిగావు కానీ
అతడు నిర్మించిన యుద్ధవ్యూహాన్ని పోరాట రూపాన్నీ
ఎన్నటికీ నువు నిర్మూలించలేవు

అది రేపటి తరానికి జీవిత పాఠమై
ఆ అడవిలోనే
పిడికెడు గుడిసెలు కూడా లేని ఆ గూడెం నేల మీదనే
లెక్క లేని హిడ్మాలకు జన్మనిస్తుంది

అడవి ఉన్నంత కాలం
అడవికి తల్లి అయిన ఈ నేల ఉన్నంత కాలం
ఈ నేలపైన ఉన్న నింగి ఉన్నంత కాలం
హిడ్మా అనే పేరు నిలిచి ఉంటుంది

ఆ తల్లి కన్నీటి ధార
ఎగిసిపడే జలపాతమై
నీ నిరంకుశ రాజ్యాన్ని
కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుంది
జాగ్రత్త!

*

వెంకట్ నాగిళ్ళ

1 comment

Leave a Reply to Kcubevarma Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉద్యమ స్ఫూర్తినీ నిండుగా అందిస్తూ విప్లవ నాయకుడు అమరుడు కామ్రేడ్ హిడ్మాకు గొప్పగా నివాళినీ అందించారు. అభినందనలు ✍🏼✊🏼

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు