ఆలస్యంగా అయినా అమెరికా రాక

వంగూరి జీవిత కాలమ్-56

అంత వరకూ దాని గురించి ఆలోచించే అవకాశం కానీ, అవసరం కానీ రాలేదు కానీ 1974 సెప్టెంబర్ లో నా డాక్టరేట్ పట్టాకి వైవావోసీ లో సఫలీకృతుడిని అయ్యాక, స్నాతకోత్సవానికి ముహూర్తం మరో నెలలోనే అని కూడా నిర్ధారణ అయ్యాక నాకు నిద్రపట్టక పోడానికి “తర్వాత సంగతి ఏమిటీ” అనే మరో కారణం దొరికింది. ఓ విధంగా చెప్పాలంటే నా భవిష్యత్తు నా ముందే హాయిగా సుస్పష్టంగా పరుచుకునే ఉంది.

డాక్టరేట్ వచ్చింది కాబట్టి ఇంచు మించు వెనువంటనే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవడం, అవే పాఠాలు కొత్త కుర్ర్రాళ్ళకి చెప్తూ, రిసెర్చ్ పేపర్లు అక్కడా, ఇక్కడా ప్రచురించుకుంటూ, మా ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ సమావేశాలకి వెళ్తూ ఐదారేళ్ళు గడిపేస్తే అసోసియేట్ ప్రొఫెసర్ అవడం, మధ్యలో ఎప్పుడైనా రష్యా లోనో, అమెరికాలోనో ఏడాది, రెండేళ్ళు గడిపేసి తిరిగి వస్తే ప్రొఫెసర్ గా అవడం, అప్పటికి నా వయసు యాభై లోపుగా ఉంటే, పాఠాలు చెప్పడం నుంచి యాజమాన్యం వేపు…అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ప్రయత్నం చేస్తే ఐఐటి డైరెక్టర్ లాంటి స్థాయికి వెళ్ళడం…ఇదీ నా భవిష్యత్తు నాకేసి చూపిస్తున్న పూల బాట. ఇదంతా నా వైవావోసీ అయ్యాక అందరినీ ఎక్కడో బొంబాయి మెరీన్ డ్రైవ్ లో సినీ తార వైజయంతి మాల నెలకొల్పిన  ‘నటరాజ్” అనే అత్యాధునిక ఖరీదైన రెస్టారెంట్ లో మా గురువు గారినీ, గుర్విణీమణి నీనా గారినీ ఖరీదైన డిన్నర్ కి తీసుకెళ్ళినప్పుడు ఆయన సంతోషంగా నాకు వేసిన బాట. వీటన్నింటికీ మధ్యలో ఎక్కడో పెళ్ళీ, పిల్లలూ, సంసారం లాంటి ఈతి బాధలు కూడా ఉన్నాయి కానీ కెరీర్ కి ఉన్నంత స్పష్టత లేనే లేదు. వాటి గురించి అంత నాకు తొందరా లేదు.

అయితే నాకు ఎందుకో ఆ కెరీర్ గ్రాఫ్ బొత్తిగా నచ్చ లేదు. అందుకు ప్రధాన కారణం అప్పటికే కేంపస్ లో ఆయా స్థాయిలో ఉన్న చాలా మంది నీరసంగా ఉన్నవాళ్ళే తప్ప జీవిత సారాన్ని ఆనందిస్తున్న వాళ్ళు తక్కువగా కనపడడం ఒక కారణం అయితే, నేను చెయ్యవలసినది ఇంకా ఏదో ఉంది, అది ఇది కాదు అనే అతి చిన్న ప్రకంపన మొదలయింది. ఏదో తెలిసో తెలియకో పిహెచ్. డి చేద్దాం అనుకున్నాం. కిందా, మీదా పడి అది చేసేశాం. మరింకేమిటీ? సరిగ్గా అప్పుడు  అప్పటికి ఆరేళ్ల క్రితం జరిగిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి వివరంగా ఇది వరలోనే (ఒక్క సరదా సంతకం నా జీవితాన్నే మార్చేసింది -38వ వ్యాసం, సారంగ 15, ఫిబ్రవరి 2019) వ్రాశాను. టూకీగా చెప్పాలంటే అప్పుడెప్పుడో 1969 లోనో, 1970 మొదట్లోనో ఒకానొక శుభ సాయంత్రాన రామ్ కుమార్ అనే మిత్రుడు నా చేత పలు రకాల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని, అమెరికన్ కాన్సలేట్ కి ఏవో మా ఇద్దరివీ అప్లికేషన్ పంపించాడు. దానికి ఐదారు నెలలలో ఒక ఉత్తరం వస్తే, నేను ఆ కవర్ కూడా తెరవకుండా నా రేకు పెట్టెలోకి విసిరేశాను.

ఆ విసిరేసిన సంగతి కూడా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. దాన్నే ‘అలా రాసి పెట్టి ఉంది” అనీ, జాతకం అంటారు పెద్దలు. ఆ రేకు పెట్టె లో వెతకగానే అట్టడుగున ఆ కవర్ కనపడింది. కవర్ మీద అది ఇమిగ్రేషన్ & నేచురలైజేషన్ సర్వీస్, శాన్ ఏంటోనియో, టెక్సస్ నుంచి వచ్చినట్టుగా ఉంది. ఈ శాన్ ఏంటోనియో అంటే ఏమిటో, అసలు అది ఒక ఊరి పేరు అని ఊహించడమే తప్ప  నిజానికి ఏమీ అప్పుడు నాకు తెలియదు. ఆ కవర్ తెరిచి చూడగానే అందులో ఒక అమెరికా వాడి ఉలిపిరి ఉత్తరం కనపడింది. అందులో భాష నాకు అర్ధం కాలేదు. సారాంశం కూడా తెలియ లేదు. అది చూడగానే నాకు నవ్వు వచ్చిన విషయం ఏమిటంటే అందులో నా పేరుతో సహా కొన్ని చోట్ల టైపింగ్ చేసిన సమాచారం, మూడో అంకె దగ్గర టిక్కు మార్కూ…..,మిగిలినదంతా ముద్రించిన సమాచారమే.

1974 అమ్మా నాన్నతో…

ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. తప్పదు. ముందుగా చెప్పవలసినది అంతకు ముందు..నాకు జూనియర్ అయిన మా తమ్ముడు 1969 లో కాకినాడలోనే ఇంజనీరింగ్ డిగ్రీ ఆఖరి రోజుల్లో తర్వాత  అమెరికా వెళ్ళాలా వద్దా, ఏమి చెయ్యాలా అని మధన పడుతూ ఉంటే, అప్పటికే బొంబాయి లో ఉన్న నేను వాడికి “అమెరికా వెళ్ళదల్చుకుంటే వెంఠనే వెళ్ళు. అంతే కానీ నాలాగా ఇండియాలోనే మాస్టర్స్ లాంటివి చేసి సమయం వృధా చేసుకోకు” అని ఘాట్టిగా సలహా ఇచ్చాను. నా సలహా వలనో కాదో నాకు తెలియదు కానీ వాడు 1970 లోనే..అంటే నా డాక్టరేట్ కి నాలుగేళ్ళ ముందే యూనివర్శిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ కి వెళ్ళిపోయాడు. నేనూ, మా చిన్నన్నయ్యా, స్వామి నాయుడూ కలకత్తా వెళ్ళి వాణ్ణి విమానం ఎక్కించాం. వాడికి ఆ సలహా ఇవ్వడానికి కారణం ఏమిటంటే, నేను బొంబాయి ఐఐటి లో చేరిన తర్వాత గమనించిన ప్రధాన అంశం అక్కడ బి.టెక్ చదువుతున్న కుర్రాళ్లు అందరూ మూడో ఏటి నుంచే అమెరికా విశ్వవిద్యాలయాలకి దరఖాస్తులు పెట్టుకుని, డిగ్రీ అవగానే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ కోవలోనే మాతో మాస్టర్స్ చదువుతున్న వాళ్ళు కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంతటే..వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి మా లైబ్రరీ వాళ్ళే వందలాది అమెరికా యూనివర్శిటీ వాళ్ళ నుంచి ఎడ్మిషన్ ఫారమ్స్ తెప్పించి పెట్టే వారు. గుంపులో గోవింద లాగా నేను కూడా నా మాస్టర్స్ – రిసెర్చ్ స్కాలర్ సంధి కాలం లో అర డజను అప్లికేషన్లు పెట్టాను. అలా అమెరికా చెక్కేసిన వాళ్లని ఆ రోజుల్లో బ్రైన్ డ్రైన్ అనే వారు. కాస్త చులకనగా, దేశ ద్రోహులుగా కూడా చూశేవారు. కాలక్రమేణా అమెరికా వెళ్ళిన వాడే ఎక్కువ దేశభక్తుడు గానూ, దేశానికి ఉపయోగపడే వాడుగానూ పరిస్ఠితి మారిపోయింది. ఒక సారి ఈ మార్పు మీద కాంగెస్ మంత్రులు చిదంబరం, నా శిష్యుడైన జై రామ్ రమేష్ 1990 లలో అనుకుంటాను…ఒక సారి హ్యూస్టన్ వచ్చినప్పుడు మౌలిక సిధ్ధాంత పరంగా సుమారు గంట సేపు చర్చించుకున్నాం.

ఇక ఇండియాలో అన్నీ చెత్త బుట్టలో పారెయ్యకుండా, ఈ అమెరికా వారు మనం పెట్టిన అప్లికేషన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చితీరేవారు ఆ రోజుల్ల్లో. వాళ్ళ రూటే వేరు. ఆ రోజుల్లో జోక్ ఏమిటంటే…మనకి అమెరికా నుంచి భారీ కవర్లో సవాలక్ష పేపర్లూ, ఆ యూనివర్శిటీ భవనాల రంగు రంగుల బొమ్మలూ వచ్చాయీ అంటే…మనకి ఎడ్మిషన్ వచ్చినట్టే! లేదా ఒకే ఒక కవర్ లో ఒకే ఒక పేజీ వస్తే “మీ చదువు అద్భుతం. మీ విద్య అపురూపం. అనీ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ…..మీకు మా విశ్వవిద్యాలయం లో చోటు ఇవ్వలేక పోయినందుకు మాకు ఎంతో విచారంగా ఉంది. మీ వివరాలు ఫైల్ లో పెడతాం.  భవిష్యత్తు లో అవసరం అయితే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాం” అని ఉంటుంది. అంచేత అమెరికా నుంచి ఒక కవర్ మాత్రమే వస్తే, అది మనం ఓపెన్ చెయ్యక్కర లేదు అనమాట. ఇక్కడ సరిగ్గా నాది అదే కేసు. ఒక కవర్ లో ఒక పేజీ. కానీ విషయం అర్ధం అవలేదు.

ఇంతకీ రహస్యం ఏమిటంటే..నాకు 1969 లోనే యూనివర్శిటీ ఆఫ్ సస్కటూన్, కెనడా నుంచీ, యూనివర్శిటీ ఆఫ్ స్టోనీబ్రూక్, న్యూయార్క్ నుంచీ భారీ కవర్లు వచ్చాయి. అందులో స్టోనీబ్రూక్ నించి ట్యూషన్ వైవర్ కూడా వచ్చింది. కానీ అప్పటికే లెక్చరర్ గా చేరిపోయాను కాబట్టి అవన్నీ అదే రేకు పెట్టెలో పారేశాను.  ఇప్పుడు తీసి బయట పారేశాను. ఇక దొరికిన ఈ ఒక్క కాగితం ఆ యూనివర్శిటీ వాళ్ళ దుర్ముఖ పత్రం లాంటిది కాదు అని తెలుస్తున్నా, అసలు విషయం తెలియక అది పట్టుకుని ఓ శుభముహూర్తాన  అమెరికా కాన్సలేట్ కి వెళ్ళాను.

ఏదో వీసా ఇంట్రర్వ్యూ కోసమో, అక్కడ లైబ్రరీలో సమాచారం కోసమో కాకుండా మనది స్పెషల్ కేసు కాబట్టి ఒక అమెరికన్ దొర గారు స్వయంగా నా దగ్గర కాగితం చూసి “కంగ్రాట్యులేషన్స్” అన్నాడు ఆ దొర.

“ఎందుకూ?” అన్నాను భయం, భయం గానూ, అనుమానం గానూ

“ఎందుకేమిటి, నీ మొహం. ఇది నిన్ను మెచ్చి అమెరికా వలస వెళ్ళడానికి మా ఇమ్మిగ్రేషన్ ఆమోదనా పత్రం. పైన టైటిల్ లో ఆ మాట స్పష్టంగా ఉందిగా.  ఈ పత్రం కోసం ఈ రోజుల్లో జనం తెగ జపం చేస్తున్నారు. అవసరం అయితే హత్య కూడా చేస్తారు”

నా మట్టి బుర్ర లో ఇంకా పూర్తిగా వెలగ లేదు కానీ మిణుకు, మిణుకు మంటూ ఒక చిరు దీపం రెప రెప లాడుతూ ఉండగా “అమెరికా వలస వెళ్ళడానికి కావలసినది గ్రీన్ కార్డ్ కదా. ఆ మాట ఇందులో ఏమీ లేదే?” అని అడిగాను.

“గ్ర్రీన్ కార్డ్ అనేది మామూలు పరిభాష లో జనం వాడే మాట. అదికారికంగా దానిని “ఏలియన్ ఇజిస్త్రేషన్ కార్డ్” అంటారు. దానికి నువ్వు అర్హుడిగా ప్రకటించిన కాగితం ఇది. నువ్వు ఇమ్మిగ్రెంట్ వీసా కోసం పట్టిన అప్లికేషన్ ఆమోదించబడింది అని ఈ పత్రం లో ఉంది”

ఇంకా నా మనసులో శంక వదల లేదు. “మరి ఈ కాగితంలో జూన్ 9, 1971 దాకానే చెల్లుబడి అని ఉంది కదా.   ఇప్పుడు చెల్లుతుందా లేక కాలదోషం పట్టేసిందా?’

“అది బంధువుల కి ఇమ్మిగేషన్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే కానీ, నీకు కాదు. ఇలాంటి కాగితానికి కాలదోషం ఉండదు. ఎందుకంటే ఇది నీ డిగ్రీలు, ఇతర అర్హతలు చూసి ఇచ్చినదే కాబట్టి జీవితాంతం చెల్లుతుంది. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళదల్చుకుంటే నిక్షేపంగా వెళ్ళవచ్చును. అని ఆ దొర గారు దానికి నేను సమర్పించవలసిన పత్రాలు, మెడికల్ పరీక్షల వివరాలు అన్నీ చెప్పి “నువ్వు అమెరికాలో విమానాశ్రయం లో దిగినప్పుడు నీ గ్రీన్ కార్డ్ అక్కడే ఇస్తారు”. అని ఆ ఉలిపిరి కాగితం నా చేతిలో పెట్టి, కరచాలనం చేసి, నవ్వేసి “ఆస్ ది  బెస్ట్” అనేసి నా జీవితాన్ని మార్చేశాడు.

ఇక నా ఆఖరి ప్రశ్న “ఈ కాగితం ముక్క శాన్ ఏంటోనియో అనే చోట నుంచి వచ్చింది. అది అమెరికాలో ఒక నగరమా? ఆ నగరం ఎక్కడ ఉంది. నేను అక్కడికే వెళ్ళాలా?”

దానికి ఆయన నవ్వేసి “నిజానికి నాకూ సరిగ్గా తెలీదు కానీ అది టెక్సస్ లోఎక్కడో ఉంటుంది. నాది న్యూయార్క్. టెక్సస్ సంగతులు నాకు తెలీదు కానీ నువ్వు అమెరికాలో ఎక్కడికైనా వెళ్ళవచ్చును. పరవాలేదు” అని మళ్ళీ గ్రీన్ కార్డ్ విలువ గురించి చెప్పాడు.

జరిగిన విషయం ఏమిటంటే…జాన్ కెన్నెడీ గారు అధ్యక్షుడి గా అవక ముందు అమెరికాకి గ్రీన్ కార్డ్ కి కేవలం పశ్చిమ భూగోళం లో దేశాల వారికే అర్హత ఉండేది. భారత దేశం తో సహా తూర్పు భూగోళం ఉన్న వారు సరదాగా రావచ్చును, చదువుకో వచ్చును కానీ అమెరికా లో శాశ్వత నివాసానికి అర్హులు కాదు. “అది అన్యాయం. ప్రపంచం లో ఎక్కడి వారైనా, ఏ దేశం వారైనా, బాగా చదువుకున్న ఇంజనీర్లూ, శాస్త్రవేత్తలూ, డాక్టర్లూ అందరూ అర్హులే అనే బ్లాంకెట్ అప్రూవల్ విధానాన్ని ప్రవేశ పెట్టాడు. ఆయన హత్య తరువాత ప్రెసిడెంట్ జాన్సన్ దానికి ఆమోదం తెలిపినా ఇంజనీరింగ్ డిగ్రీ లాంటివి ఉన్నవాళ్ళకి ఆ బ్లాంకెట్ అప్రూవల్ పధ్దతికి 1970 లలోనే స్వస్తి చెప్పి,   వ్యక్తిగత వివరాలని బట్టి మాత్రమే గ్రీన్ కార్డ్ లు ఇచ్చే పధ్ధతి మొదలయింది. రామ్ కుమార్ ధర్మమా అని నేను ఇమిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తు పెట్టినప్పుడు అప్పటికి ఇంకా బ్లాంకెట్ అప్రూవల్ పధ్దతి ఉంది కాబట్టి బతికిపోయాను. ఒక సారి వీసా అప్రూవల్ అయ్యాక, అది ఎన్నేళ్ళయినా కాలదోషం పట్టకపోవడం నా పాలిట వరం అయింది. దీన్నే మన పరిభాష లో “జాతకం” అంటారు.

అలా అమెరికా తలుపు అనుకోకుండా తెరుచుకోగానే ముందుగా చేసిన పని “నేను అమెరికా రావడానికి నిర్ణయించుకున్నాను ‘ అని చికాగో లో ఉన్న మా తమ్ముడికి ఏరో గ్రామ్ ఉత్తరం వ్రాయడం. ఆ రోజుల్లో ఫోన్ సదుపాయాలు లేవు. దానికి వెంఠనే వాడి దగ్గర నుంచి  “ఇప్పుడు అమెరికా అంతా గందరగోళంగా ఉంది. వియత్నాం యుధ్దం జోరుగా ఉంది. గ్రీన్ కార్డ్ తో వస్తే నిన్ను యుధ్దం లోకి పంపించవచ్చును. అందుకే నేను కూడా గ్రీన్ కార్డ్ కి అప్లై చెయ్యకుండా గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు అస్సలు లేవు.” అంటూ సమాధానం వ్రాశాడు. కానీ అప్పటికే నా నిర్ణయం అయిపోయింది. ‘గండర గండడు’..అంటే మా గురువు గారి దగ్గ్గరకి వెళ్ళి, విషయం చెప్పి, లెక్చరర్ ఉద్యోగం రాజీనామా చేస్తాను అంటే మేడీసన్, విస్కాన్సిన్ లో చదువుకుని వచ్చిన ఆయన “ ముందు మాటగా

“నీకేమైనా పిచ్చా?’ అన్నారు.  “ఇక్కడ హాయిగా ఉద్యోగం చేసుకోక అమెరికా పోయి ఉధ్దరించేది ఏమీ లేదు. కావాలంటే ఏడాది సెబాటికల్ శలవు ఇస్తాను. వెళ్ళి దేశం చూసి రా” అన్నాడు.

“అలా అయితే ఆ అవకాశం ఇంకొకరికి కూడా ఇవ్వకుండా ఖాళీగా ఉండాలి కదా. అది నాకు ఇష్టం లేదు.” అన్నాను. అలా అమెరికా వెళ్ళి ఉధ్ధరించేది ఏమీ లేదు అని అందరూ వార్నింగులు ఇచ్చినా నా నిర్ణయం మారలేదు. కావలసిన ఏర్పాట్లు అన్నీ చక చకా జరిగిపోయాయి. దానికి కూడా రామ్ కుమారే సహాయం చేశాడు. అప్పటికి మా కాన్వికేషన్ అయి నెల అయింది. ఇక జరగవలసినదల్లా కాకినాడ వెళ్ళి నాలుగు రోజులు మా అమ్మా, బాబయ్య గారి దగ్గరా ఉండడమే. మా కుటుంబం లో నాన్న గారిని బాబయ్య గారు అంటాం. డాడీ, గీడీ అనే మాటలే తెలియని సంస్కారం మాది.

ఇక మా పెద్దన్నయ్యా, వదినా, చిన్నన్నయా, వదినా, హైదరబాద్ నించి వచ్చిన మా అక్కా,  చెల్లెళ్ళు భానూ  పూర్ణా, ఉషా ఇలా….అందరితోటీ డిశంబర్ , 1974 లో కాకినాడ లో నేను గడిపిన సుమారు 15 రోజులు మహానందకరమైనవి. పనిలో పనిగా కాకినాడలో మా నాన్న గారి క్లాస్ మేట్ అయిన టైలర్ అల్లా ఉద్దీన్ దగ్గర ఒక కోటు కుట్టించుకున్నాను. అప్పుడు మా సుబ్బన్నయ్య పాండిచ్చేరి లో జిప్ మెర్ (జవహర్ లాల్ నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) లో ఉండేవాడు. అతడినీ, మా శేషుమాంబ వదిననీ, ఆరేళ్ళ కూతురు మధు నీ చూడడానికి వారం రోజుల పాటు పాండిచ్చేరి వెళ్ళాను. మధు పూర్తి పేరు సత్య మాధవి. దాని చేత సుమతీ శతకం చదివించి రికార్డు చేసుకుని అమెరికా తీసుకెళ్ళాను. ఇప్పుడు మధు కోనసీమ లో పెద్ద డాక్టరు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అమెరికా వెళ్ళడానికి టికెట్ డబ్బు సంపాదించడం లో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రోజుల్లో బొంబాయి నించి చికాగో కి టికెట్టు సుమారు ఏడు వేల రూపాయలు. అందరి కాళ్ళూ పట్టుకుని అవి ఎలాగో అలాగ పోగేశాను. రామ్ కుమారూ, నేనూ పాస్ పోర్ట్ తో సహా అన్ని కాగితాలతోటీ పటేల్ ట్రావెలర్స్ ఆఫీసుకి వెళ్ళాం. దారి ఖర్చులకి భారత ప్రభుత్వం వారు మంజూరు చేసే 8 డాలర్లు కొనుక్కోడానికి ఆ రోజుల్లో డాలర్ కి ఏడు రూపాయలు చొప్పున కూడా తీసుకుని సొరుగు లోంచి అక్ష్రరాలా ఎనిమిది డాలర్ల విచ్చు నోట్లు తీసి ఇచ్చాడు. అంతే కాదు. “ఇవి నీకు చాలవు. అంచేత రూపాయి ఎక్కువకి కనీసం వంద డాలర్లు కొనుక్కో” అని హిత బోధ చేశాడు. అంచేత మరొక 800 రూపాయలు అప్పటికప్పుడు ఆ పటేల్ కి ఇచ్చి అనధికారంగా మరో వంద డాలర్లు కొనుక్కున్నాను. చెప్పొద్దూ, డబ్బులు గూబ వాచినా, ఏకంగా 108 అసలు సిసలు ఆకుపచ్చ అమెరికా డాలర్ నోట్లు జేబులో పెట్టుకోవడం భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇప్పుడూ అంతే సుమా1

నన్ను సాగనంపడానికి బొంబాయి విమానాశ్రయానికి కనీసం పాతిక మంది మిత్రులు వచ్చారు. అప్పటి ఫొటో పైన వుంది చూడండి.  వీరిలో కొందరు  సుందర రావు (హైదరాబాద్), తిరుమల రావు (హైదరాబాద్), రాంభట్ల సీతారామ్ (చికాగో),  గరిమెళ్ళ సూర్యనారాయణ (ఢిల్లీ),  దూర్జటిస్ శ్రీరామ్ (రాచెస్టర్), అనిల్ డాటే (ముంబై), సాయిదాసు (బెంగళూర్),  కీ.శే. కిశోర్, రామ్ కుమార్ (నెల్లూరు),  భాస్కర్ & రాధ దంపతులు ఇప్పుడు హ్యూస్టన్ లోనే ఉంటారు. ఫొటోలో మిగతా వారు గుర్తు ఉన్నా కొందరి పేర్లు మర్చిపోయాను.

ఇక విమానం ఎక్కడం నాకు కొత్త కాదు కానీ అన్ని గంటల సేపు కదలకుండా కూచునే ప్రయాణం అదే మొదటి సారి. అందులో మొదటి అనుభవం వాళ్లు పెట్టే తిండి అస్సలు భరించలేక పోవడం. ఆ రోజుల విమానాలలో శాకాహారం అని కానీ, హిందూ మీల్ అని కానీ ఏమీ లేవు. వాళ్ళు ఏ గడ్డి పెడితే అది తినడమే. ఆ Pan Am వారి విమానం బొంబాయి-ఫ్రాంక్ ఫర్ట్, లండన్ లో దిగే దాకా బొంబాయి లో అన్నేళ్ళు ఉండి రకరకాల తిళ్ళకి అలవాటు పడ్డ నేనే  నేను అస్సలు ఏమీ తిన లేక పోయాను.

లండన్ లో విమానం మారి న్యూయార్క్ దారిలో ఉండగా అంత వరకూ నాతోటే ప్రయాణం చేస్తున్న ఒక అమెరికన్ పెద్దావిడ తన సీటు లోంచి లేచి వచ్చి “ఐ హేవ్ బీన్ అబ్జర్వింగ్ యు. వాళ్ళు పెట్టినది నువ్వు ఏమీ తినడం లేదు. నువ్వు కూడా ఏమీ తెచ్చుకో లేదు. ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు బి హంగ్రీ అల్ల్ ది టైమ్. ఇదిగో. ఈ ఏపిల్స్ తిను.” అని పలకరించి, నాకు మాట పెగిలే లోపుగానే రెండు ఏపిల్ పళ్ళు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. బహుశా నేను భయం, భయంగానో, కొత్త బిత్తరి చూపులతోనో కూచున్న పధ్ధతీ, ఆకలి తో నక నక లాడుతూ వాళ్ళ తిండి తినలేకా, ఇంకేం చెయ్యాలో తెలియకా ఉన్న నన్ను ఆవిడ నాబాధ గమనించడమే కాక వచ్చి, పలకరించి రెండు ఏపిల్ పళ్ళు ఇచ్చి వెళ్ళిన ఆ అమెరికన్ సంస్కృతి తో అదే నా మొదటి అనుభవం.

అలాగే న్యూ యార్క్ లో దిగాక అక్కడి ఏడడుగుల కష్టమ్స్ నల్ల వాడు నా పట్ల చూపించిన మర్యాద, కాగితాలు, పాస్ పోర్ట్ అన్నీ సరి చూసి, నాకు కాన్సలేట్ వారు ఇచ్చిన, నేను కూడా తీసుకొచ్చిన  సీల్డ్ కవర్ లోనించే నా గ్రీన్ కార్డ్ తీసి నాకు ఇచ్చి “వెల్ కమ్ టు అమెరికా” అని కరచాలనం చేసినప్పుడూ నాకు అనుభవం అయినది ఆ అమెరికన్ సభ్యతా సంస్కారాలే!. అంత అక్కడి నుంచి విమానం మారి మా తమ్ముడు ఉన్న చికాగో చేరే సరికి చీకటి పడింది. అది డిశంబర్ 31, 1974. ఆ సంవత్సరానికి ఆఖరి రోజు. అప్పుడు మా తమ్ముడు హార్వుద్ హైట్స్ అనే ప్రాంతం లో ఉంటున్న స్టుడియో అపార్ట్ మెంట్ అనే ఒకే ఒక గదిలో అడుగుపెట్టడంతో నా అమెరికా జీవితం ప్రారంభం అవడానికి మొదటి రోజు. ఆ చలితో ఎలా చావాలో తెలియని రోజు.

*

వంగూరి చిట్టెన్ రాజు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • >>నాకు అనుభవం అయినది ఆ అమెరికన్ సభ్యతా సంస్కారాలే!.

    ఏవీ నిరుడు కురిసిన ఆ హిమ సమూహములు? 🙁

    • శర్మ గారూ,

      అప్పుటికీ, ఇప్పటికీ ఇంచుముంచు ప్రతీ రోజూ ఏదో ఒక విషయం లో అమెరికా వారి సభ్యతా, సంస్కారాలు అడుగడుగునా నాకు కనపడుతూనే ఉంటాయి. అది గ్రోసరీ కొట్టులో కావచ్చు, బ్యాంకులో కావచ్చు, పోస్ట్ ఆఫీస్ లో కావచ్చు…ఎలా చూసినా అమెరికా చాలా గౌరవప్రదమైన దేశం. లేకపోతే ఎక్కడి కాకినాడ గాంధీ నగరం..ఎక్కడి హ్యూస్టన్ మహా నగరం. ?

      అయితే మీ ప్రశ్న ..శ్రీశ్రీ గారి ఆవేదనా సరి అయినవే….ముఖ్యంగా మన టెలెగూ-అమెరికన్ ల విషయం లో….వారి విషయం లో ‘నిరుడు హిమవసంతాలు” నిజంగా కురిశాయా..లేక ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉందా? అనేది నా అనుమానం.

      మీ స్పందనకి ధన్యవాదాలు. ఈ వ్యాసం తో భారత దేశం లో నా జీవిత చరిత్ర పూర్తి అయింది. ఆ తర్వాత 45 ఏళ్ళూ అమెరికాలోనే గడీపిన ఆ విశేషాలు రాయాలా, వద్దా అనే మీమాంస లో పడ్డాను. మీ లాంటి సహృదయుల సలహాలని ఆహ్వనిస్తున్నాను. “ఎవడికి కావాలి నీ సోది” అనే ప్రశ్న కి నా దగ్గర సమాధానం లేక మధన పడుతున్నాను శర్మ గారూ…

      • నమస్కారమండి. నేను వచ్చిన కొత్తలో నవ్వుతూ ఆహ్వనించిన అమెరికా వేరు. అప్పట్లో చేతులు చాపి, మీ ఇండియన్స్ మంచివాళ్ళు కష్టపడి పనిచేస్తారు అని చెప్పిన అమెరికా వేరు, ఇప్పుటి అమెరికా వేరు. మొత్తంలో ఇప్పటికీ మనని అభిమానించేవారు “చాలామంది” ఉన్నట్టే లెక్క కానీ షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడూ, మరో చోటా అనుమానంగా చూడడం అవీ జీర్ణించుకోలేని విషయాలు. అయితే మెల్లిగా ఇటువంటివి జీర్ణం అవుతాయి కడుపులోకి వెళ్ళాక. వాటిని అలా వదిలేసి మంచిని చూడ్డమే బాగుంటుందనుకోండి, కానీ నేను చెప్పినది మన జీవితకాలంలో ఎప్పుడూ ఊహించలేని ఇప్పుడు జరిగే మార్పు గురించి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందని విన్నదే కదా? అదే మన టెలుగు -అమెరికన్ల విషయం అని నా “ఎదవాలోచన.”

        మీ తర్వాతి అమెరికా జీవితం గురించి తప్పకుండా రాయండి. ఏసోప్ కధ విన్నదే కదా? పెద్దాయనా, కుర్రాడూ గాడిద నడుస్తుంటే అందరూ తలో విధంగా అంటారు. ఎవరి ఏడుపు వారిది. అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేము. రాయడం అనేది మనకోసం. చదివే వాళ్ళు చదువుతారు. చదవకుండా లైకులు కొట్టేవారికి వాళ్ల దార్లు వాళ్ళకి ఉన్నాయి. ఇదెందుకు చెప్తున్నానంటే, అనుభవం అయ్యి. మీరు రాసేవి కనీసం పది మంది చదివినా చాలదుటండీ?

        తప్పకుండా రాయండి.

  • రాజు గారు

    మీరు ప్రస్తావించిన ‘బ్రెయిన్ డ్రైన్’ అనే సిద్దాంతం 1980 ల వరకు ఉంది. విదేశాలు వెళ్లే మేధావులు దేశ ద్రోహులని ‘ఉపన్యాసాలు’ ఇచ్చిన వాళ్లలో నేనూ ఉన్నాను. ఆ ‘దిక్కుమాలిన’ సిద్ధాంతం మా మెదళ్లలో ఎక్కడానికి కారకాలు ఏమిటో తెలియదు అప్పుడు. దేశభక్తి, జాతీయ భావనలు ప్రభావితం చేసి ఉండవచ్చు.

    మీరు రాస్తున్న జీవిత కాలం గొప్పగా ఉంది.

    • ధన్యవాదాలు, రామా నాయుడు గారూ.

      మీ స్పందన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.

  • రాజు గారూ, ఈ భాగం నాకు బాగా నచ్చిందండీ. అసలు ఈ సాఫ్ట్వేర్ ప్రవాహం మొదలవ్వకముందు ఇక్కడికి  రావడానికి ఏం పద్ధతులు ఉండేవో, అవన్నీ ఎలా పనిచేసేవో నాలాంటి వాళ్ళకి తెలీదు. ఇంతకు ముందు చూచాయగా విన్నా ఇదే మొదటిసారి వివరంగా తెలుసుకోవడం. ఆ రోజులూ, ఆ మనుషులూ , ఆ ప్రేమలూ తెలుసుకోవడం బావుంది. థాంక్ యు..

    మీతో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నాను, మీరు వ్రాసిన కథలూ వాటి కన్నా, మీ ఈ జ్ఞాపకాల రాతలు నాకు చాలా నచ్చుతాయి అని. ఇవి మీరు నిజాయితీగా, మురిపెంగా రాసుకున్నట్టు అనిపిస్తాయి నాకు. What is there to take it from them అంటే చెప్పలేను కానీ ఆహ్లాదంగా అనిపిస్తుంది. అక్కడక్కడా కళ్ళు చెమరిస్తాయి. మనం పాత ఫోటోలు చూసుకుని ఎందుకు మురిసిపోతుంటామో  అలాగే ఇవీనూ. 

    మీరు ఇంకా రాయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నారు కదా పైన, నా కోరిక అయితే రాయాలి అని. పాతికేళ్ళ క్రితం నేను వచ్చినప్పటికీ, నా తర్వాతి తరం వచ్చినప్పటికీ  ఇక్కడ మనుగడ చాలా సులభం అయిపొయింది. మీ తరం వాళ్ళు ఏయే అవస్థలు పడ్డారో, ఎలా కుదురుకున్నారో మీలాంటి వారి అనుభవాల ద్వారా తెలుసుకోవడం బావుంటుంది. కొన్ని కథల్లో అప్పటి అనుభవాల్ని కొంతమంది రాసినప్పటికీ, మీలాంటివాళ్ళ అనుభవాలనుండీ తెలుసుకోవడం  అనేది ఎప్పుడూ మెరుగైన అనుభూతి. నాలాగా వాటిని చదవాలనుకునేవాళ్ళు కొంతమందైనా ఉండే ఉంటారు. 

    • ధన్యవాదాలు, పద్మా.

      ఉన్నమాట చెప్పాలీ అంటే…నా ఇండియా జీవితం అంతా ‘రాజకీయ రహితంగా” జరిగింది. తీరా అమెరికా వచ్చాక నా జన్మలో ఊహించని విధంగా మంచి మనుషులు కూడా “మన వాడా, కాదా?” అని వాకబు చేసుకోవడం విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను. ఇండియా లో ఉన్న ముఫై ఏళ్ళు తెలియని తేడాలు అమెరికాలో తెలిశాయి. 45 ఏళ్ళ క్రితం పైపైనే ఉండేవి ఈ సమాజం లో రాను రాను బాగా బలపడ్డాయి. నువ్వు చెప్పినట్టు నిజాయితీగా నేను నా అమెరికా జీవితం గురించి వ్రాస్తే ఆయా సంఘటనలు, వ్యక్తుల ప్రస్తావన వస్తుంది. అది అవసరమా అనేదే నాకు సమాధానం లేని ప్రశ్న. అందుకే నా అమెరికా జీవిత కాలమ్ వ్రాసే పధ్ధతి ఎలా ఉండాలా అనేది తేలకుండా ఉంది.

      నీ స్పందనకి మరొక్క సారి ధన్యవాదాలు.

  • చిట్టెన్ రాజుగోరండీ ! అమెరికా వారి సభ్యతా, సంస్కారాల గురించి మీలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా ఉహూ ఇదవుతూ అన్నారు. ఎంతైనా గ్రేట్ మెన్ థింక్ ఎలైక్ కదండి.

    డిశంబర్ 31, 1974 తర్వాత అమెరికాలో 45 ఏళ్లు గడిపిన మీ జీవితానుభవాల విశేషాలు రాయాలా వద్దా అనే ధర్మసందేహం తమకేల కలిగింది స్వామి. అది తమ విద్యుక్తధర్మం. బొంబాయి మెరీన్ డ్రైవ్ లో సినీ తార వైజయంతి మాల నెలకొల్పిన ‘నటరాజ్” అనే అత్యాధునిక ఖరీదైన రెస్టారెంట్ అన్న తలపుల్లాంటివి అమెరికాలో కూడా ఉండే ఉంటాయి కదండి Marilyn Monroe, Audrey Hepburn, Elizabeth Taylor లాంటివి అవికూడా మా చెవిన వెయ్యాలండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు