మనమెప్పుడూ బాటలం
ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ
చిన్న చినుకులకే చిధ్రమవుతూ
చిత్ర విచిత్రమైన నడకల్ని భరిస్తూ.
వాళ్లెప్పుడూ వాహనాలే
ఎండైనా… వానైనా
తమకి నచ్చిన వేగంతో నడుస్తూ
అలసట వచ్చిన చోట ఆగుతూ
రహదారిని తమ హక్కుగా చేసుకుంటూ !
ఎంతైనా
పన్ను కట్టిన వాడికే
దారిమీద హక్కుంటుందంటారు కదా
మనమెప్పుడూ పాపాలం
వారివేమో పవిత్రాత్మలు
అంతేగా మరి…
బతుకే బతుకులో ఏ అర్థమూ లేక
మన దేహాలు
నడిచే సజీవ సమాధులైతే
వారి దేహాలేమో
మన పాపాలని గ్రుక్కిట పడుతూ
మన బ్రతుకుల మీద
ముక్తిని ధృవీకరించే వ్యాకరణాలు
మన అభిప్రాయాల వ్యక్తీకరణలన్నీ
వారి అధికారపు నిర్ణయాల మాటున
విధిగా చల్లబడుతుంటే
మనం పూసే విషాదాల మీద
వారు చిరునవ్వులుగా విరబూస్తారు
***
అవును…
లోకధర్మమింతే
తమని తాము ఎక్కువ సమానంగా
శాసనాలు రాసుకున్నాక
మనం రాసే దిగుళ్ళకి కార్చే కన్నీళ్ళకి
అందే లెక్క ఒక్కటే
కొన్ని జన్మలు అవనతం కాని కన్నీళ్ల పతాకాలు అని
*
చిత్రం: తిలక్
Add comment