ఈ ప్రతిఘటనలు చాలా వరకు నిశ్శబ్ద విప్లవాలే!

జీవిత దర్శనంలోనూ, తత్వ చింతనలోను అత్యంత ప్రాచీనమైన  గ్రీకు భారతీయ సాహిత్యాల్లో వ్యత్యాసాలున్నప్పటికీ, స్త్రీల స్థితిగతులు పురుష స్వామ్యపు అధికారానికి లోబడే ఉన్నాయని, అయితే ఈ సాహిత్యాల్లో స్త్రీలు ప్రతిఘటించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ ప్రతిఘటనలు చాలా వరకు నిశ్శబ్ద విప్లవాలే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రముఖ రచయిత్రి మృణాళిని తన చిరుపుస్తకం ‘నిశ్శబ్ద విప్లవాలు’ లో రాసిన వాక్యాలు నా చెవుల్లో ఇంకా గింగుర్లుమంటున్నాయి. మృణాళిని రాసిన ఈ మాటల వెనుక లోతైన వాస్తవాలు నన్ను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు పురికొల్పాయి.

గ్రీకు భారతీయ పురాణాలు కేవలం కథ చెప్పి ఊరుకోవు. ఒక తాత్విక దృక్పథాన్ని అందిస్తాయి. భారత పురాణాల  నిత్యనూతనత్వానికి అందులోని గాథలు ప్రజల జీవితలతో వర్తింపచేసే విధంగా ఉండడమే కారణమని మృణాళిని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఈ రెండు భాషల సాహిత్యాల్లో మరో ప్రధాన సారూప్యం రెండింటిలోనూ స్త్రీల ప్రాముఖ్యం ఎక్కువని చెప్పిన మృణాళిని ఆ స్త్రీల మనోభావాల్లో అన్ని ప్రాంతాల, జాతుల భాషల స్త్రీలకు వర్తించే సార్వత్రిక సత్యాలుంటాయని విశ్లేషించారు. “మన శరీరాలను శాశ్వత నియంతకు అప్పగించి ఒక పిల్లవాడిని కనడం కంటే మూడు సార్లు యుద్ద భూమికి వెళ్లడం నాకిష్టం” అని యూరిపిడస్ రాసిన విషాద  రూపకంలో మెదియా అంటుంది. మహాభారతంలోని ఒక ఉపాఖ్యానంలో దీర్ఖతముడు అనే అంధుడికి ఆయన భార్య ప్రద్వేషిణి నీవంటే నాకు ఇష్టం లేదని స్పష్టం చేస్తుంది. అదే విధంగా గ్రీకు నాటకాల్లో ఎలెక్ట్ర్రా, హెలెన్, ఫెడ్రా తదితర పాత్రలు, రామాయణ మహాభారతాల్లో సీత, శకుంతల, అంబిక, ద్రౌపది, కుంతి ఏ విదంగా ధిక్కార స్వరాలు  వినిపించారో మృణాళిని కళ్లకు గట్టినట్లు వినిపించారు. “మనం కేవలం స్త్రీలం పురుషులతో పోరాడలేం. అఁదునా అధికారంలో ఉన్న వాళ్లతో అసలే పోట్లాడలేం..” అని ఆంటిగొనీ నాటకంలో ఇస్మిన్ అన్న మాటలు నేటికీ కొనసాగుతున్న పురుష స్వామ్య అధికార వ్యవస్థ గుండెల్ని ఛిద్రం చేయాల్సి ఉన్నది.

‘నిశ్శబ్ద విప్లవాలు’ రాసిన చాలా రోజులకు ఇటీవల మృణాళిని రచించిన ‘విశ్వ మహిళా నవల’ అనే పుస్తకాన్ని చదివాను, ఈ పుస్తకమూ ప్రపంచ చరిత్రలో మహిళా రచయితలు ఏనాడో మన కళ్లు విప్పారేలా చేసే ప్రకంపనలు సృష్టించారని మనకు తెలియజేస్తుంది. నన్నయ్య మహాభారత రచన చేస్తున్న కాలంలోనే లేడీ మూరాసాకి అనే జపనీస్ రచయిత్రి ప్రపంచ సాహిత్యంలో తొలి నవల రచించారని ఎంతమందికి తెలుసు?

“నువ్వు మరిచిన ఆకులు రాలే కాలపు విషాదం లాంటి నన్ను తలుచుకో,, ఇప్పుడు పున్నమి వెన్నెల ఏరులో నీ మనసు ఎంతగా సేద దీరుతున్నా” అని ఒక ప్రణయకవితలో రాసిన మూరాసాకి ప్రేమించడాన్ని ఒక కళగా అభ్యసించిన గెన్జి అనే కథానాయకుడిపేరుతో రాసిన నవల గురించి మృణాళిని అద్భుతంగా వివరించారు.

“ప్రియుడిగా నీ మీద అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు కాని భర్తగా మారాక అలా చేయగలనా?” అని మదామ్ దె లాఫయట్ అనే ఫ్రెంచి రచయిత్రి 1678లో రచించన ఒక ముక్కోణపు ప్రణయ నవల లా ప్రిన్సెస్ ద క్లేవ్ లో ఒక పాత్ర అంటుంది.

ఆడవాళ్ళకు మనసు విప్పి మాట్లాడే హక్కుందని మొదటి సారి నిరూపించిన రచయిత్రిగా వర్జీనియా వూల్ఫ్ తో ప్రశంసలు అందుకున్న తొలి ఇంగ్లీషు నవలా రచయిత్రి అఫ్రాబెన్ (1640-1689) నల్లజాతి బానిసత్వాన్ని వివరించే తొలి నవలను కూడా రాశారు.

“మన చదువే మన ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుందని, ఆ చదువు స్త్రీలకు లభించకపోవడం దురదృష్టకరమే కాని వారి నేరం కాద”ని చెప్పిన 18వ శతాబ్దపు బ్రిటిష్ రచయిత్రి షార్లట్ లెనక్స్ .జర్మన్ తొలి మహిళా నవలగా గుర్తింపు పొందిన ద హిస్టరీ ఆఫ్ లేడీ సోఫియా స్టెర్న్ హైమ్ నవలను రచించిన మేధావి సోఫిలా జోష్,” స్త్రీలనుంచి స్వేచ్చను లాక్కోవడం ఎంత సులువు?” అని బాధపడ్డ ఫానీ బర్నీ రచించిన అద్భుత ఇంగ్లీషు నవల ఎవలీనా, నెపోలియన్ ను సైతం భయపెట్టి ఫ్రెంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన  మదామ్ దె స్టాఎల్, ఫ్రెంచి విప్లవ నేపథ్యంలో మూడు  అద్భుత నవలలు రచించిన మేరీ ఉల్ స్టన్ క్రాఫ్ట్, ఇంగ్లీషులో తొలి హారర్ నవల రాసిన అన్ రాడ్ క్లిఫ్, మగవాళ్ల సంకెళ్లనుంచి కలాలను విడిపించి స్త్రీ హృదయ స్పందనను తన నవలల్లో చిత్రించిన జేన్ ఆస్టిన్, రష్యన్ సమాజంలో స్త్రీల ప్రతిపత్తి గురించి వివరించిన బ్రాంటీ సోదరీమణులు, గాఢమైన ప్రేమను దృశ్యకావ్యంగా మలిచిన ఎమిలీ బ్రాంటీ, “మన జీవితంలోంచి ఒక్క పేజీని కూడా చింపలేము కాని మొత్తం పుస్తకాన్ని నిప్పుల్లో వేయగలం” అంటూ ఎన్నో ఉద్వేగ భరితమైన నవలల్ని  రచించిన  ఫ్రెంచి రచయిత్రి జార్జి సాండ్  రచవల గురించి మృణాళిని వివరించిన తీరు వెన్నెల రాత్రుల్లో సముద్రపు  అలలు మన పాదాలు తడిపినట్లుగా ఉంటుంది.

“జీవితంలో ఒకటే సంతోషం, ప్రేమించడం, ప్రేమించబడడం” అని సాండ్ అన్నారు. నాకిప్పుడు ఒకే సంతోషం, మృణాళిని లాంటి వారు రాసిన వికసించిన పద్మాల లాంటి పుస్తకాలు చదవడం, ఇతరులు చదివేలా చేయడం. తెలుగు సాహిత్యంలో ఒక నిశ్శబ్ద విప్లవం మృణాళిని.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కృష్ణుడూ,

    మీకు శతకోటి ధన్యవాదాలు. నేను విశ్వమహిళానవల ఓ వారం రోజుల కిందట ఇచ్చానే గానీ ఇంత వేగంగా చదివేసి, ఇంత మంచి స్పందన తెలుపుతారని అస్సలు ఊహించలేదు.

    నా ‘నిశ్శబ్ద విప్లవాలు’ చదివిన అతి కొద్దిమందిలో మీరు ఒకరనుకుంటా. ఆ ఫోటో!! ‘ఉదయం’ రోజులదేనా?

  • Ee rachana chesina KRISHNUDU evaro teliyadu Kani MRUNALINI GURINCHI yadaardham chepperu.
    Aavida raastunna navalaa parichayaalu chadive manchi navalalu chaduvutoo vuntaanu.
    PUSTAKAALU VAATINI CHADIVINCHE RACHAETALU IDDAROO MANCHI SNEHITULE KAVADAM ENTA ADBHUTAM!
    Thanks a lot KRISHNUDU GARU & MRUNALINI GARU IDDARU GOPPA RACHANALU CHESTUNNARU.
    Chaduvukune saahiti priyulu dhanyulu.

      • Sri Krishna Rao Garu ,
        Me gurinchi Mrunalini chepperu. Telisindi. Nenu Andhrajyothy
        Paper lo me articles regularly chaduvu toone vuntaanu.
        Me meda respect marintagaa perigindi.naaku ishtamaina patrika articles rase journalists lo meru vokaru.
        Thanks for your wonderful articles.
        With regards,
        Annapurna.
        CA ( US)

  • మంచి పరిచయం మిత్రమా… ప్రతి సంచికలో ఇలాంటి కొత్త విషయాలు రాయాలని కోరుకుంటున్నా.. కాస్తా విస్తారంగా కూడా రాయవచ్చు. కవిత్వమే కాదు, మీ వచనం కూడా బాగుంటుంది. ఏమైనా వచన రచనలో జర్నలిస్టులుగా ఆరితేరినవాళ్లం కదా…
    – ప్రతాపరెడ్డి కాసుల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు