ఈ లిటిల్ ఇండియా కథేమిటో………?!

సెలామత్ డతాంగ్ లిటిల్ ఇండియా (వెల్కమ్ టు లిటిల్ ఇండియా) అనే పెద్ద బోర్డు మెడాన్ నగరం మధ్యలో చూడగానే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఈ లిటిల్ ఇండియా కథేమిటో ఇంతమంది భారతీయులు ఇక్కడకి వచ్చి ఎందుకు స్థిరపడ్డారో తెలుసుకోవాలి అనుకున్నాను. నేను మొదటి సారి అక్కడకి వెళ్లిన రోజు ఎవరితోనూ మాట్లాడటానికి వీలు కాలేదు.

ఆ తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరి బెరింగిన్ అనే జిల్లా ఆఫీస్ కు వెళ్లాం. అక్కడ భూపతి (సబ్-డిస్ట్రిక్ట్ హెడ్) ని కలిసి ఆ జిల్లా గురించిన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. 11 గ్రామాలు, 89 ఉపగ్రామాలు ఉన్న ఆ జిల్లా మొత్తం జనాభా 60000. అధిక శాతం ముస్లింలే. ప్రధాన వృత్తి వ్యవసాయం. కొందరు చదువుకున్న యువకులు స్థానికంగా కన్నా బయటదేశాలలో ఉపాధి అవకాశాలు బాగుంటాయనే ఉద్దేశంతో మలేసియా, కంబోడియా, వియత్నాం వంటి దేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. మరికొంతమంది స్వయం ఉపాధి కల్పించుకున్నారు. భూపతి చాలామంది యువకులు ఫ్రీలాన్స్ గా పనులు చేస్తుంటారు అని చెప్పగానే అంతకు ముందు రెండు రోజుల నుండి అక్కడక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తున్న ట్రాఫిక్ వాలంటీర్స్ గుర్తువచ్చారు. మెడాన్ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు కనిపించలేదు. కొన్ని ప్రధానమైన కూడళ్లలో కొంతమంది ఒకరో ఇద్దరో కుర్రవాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. కొందరు వాహనదారులు వారికి డబ్బులు చెల్లిస్తున్నారు, కొంతమంది చెల్లించకుండానే వెళ్లిపోతున్నారు. దానిగురించి భూపతిని అడిగితే అది వారికి వారు స్వయంగా కల్పించుకున్న పని. ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, అదే వారికి ఆదాయం అని చెప్పారు.

ఆయనతో కొంతసేపు మాట్లాడాక కార్తిని అనే ఆమెను కలవడానికి ఒక గ్రామానికి వెళ్లాం. కార్తిని ఇంటివద్దే ఒక చిన్న చిరుతిండ్ల వ్యాపారం నడుపుతుంది. దాదాపు పదిహేను మంది ఆమెతో పనిచేస్తున్నారు. బంగాళాదుంప, అరటికాయ, కసావా పండ్లతో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నారు అక్కడ. దాదాపు పది సంవత్సరాల నుండి తాను ఈ వ్యాపారం చేస్తున్నాను అని చెప్పింది ఆమె. ఏడు రకాల స్నాక్స్ తయారు చేసి అందమైన ప్యాకింగ్ చేసి స్థానిక సూపర్ మార్కెట్లలో, మాల్స్ లో అమ్ముతుంది. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. తర్వాత మరొక ఊరికి వెళ్లి యూసుఫ్ అనే వ్యక్తిని కలిసాం. యూసుఫ్, అతని భార్య కలిసి వారి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు పదిహేను చేపల చెరువులు తవ్వి చేపల పెంపకం చేస్తున్నారు. చిన్ని చిన్ని చెరువులలో కాస్తంత ఆహారం వెయ్యగానే లెల్లె చేప పిల్లలు గలగలలాడుతూ సందడి చేశాయి. తన నాన్నగారు ఎవరో ఆస్ట్రేలియన్ దగ్గర పని చేసేవారనీ, ఆ ఆస్ట్రేలియన్ అధికారిని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేందుకు సలహా అడిగితే ఈ చేపల పెంపకం చేయమని సూచించారనీ యూసుఫ్ చెప్పాడు. ప్రతివారమూ ఒకటో రెండో చెరువుల్లో చేపలు పట్టి మార్కెట్లో నేరుగా కాకుండా మధ్యవర్తులకు అమ్ముతాడు.

అక్కడ నుండి రేకి తనుమ్ అనే మహిళ ఇంటికి వెళ్ళాం. ఈమె కూడా ఇంటివద్దనే చేనేత మగ్గాలు ఏర్పాటుచేసి కుటీర పరిశ్రమ నడుపుతుంది. పదిహేను మంది అమ్మాయిలు అక్కడ పనిచేస్తున్నారు. అందమైన వస్త్రాలు నేయడమే కాదు వాటితో హ్యాండ్ బ్యాగ్లు, అలంకరణ ఉత్పత్తులు తయారుచేస్తూ మంచి కస్టమర్ బేస్ సంపాదించుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి కూడా ముగ్గురు కస్టమర్స్ కు తాము తయారు చేసిన ఉత్పత్తులు చూపిస్తూ బిజీ గా ఉంది రేకి. వాళ్ళతో పాటు మాకు కూడా వారు ఏమేమి తయారు చేస్తున్నారో, ఎంత ఆదాయం వస్తుందో, తాను ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో వివరించింది.

అలా ఆ రోజంతా ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చూస్తూ గడిపాము. నిజానికి అక్కడ కుటీర పరిశ్రమలంటే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్లుగా కనపడేవి కావు. మెడాన్ నగరంలో దాదాపు ప్రతి ఇంటికీ అనుబంధంగా ఏదో ఒక చిన్న దుకాణమో, పరిశ్రమో నడుస్తుంది. వ్యాపార దృక్పధం చాలా అధికంగా ఉన్న ప్రజలు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే చింత ఇటు నగరంలోని యువతలో గానీ, చుట్టుపక్కల పల్లెల్లోని యువతలో కానీ కనపడలేదు. అక్కడే ఎవరో అన్నట్లు వారికి ప్రకృతి అనంతమైన సంపదనిచ్చింది. మనలాగా వ్యవసాయం అక్కడ గిట్టుబాటు కాని వృత్తిలా మారలేదు. ఏడాదికి రెండుపంటలు సమృద్ధిగా పండుతున్నాయి. యువకులు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయం బాగుంటే వారు మాత్రం ప్రత్యామ్నాయాల వైపు ఎందుకు చూస్తారు? ఇటు నగరంలోని కుటుంబాలు ఒకవైపు ఉద్యోగాలు చేస్తున్నా, ఇంటి వద్ద ఏదో ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. అసలు ఇలా ఇంటింటికీ ఒక దుకాణం ఉంటే వ్యాపారాలు ఏమి నడుస్తాయి? అయినా మేము చూడడంలో ఏదైనా లోపం ఉందా, నిజంగా ఇన్ని దుకాణాలు ఉన్నాయా అనే ఆసక్తితో మెడాన్  నగరం గురించి కొంత గూగుల్ చేసి చూసాను. అప్పుడు తెలిసింది మెడాన్ నగరాన్ని “సిటీ ఆఫ్ మిలియన్ షాప్ హౌసెస్” అంటారని. తమ ఇళ్లకు ఆనుకునే లక్షల దుకాణాలు నిర్మించుకున్నారు నగరవాసులు. అవి వారికి అదనపు ఆదాయాన్ని ఇస్తుండడమే కాక ఇంకొంతమందికి ఉపాధినిస్తున్నాయి.

ఇక ఆ తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరి ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాం. బెరింగిన్ సబ్-డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ పాఠశాల అన్ని వసతులతో ఎంతో చక్కగా ఉంది. అక్కడ పాఠశాలలు పొద్దున్నే ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మాత్రమే నడుస్తాయి. ఆ తర్వాత అంతా పిల్లలు ఖాళీనే. మేము వెళ్లేసరికి పిల్లలు పరీక్ష రాస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని మేము టీచర్లకు చెప్పినా కూడా వినకుండా ఒక తరగతి గదిలోకి తీసుకువెళ్లారు. ఏమీ పర్లేదు, వాళ్ళు రాస్తున్నది స్పోర్ట్స్ కి సంబంధించిన పరీక్ష అన్నారు. స్పోర్ట్స్ లో థియరీ పరీక్ష కూడా పెడతారా అంటే అక్కడ అన్ని క్లాసెస్ లోనూ అది తప్పని సరి అని చెప్పారు టీచర్లు. బోధన అంతా వారి మాతృభాష అయిన బహాస లోనే జరుగుతుంది. ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కానీ ఎక్కడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు లేవు అని చెప్పారు. అందుకే అక్కడ గ్రాడ్యుయేషన్ పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారు.మేము వెళ్లిన ఆఫీసులలో ఎక్కడా కూడా ఏ అధికారీ మాతో ఇంగ్లీషులో మాట్లాడలేదు. అందరూ బహాస లో మాట్లాడితే మాతో ఉన్న మెటా అనే అమ్మాయి మాకు అనువాదకురాలిగా సహాయం చేసింది. మెటా మేము అక్కడ ఉన్నన్ని రోజులూ మాతో పాటే అన్ని ప్రాంతాలూ తిరిగింది. కారులో వెళ్ళేటపుడు ప్రతిరోజూ నేనూ, నాతో పాటు ఇండియా నుండి వచ్చిన నా సహోద్యోగి ఇంగ్లీషులో మాట్లాడుకుంటుంటే ఉండబట్టలేక ఒకరోజు అడిగేసింది. మీరెందుకు మీలో మీరు కూడా ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు, మీ భాషలో మాట్లాడుకోవడం లేదు ఎందుకు? అని. మేము ఇద్దరం వేర్వేరు రాష్ట్రాల వారిమి అనీ, ఒకరి భాష మరొకరికి రాదు కాబట్టి రోజూ మేము ఇలానే మాట్లాడుకుంటాం అని చెప్పాం. బహుశా అందుకేనేమో మీ ఇండియన్స్ కు ఇంగ్లీష్ బాగా వస్తుంది, దానితో పాటు బ్రిటీషర్ల పాలనలో ఉన్నారు కదా చాలాకాలం అని కూడా తనే అనుకుంది.

పాఠశాల చూసాక జూలీ తాని అనే రైతు సహకార సంఘాన్ని చూడడానికి వెళ్లాం. యార్లీ అనే యువకుడు ఆ సంఘం నాయకుడు. ఇంజనీరింగ్ చదువుకుని సహకార వ్యవసాయం మీద ఆసక్తితో ఆ సంఘంలో చేరి దానికి నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. మొత్తం 38 హెక్టార్ల భూమిలో 105 మంది సన్నకారు రైతులు కలిసి సహకార వ్యవసాయ పద్ధతిలో పచ్చిమిరప పండిస్తున్నారు. జులై నెలలో పుట్టిన ఒక రైతు ఎన్నో ఏళ్ళ క్రితం ఈ సహకార వ్యవసాయం గురించి ఆలోచన చేసి ఈ రైతులందరినీ ఒక సంఘంగా సమీకరించి సమిష్టి వ్యవసాయం ప్రారంభించారట. ఆయన జ్ఞాపకంగా ఆ సంఘానికి జూలీ తాని (జులై లో పుట్టిన రైతు) అని పేరు పెట్టుకున్నారు. మిర్చి పండించడంతో పాటు కొద్దిపాటి ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నారు. కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఇండో-ఫుడ్ అనే కంపెనీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి మూడుకిలోల ఆర్గానిక్ వ్యర్ధాలకూ ఆ కంపెనీ ఒక నూడుల్స్ పాకెట్ ను సంస్థకు ఇస్తుంది. వ్యవసాయంపై మాత్రమే కాకుండా తమ సభ్యుల ఇతర అవసరాలపై కూడా ఈ సంఘం దృష్టి పెట్టింది. వారి పిల్లల పై చదువులకు అవసరమైన ఆర్ధిక సహాయం చేస్తుంది.

మేము వెళ్ళేటప్పటికి కొంతమంది యువతులు మిర్చిని గ్రేడింగ్  చేయడం,తొడిమలు ఒలవడం చేస్తున్నారు. వారికి కొంతదూరంగా కొందరు కుర్రవాళ్ళు నేలపై పడుకుని మొబైల్ ఫోన్లు చూసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాళ్లంతా ఎవరు అని అడిగితే ఏదో కాలేజీ లో చదువుకుంటున్న పిల్లలు అనీ, జూలీ తానీ లో ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చారనీ చెప్పారు యార్లీ. వాళ్ళు నెల రోజులు అక్కడే ఉండి యార్లీ, ఇతర సభ్యులు ఏ పని కేటాయిస్తే అది చేస్తారు. అయితే అమ్మాయిలు అంతా కష్టపడి పని చేస్తున్నారు, అబ్బాయిలు చూడండి ఊరికే పడుకుని టైం పాస్ చేస్తున్నారు, ఎంతైనా అమ్మాయిలలో కష్టపడే గుణం ఎక్కువ అన్నాను నవ్వుతూ యార్లీతో. అతను నవ్వి వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లి పొద్దుటి నుండీ వాళ్ళేమి పనులు చేశారో చెప్పమన్నాడు. ఆ అమ్మాయిలు పొద్దుటి నుండీ వరండాలో కూర్చుని మిర్చి గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు అప్పటివరకూ మిర్చి తోటలో మడులు చేసి వచ్చామన్నారు. ఎండలో నిలబడి నిముషం కూడా కూర్చోకుండా కొన్ని గంటల పాటు పనిచేశామనీ, ఇప్పుడే వచ్చి అలా నడుం వాల్చి విశ్రాంతి తీసుకుంటున్నామనీ చెప్పారు. పూర్తిగా విషయం తెలుసుకోకుండా తొందరపడి వాళ్ళని జడ్జ్ చేసినందుకు నన్ను నేనే మనసులో తిట్టుకున్నా. ఆ పిల్లలతో, యార్లీతో కొన్ని ఫోటోలు తీసుకుని అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాం.

పగలంతా ఎక్కడ  తిరిగినా, ఏమి తిన్నా రాత్రి డిన్నర్ మాత్రం లిటిల్ ఇండియాలోనే, ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ లోనే. లెబనాన్ అనే ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ గురించి తెలుసుకుని అక్కడ డిన్నర్ కు వెళ్లాం అక్కడ ఉన్నన్ని రోజులూ. ఆ లిటిల్ ఇండియాలోనే కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడి అసలు ఇంతమంది ఇండియన్స్, అందునా ఎక్కువగా తమిళియన్స్ ఇక్కడకు ఎందుకు, ఎలా వచ్చారు అని అడిగితే నిజానికి వారంతా స్వచ్చందంగా వచ్చిన వారు కాదు అనీ, కొన్ని తరాల క్రితం డచ్ వారు ఇక్కడి పామ్ ఆయిల్, రబ్బర్ తోటలలో పనిచేసేందుకు మద్రాస్ నుండి అనేకమంది తమిళియన్స్ ను కూలీలుగా  తీసుకువచ్చారనీ, వారి తర్వాత తరాల వారు అక్కడే పుట్టి పెరిగి ఇండో-ఇండోనేషియన్స్ గా అక్కడ స్థిరపడిపోయారనీ చెప్పారు.

ఇండోనేషియా మొత్తంలో ఉత్తర సుమత్రా ద్వీపంలోని భారతీయుల సంఖ్య ఎక్కువ. అందులోనూ మెడాన్ నగరంలో వీరి సంఖ్య మరీ ఎక్కువ. వీరి ముందు తరాలంతా కూలీలుగా పనిచేయడంతో వీరిలో చాలా మందికి సరైన చదువులు, ఉపాధిమార్గాలు లేవు. మెడాన్ లో అధికశాతం పేదలు ఈ ఇండో-ఇండోనేషియన్ సమూహాలే. మెడాన్ నగరంలో ఈ తమిళియన్ లు నివసించే ప్రాంతాన్ని మొదట్లో కెంపున్గ్ కెల్లింగ్ అని పిలిచేవారట. కెంపున్గ్ అంటే గ్రామం అని. కెల్లింగ్ అంటే నల్లని రంగు వారు అని. నల్లని మేని ఛాయ గలిగిన వారు నివసించే ప్రాంతం కాబట్టి దీనిని కెంపున్గ్ కెల్లింగ్ అని పిలిచేవారు. కానీ తర్వాత కాలంలో ఈ పేరు వెనుక ఉన్న వివక్షా దృక్కోణం అర్ధమయిన స్థానిక ప్రభుత్వం ఆ పేరుని నిషేధించి ఈ ప్రాంతాన్ని కెంపున్గ్ మద్రాస్ అని పిలవడం ప్రారంభించింది. ఈ కెంపున్గ్ మద్రాస్ నే ఇప్పుడు లిటిల్ ఇండియాగా పిలుస్తున్నారు.

*

భారతి కోడె

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు