అరక్కోణపు బంధువులు – కంచి కథలు

కొన్ని కలలు – ఒక స్వప్నం, స్కూటర్ మీద దక్షిణ దేశయాత్ర

ఎపుడో నెహ్రూ రాశారు, ‘భారతదేశపు వివాహాలు చాలా విలక్షణమైనవి,’ అని. ఆయన అన్నది ఆ వివాహకాండ గురించి, అది బంధువులందరు కలుసుకొనే వేదిక అవడం గురించీ…

ఏడాదిన్నర క్రితం జరిగిన మా బాబు సన్నీ పెళ్లి ఒకే ఊపులో ఇరవై పాతికమంది అపరిచితుల్ని అతి సన్నిహిత బంధువుల్ని చేసింది. అటు తమిళనాడును ఇటు ఒరిస్సాను ‘మా వియ్యంకులవారి రాష్ట్రాలు’ చేసింది.

ఈ రచన శ్రీనివాస్ బందా స్వరంలో సారంగ చానెల్ లో వినండి/ చూడండి.

అరక్కోణపు బంధువులు – కంచి కథలు

మా కోడలు సురభివాళ్ల అమ్మగారిది అరక్కోణం. నాన్నగారిది భువనేశ్వర్. ఆయన ఉద్యోగం చేస్తోంది వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ల మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా. సురభి – ముద్దు పేరు ఆరా. ఆరా, వాళ్లన్నయ్య శక్తి పుట్టి పెరిగింది బెనారస్‌లోనే. అయినా వాళ్లిద్దరికీ అటు తండ్రివేపు భువనేశ్వర్, కటక్ చుట్టాలతోనూ, ఇటు తల్లివేపు ఆర్కోణం, చెన్నై చుట్టాలతోనూ సన్నిహిత బాంధవ్యం ఉంది.

మావాడి పెళ్లయిన దగ్గర్నుంచీ ఒకసారి వెళ్లి నా అరక్కోణం బంధువులతో కాసేపైనా గడిపి రావాలని బలమైన కోరిక…

అది ఆ డిసెంబరు 31న తీరింది.

తిరుత్తణి దాటి అరక్కోణం చేరేసరికి ఉదయం తొమ్మిది. అక్కడివాళ్లు అందించిన ఆధారాలు పట్టుకొని బిజీ రహదారులు దాటుకొని ఇంటికి చేరేసరికి తొమ్మిదింబావు. ఆ ఊరూ, ఆ రోడ్లూ కొంచెం తికమక పెట్టినా- ఇల్లు సులభంగానే పట్టుకోగలిగాను.

అనుకొన్నదానికన్నా ఆదరంగా ఆహ్వానించారు మా అరక్కోణం బంధువులు. ఆరా వాళ్ల పిన్ని లైలా ఆ ఆహ్వానబృందంలో ముఖ్యురాలు. ఆవిడ చెన్నైలో రైల్వే ఉద్యోగి. అకౌంట్స్ విభాగంలో అధికారి. రోజూ అరక్కోణంనుంచి చెన్నై వెళ్లి వస్తూంటారు. నే వస్తున్నానని సెలవు పెట్టి ఉండిపోయారు. బోలెడన్ని కబుర్లు చెప్పారావిడ.

ఈలోగా వాళ్లమ్మగారు- అంటే అరా వాళ్ల అమ్మమ్మగారు వచ్చి పలకరించారు. సుమారు ఎనభై ఏళ్ల మనిషి ఆవిడ. భర్త- ఆరా వాళ్ల తాతయ్య పోయి సుమారు పదిహేనేళ్లు. ఆయన వాయుసేనలో పనిచేసి నడివయసులో బయటకు వచ్చి అరక్కోణంలోనే ఉద్యోగాలూ వ్యాపారాలూ చేశారట. ఆయన పోయాక ఆ కుటుంబానికి- ఛాయామాత్రంగానే అయినా ఈ అమ్మమ్మ మూలాధారం.

ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబాన్ని నిభాయించారీ విడ.

అందులో ఆరా వాళ్ల అమ్మగారు- సులేఖ అందరికన్నా పెద్ద. ఆవిడ చిన్న చెల్లి, ఈనాటి నా హోస్టు- లైలా. పెద్ద చెల్లి మద్రాసులో ఉంటారు.

సులేఖగారికి ముగ్గురు తమ్ముళ్లు, పెద్ద తమ్ముడు అరక్కోణంలోనే తమ పాతింట్లోనే ఉంటారు. ఆయనా రైల్వే ఉద్యోగే. లైలాలాగా రోజూ మద్రాసు వెళ్లి వస్తూ ఉంటారు. “ఇపుడే వెళ్లిపోయాడు బాబు. సెలవు పెట్టడం కుదరలేదు. తొమ్మిదిదాకా ఎదురుచూసి జస్ట్ వెళ్లాడు,” చెప్పింది లైలా. కొంచెంలో ఆయన్ని మిస్సయ్యానన్నమాట.

రెండో తమ్ముడు వెళ్లిపోయి చాలా ఏళ్లయిందట.

అన్నింటికన్నా విషాదం- ఈ మధ్యనే మూడో తమ్ముడు, ఆరుగురిలో ఆఖరి మనిషి హఠాత్తుగా నిష్క్రమించడం.

కుటుంబంలోని సులేఖల తరానికీ, ఆరాల తరానికీ వారధి ఈ తమ్ముడు. చురుకైన మనిషి, ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకొనే మాట తీరు. అమెరికాలో చాలా ఏళ్లు ఉండి వచ్చాడు. అట్లాంటాలో ఇల్లు కూడా ఉందనుకొంటాను. మా సన్నీ పెళ్లినాటికి కుటుంబంతోసహా గల్ఫ్ లో ఉంటున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం- 2014 ఫిబ్రవరిలో తన మేనకోడలూ, ఆరా వాళ్ల కజినూ అయిన అమ్ము పెళ్లి చెన్నైలో జరిగినపుడు కలిశాను. కాసేపు మాట్లాడాను. ఏడాది తిరిగేలోగా కేన్సరు బారిన పడటం. మన మధ్యనుంచి అదృశ్యమవడం- ఊహాతీతమైన విషాదం అది. ఆ షాక్‌కు కుటుంబం కుటుంబమంతా గురి అయింది. ఇపుడిపుడే తేరుకుంటోంది.

గత రెండేళ్లుగా వీళ్లందరినీ కలుస్తూనే ఉన్నానుగానీ మొత్తం కుటుంబాన్నంతటినీ ఒకే ఫ్రేములో చూడడానికి లైలాతో గడిపిన ఆ గంటా ఉపయోగపడింది. ఒక స్పష్టమయిన అవగాహన వచ్చింది. దాంతోపాటు నాకు మూడో కాఫీ కూడా వచ్చేసింది! బాబూ వాళ్లవిడ తెచ్చి ఇచ్చారు.

‘పాపాకు కాఫీ అంటే ప్రాణం. అరగంటకోసారి కాఫీ ఇవ్వు. పంచదారలేని స్ట్రాంగ్ కాఫీ..’ అని ఆరా వాళ్ల పిన్నికి చెప్పిందట!

పెద్దావిడతో కబుర్లలో పడ్డాను. నాకు తమిళం రాదు. ఆవిడ తెలుగు అర్థం చేసుకోగలరుగానీ మాట్లాడలేరు. అయినా సంభాషణ సాఫీగా సాగింది!

మాట్లాడుకోడానికి మనం అక్షరభాషే అవసరమనుకొంటాం. నిజమే. అది ముఖ్యమే. కానీ దానితోపాటు మనం మరో భాషను మనకు తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటాం. బాడీ లాంగ్వేజ్… హావభావాల భాష అది.

ఒక చూపు, ఒక ముఖకవళిక, ఒక శరీర ప్రకంపన, ఒక చిరునవ్వు, ఒక నిలబడే తీరు, ఒక కరచాలనం- ఇవి అక్షరాల భాష చెప్పలేని ఎన్నో భావాలను వ్యక్తపరచగలవు. దీన్ని నిజానికి హావభావాల భాష అనడం చిన్నమాట అవుతుంది. మనోభాష అనడం పెద్దమాట అవుతుంది.

భాషరాని చోటకు వెళ్లినప్పడు ఈ హావభావాల మహాత్యం బోధపడుతుంది. ఆమెతో సంభాషణ అందుకే చాలా సాఫీగా సాగింది. కడుపు నిండినట్టని పించింది.

ఈలోగా ఆవిడ బుల్లి మనవడు నిద్రలేచి వచ్చాడు. రెండేళ్ల వయసు. ఈలోగా ఇతగాడి అక్కయ్యలు. అంతా కలిసి నలుగురు పిల్లలు వెళ్లిపోయిన ఆ చిన్నకొడుకుకి… పిల్లల్ని కబుర్లలో పెట్టి స్నేహం కలుపుదామని మంచి ప్రయత్నమే చేశాను. ఫలించలేదు! అతని భార్య కూడా వచ్చి రెండు నిమిషాలు కనపడి వెళ్లారు. నా ఈ అరక్కోణం యాత్రకు ఓ ముఖ్యకారణం ఆవిడనూ పిల్లల్నీ కలిసి బాధను పంచుకోవడం. ఆవిడా పిల్లలూ ఇండియాలోనే ఉండాలా… పౌరసత్వమో, గ్రీన్ కార్డో ఉన్న అమెరికా వెళ్లిపోవాలా అన్నది ఆ సమయంలో ఆ కుటుంబంలో నడుస్తోన్న చర్చ. నా సలహా అడగకపోయినా చొరవ తీసుకొని అమెరికా వెళ్లమనే ఆమెకు చెప్పాను.

అరక్కోణంనుంచి కంచి అంతా కలసి ముప్పయ్ కిలోమీటర్లు. రెండు గంటలు బంధువులతో గడిపి అర్లీగా లంచ్ ముగించి పదకొండున్నరకు ఇల్లు వదిలిపెట్టిన నేను గంటసేపటికల్లా కంచి చేరిపోయాను.

చిన్నప్పుడు కథలు వినకుండా ఉంటేనూ, పెద్దయ్యాక రాయకుండా ఉంటేనూ నాకు కంచి గురించి అంత పట్టు ఉండేదిగాదేమో- కంచికి చేరిన కథలన్నింటినీ ఓసారి పలకరించి రావాలన్న నా కల వయసు కనీసం ఏభై ఏళ్లు!

ఆ మాట ఎలా ఉన్నా దక్షిణ భారతదేశంలో చరిత్రపరంగానూ, సంస్కృతిపరంగానూ, మతపరంగానూ ఓ విలక్షణస్థానమున్న కంచిని చూసి రావాలన్నది నాకున్న ఒక బలమైన కోరిక.

ఊళ్లోకి వెళ్లాక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నిన్న రాత్రి కాలూరులో తాత్కాలిక రిపేర్లు జరిగాయేగానీ అప్పటికప్పుడు వేసిన అతుకుల ట్యూబు స్థానంలో కొత్త ట్యూబు వేయించుకోవడం అత్యవసరంగదా- దానికోసం అరక్కోణంలోనూ, దారిపొడవునా అర్థమనస్కంగా వెదికిన మాట నిజమే కానీ, ఆ పని కంచిలో జరగవలసి ఉంది.

సులువుగానే మెకానిక్ దొరికాడు. హఫీజ్ అతని పేరు. సత్తార్ అతని అనుచరుడు. నా ప్రయాణం గురించి అడిగి చెప్పించుకొని ఉత్సాహం చూపించారు. “ఒక్క అరగంట ఆగండి సార్. పక్కన ఎమ్మారెఫ్ వాళ్ల దుకాణం ఉంది. నాణ్యమైన టైరు తెచ్చి మార్చేస్తాం,” అన్నారు.

నేను ఆగవలసిన అవసరం లేదనీ, వాళ్లు చేసే పనిని పర్యవేక్షించవలసిన అవసరం అసలే లేదనీ, తొందరేం లేకుండా పని ముగించమనీ చెప్పి ఒప్పించి గుడుల వైపుకు దారితీశాను. అన్నట్టు వీళ్లతో నాది పదాల భాషే- హిందీ, ఉర్దూల మేలు కలయిక!

ఏదో మా పెద్దమ్మ వాళ్లింటికి వెళ్లాలి అని అడిగినట్లు, “కామాక్షీ మందిరం ఎక్కడా?” అని వాకబు మొదలెట్టాను. సమాధానాలు లేవు. ఎవరో ఓ పెద్దాయన నా వాలకం కనిపెట్టి, జాలిపడి, “ఏదో మధురలో మీనాక్షి గుడిలాగా ఇక్కడ కామాక్షి గుడి ఉంటుంది అనుకొంటున్నట్లున్నావు. నువ్వు వెళ్లవలసింది ఏకాంబరేశ్వర మందిరానికి. అక్కడ కామాక్షి అమ్మకూడా కొలువై ఉంది,” అని తమిళంలో వివరించాడు. కనీసం నాకు అలా అర్థమయింది. కానీ యాత్ర ముగిసి ఇంటికి చేరిన తర్వాత వివరాలు పరిశీలిస్తే ఆనాటి నా అవగాహన తప్పనీ, కామాక్షి ఆలయం మరో కిలోమీటరు దూరాన ఉందనీ బోధపడింది. ప్రాథమిక అవగాహన లేకుండా అలాంటి ముఖ్యమైన ప్రదేశానికి వెళ్లడం క్షమించరాని పొరపాటే!!

ఆ ఏకాంబరేశ్వర మందిరం అక్కడికి మైలు దూరాన ఉంది. కొంచెం ఎండ ఇబ్బంది పెడుతున్నా ఊరుతో పరిచయం కలుగుతుందనే ఆలోచనతో నడక సాగించాను. వీపున ఉన్న బ్యాక్‌పాక్‌ను, హెల్మెట్‌ను కూడా హఫీజ్‌కు అప్పజెప్పాను.

చాలా పెద్ద ప్రాంగణమది. శ్రీరంగం, చిదంబరం గుర్తొచ్చాయి. కానీ టైమింగుల సమస్య మళ్లా నన్ను వెంటాడింది.

పదకొండింటికి గుడి తలుపులు మూస్తారట, మూడింటికి గాబోలు మళ్లా తెరుస్తారట. గర్భగుడిలోకి వెళ్లి తీరాలనే పట్టుదల, అవసరం లేవుగాబట్టి పెద్దగా బాధపడలేదు.

ఆరో శతాబ్దంలో కట్టిన గుడి అది. మహాబలిపురం సమకాలీనమన్నమాట. ‘పంచభూతాల పునాదుల మీద’ నిర్మించిన శివాలయాల్లో ఇది భూమికి ప్రతీకగా నిర్మించినదట. చిదంబరం ఆకాశానికి, అరుణాచలం అగ్నికీ, కాళహస్తి వాయువుకీ, తిరుచ్చి దగ్గరి తిరువనైక్కావల్ మందిరం జలానికీ అంకితమట. గోపురంమీదా గుడిమీదా అపార శిల్పసంపద. తలుపులు మూసి ఉన్నా గుడి అవరణలో తిరుగాడే అవకాశం. ‘ఇంకా బోలెడు గుడులున్నాయి ఊళ్లో’ అంటూ సహృదయులు సలహా ఇస్తున్నా పట్టించుకోకుండా ఉన్న సమయమంతా ఆ గుడి దగ్గరే గడిపాను. పనిలో పనిగా విలక్షణ కథకులూ, శ్రీకాకుళం కథానిలయంలో కార్యకర్తా అయిన వివినమూర్తికి ఫోన్ చేసి, ‘మీరేదో కథలన్నిటినీ కథానిలయంవేపు మళ్లించే యజ్ఞంలో ఉన్నారు. అది తగని పని. అవి చేరవలసింది ఇపుడు నేను మాట్లాడుతోన్న కంచికి. కనీసం ఇక్కడ కథానిలయం బ్రాంచి అయినా తెరచి నన్ను కార్యకర్తగా నియమించండి,’ అని చతుర్లాడాను.

తిరిగి వెళ్లేసరికి బండి సిద్ధంగా ఉంది. కాస్త బ్రేకులూ గట్రా చెక్ చెయ్యగలవా అన్నాను. చేశాడు. బిగి సడలిన బ్రేకును కాస్త బిగించాడు. గంట రెండయింది.

కంచి నుంచి చెన్నై ఎనభై కిలోమీటర్లు, మహా అయితే రెండున్నర గంటలు. ప్రయాణం మొదలెట్టాను.

మంచి రాజమార్గం. సుతారంగా సువేగంగా సాగిపోతున్నాయి వాహనాలు. నాది మాత్రం మార్జిన్ నడక గదా- ఆ ఆరడుగుల మార్జిన్లో ఏభైకి దాటని వేగంతో నేనూ నా ఏక్టివా…

గంట గడిచేలోగానే శ్రీ పెరుంపుదూర్ వచ్చింది. రాజీవ్ గాంధీతో ముడి పడిన ప్రదేశం, రామానుజుని జన్మస్థలం, చెన్నైకి చెందిన పరిశ్రమలు కొన్నింటికి వేదిక. అంతకుముందు చూసిన ప్రదేశమే అయినా రాజీవ్ గాంధీ మెమోరియల్ ప్రాంగణంలో మళ్లా కాసేపు గడపాలనిపించింది. వెళ్లాను.

అనుకోని సమస్య ఎదురయింది. సీఆర్పీఎఫ్ వాళ్లు అక్కడ కాపలాదారులు. అంతా మహా పకడ్బందీగా ఉంది. శరీరమంతా తడిమి చూడటం. అదిసరే… నా హెల్మెట్టు, బ్యాక్‌పాక్‌ కుదరవన్నారు. బ్రతిమాలాను, ఊహూ అన్నారు. పోనీ అవి అట్టే పెట్టేందుకు ఏమన్నా స్థలముందా అంటే అదీలేదు. చివరికి ఓ జవాను కరుణించి తన దగ్గర పెట్టుకున్నాడు నా సామాను!

కళాత్మకంగా ఉందో లేదో చెప్పే శక్తి నాకు లేదుగానీ ఆ విశాల ప్రాంగణం ఓ విధమైన ధీరగంభీర విషాద వాతావరణాన్ని సృష్టించడంలో సఫలమయిందన్నమాట నిజం. అతి చక్కని కాలిబాటలూ, అటూ ఇటూ ఇరవై పాతికేళ్ల వయసు ఉన్న చెట్లు, కేంద్రబిందువు దగ్గర అతి ఎత్తయిన రాతిస్థంభాలు, వాటి చిట్టచివర విలక్షణ శిల్ప విన్యాసాలు- వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయి ఏదో రోమన్ కలోసియంలో తిరుగాడుతున్న భావన. నా ప్రణాళికలో లేకపోయినా అక్కడ ఆగినందుకు నన్ను నేనే అభినందించుకొని, సీఆర్పీఎఫ్ జవానుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అరగంటలో మళ్లా రహదారి ఎక్కాను.

దారిలో ఒకచోట నల్లటి రక్తపు మడుగు. ఏదైనా జంతువులదా, ఎవరైనా మనిషిదా? తెలియలేదు. ఒళ్లంతా జలదరింపు. క్షణకాలపు వైరాగ్యం. నాలుగు గంటలకల్లా చెన్నై శివార్లకు చేరుకొన్నాను. నేను వెళ్లవలసిన అశోక్ నగర్ గురించి అవగాహన ఉంది. ఊళ్లో కారూ, బైకులు నడిపిన అనుభవం ఉంది. అయినా చేరడానికి గంటన్నర పట్టేసింది. సరైన మార్గం కనుక్కొని, వాహనాల మధ్యగా ఈదుతూ ట్రాఫిక్ నిబంధనలూ నిషేధాల మీద ఒక కన్ను వేసి ఉంచుతూ, దారి తప్పే పొరపాటు జరగకుండా జాగ్రత్తపడుతూ, ఒకటికి రెండుసార్లు అడిగి నిర్ధారించుకొని ముందుకు సాగుతూ- శారీరకంగా మానసికంగా అలసిసొలసి మా కంపెనీ వారి గెస్టుహౌస్ చేరుకునేసరికి అయిదున్నర!

(మిగతా వచ్చే సంచికలో…)

దాసరి అమరేంద్ర

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు