ఆకాశవాణి కి రిక్రియేషన్ క్లబ్ ఉంది.ఎక్కవగా రిటైర్మెంట్ ఫంక్షన్ లు నిర్వహించటం దాని బాధ్యతగా ఉండేది.
ఆరోజుల్లో మాకొక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చారు. ఆయన పేరు గణేష్ కుమార్. సరదాయైన మనిషి.ఆయన ఆకాశవాణి క్లబ్ పక్షాన క్లబ్ డే జరుపుదామని స్టేషన్ డెరైక్టర్ పర్మిషన్ తీసుకుని, అందులో స్పోర్ట్స్ కు భాగస్వామ్యం కల్పించారు.
అలా షటిల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్,కేరమ్స్,ఛెస్ వంటి ఆటలు మొదలయ్యాయి.అప్పటివరకు నిరుపయోగంగా ఉన్న టి.టి.టేబుల్ కు జవసత్వాలొచ్చాయి.టి.టి.బ్యాట్ పట్టుకోవటం రాని నాలాంటి వాళ్ళం కూడా టి.టి.ఆట పట్ల మోజు పెంచుకున్నాం.మా ఫస్ట్ ట్రాన్స్మిషన్ పదకొండు గంటలకు అయిపోతే ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం.ఎప్పుడొచ్చారో కానీ సంగీత విద్వాంసులు పెమ్మరాజు సూర్యారావు గారు, మా దగ్గరికొచ్చి తను కూడా ఆడతానని చెప్పారు.. మాకు అభ్యంతరం లేకపోతే.. నిజానికి క్లాసికల్ మ్యుజీషియన్స్ లో సూర్యారావు గారు మోడర్న్ గా ఉండేవారు.. సిల్క్ కుర్తా, రేబాన్ గ్లాసెస్ ఆహార్యంతో ఛార్మింగ్ గా ఉండేవారు..టేబుల్ టెన్నిస్ లో ఆయన మంచి ప్లేయర్..ఆయనతో టి.టి.ఆడటం గ్రేట్ ఎక్స్పీరియన్స్..నిజానికి ఆయనతో ఆ అనుభవం ఎన్నడూ ఊహించనిది..
ఈపోటీల వలన ఆఫీస్ అంతా ఉత్సాహం, కోలాహలం చోటుచేసుకున్నాయి.. నాకు టేబుల్ టెన్నిస్ ఆడటం బాగా అలవాటయ్యింది.ఇప్పటికీ కొనసాగుతోంది.
రేడియోలో ప్రసారమయ్యే వారి కార్యక్రమాల పట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు చాలా పట్టుదలతో ఉండేవారు.అనుకోకుండా ఒక ప్రోగ్రాం రికార్డు చేసి పొరపాటు అది ప్రసారం కాకపోతే దాన్ని రీషెడ్యూల్ చేయటమో తలకు మించిన భారం లా ఉండేది.. రిపీట్ బ్రాడ్ కాస్టింగ్ చేయటానికి అవకాశాలు తక్కువుండేవి.
విజయవాడ రేడియోలో రైళ్ళ రాకపోకలు పొద్దున్నా, మధ్యాహ్నం, రాత్రి చెప్పేవాళ్ళం.. అలాగే ఉదయాన్నే రిజర్వేషన్ ఛార్ట్ వివరాలు వెల్లడించేవాళ్ళం..నేను చెప్పేది ఇంటర్నెట్ లేని కాలం గురించి..విజయవాడ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం అనేక రైళ్ళు వచ్చి,పోతుండేవి.చాలా మంది శ్రోతలకు ఆరోజుల్లో రేడియో ముఖ్య సమాచార వాహిక.రేడియోలో వింటే ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలిసేది.
రాత్రిపూట ఢిల్లీ వార్తల ముందు అంటే ఏడుగంటల నాలుగు నిమిషాలకు రైళ్ళ రాకపోకల సమాచారం చెప్పేవాళ్ళం.రైల్వేస్టేషన్ వాళ్ళే ఫోన్ చేసి చెబుతుండేవారు.దానికో ఫార్మాట్ ఉండేది.ఒకరోజు వాళ్ళు ఆ సమాచారం ఏడుగంటల ఐదు నిమిషాలకు ఇచ్చారు.ఎలా అయినా చెప్పమని కోరారు.
తెలుగు వార్తల అనంతరం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రైల్వే సమాచారం చెప్పి, పంటసీమలు కార్యక్రమం ప్రసారం చేశాం.
ట్రాన్స్మిషన్ రిపోర్ట్ లో రైల్వే సమాచారం లేటుగా రావటం వలన లేటుగా ప్రసారం చేశామని రాశాను.
ఆ తరువాతి రోజు జరిగిన ప్రోగ్రాం మీటింగ్ లో అప్పటి ఫార్మ్ రేడియో ఆఫీసర్ వై.హనుమంతరావుగారు ,అలా చేయటం పట్ల అభ్యంతరం తెలిపారు.అది తమ కార్యక్రమం వినే రైతాంగానికి అసౌకర్యం కలిగించిందనేది ఆయన అభ్యంతరం.. ఆయనకు సర్ది చెప్పినా ఆయన అభ్యంతరం సరైనది కాదు అనలేకపోయారెవ్వరూ..
ఆ తర్వాత రోజున నేను మధ్యాహ్నం డ్యూటీ లో ఉంటే ఆయనే ఈ విషయం చర్చించారు..నా భుజం తట్టి డ్యూటీ ఆఫీసర్ గా నువు చేసింది తప్పు అనటం లేదులే అన్నారు.. దేన్నయినా వివరించి చెప్పటం ఆయనకు అలవాటు..ఆయనలో ఇంకో విశేషముండేది.. సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళిపోతూ మరుసటిరోజు ప్రోగ్రాం క్యూ షీట్ తీసుకుని వ్యవసాయ కార్యక్రమాల వివరాలు ఉన్నాయా లేదా, వాటికి సంబంధించిన రికార్డింగ్ టేప్ నెంబర్లను వేశారో లేదో చెక్ చేసుకునేవారు..అదీ ఆయన నిబద్ధత..ఈ రకమైన క్రమశిక్షణ వ్యవసాయ కార్యక్రమాల సిబ్బంది అందరిలోనూ ఉండటం నేను అన్ని స్టేషన్లలోనూ గమనించాను.
ఆరోజుల్లో ఈ ప్రోగ్రాం మీటింగ్ లో కొన్ని అంశాలపై చర్చలు వాడిగానే జరుగుతుండేది.
డా.వి.చంద్రశేఖరరావు గారి కథలు ఆరోజుల్లో ప్రత్యేకంగా ఉండేవి. తన కధల్లోని మేజిక్ రియలిజం శిల్పం ఒక్కోసారి అర్ధమయ్యేది.. ఒక్కోసారి అయ్యేది కాదు.
ఒకసారి ఆయనో కథ చదివారు..ఆ కథ పేరు “చిట్టచివరి రేడియో నాటకం”..ఆ టైటిల్ తో కథను ఎలా ప్రసారం చేస్తారని కొందరు, తప్పేమీ లేదని ఇంకొందరు వాదించారు. ఆ టైటిల్ ఎక్కువమందిని ఆకర్షిస్తుంది తప్పు లేదని సమర్థించారు. నిజానికి చాలా మంచి కథ అది..ఆ టైటిల్ తోనే కథ ప్రసారమయింది.. ఊహించినట్టుగానే ఆ కథపై ఎక్కువ ఉత్తరాలొచ్చాయి..
ముంజులూరి కృష్ణకుమారి గారు వారితో ఒక ప్రోగ్రాం కి స్క్రిప్ట్ రాయించి ప్రొడ్యూస్ చేశారు.ఆ ప్రోగ్రాం పేరు “సందిగ్ధం”. వారి ప్రొడక్షన్ టీం లో నేనూ ఒక సభ్యుడిని.ఆకాశవాణి వార్షిక పోటీలలో ఆ ఎంట్రీకి మెరిట్ సర్టిఫికెట్ లభించింది.కృష్ణకుమారిగారు విశాఖపట్నం కేంద్రం లో పనిచేస్తున్న సమయంలో
డా.వి.చంద్రశేఖరరావుగారి ఒక కథను నాటికగా మలిచి ఆకాశవాణి జాతీయ పోటీలకు ఎంట్రీ గా పంపారు. అప్పుడు ఆ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది..
చంద్రశేఖరరావు గారు మితభాషి.. మృదు స్వభావులు.
ఆ తర్వాతి రోజుల్లో వారితో పరిచయం పెరిగింది..కథా రచన గురించి వారు చేసే ప్రసంగాలు ఆసక్తిగా ఉండేవి.
ప్రఖ్యాత కవి వేగుంట మోహన్ ప్రసాద్ గారి జ్ఞాపకం ఒకటి చెప్పాలి మీకు.మోహన్ ప్రసాద్ గారు ఆకాశవాణి వార్షిక పోటీలో ఎంట్రీల స్క్రిప్ట్ లను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తుండేవారు.వార్షిక పోటీలకు ఎంట్రీలు పంపేవారు ముందే ఆయన్ని సంప్రదించి తమ స్క్రిప్ట్ అనువాదం చేయమని ఆయన్ని ఫిక్స్ చేసుకునేవారు.ఆయన అనువాదానికి అంత డిమాండ్ ఉండేది..
ఆయన తన స్క్రిప్ట్ ఎంత ఖచ్చితంగా సమయానికి ఇచ్చేవారో, అంతే ఖచ్చితంగా రేడియో ఆయనకు ఇవ్వాల్సిన చెక్ ఇవ్వాలని ఆశించేవారు. నేను ఇంగ్లీష్ టాక్స్ చూస్తున్నప్పుడు వారిని ఇంగ్లీష్ లో కవిత్వం రాయమని కోరాను.నిజానికి నాకు వారితో పరిచయం తక్కువ..పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు,ఆయన మాట్లాడుకుంటుంటే వింటుండేవాడిని..ఆయన నన్ను పెద్ద నోటీసు చేసింది లేదు.. ఆంగ్లంలో కవిత్వం రాయమంటే ఆయన అడిగిన ఒకే ప్రశ్న.. రికార్డింగ్ అవగానే చెక్ ఇస్తారా అని..
అలాగే సర్ అని చెప్పాను..చెప్పిన తేదీ కి వచ్చారు.. రికార్డింగ్ చేశారు.. చెక్ తీసుకున్నారు..ఏం మాట్లాడలేదు.. వెళ్ళిపోయారు.
అప్పటికింకా సెల్ ఫోన్లు లేవు..ఆయన తో రికార్డు చేసిన కవిత్వానికి చిన్న ప్రయోగం చేశాను.అంతకుముందే ఒక కీబోర్డ్ ప్లేయర్ ని బుక్ చేసి ఎఫెక్ట్స్ రికార్డు చేస్తున్నప్పుడు కొన్ని బిజిఎమ్ ట్రాక్స్ రికార్డు చేసి పెట్టుకున్నాను..”మో” కవిత్వం ఆరు నిముషాలు ఉంది. నాలుగు కవితలు రికార్డు చేశాను..ఈ బిజిఎమ్ బిట్స్ కవిత్వంపై సూపర్ కంపోజ్ చేస్తే , ఆ కవిత్వం ఫీల్,ఫ్లేవర్ మారిపోయాయి.
ఆ రికార్డింగ్ ప్రసారం అయిన రెండు రోజులకు డ్యూటీ రూం కి ఆయన ఫోన్ చేశారు.. లక్కీగా నేనే ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాను.. నిజానికి ఆయన నేనే ఆ ఫోన్ తీస్తానని అనుకోలేదు.
“నా పొయిట్రీ నాకు చాలా నచ్చింది.. మీరు మ్యూజిక్ తో మిక్స్ చేసి నా పోయమ్స్ ని ఎలివేట్ చేశారు.. మీకు కన్వే చేయమని చెప్పటం కోసం చేశాను.లక్కీలీ యూ లిఫ్టెడ్ ది ఫోన్ అని నవ్వారు..సో మీకే చెబుతున్నాను” అని నవ్వారు. అది చాలు కదా..మూడీ “మో” మేడ్ మై డే ఆరోజున అని ఆనందపడటానికి..
ఆరోజుల్లో స్టేషన్ డైరెక్టర్లు తెలుగు వారు కాకపోయినా, కార్యక్రమాల సరళిపై వారికి మంచి పట్టు ఉండేది.నేను విజయవాడ లో పనిచేసిన 1988-98 సంవత్సరాల్లో నలుగురు స్టేషన్ డైరెక్టర్లు సారధ్యం వహించారు..దిశా నిర్దేశం చేశారు..
ఆ జ్ఞాపకాలు కొన్ని చెప్పాలంటే —
*








జోరు పెరుగుతూ ఉంది. సాగి పో. మెల్ల మెల్లగా నీ మాటల కెరటాల వైపు లాక్కుంటూ వెళ్తున్నావ్ రాంబాబు గారు. సారంగ లో ఆకాశవాణి అనుభవాలు అలవోకగా చెప్తున్నట్లు ఉంది. వ్యవసాయ ప్రసారాలు గురించి పలకరించావ్. మో గురించి మోయనంగా చెప్పావ్. ఎవరి గురించి రాయాల్సి వచ్చినా నిజాలే రాయి….