ప్రతి సంస్థలోను ఉద్యోగులకు సంఘాలు సమస్యలు ఉన్నట్టు ఆకాశవాణిలో అనేక అసోసియేషన్ లు ఉన్నాయి.
ఇంజనీరింగ్ విభాగంలో వారికి కొన్ని ఉంటే , ప్రోగ్రాం స్టాఫ్ కు ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ ఉంది.ఇందులో ట్రాన్స్మిషన్ ఎక్సిక్యూటివ్ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వరకు సభ్యులే.
అలాగే అనౌన్సర్ లకు వారి అసోసియేషన్ ఉండేది.అడ్మినిస్ట్రేషన్ విభాగం వారికి, మళ్ళీ మరో అసోసియేషన్.
నేను చేరిన కొత్తల్లో మూణ్ణెళ్లకో సమావేశం j జరుగుతుండేది.సభ్యులకు స్వీట్, హాట్, ఐస్క్ క్రీం పెట్టేవారు.డైరక్టర్ గారు స్టాఫ్ కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలంటూ మోటివేషనల్ స్పీచ్ ఉండేది..మా కౌంటర్ పార్ట్స్
అయిన ఇంజనీర్లకు ప్రభుత్వం స్కేల్స్ అప్ గ్రేడ్ చేసింది.. మాకు కూడా. వారితో సమానంగా పెంచాలని ఆందోళనలు చేశాం.ఇందులో నిరాహారదీక్షలు, గేట్ మీటింగ్స్ పెట్టేవాళ్ళం.
ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది విజయవాడ కేంద్రమే..
రేడియో కబుర్లు: ధర్నాలూ, సమ్మెలూ ! సారంగ ఛానెల్ లో కూడా చూడండి!
కొంతకాలం రిలే నిరాహారదీక్షలు చేశాం.అప్పుడు ప్రతిరోజూ ప్రెస్ నోట్ తయారు చేసి నేను, మిత్రుడు డి.రాజారెడ్డి కలిసి అన్ని పత్రికాఫీసులకు వెళ్లి ప్రెస్ నోట్స్ ఇచ్చి వస్తుండేవాళ్ళం.ఎంతోమంది పెద్దవారు మా శిబిరానికి వచ్చి మాకు సంఘీభావం ప్రకటిస్తూ ఉండేవాళ్ళు .
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్మిషన్ ఎక్సిక్యూటివ్స్ సమావేశం పెడదామని ఐడియా ఇచ్చాడు మిత్రుడు పి.జి.కె.మూర్తి.అలా ఒక ఆదివారం సమావేశం నిర్వహించాం.తమిళ్ నాడు, కర్నాటక,కేరళ వాళ్ళని కూడా ఒక ప్రతినిధిని పంపమన్నాం.ఇది మూర్తి, రాజారెడ్డి ల ఐడియా.లక్కీగా వాళ్ళు కూడా తమ రిప్రజెంటేటివ్ లను పంపించారు.. వచ్చినవారికి మా పక్కనే ఉన్న తి.తి.దే.వారి గెస్ట్ రూమ్ లను తీసుకున్నాం.. మొత్తానికి అన్ని స్టేషన్లనుంచి వచ్చారు.
మనం పోరాటం ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే దానిమీద చర్చలు నడిచాయి.అందరం యంగ్ స్టర్స్..ముప్ఫైల్లో ఉన్న వారం వాడిగా వేడిగా చర్చలు జరిగాయి.అందరం ఒకరికి ఒకరం పరిచయం అయ్యాము.సెంట్రల్ లీడర్ షిప్ మీద ఒత్తిడి తేవాలని అందరూ సూచించారు.

మా ట్రాన్స్మిషన్ ఎక్సిక్యూటివ్స్ మీటింగ్ తమిళనాడు వాళ్ళ మీద చాలా ప్రభావం చూపింది.మా మీట్ జరిగిన ఆర్నెలల్లో మద్రాసు నగరంలో వాళ్ళు సౌత్ జోన్ మీటింగ్ పెట్టారు.ఇందుకు సెంట్రల్ లీడర్ షిప్ ని కూడా ఆహ్వానించారు.. మొదటి రోజు మీడియాలో వస్తున్న మార్పులు అనే అంశంపై ఒక సదస్సు ఏర్పాటు చేసి లోకల్ మీడియా ని ఆహ్వానించారు..పనిలో పనిగా మాకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు.అది నెక్స్ట్ డే ప్రెస్ లో బాగా ఫోకస్ అయింది.అలాగే మా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణన్ దీని మీద ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది.మద్రాసు యూనిట్ వాళ్ళు మొదటగా లీడ్ తీసుకుంది విజయవాడ యూనిట్ అని మమ్మల్ని అభినందించారు.మేం దాదాపు ఎనిమిది మంది అటెండ్ అయ్యాం.. మాకు కూడా కొత్త అనుభవం ఒకవిధంగా.. ఎందుకంటే మా అసోసియేషన్ లో డైరెక్టర్ లు కూడా మెంబర్లు అవటం వలన డైరెక్టర్ లెవెల్ అధికారులు చాలామంది పాల్గొన్నారు..అలా మమ్మల్ని పోర్ట్ బ్లెయిర్ స్టేషన్ డైరెక్టర్ గా ఉన్న ఎస్.జయలాల్ ఆకర్షించారు.ఆయన do or die అనేట్టు ఉద్యమం చేయాలని సూచించారు.. ఇది తర్వాత ఢిల్లీలో జరిగిన కన్వెన్షన్ కు మేము హాజరయ్యాం..అదో పెద్ద కథ..
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జాతీయ స్థాయిలో మా ఇష్యూ ఫోకస్ కావటానికి మేం చేసిన చిన్న ప్రయత్నం ఎలా ఉపయోగపడిందో చెప్పటానికి!
విజయవాడ లో ఉన్న పదకొండు సంవత్సరాలలో అనేక ఊళ్ళు తిరిగి అక్కడి కళాకారులను రికార్డు చేసే అవకాశం కలిగింది.యాత్రాస్థలాల స్థల చరిత్ర రికార్డు చేసే అవకాశం లభించింది.గుడివాడ, తెనాలి, బందరు, ఏలూరు, నెల్లూరు గుంటూరు, ఒంగోలు వంటి అనేక పట్టణాల్లోని యువతను రికార్డు చేయగలిగాం.. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ లో చెరకు పిప్పిని ఎలా ఉపయోగకరంగా మార్చుతారో డాక్యుమెంటరీ రూపొందించారు మిత్రులు ముకుంద శర్మ..వారి ప్రొడక్షన్ టీం లో పనిచేశాను.
రాష్ట్రపతి,ప్రధానమంత్రిలు పర్యటనకు వచ్చినప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్ లు ప్రధాని ప్రసంగాలు రికార్డు చేసి ప్రసారం చేస్తాయి.ఇప్పుడు లైవ్ రిలే ఇచ్చేస్తున్నారు.అప్పుడు ఆకాశవాణి అధికారులు ప్రధాని ప్రసంగం రికార్డు చేసి ప్రెస్ సెక్రటరీ కి అందచేయాలి.అది ఖచ్చితంగా అమలు చేయాలి.అది రూల్..అదొక పెద్ద ఛాలెంజ్ గా ఉండేది.అలా నర్సాపూర్, గిద్దలూరు వంటి ఊళ్ళకు వెళ్ళే అవకాశం కలిగింది.ప్రధాని, రాష్ట్రపతి పర్యటన అంశాలను రేడియో రిపోర్ట్ లు గా రూపొందించి ప్రసారం చేయాలి.ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలను ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ టేప్, స్క్రిప్ట్ ఢిల్లోలోని డైరక్టరేట్ పంపించాలి.
ఇలాంటి ఓబీ(outside broadcast) కవరేజెస్ లో మాకు సాంకేతిక సహకారం మా ఇంజనీర్లు అందించేవారు.ఎలాంటి కష్టమొచ్చినా మాకు భరోసాగా ఉండేవారు.వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము చేసిన ధర్నాలు, స్ట్రైక్ ల వలన మొత్తానికి డిసెంబర్ 1998లో నాకు ప్రమోషన్ వచ్చి వరంగల్ కు బదిలీ అయింది.
అలా పదకొండేళ్ల విజయవాడ ఆకాశవాణి తో నా ప్రయాణం ముగిసింది.. జనవరి 11వతేదీన ఆకాశవాణి వరంగల్ లో చేరాను.
ఆ జ్ఞాపకాలు లోకి వెళ్ళేముందు డిసెంబర్ 2023లో ఆకాశవాణి విజయవాడ ఏర్పడి డెబ్భైఇదేళ్ళు అయిన సందర్భంగా స్టేషన్ హెడ్ సోమేశ్వరరావు గారు ఒక చక్కని ఫంక్షన్ ఏర్పాటు చేశారు..
మల్లాది సూరిబాబు,రామం, కలగ కృష్ణ మోహన్,పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ముంజులూరి కృష్ణ కుమారి, బి.జయప్రకాశ్, మాడుగుల రామకృష్ణ.. ఇలా ఆకాశవాణి వార్షిక పురస్కారాలు పొందినవారిని సన్మానించారు.. నేను, కృష్ణ మోహన్, అద్దంకి శ్రీరామ్ కుమార్ హైదరాబాద్ నుంచి వెళ్ళాం.. మళ్ళీ అందరినీ ఎప్పటి వారందరినో కలుసుకున్నాం..శతవసంతాలు చూసిన అన్నవరపు రామస్వామి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.మళ్ళీ స్టూడియోస్ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు కళ్ళముందు కదలాడాయి.
ఆ తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్ లో తానా పూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు విజయవాడ రేడియో లో పనిచేసిన వారిని సత్కరించారు.. అప్పుడు కూడా అన్నవరపు రామస్వామి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈసారి ఒకప్పటి విజయవాడ నగర మేయర్ జంధ్యాల శంకర్ గారిని కూడా ఆహ్వానించారు.ఆయన విజయవాడ కేంద్రం శంఖుస్థాపన సమయంలో చిన్న పిల్లల గ్రూప్ లో ఉండి గీతాలాపన చేశారు.తొంభై దాటినా తరగని ఉత్సాహం తో నవయవ్వనుడిలా ఉన్నారు..
ఆవిధంగా విజయవాడ రేడియో స్టేషన్ లో పనిచేసి పాతికేళ్ళు దాటినా జ్ఞాపకాలు పాతబడలేదు..ఇక వచ్చే సంచికలో వరంగల్ రేడియో అనుభవాలతో కలుస్తాను
*








మిత్రమా
వరంగల్ అనుభవాలకు స్వాగతం