ఉద్యమ సమయాలలో / ఊరూరా గ్రామ గ్రామాన తిరుగుతూ / గూడెంలలోనే కలోగంజో గతుకుతూ /సామాన్యుల జీవనంతో మమేకమవుతూ / ప్రజలను ఉత్తేజపరుస్తూ / ఉద్యమానికై చైతన్యపరుస్తూ / తన కవితా వర్షంలో స్నానపరుస్తూ / ప్రసంగాలతో సమాయత్తపరుస్తూ / జనాన్ని పదునైన ఆయుధాలుగా / లోడెడ్ గన్నులుగా మలిచిన /ఉద్యమ కవి సూర్యుడు దాశరథి – దాశరథి ఉద్యమాన్ని తన శ్వాసగా ఎలా మార్చుకున్నాడో గ్రహించిన కవి ఆ ఉద్యమ దాశరథిని ఆవహించుకున్న తీరు ఈ పంక్తులకు నిదర్శనం. ఇక్కడ ఉద్యమం అంటే దాశరథి – దాశరథి అంటే ఉద్యమం అని కవి బలంగా చెప్పదల్చుకున్న దానికి ప్రతీకగా ఈ పంక్తులు నిలుస్తాయి.
‘పందొమ్మిది వందల యాభైన / ప్రభుత్వ సమాచార శాఖ / తలపెట్టిన కవితల పోటీలో / ప్రథమ బహుమతినందినది / ఈ పుస్తక శీర్షిక కైత’ అంటూ తను రాసిన ఈ దీర్ఘ కవిత్వానికి పెట్టిన పేరు ఎక్కడినుంచి తీసుకున్నారో తెలియజేశారు కవి డాక్టర్ రాపోలు సుదర్శన్.
దాశరథి రచనలను, దాశరథి మీద ఇతర రచయితలు రాసిన రచనలను చదివిన తరువాత దాశరథి మీద దీర్ఘ కావ్యం రాయలేక ఉండలేని తనం నుండి డాక్టర్ రాపోలు సుదర్శన్ రాసిన దీర్ఘ కావ్యమే ‘దాశరథీ(య)o. దాశరథి శత జయంతి సందర్భంగా వెలువడిన ఈ శత పుటల దీర్ఘ కవితలో దాశరథి జననం, ఆ కుటుంబంలోని సంప్రదాయాలు, తల్లి నేర్పిన సంస్కారం, విద్యాభ్యాసం, ఆయన మీద గురువుల ప్రభావం మొదలుకొని దాశరథి ఉద్యమ జీవితం, ఉద్యమానంతర జీవన ప్రస్థానం వరకు ఈ దీర్ఘ కవిత్వంలో మనకు కనిపిస్తుంది.
ఫారసీ, ఉర్దూ భాషలు నేర్పిన గురువుల పేర్లు, అలాగే ఇక్బాల్ కవిత్వం, గాలిబ్ గజళ్ళను దాశరథి ఆకలింపు చేసుకొని తెలుగులోకి అనువాదం చేయడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయుల పేర్లను కూడా రాపోలు ఈ దీర్ఘ కవిత్వంలోకి తీసుకొచ్చారు. వరంగల్ లో పొందిన 100 రూపాయల ప్రథమ పురస్కారం నుండి క్రీడలపై ఆసక్తిని, ఆటల పేర్లను కూడా ఈ కవిత్వంలో నమోదు చేసిన విధానం వీరి సూక్ష్మ పరిశీలనకు నిదర్శనం.
దాశరథిని వరంగల్ జైలు నుండి నిజామాబాద్ జైలుకు తరలించడంతో ఆయన భౌతికంగా ఎంత హింసకు గురయ్యాడో ఆయనలోని కవి హృదయం అంతే ఉగ్రరూపంతో పంజా విసిరింది. ఆ తరలింపు సందర్భంగా దాశరథి ఆశువుగా చెప్పిన 27 కంద పద్యాలను అక్కడ పెన్ను పేపరు లేకపోవడంతో తోటి ఖైదీలను తలా ఒక పద్యం గుర్తుంచుకోమన్నాడు. నిజామాబాద్ జైలు గోడల మీద రాసిన పద్యాలే ఆ తర్వాత తెలంగాణలోని పలు ఉద్యమాలకు ఇరుసుగా మారినవి. దాశరథి రచనలు అన్నింటినీ – పెద్దల కోసం, పిల్లల కోసం రాసిన కవిత్వము, పాటలు, వ్యాసాలు, అనువాదాలు, నిఘంటు నిర్మాణం, ఏ సంవత్సరంలో ఏ కావ్యం వెలువడింది, దానిలోని వస్తువు, కవి ఆవేదన, ఆలోచన, ఆచరణను, దాశరథి వ్యక్తిత్వాన్ని ఈ దీర్ఘ కావ్యంలో ఆవిష్కరించారు కవి రాపోలు సుదర్శన్.
అనువాదాల గురించి చెబుతూ ‘అనువాదాల సాహితీ క్షేత్రాన్ని /దున్నలు లేకుండానే దున్నడంలో / దాశరథి కలం హలం అందెవేసిన పాదం’ అని చెప్పడంలో హాస్య రసం గోచరిస్తుంది. ‘ఉర్దూ, ఫారసీ, సంస్కృతం, / ఆంగ్లమాదుల భాషల తోటల్లోని / సాహిత్య పుష్పాల తేనియల్ గ్రోలి /తెలుగున కవిత్వ తేనె తెట్టెల్ని పెట్టిన / కవి తుమ్మెద దాశరథి’ – దాశరథి అనువాద పటిమను, తియ్యదనాన్ని ఈ పంక్తుల ద్వారా మన ఆలోచనల దోసిలినింపాడు కవి.
అలాగే ‘కార్యకర్త’ అనే చాప్టర్ లో ‘ఎంతటి కార్యకర్తైనా / కావ్య కర్తృత్వం త్యజించని /నిత్య సృజనశీల కార్యకర్త’ అన్నాడు. ఈ విధంగా దాశరథి లోని కావ్యకర్తను మరియు కార్యకర్తను ఆవిష్కరించారు.
రాపోలు సుదర్శన్ కూడా ఒకవైపు సాహిత్య సృజన, మరో వైపు సాహిత్య ఉద్యమాల నిర్మాణంలో ఉన్నారు కనుకనే ఈ కవితా పంక్తులను రాగలిగారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ఈ కవితా పంక్తులు వినిపించకుండా తెలంగాణలో ఏ ఉద్యమం ప్రారంభం కాదు. దాశరధి రాసిన పై కవితా పంక్తులను ఈ దీర్ఘ కావ్యంలో కవిత్వీకరించిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఆ పంక్తులు – ‘నిప్పులు కురిసే ప్రేమలు విరిసే / “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అనే / ఒకే ఒక్క రసాత్మక వాక్యం /అజరామర మహాకావ్యం.
దాశరథికి మూడు పదుల వయసైన రాకమునుపే ‘మహాకవి’గా ఆదరింపబడినప్పటికీ ఉండాల్సినంత ఆదరణ, రావాల్సినంత కీర్తి, దక్కాల్సినంత గౌరవం దక్కలేదని దాశరథిని ఆమూలాగ్రం చదివిన డాక్టర్ రాపోలు సుదర్శన్ భావించారు. బాధపడ్డారు. ఆ భావనలోంచి, ఆ బాధలోంచి పెళ్ళుబిక్కిన దీర్ఘకావ్యమే ఈ ‘దాశరథీ (య)o’.
మామూలుగా మనం ఏదైనా పుస్తకాన్ని సమీక్ష చేసేటప్పుడు వచనములో చేస్తాం. అయితే ఇక్కడ రాపోలు సుదర్శన్ దాశరథి జీవితాన్ని, రచనలను, వ్యక్తిత్వాన్ని కావ్యరూపకంగా చేసిన సమీక్ష ఇది. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ముద్రించిన ఈ దీర్ఘ కావ్యంలో చివరన ‘దాశరథి జీవిత తలపుల / తలుపులు తెరిచి తెరిచి / వలపోసిన తలపోసిన / దాశరథి జీవిత కొండను / ఈ దీర్ఘ కవితాద్దమందు / పట్టి చూపుట సాధ్యమే !?’ అని తనకు తాను ప్రశ్నించుకున్నారు. అయితే ఈ కావ్యానికి ముందుమాట రాసిన ప్రసీన్ ‘నో డౌట్. సాధ్యం చేయడానికి అన్ని దారులా పయనించారు మీరు. ఏ కోణాన్నీ తట్టకుండా వదిలేయలేదు. పైగా కొండనే అద్దం చేసారు ‘ అంటూ కవి సందేహాన్ని పటాపంచలు చేశారు.
ప్రతులకు: నవచేతన బుక్ హౌస్
విశాలాంధ్ర బుక్ హౌస్
నవోదయ బుక్ హౌస్
వెల: శత రూపాయలు (100/-)








Add comment