కవిత్వం ఒక నిరంతర అన్వేషణమే. ఇది భవిష్యత్తు సృజన శీలురు ఆయా కాలాలలో ఒడిసి పట్టుకున్న రన్నింగ్ కామెంట్రీ. మానవ జీవన సంఘర్షణకు సాక్షి సంతకం. ఆ క్రమంలో ప్రబంధాలను సృష్టించిన ప్రాచీన కవి పండిత యుగం , నవ సృష్టి పట్ల మొగ్గు చూపిన ఆహ్లాద రస పిపాసుల భావ కవితా యుగం, సమాజ అభ్యుదయమే ఊపిరిగా ఆత్మా శయ ధోరణి నుండి ప్రజాశయ కవితాసృష్టి చేసిన అభ్యుదయ యుగం, పద్యం కంటే వచనమే ప్రబలమనుకున్న వచన కవులు…. ఇదంతా 1965 కు పూర్వం.
ఇలాంటి సమస్త గతాన్ని ఆగమ్య గోచరంగా భావించి ఛేదించాలని స్తబ్దత బద్దలు కొట్టాలని ఘాటుగా స్పందించిన దిగంబరకవులు 1965లో సాహితీ జగత్తులో రంగ ప్రవేశం చేశారు. అది షాకు ట్రీట్మెంట్ అని అరాచకవాదం అని, అల్లరి అని, లొల్లి అని కొందరు సాహిత్యకారులు అనుకున్నప్పటికీ అది ఒక స్తబ్ధతను చేదించిన మాట నిజం అని మరికొందరన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు కవితా ప్రస్థానంలో మరో మలుపు , మేలుకొలుపు అని నలుగురు కవులు సుప్రసన్న పేర్వారం జగన్నాథం, సంపత్ కుమార, వే నరసింహారెడ్డి గారలు చేతనావర్త కవుల హృదయ ప్రకంపన గా కవిత్వాన్ని ప్రకటించారు.
దేశం, దేశ ప్రజల జీవన మార్గం భూమిక ఒకటే అయినా… వారి అభివ్యక్తి, నిర్మాణ శక్తి ,శిల్చ, వస్తు, భాషా ప్రయోగ మార్గం ఎవరిది వారిదేమైనా. కాక వివిధ సామాజిక అన్యాయాలను, అవినీతిని, దుర్నీతిని వ్యతిరేకించే ప్రజాశయ ప్రతిస్పందనగా చేతనావర్తం 1967లో మొదటి సంపుటి, 1970లో రెండవ సంపుటి, అనంతర కాలంలో 1992 ప్రాంతంల్లో రజతోత్సవ సంపుటిని వెలువరించి సాహిత్య అభిమానుల, విమర్శకుల దృష్టిని ఆకర్షించారు. అనునిత్యం అంతర్, బహిర్, ఆధ్యాత్మిక, ఆధునిక సంఘర్షణతో సందర్శించే మానవ జీవితం సమగ్ర వికాసానికి సమన్వితమైన సాహిత్యం అనివార్యం. పాక్షిక దృష్టి ఏదైనా సహేతుకం కాదు. అది అభివృద్ధి నిరోధకం అని ఆ నల్వురు భావించారు. ఆ దృష్టితో భావిదర్శనం చేస్తున్నామన్నారు. సమగ్ర మానవ వికాస ధ్యేయంతో ఆ బాధ్యతతో చేతనావర్తం ఉద్యమ రూపమని విమర్శకుల ప్రశంసల జల్లులలో కూడా పులకరించింది. వైవిధ్య భరితమైన సాహిత్య సృజన జరుగుతున్న కాలంలో 90 సంవత్సరాల జీవితానుభవంతో జ్ఞానచక్షువులతో లోకాన్ని చూస్తూ… కవులకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పాక్షిక దృష్టి కూడదన్న కవి పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో కొన్ని ముచ్చట్లు.

చేతనా వర్తకవుల్లో మీరు ఒకరు. చేతనావర్తం ఒక ఉద్యమంలా వచ్చిందంటారు. ఎందుకు? నేపథ్యం ఏమిటి ?
చేతనావర్తం అనే రచన ఒక సంపుటంగా రావటానికి రెండుమూడేండ్ల ముందే చేశాను. మొదటి సంపుటంలో మొదటి ఏడెనిమిది గీతాలు ఆ రచనలోని భాగమే. అప్పుడా భాగాలు పత్రికల్లో వచ్చాయి. ఆ గేయాల స్పిరిట్ ఆధారంగా చేతనావర్తం సంపుటి రూపొందించబడింది. నా సహపాఠి పేర్వారం జగన్నాథం, మా చిన్నాయన సంపత్కుమారాచార్య, మరొక అధ్యాపక మిత్రుడు వే. నరసింహారెడ్డి నలుగురం కలిసి మా రచనలను ఒక సంపుటంగా 1967లో ప్రచురించడం జరిగింది. దీని వెనుక ఉన్న తాత్విక భూమికను తెలుగు కవితారంగంలో అప్పటికే వచ్చిన వస్తువు పరిణామాలను విశదం చేసే ఒక బృహత్పీఠికను నేను చేకూర్చాను. దీనిలో ఉన్న భావమే దాన్ని ఉద్యమంగా చేసింది. ప్రగతి వాద కవిత్వోద్యమం జాతీయ సంప్రదాయానికి చాలావరకు దూరంగా కొంతవరకు వ్యతిరేకంగా ప్రవర్తించింది. ప్రజాసామాన్యానికి ప్రాచీన సాహిత్యం ద్రోహం చేసిందని ఉద్యమ ప్రారంభంలో ప్రకటించటం జరిగింది. క్రమంగా ఆ భావం విరిగిపోయి 1948 నాటి అరసం మహాసభల్లో వెనక్కి తగ్గటం జరిగింది. దీంతోపాటు ప్రయోగవాదం కూడా ఒక ప్రయోజనానికి దూరంగా సాగివచ్చింది. ఈ రెండూ కలిసి అభ్యుదయ కవిత్వంగా చలామణి అయ్యాయి.
రాజమహేంద్రవరంలో జరిగిన అభ్యుదయక కవిత్వ రచయితల మహాసభల్లో కృష్ణశాస్త్రి అధ్వర్యం వహించారు. మద్రాసులో జరిగిన తరువాతి మహా సభల్లో రాజమన్నార్, నార్ల, విశ్వనాథ మొదలైన వాళ్లు పాల్గొన్నారు. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వోద్యమం మరుగున పడే దశ వచ్చింది. 1955లో దాన్ని పునరుద్ధరించడం, ఛందస్సుల వినియోగానికి శ్రీశ్రీ పిలుపివ్వడం జరిగింది. ఆ రకంగా వామపక్ష భావ ప్రధానమైన ఆ ఉద్యమం పలుచబడిపోయింది. ఆ తరువాత 1960లలో దీనికి ప్రత్యామ్నాయంగా దిగంబర కవిత్వం వచ్చింది. అది కేవలం అశ్లీలంతో సంస్కృతిని హేళన చేయటం, వ్యతిరేకించడం జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్టంలో ఉప ఎన్నికలు రావటం, కమ్యూనిస్టులు బలహీనపడటం జరిగింది. అప్పుడు రచయితల సమష్టి ప్రకటన ఒకటి వెలువడింది. ఈ ప్రకటనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ అనేకమంది రచయితలు ప్రకటన చేశారు. ఆ క్లిష్టమైన సన్నివేశంలో దీపస్తంభంలాగా చేతనావర్తం వెలువడింది. ఒక సమగ్రమైన దర్శనంతో జాతీయ సంస్కృతికి వెన్నెముకగా, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా, దివ్యజీవన ఆరోహణం లక్ష్యంగా చేతనావర్తం ఒక ఉజ్వలమైన లక్ష్యాలతో వెలువడింది.
చేతనావర్త కవుల ఆలోచన ధోరణి ఒకటేనా? ఆ తర్వాత కొనసాగింపు జరిగిందా? ఆ క్రమంలో రెండు సంపుటాలు మాత్రమే వచ్చినట్టున్నాయి?
చేతనావర్తం రెండు సంపుటాలు వెలువడిన తరువాత దానిలో ప్రముఖంగా పాల్గొన్న నరసింహారెడ్డి పరమపదించారు. ఆ సంపుటాలు తరువాత రాకపోవడానికి ఇది ప్రధాన కారణం. వెలువడిన రెండు సంపుటాలలో కూడా నలుగురు కవుల లక్ష్యం ఒక్కటే. ప్రాధాన్యం విషయంలో భేదం ఉండవచ్చు. శైలి విషయంలో అంతరం ఉండవచ్చు. పలుకుబడి, అభివ్యక్తి లో ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. ‘రుచీనాం వైచిత్రియాత్ బుజుకుటిల నానా పథగతాం గుణాం ఏకో గమ్యా: ” అన్నట్టు దీనిలోని ఐక్య లక్షణం అంతర్వాహినిగా ఉన్నది. ఈ విషయాన్ని తరువాత సంపుటానికి సంపత్కుమార రాసిన పీఠికలోను, తరువాత సమైక్యంగా రెండు సంపుటాలను ఒకటిగా వెలువరించిన సందర్భంలో పేర్వారం జగన్నాథం రాసిన పీఠికలోనూ వెల్లడించడం జరిగింది. దీని తరువాత పేర్వారం జగన్నాథం గారి సంపాదకత్వంలో వెలువడిన అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు అనే వ్యాస సంపుటి కూడా ఈ లక్ష్యాలనే విస్తరించి వ్యాఖ్యానించటం జరిగింది.

జాతీయ సాహిత్య వాదం అంటే ఏమిటి? ఏ కవి ఐనా భిన్నంగా రాయగలడా?
జాతీయ సాహిత్య వాదం అంటే తెలుగు కవిత్వ సందర్భంలో భారతీయ సంస్కృతి, రాజ్య వ్యవస్థ, రామాయణ మహా భారతాలలో ప్రపంచించిన జీవన తత్త్వం వంటి అంశాలన్నీ అంతర్భవిస్తవి. వీటిలో ఎంత గాఢంగా విశ్వజనీనత ప్రతిపాదింపబడిందో మనం అర్ధం చేసుకోవచ్చు. “సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు, మాకళ్చిత్ ధుఃఖ భాగ్బవేత్’ ఇది ప్రపంచానికి వేల సంవత్సరాలుగా మన దేశం ఇచ్చిన సందేశం. భిన్నత్వంలో ఏకత్వం విజ్ఞానానికి అనుకూలంగా ప్రవహించటం సర్వ చైతన్యము ఈశ్వరమయమని భావించడం, దు:ఖం నుండి వైరుధ్యాలనుండి, మృత్యువు నుండి విముక్తిని సాధించడం దీని లక్ష్యం. మనకు ఇతర దేశాల నుండి వచ్చిన ఆక్రామకులు తమ విశ్వాసాలను మన మీద రుద్దినప్పుడు మన విశ్వాసాలను గౌరవించనప్పుడు వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ సంస్కృతి దాన్ని ఎదుర్శొని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఈ ఒత్తిడిలో ఘర్షణలో మన మౌలిక విశ్వాసాలకు దూరంగా జరిగిన సన్నివేశాలు వాటిని అర్ధం చేసుకొనలేక తిరస్కరించిన సందర్భంలో అప్పుడప్పుడు వేదిక మీదకు రావడం తరువాత తిరోగమించడం మనం చూస్తూనే ఉన్నాం. భావ సంస్కారాలలో వైరుధ్యం ఏర్పడటం అప్పుడప్పుడు గమనించవచ్చు. అందువల్ల కొన్ని సందర్భాలలో అర్ధం చేసుకోవడంలో వైరుధ్యాలు గోచరించవచ్చు. అది మనకు ఆధునిక కాలంలో క్వాచిత్మంగా కనిపిస్తుంది.
మీరు, సంపత్ కుమార, పేర్వారం, ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం తదితరులు మానవ వికాస రచయితల సంఘం (మావిరసం)పాత కొత్తల మేలుకలయక తో ఒక సంఘాన్ని స్థాపించారు. అది ఏ ఉద్దేశంతో స్థాపించారు. వివరిస్తారా?
మానవ వికాస రచయితల సంఘం దాదాపు చేతనావర్త లక్ష్యాలను ప్రధానీకరించి ఏర్పడింది. కార్యకర్తలు దూరదూరాలలో ఉండటం చేత ఒక సంస్థగా పనిచేయడంలో ఇబ్బందులు రావడం వల్ల దాని కొనసాగింపు జరగలేదు. కానీ, ఆ లక్ష్యాలను స్థాపించిన వారితో పాటు వారి తో సమలక్ష్యం కలిగిన అనేకమంది రచయితలు కొనసాగించారు. 1970లలో ఏర్పడ్డ జాతీయ సాహిత్య పరిషత్తు ఈ మార్గాన్ని గాఢమైన అఖినివేశంతో ముందుకు నడిపించింది.
పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శిగా మీరు చేసిన కృషిని వివరిస్తారా?
పోతన జయంతి ఉత్సవాలు నేను పాఠశాలలో చదివేనాడే నిర్వహించడం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు అనేక పాఠశాలలలోని విద్యార్థులు పాల్గొని పోతన భాగవత సంప్రదాయపు వెలుగులో జాతీయ సమైక్య భావాన్ని తాత్సికమైన గాఢతను అర్థం చేసుకొనే అవకాశం కలిగింది. భాగవతం సర్వ జీవులకు అంతశ్చైతన్యంలోని ఐక్యాన్ని జీవన సాఫల్యం కోసం చేసే ప్రయత్నాన్ని వెల్లడించింది. ప్రహ్లాద చరిత్రలో “పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్ అన్న పద్యంలో జీవనంలోని ప్రతి క్షణమూ ఆ పరమ చైతన్యంతో అనుసంధించుకోవడం లక్ష్యంగా సాగివచ్చింది. క్రమంగా పోతన స్మారక సంఘం ఏర్పడింది. ఆ తరువాత పోతన పంచశతి ఉత్సవాలు చేయాలన్న సంకల్పం కలిగింది. ఈ ప్రయత్నాన్ని మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు, పాములపర్తి సదాశివరావు, కాళోజీ నారాయణరావు మొదలైన పెద్దలు బలపరిచినారు. పీవీ గారు ఇచ్చిన ప్రేరణతో, బలంతో ఒక జాతీయ ఉత్సవంగా ఈ మహోత్సవాలు 1982 మార్చిలో నిర్వహింపబడ్డాయి. సంగీత, సాహిత్య, నాటక, తాత్త్విక రంగాలలోని ప్రముఖులు దేశం నలుమూలల నుంచి వచ్చి పాల్గొన్నారు. అవిస్మరణీయమైన చర్చలు జరిగాయి. ఈ ఉత్సవాలు ఇచ్చిన పేరణతో తరువాత పోతన విజ్ఞాన పీఠం ఏర్పడింది. ఈ పీఠానికి తొలుత జీఎస్ మాధవరావు కార్యదర్శిగా ఉన్నారు. తరువాత నేను కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ విజ్ఞాన పీఠం అనేక సాహిత్య ఉత్సవాలు నిర్వహించింది. అవధానాలు నిర్వహించింది. రూపక ప్రదర్శనలు, సంగీతోత్సవాలు నిర్వహించింది. కొన్ని గ్రంథాలను ప్రచురించింది.
ఒక విసృతమైన లక్ష్యంతో పరిశోధన గ్రంథాలయాన్ని నిర్మించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో పోతన విగ్రహాన్ని స్థాపించింది. పంచశతి ఉత్సవాల సందర్భంలో టీటీడీ వారిచేత పోతన భాగవత నీరాజనం అనే గ్రంథాన్ని ప్రచురించింది. దానిలో చేరిన వ్యాసాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిగా ఒక సంచికగా ప్రచురించింది. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు చేత పోతన చిత్రపటాన్ని చిత్రింపజేసింది. భాగవతంలోని అనేక సందర్భాలను దృష్టిలో పెట్టుకొని చిత్రకళా రూపాలను నిర్మింపజేసిన శ్రీ దెందుకూరు సోమేశ్వరరావు, డా.కె. విశ్వనాథం మొదలైన వారు చిత్రించిన చిత్రకళారూపాలను సేకరించి భద్రపరచింది. ఒక ప్రసిద్ధమైన సభాంగణాన్ని నిర్మించింది. తెలుగు దేశంలోని ప్రముఖ విద్వాంసుల చేత భాగవత గోష్టులు, కళా ప్రదర్శనలు చర్చా గోష్టులు నిర్వహించింది. ప్రత్యేకంగా భాగవతమే విషయంగా ఒక శతావధానాన్ని నిర్వహించింది. ఈ పీఠంలో జరిపిన వందలాది కార్యక్రమాల నిర్వహణలో నాకు భాగస్వామ్యం ఉన్నది.
కొత్త తరం కవులుపండితులు విసృతంగానే వస్తున్నారు రాస్తున్నారు. కానీ ఇదివరకులా సాహిత్య అభిలాష కల శ్రోతల సంఖ్య తగ్గుతుంది. కారణం ఏమంటారు? ఆ దిశగా మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి?
ఎప్పుడు కూడా వర్తమానంలో జరుగుతున్న కృషిని దాని అభివృద్ధిని వెలుగులను సరిగా అంచనా వేయలేం. కాలం గడిచేకొద్దీ గడచిన కాలంలోని లక్ష్య శిఖరాలు వెలుగులోకి వస్తాయి. ఈనాడు కూడా జరుగుతున్న కృషిలో ఎంతో చెప్పుకోదగిన అంశాలు ఉన్నాయి. సామాన్యమైనవి వర్తమానంలో ప్రముఖంగా గోచరిస్తాయి కానీ, కాలం జల్లెడపట్టి వాటిలో బలమైన వాటినే నిలుపుతుంది. బలహీనమైన వాటిని జారవిడుస్తుంది. నాకు ఈ ఎనభై సంవత్సరాలలో తెలంగాణలోని సాంస్కృతిక రంగం సాధించిన అంశాలు ఉన్నతమైనవిగానే కనిపిస్తున్నవి. ఆరువందల యాభై సంవత్సరాల అణచివేత కూడా లక్ష్యసాధనకు అడ్డం రాలేదు. వెదికితే కదిపితే కుదిపితే మరుగుపడ్డ అంశాలు జ్వలంతంగా కనిపిస్తాయి.
తెలంగాణ ప్రాచీన సాహిత్యం గురించి ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సి ఉంది. పరిశోధకులు ఆ దిశగా కృషి చేస్తే వేయి సంవత్సరాల క్రితమే … ఒక్క వరంగల్ పరిసర ప్రాంతాలే చాలు సంపద్వంతమైన చరిత్ర మనది అని ఒకచోట అన్నట్లు గుర్తు. వివరంగా చెప్పండి సార్.
ఈ రోజు తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం ఇత్యాది భేదాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నా, కాకతీయుల నాటి నుంచి తెలుగు వారి సంస్కృతి సాహిత్యము లలితకళలు మొదలైన వాటికి ఓరుగల్లు, రాజమహేంద్రవరం, నెల్లూరు మొదలైన స్థానాలు ప్రధాన కేంద్రాలుగా విలసిల్లినాయి. ఈ వికాసంలో ఒక ఉన్నతమైన లక్ష్యాలు శిఖరాలను తాకాయి. కాకతీయుల నాడు శ్రీశైల, కాళేశ్వర, ద్రాక్షారామాలు త్రిలింగ దేశ భావనకు సరిహద్దులుగా చెప్పబడ్డాయి. విద్యానాథుడు.. త్రిలింగనగరి, ఆంధ్ర నగరి మొదలైన శబ్దాలు వాడారు. గూడూరు శాసనం ఈ కేంద్రానికి దగ్గరలోనిదే. దాదాపు 60 సంవత్సరాల వరకు కాంచీపురం
దాకా తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన గణపతి దేవుడు, తరువాత ఒక స్త్రీ వీరనారియైన రుద్రమదేవి 30 సంవత్సరాలకు పైగా పరిపాలన చేపట్టడం.. కాకతీయ శిల్పం అనే పేరున ఒక శిల్చ మార్గం వ్యాప్తి చెందడం, వాణిజ్య పరంగా అనేక ప్రాంతాలతో సంబంధం ఏర్పడటం (ఈ విషయం మోటుపల్లి శాసనం లో కనపడుతుంది) వంటివన్నీ మన విద్వత్తును, నైపుణ్యాన్ని నిరంతర (శ్రమను వెల్లడించే అంశాలు. కాకతీయ శిలాతోరణాలు అద్భుతమైన భావనను పెంపొందిస్తాయి. కంబర్ మహాకవి, తిక్కన సోమయాజి ఇంతదూరం వచ్చారని, జీవితాన్ని ప్రభావితం చేసినారని చరిత్ర చెప్తోంది. ఆనాడు పరిపాలకులు ఏర్పరిచిన తటాకాలు జీవితాలను సుభిక్షం చేశాయి. కాకతీయ సామ్రాజ్యం పడిపోవటం, బహుమనీ సామ్రాజ్యం ఏర్పడటం, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ రాజ్యాలు ఏర్పడటం వల్ల ఓరుగల్లు ప్రాంతానికి గ్రహణం పట్టింది. సుమారు 600 సంవత్సరాలు
బానిసతనంతో ముడుచుకునిపోయే సన్నివేశం వచ్చింది. కానీ ఈ ప్రాంత ప్రజలు ధైర్యంతో తమ భాషను, సంస్కృతిని సాహిత్యాన్ని మిగిలిన సంప్రదాయాలను సజీవంగా నిలుపుకున్నారు. ప్రభుత్వం ఎంతగా నిరోధించినా జనపదాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక కేంద్రాల దాకా నిరంతరం తమ సంపదను కాపాడుకున్నారు. ఆక్రామకులకు విరుద్ధంగా బగళా ఆరాధన బతుకమ్మ పండుగ రూపంలో ఏర్పరుచుకొని వర్ణ భేధాలకు అతీతంగా ఐక్యతను కాపాడుకున్నారు. మేడారం సమ్మక్క వంటి జాతరలతో గిరిజనులు, పురజనులు ఒక్కటైనారు. జానపద సాహిత్య మార్గంలో ఉత్సవాలను, వీరగాథలను వ్యాపకంగా చేసుకున్నారు. తమ జీవన మూల్యాలను రక్షించుకున్నారు. ఈ మహత్ సంపదను మనం వెలికి తీయవలసిన అవసరం ఉన్నది. మరుగు పడిపోయిన జీవన అంశాలను చరిత్రను సాహిత్యాన్ని వెలికి తీసి ఈ తరానికి తెలియజెప్పవలసిన అవసరం ఉన్నది.
తెలంగాణ భాషా సంస్కృతులపై జరిగిన దాడిని ఏమంటారు? మనకు జరిగిన నష్టం ఎంత?
తెలంగాణ సాహిత్య విషయంలో ఆంధ్ర ప్రాంతంలో అనిష్టంగానీ ఉపేక్ష కానీ ఉన్నట్టు కనిపించదు. కవిత్రయ భారతం కంటే, పోతన భాగవతానికి ఎక్కువ ఆదరణ లభించింది. ఆ పద్యాలు ఇంటింటా మారు మోగాయి. 20వ శతాబ్దం ఆరంభంలో పోతన జన్మస్థానం గురించి వివాదం జరిగినా, 1910 నాటికి అది సర్దుకొని ఓరుగల్లే పోతన జన్మస్థానమని ప్రధాన విమర్శకులు, పరిశోధకులు అంగీకరించారు. పాల్కురికి సోమన జన్మస్థానం విషయంలో పాల్కురికి కాదు.. హాల్కురికి అని చిలుకూరి నారాయణరావు గారు అన్నా అది ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణలో సృజింపబడిన నూతన ప్రక్రియలు, ధోరణులు తెలుగు
సాహిత్యమంతా అంగీకరించి విసృత పరచబడ్డవి. పాల్కురికి సోమన నిర్మించిన ఉదాహరణం, శతకం వంటి ప్రక్రియలు మూడు పూవులు, ఆరు కాయలు లాగా సాహిత్యంలో ఎదిగి వచ్చాయి. అచ్చ తెనుగు కావ్యాలు విస్తరించాయి. చిత్ర కవిత్వం అనేక రూపాలలో వ్యాపించుకుంటూ పోయింది. ఆధునిక కాలంలో నిజాం పరిపాలనలో తెలుగు భాషా సాహిత్యాలు ఎంతగా అణచివేయబడ్డా సామాన్య ప్రజలు దైవం మీద విశ్వాసంతో అనేక ప్రబంధాలు, వివిధ ప్రక్రియల్లో రచనలు కొనసాగిస్తూనే వచ్చారు. కొన్ని సందర్భాలలో సమాచారం తెలియక ఒక ఇద్దరు విమర్శకులు తెలంగాణలో కవుల సంఖ్య పూజ్యమని అన్న మాట నిజమే. కానీ, దానికి వెంటనే సమాధానంగా గోలుకొండ కవుల సంచిక వెలువడింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు కాకినాడలో
ఏర్పడ్డ తరువాత జయంతి రామయ్య పంతులు గారు తెలంగాణలో శాసనాలను, తాళ పత్ర ప్రతులను సేకరించడానికి ప్రత్యేకంగా శేషాద్రి రమణ కవులలో ఒకరైన దూపాటి వెంకటరమణా చార్యుల వారిని పంపించారు. ఆయన జీవితం అంతా నిజాం సంస్థానంలో తెలుగు తాళ పత్ర ప్రతులను సేకరించడానికి శాసనాలను వెలికి తీయడానికి అంకితమైంది. ఆయన జీవితమంతా ఇక్కడే గడిపారు.
తరువాత కాలంలో దాశరథి, నారాయణ రెడ్డి, కవిరాజమూర్తి, పల్లా దుర్గయ్య, వానమామలై వరదాచార్యులు మొదలైన కవుల రచనలు తెలుగు దేశం సర్వత్రా ప్రసిద్ధిని పొందాయి. భావకవులు పద్యానికి కాల్చనికతను జోడిస్తే, దాశరథి
ఉద్యమస్స్ఫూర్తిని కలిగించాడు. నారాయణ రెడ్డి చరిత్రలోని ముఖ్య ఘట్టాలకు గేయ కావ్య రూపాన్ని సంతరించారు. వానమామలై వారు పోతన చరిత్ర పేరు మీద నవ్య సంప్రదాయ మహా కావ్యాన్ని నిర్మించి తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని అగ్ర శ్రేణిలో నిలబెట్టుకున్నారు. పీవీ నరసింహారావు వేయిపడగలను హిందీలోకి అనువదించి తెలుగు సాహిత్యానికి అఖిల భారత సాహిత్య ద్వారాలను తెరిచి పెట్టారు. పాములపర్తి సదాశివరావు వామపక్ష సాహిత్యాన్ని సృజించి ఎంతో మందికి మార్గదర్శనం చేసి ఒక యువ పరంపరను సృజించారు. కాళోజీ నారాయణ రావు అధిక్షేప కావ్య ధోరణిలో కొత్త శైలిని , వాక్య పద్ధతిని నిలబెట్టారు. అనుముల కృష్ణమూర్తి తెలుగు పద్యానికి ఒక నూతన అభివ్యక్తి మార్గాన్ని నిర్మించారు. వీళ్లందరూ తెలుగు సాహిత్య ప్రధాన మార్గంలో నిలబడ్డవారే. వచన కవిత్వ వికాసంలోనూ, వివిధ ఉద్యమాల పుట్టుక, ప్రాచుర్యము తెలంగాణలో జరిగింది. అందువల్ల సాహిత్య రంగంలో ప్రధాన తెలుగు సాహిత్య రంగానికి, తెలంగాణ సాహిత్య రంగానికి విభేదం ఉన్నదని భావించే అవకాశం లేదనుకుంటా. చెళ్లపిళ్ల వారికి ఆస్థాన కవి పదవి లభించినప్పుడు దాశరథి పూజా పంచకం పేరుమీద వారిని స్తుతిస్తూ ఆ ఉత్సవంలో పద్యాలు ప్రకటించారు. 1953 ప్రాంతంలో అలంపురంలో సారస్వత పరిషత్ మహా సభలు జరిగినప్పుడు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల కవులు రచయితలు సమైక్య భావనతో సాహిత్య సమర్బన చేసుకున్నారు.
అయితే, ముందే నేను చెప్పినట్టు తెలంగాణ సాహిత్య విషయంలో, చరిత్ర విషయంలో వ్యతిరేకత ఉన్నట్టు స్ఫురించదు. తెనుగు పత్రిక, శైవ మహాపీఠం ఒక విశిష్టమైన కృషి చేసి అనేక గ్రంథాలను వెలికి తీసుకురావడానికి దోహదం చేశాయి. అయినా బండ్ల కొలది తాళ పత్ర గ్రంథాలు పల్లెల్లోనే మిగిలిపోయాయి. ఆదిరాజు వీరభద్రరావు, బిరుదురాజు రామరాజు తరువాతి పరిశోధకులుగా అపూర్వ సాహిత్యాన్ని సేకరించారు. ఇంకా నష్టపోయిన సాహిత్యాన్ని అంచనా వేస్తే, అదొక [గ్రంథ రాశి అవుతుంది. 19, 20 శతాబ్దాల నిండా ఎంతో మంది కవులు రచించిన రచనలు ముద్రితాలు కాకుండా అవిదితంగానే మిగిలిపోయాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంధ్ర మహాభారతాన్ని ఖండవల్లి లక్ష్మీరంజనం గారి అధ్వర్యంలో ప్రామాణిక ముద్రణంగా వెలువరించింది. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ తెలుగు భాగవతాన్ని సంశోధిత ముద్రణంగా ప్రచురించింది.
లక్ష్మణ రాయ పరిశోధక మండలి వారు తెలంగాణ శాసనాలను రెందు నంపుటాలు ప్రకటించారు. కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము చారిత్రక రచన ఖండవల్లి వారి సంపాదకత్వంలో వెలువడింది.
అయితే, గద్వాల వనపర్తి మొదలైన సంస్థానాలకు ప్రసిద్ధ కవులు రావడం వల్ల కొంత సాహిత్య పోషణ జరిగింది. తెలంగాణకు సాంస్కృతిక రాజధాని అయిన ఓరుగల్లు చుట్టూ ఒక వంద మైళ్ల దూరం దాకా ఎంతో సాహిత్య కృషి జరిగింది. కానీ, ఇక్కడి కవులకు అలాంటి ఆదరణ పెద్దగా లభించలేదు. ముందుగానే చెప్పినట్టు ఇక్కడి సాహిత్యానికి సరైన పోషణ లభించకపోవడం వల్ల వారు దైవంపైనే ఆధారపడి… దైవానికే తమ రచనలను సమర్పించుకున్నారు. దీనివల్ల చాలా సాహిత్యం కాలగర్భంలోనే ఉండిపోయింది.
అచల సంప్రదాయం, శైవ వైష్ణవాలు, ఇతర ఉపాసనామారాలు, జానపద గాథలు, వివిధ ఇతర గాథలు, అనేక అధిక్షేప కావ్యాలు అనేకం సృజింపబడి ఉన్నాయి. కానీ వీటన్నింటి గురించి విస్సతమైన సర్వేక్షణ, సమీక్షణ, ముద్రణ, అంచనాలు చేయడం జరగవలసి ఉన్నది. దీని కోసం సాహిత్య పరులు సంస్థలు ఉదారులైన సాహిత్య ప్రియుల ప్రోత్సాహంతో బృహత్ కృషిని చేపట్ట వలసి ఉన్నది. ఈ ప్రాంతంలో సంస్కృతంలోనూ, కొంతవరకు తమిళ మణి ప్రవాళంలోనూ జరిగిన కృషిని చేర్చుకోవచ్చు. ఈ ప్రయత్నం చేయడానికి నా వంతు సహాయాన్ని సమకూరుస్తానని ఇంతకు ముందే పేర్కొన్నాను. ఇప్పుడు కూడా ఈ
సాహిత్యాన్నంతా వెలికి తీసి శోధించాల్సిన అవసరం ఉన్నది.
*








మంచి వ్యాసం. ఇటువంటి వ్యాసాలు చాలా రావలసి ఉంది.
చాలా బాగా రాశారు శ్రీనివాస రావు గారూ!