హథీరాం తన కవిత్వాన్ని గురించి రాస్తూ ఒకవైపు ధిక్కారాన్ని, మరో వైపు సంఘీభావాన్ని ప్రకటిస్తుంది నీలం రంగు నది అన్నాడు. ధిక్కారాన్ని, సంఘీభావాన్ని వేరువేరుగా చెప్పుకున్నాడు. కానీ నీలం రంగు పుస్తకమంతా సంఘీభావంతోనే ధిక్కారం ప్రకటించాడు. చలం యోగ్యతా పత్రం రాస్తూ శ్రీశ్రీ గురించి ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని రాసాడు.
బహుశా ఇప్పుడైతే ప్రపంచం బాధ యువ కవుల బాధ అని రాసేవాడేమో. వాళ్ళ నుండి వచ్చే ప్రతీ పుస్తకంలో ప్రపంచమంతా కనిపిస్తుంది. ఆదివాసి గుండాల నుండి, తాండాల నుండి, గ్రామాల గుండా ప్రపంచం దాకా వాళ్ళ కవిత్వ వస్తువు వ్యాప్తి చెందింది. నీలం రంగు నది కూడా అలాంటి పుస్తకమే. కవిత్వానికి కవిత్వ ప్రయోజనం ఉన్నట్టుగానే కవిత్వం రాయడానికి రచయితకు కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ పుస్తకంలో మాత్రం కవిత్వ ప్రయోజనం, రచయిత ప్రయోజనం రెండు ఒకటే. అదే ధిక్కార ప్రకటన మనిషి పుట్టుకకు, మానవ నాగరికత పుట్టుకకు మూలం ప్రకృతి. అందుకే ప్రకృతి చాలా విలువైంది. పాలకుల దృష్టిలో కూడా ప్రకృతి విలువైనదే. ఎంత విలువైంది అంటే మనుషుల ప్రాణాల కంటే విలువైంది.
ప్రపంచంలో అత్యంత పెద్ద పది మంది ధనవంతులను మన దేశంలో సృష్టించే అంత విలువైంది. మన దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా అంతే. ఆ పది మంది ధనవంతులు అవడం కోసమే ప్రకృతి. ప్రకృతే కాదు నేల, నీళ్లు, మనుషులు, యుద్ధాలు, చావులు, నెత్తురు అన్ని ఆ పదిమంది కోసమే. వాళ్ళ వందో అంతస్తులో పదవ బెడ్రూంలో మూడో బాత్రూంలో నాలుగవ ఫ్యాన్ తిరగడం కోసం ఇక్కడ వేలాది మంది ఆదివాసులు ఇళ్లను, జీవితాలను కోల్పోయి రోడ్ల మీద తిరగాలి. అట్లా తిరగడానికి ఇష్టపడని ప్రజలు ఉంటారు. వాళ్ళు తిరగబడతారు. వాళ్లకు మద్దతుగా మానవత్వం ఉన్న మనుషులు ఇంకొందరు తిరగబడతారు. కానీ ఒక చీకటి రాత్రి వాళ్ళంతా హత్య చేయబడతారు. అక్కడికి ఒక కవి వస్తాడు. అక్కడ కనపడ్డ రక్తాన్నంత తన అక్షరాల్లో నింపుకుని ఇట్లా పుస్తకాలుగా మన ముందు పెడతాడు. ధిక్కారమో, సంఘీభావమో లేదా రెండు కలిపో ఏదో ఒకటి ప్రకటించమని అడుగుతాడు. నీలం రంగు నది అదే అడుగుతుంది. హథీరాం అదే అడుగుతున్నాడు. 
కానీ అడవిని కోల్పోయిన ఆదివాసిగా మాత్రమే అడగట్లేదు. నేలను కోల్పోయిన పాలస్తీన వాడిగా అడుగుతున్నాడు. సహనాన్ని కోల్పోయిన భారతీయుడిగా, మానవత్వాన్ని కోల్పోయిన మనిషిగా, ప్రేమను కోల్పోయిన ప్రేమికుడిగా కూడా అడుగుతున్నాడు. మన పేర్లు తెలియకపోవడం వలన కావచ్చు. ఒక దగ్గర ఫిర్దౌసా అని పిలుస్తున్నాడు. ఇంకో దగ్గర యోనేసి అని పిలుస్తున్నాడు. మరో దగ్గర జోర్డాన, షబ్బీరు అంటున్నాడు. ఏ పేరుతో పిలిచినా కానీ మనల్నే పిలుస్తున్నాడు. ఏ ప్రశ్న అడిగినా కానీ ముమ్మాటికి మనల్నే అడుగుతున్నాడు. ప్రేమికుల రోజు గులాబీ పూలను ఇవ్వడానికి కాసింత నేల ఎందుకు లేదు అని అడుగుతున్నాడు. మత కట్టడాల కింద మానవత్వం కాలిపోతే మనుషులను మనుషులుగా గుర్తించే తెల్లని వాకిళ్ళ కోసం వెతుకుతున్నాడు.
కశ్మీర్ అభివృద్ధి చెందుతుందని కశ్మీర్ ఫైల్స్ సినిమాలు చెబుతుంటే అదే పేరు పెట్టి కార్పొరేట్ తోటలను పెంచడమే అభివృద్ధా అంటున్నాడు. దామ గుండం గురించి, దండకారణ్యం గురించి రాగాలను, పిడికిళ్లను ఎత్తమని అడుగుతున్నాడు. భాషను రాజకీయం చేసే వాడి గురించి మాట్లాడుతున్నాడు. మీ భాషలో కూడా వాడి గురించి మాట్లాడమని బ్రతిమాలుతున్నాడు. ఆదివాసుల మీద, ఆదివాసి గుడాల మీద, ఆదివాసి మనసుల మీద దాడి జరుగుతుంటే మాట్లాడరా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ దాడులకు సాక్ష్యంగా ఇంకా పచ్చిగా ఉన్నా వీర్యపు అవశేషాలను చూపెడుతున్నాడు.
పుస్తకాలు, అక్షరాలు, చరిత్ర, ఊర్లు, అడవి అన్ని లాగేసుకుంటున్నారు. వాడి గురించి ఆవేశంగా రెండు మాటలైనా అనండి అంటున్నాడు. దేశాన్ని ప్రేమించడం ఎలానో నేర్పించమని అడుగుతున్నాడు. దేశం కోసం, దేశ ప్రజల కోసం శ్రమ చేయడం కంటే గొప్ప ప్రేమ ఎక్కడుంది అంటున్నాడు. దమ్ముంటే ఒడ్లు చెక్కుతున్న అమ్మ కంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో చూపించండని సవాలు చేస్తున్నాడు. ప్రాచీన కాలం నుండి అన్ని కవిత్వ సందర్భాలలో వర్ణనా వస్తువైన సూర్యుడిలో అమ్మ నూరిన ఎర్ర కారం ముద్దను చూస్తూ, ఆదివాసి అస్తిత్వంతో అడుగుతున్నాడు.
నీలం రంగు నది అడుగుతుంది. ఆ నది నీళ్లను దోసిళ్లలో పట్టుకుని హథీరాం అడుగుతున్నాడు. సమాధానాలు అడుగుతున్నాడు. సంఘీభావం అడుగుతున్నాడు. మనుషులను అడుగుతున్నాడు. మనల్నే అడుగుతున్నాడు. నేను మనిషినే, ఈ సమీక్షనే నా సంఘీభావం.
*








Add comment