| 
 మా ఊరెళ్లాక.. 
‘నువ్వెక్కడాడుకున్నావ్!’ 
అంటూ కృతి అడిగింది. 
ఆ ఒక్కమాట.. 
బాల్యంలోకి 11 కి.మీ ఫర్ సెకన్ కంటే ఎక్కువ వేగంతో.. 
నా మనసు దూసుకెళ్లింది. 
గురుత్వాకర్షణకు ఎంతటిశక్తి ఉందో తెలీదుకానీ.. 
జ్ఞాపకాలకున్న శక్తిని వ్యక్తపర్చటం అలవికాదు. 
బడికాడికి పోయి.. 
ఒకప్పుడు బావి, జామాయిల్ చెట్టు, దేవునిపూల చెట్టు.. 
ఒకటో తరగతి పెంకుటిల్లు బడి.. 
మా మురళీ సారు, ప్రకాశ్ సారు, ప్రసన్నయివారు.. 
నేనాడుకున్న ఆటల్నీ కాసేపు చెప్పానంతే. 
అంతలోనే.. 
‘నాన్న.. నువ్వు బడికిపోకపోతే.. 
మీ ఫ్రెండ్సు నిన్ను ఎత్తుకు పోవటానికి వచ్చింటే.. 
నువ్వు ఎనుముల దగ్గర దాక్కున్నావు కదా!’ అంటూ .. 
నేను ఒకప్పుడు చెప్పిన విషయాన్నే నాకే గుర్తుచేసింది. 
. 
బడికాడి గుర్తులన్నీ భోరున గోలపెట్టాయి. 
గానాట, సీటుబ్యాటు, అశ్వి ఆటలు. 
జామాయిలు చెట్ల గంపల్ని వేళ్లపై పెట్టి పగలగొట్టి రక్తం చూడటం.. 
ఆంజనేయసోమి కనిపిచ్చాడని ముక్కుగీరుకోవటం.. 
అగ్గిపెట్టెల్ని ఇస్పెట్టాకుల్లా దాచుకోవటం.. 
పావులా పుల్లయిసులు, సోంపాపిడి.. 
ఆడపిల్లోల్లతో అచ్చందకాయలాడుకున్న క్షణాలు.. 
గిలకల చెట్టు, దేవుని పూల చెట్టు.. 
జెండాకట్టె.. బోరింగ్.. అన్నీ లీలగా పలకరించాయి. 
అభివృద్ధి విధ్వంసంలో 
ఆనవాళ్లే లేకుండా పోయాయి. 
అయినా మనసుకు ఓ అగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ 
ఉంటుంది కదా! 
ఉత్తకాళ్లకి పల్లెరుగాయిలు ఇరిగిన క్షణాలూ.. 
వొదెపెట్టి మరీ గురుతొచ్చాయి. 
జ్ఞాపకాలు ఇంకలేదు.. 
ఇంకా పచ్చిగా ఉండాయి ! 
మా ఇంటికాడ కుంటలో ఈతలేసేవాళ్లం.. 
ఎనుముల్ని రాళ్లతో కొట్టడం.. 
తూనీగలు పట్టుకోవటం, నీళ్ల కోళ్ల జాడకోసం వెతుకులాట.. 
నిక్కర్లు తడిచేదాకా కుంటలోకి పోయి ఆడుకోవటం.. 
చరిత్ర అయ్యాయి. 
రియల్ ఎస్టేట్ కి కుంటలు జాడ లేదు 
ఒకప్పటి చెర్లోపల్లెగుట్టకి వెళ్లాం. 
సాదాసీదాగా బాధతో కరిగిందది. 
గుట్టపై కాసేపు ఆడుకుంది మా కృతి. 
ఆ తర్వాత రోజు ఉదయాన్నే.. 
తూమురాళ్ల దిక్కుపోయినా. 
‘తూమురాళ్లను నాలోనే కలిపేసుకున్నా’ నంది. 
మా వూరి చెరువు కట్ట. 
దూరంగా ఉండే రేనగాయచెట్లు, గచ్చకాయచెట్లు 
గగనానికెగిసినాయి! 
చెరువుకట్టలో.. 
కృతితో కలిసి రాళ్లతో ఈతలేశాను.. 
చిన్నప్పటిలాగే పది రాళ్లీతలూ వేశా. 
నీళ్లపై రాయి సవారు గుర్రంలాగా పోతాంటే.. 
ఆ నీళ్లలోనే.. 
ఇనాకుమయ్యను వేసిన క్షణాలు మెదిలాయి. 
ఓ సాయంత్రం.. 
ఇసుకలోకి పోయి గుజ్జనగూడు. 
చెక్ చెక్ పుల్ల చెకారి పుల్ల ఆడుకున్నాం. 
పడమటి కిరణాలు పలచబారుతున్న వేళ.. 
నాకో విషయం అనిపించింది 
ప్రతి మనిషికి ఒకేసారి బాల్యం అనేది తప్పని. 
ఎందుకంటే.. 
మన ప్రతి బిడ్డా మనకో బాల్యాన్ని తిరిగిస్తాడు. 
అలా ఆ రోజు కృతి.. 
నా రెండోబాల్యాన్ని కందిపుల్ల తీసుకుని.. 
బెదిరించి మరీ మళ్లీ నాకు ఇచ్చింది. 
అది కూడా కాళ్లకు అవాయి చెప్పుల్లేకుండా.. 
నాన్నపాదాలు, కూతురి పాదాలు.. 
ఒకేచోట ఇసుకలో ఆడుకోవటం కంటే.. 
గొప్ప అనుభూతి ఏముంటుందీ? 
* 
చిత్రం: రాజశేఖర చంద్రం  
 | 
            నాన్నపాదాలు…కూతురి పాదాలు..
ఓ సాయంత్రం..
ఇసుకలోకి పోయి గుజ్జనగూడు.
చెక్ చెక్ పుల్ల చెకారి పుల్ల ఆడుకున్నాం.








చాలా బాగుంది , ప్రతి గ్రామీణుని మనసుని హత్తుకొనే అంశం .
Thanks sir
ఊరికి తీసుకెళ్లి పోయారుగా
vurikani vellanu. yekkada adukunnavante rasesa madam poem.’
thanks
నేడుఇలాంటిఅనుభూతులుపిల్లలకుకరువయ్యాయి.సెల్ పోనులరేడియేషన్,టి.వి లఅరుపులు తోడయ్యాయి.ప్రకృతికిఆసరామనంమనకుప్రకృతిఆధారం అలాంటిప్రకృతిగురించితెలియడంలేదు నేటిబాల్యానికి ఇలాంటి అనుభూతులు,అనుభవాలుకలిగించాలి
Thanks anna