ఎడారిలో కురిసిన ఒక కల

“పరిసరాలను పట్టించుకుని కవితాత్మలో పొదిగిందే కవిత్వం” అని అంటాడు స్కాట్లాండ్ జాతీయ కవి ఎడ్విన్ మోర్గాన్. కవుల కల్పనలో అపు రూపాలైన చెట్టూ, పుట్టా, గట్టూ, చేనూ, చెలకా, ఏరూ సెలయేరూ, వాగూ, వంకా  డొంకా కవుల చుట్టూ ఉన్నసమీప పరిసరాలుగా పరిగణించవచ్చు. ఇవి మాత్రమే  కాదు నదులూ, నదాలూ, సముద్రాలూ, సూర్యాస్తమయాలూ, అమావాస్యా, పున్నమిదినాలు,చెరువులు,  కరువులు ఒకటేమిటి  అన్నీ ఇవన్నీ కవితా వస్తువులే.ఇవి కవుల చుట్టూ పరిభ్రమించే పరిసరాలే .

కవులు ఈ పరిసరాల్లో నడుస్తూ మన మనసును గిలిగింతలు పెట్టే కవిత్వమవుతూ ఉంటారు.లేదా కవులే కాపువేసీ వాటిని అక్షరాల్లో పొదిగి అందంగానూ, ఆర్ద్రంగానూ కవిత్వం చేస్తూవుంటారు.   కవి తన చుట్టూ ఉన్న పరిసరాలనే తన కవితా వస్తువులుగా చేయడమంటే.. ఎడారి స్వప్నాలను ఫలింపజేసే ఒయాసిస్సులు కూడా ఉంటాయని నిరూపించడమేనని అనుకుంటాను.

ఇట్లా పరిసరాలను పట్టించుకుని కవితాత్మలో పొదిగిన కవిత్వం రాస్తున్న కవులు కొందరే ఉన్నారు.అలాంటి కవుల్లో డాక్టర్ అంకె శ్రీనివాస్ కూడా ఒకరు. కరువూ చెరువు ఇతని ఇష్ట సఖులు.అనంతపురం ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు ఇతడు.చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పరిశోధకుడుగా అంకె శ్రీనివాస్ చిర పరిచితుడు.

రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ సాహిత్యం మీద పరిశోధన చేసి ‘ బహుముఖం ‘ అన్న గ్రంధాన్ని శ్రీనివాస్  తీసుకొచ్చాడు. ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేసిన పరిశోధన గ్రంధం “నాడు – నుడి “ అనేది ఇతనిదే.ఆధునిక రాయల సీమ సాహిత్యం మీద పరిశోధన చేసి ‘ అస్తిత్వ’ అనే గ్రంధం ప్రచురించాడు శ్రీనివాస్.

కవి,కథకుడు, విమర్శకుడు అయిన శ్రీనివాస్ ఈ మధ్యే ఒక కవిత రాశాడు. ఏప్రిల్ 26 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఈ కవిత అచ్చయ్యింది.  గాఢమైన అనుభవాన్ని, గొప్ప ఊహా శబలతను పొదువుకున్న  లోతైన కవిత ఇది.

ఈ  కవితా శీర్షిక ‘ కుహువు ‘. కుహువు అనేది సంస్కృత పదం. దీనికి కోయిల కూజితం అని, చంద్రకళ లేని అమావాస్య అని రెండర్థాలున్నాయి. తన తెలుగు కవితకు ఒక సంస్కృత శీర్షిక పెట్టడం మాత్రమే చేయలేదు శ్రీనివాస్, కోయిల కూజితం అనే అర్థంలో కాకుండా చంద్రకళ లేని అమావాస్య అనే ప్రత్యేకార్థంలో ‘కుహువు’ అనే శీర్షికను తన ఈ కవితకు ఉంచాడు. ఈ శీర్షిక కొంచెం ఆశ్చర్యం. కొంచెం చిత్రం. ఎందుకంటే కుహూ కుహూ అనే కోయిల ప్రస్తావనే లేకుండానే  కవిత అంతా రాయడం.

ఈ కవిత స్త్రీ పురుషుల మధ్య ఉండే  ఒక ప్రేమ – ఒక కాంక్ష’ను చిత్రించిన  వస్తువులా ధ్వనిస్తుంది. కానీ దాని ప్రతి ధ్వని  కవి చుట్టూ ఉన్న పరిసరాల వ్యవసాయకరువును పొదువుకొని వినిపిస్తుంది. కవితలో అంతరార్థంగా రాయల సీమ కరువు తీవ్రతని చూపించడం మాత్రమే కాదు ఈ శ్రీనివాస్ చేసింది, కోరిక మరక ఉన్న అతడు నెర్రెలు పోయిన నేల ముఖంతో కృష్ణ పక్షపు కుహువు అవుతున్నాడని చెప్పడం. కాంక్షా రహిత ప్రేమ ఉన్న ఆమె… ఆమెలా వరి పొలం లాంటి పంటలా, ప్రకృతిలా ఉందని చూపించడం ఈ కవిత ప్రత్యేకత.

శ్రీనివాస్  చంద్రకళ కానరాని అమావాస్యను  అంతర్లీనంగా కవితలో పొదిగించి, తన పరిసరాల్లోని వ్యవసాయ కరువు స్థితిని స్త్రీ పురుష ప్రేమ కాంక్షలో కరగించి పోతపోసిన కవిత్వం చేయడం ఒక అద్భుత శిల్పం. పదాల అమరికతో చిత్రాన్ని గీసి చూపే ఒక కళ ఈ కవిత.’ ఇంటి ముందు ముగ్గులాగా అందంగా వుండేది’ –  అని అనడంలో యవ్వనంలో ఆమె అందాన్ని,  ‘వరి పొలం లాంటి దేహం’ అని అనడంలో ఆమె దేహపు పసుపు మిసిమిని స్ఫురింపచేయడం ఈ కవికున్న ప్రతిభే.

అదే ‘ఇంటి ముందున్నముగ్గు  ఆమె తలను అలంకరించింది’ అని రాయడంలోనూ, ‘వరిపొలంలోని కాలువలు ఆమె దేహం మీద ఎండిపోయాయి’ అని అనడంలోనూ ఆమె వృద్ధ్యాప్య దశని దర్శింప చేస్తాడు కవి. కరువు స్తితిని చూపిస్తాడు.

ఈ సందర్భంలోనే శ్రీనివాస్ ‘చరమ రేయేలిక’ అనే అరుదైన పదప్రయోగం చేశాడు. తెల్లవారు ఝామున కనిపించే ఆఖరి చంద్రుడు అని దీని అర్థం. జీవితపు ఆఖరు దశకు ముగింపునకు,లేదా ఒక సుదీర్ఘ నిరీక్షణ సమయానికీ ప్రతీకగా కవులు దీన్ని ప్రయోగిస్తారేమో?.

ఒకే ఒక పద ప్రయోగంతో ఆమె ఆఖరు దశలో లేదా ఒక సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆమె అతన్ని చూసిందనే భావనను పాఠకుడికి స్ఫురింప చేయడానికీ ఈ కవి తీసుకున్న శ్రద్ధ, అతని శిల్ప పరిపక్వతకు లోతైన నిదర్శనంగా నిలుస్తుంది.ఇట్లా శిల్పాన్ని నిక్షేపించడం కవిత్వాన్ని నిర్మించే నేర్పరులే చేయగలరు.

‘వరిపొలం లాంటి దేహం’ గల ఆమె కనిపించగానే  అతని కంటి ప్రమిదలు అసంకల్పితంగా వెలగడం’ అతనిలోని కాంక్షకి గుర్తు.అతని గుండె లోని కాంక్షా చీకటిని కోసే కొడవలి నెలవంక అయితే ఆ కొడవలికి పదును పెట్టేది మాత్రం ఆమె నవ్వే. ఇదొక నవ్య నవనీత భావన.

ఆ సమయం కుహువు కాబట్టి  ఇక ఆ నెలవంక కొడవలి కానరాదని కవి ఊహ.  ఆమె నవ్వులోని వెన్నెల మీగడల వెలుగుల్లో కవి గీసిన భావుకత్వ చిత్తరువులే  పాఠకుడి హృదిలో అనేక ఊహల్ని రేపుతాయి. ఒక అద్భుత దృశ్యాన్ని గీసి చూపిన కళగా ఈ కవిత మెరుస్తుంది చదువరి మనో కాన్వాస్ మీద.

‘వరి పొలం లాంటి దేహం’ వంటి ఉపమలు, ‘గుండె  చీకటిని కోసిన నెలవంక కొడవలి’, వెన్నెల మీగడ ఆవిరికి కోరిక మరక వంటి రూపకాలు ఈ కవితకు అదనపు నగీషలే.ఆమె లోని అమలిన ప్రేమను ఈ కవిత పలవరించడమే కాదు పరిసరాలను అంటే కవి చుట్టు అలుముకున్న కరువు స్థితులను కూడా లయించు కొని, అతని దేహం కృష్ణ పక్షపు కుహూవు గా  ఎందుకు మారిందో అద్భుతంగా చూపింది. మగ దురహాంకారపు కోరిక వృద్ధ్యాపు దశలో కూడా అతనిలో ఉందని ధ్వనింప చేసిన డాక్టర్ అంకె శ్రీనివాస్ కి అభినందనలు.

గాఢమైన అనుభవాల్ని,ఊహల్ని లోతైన కవిత్వంగా మలిచే కవి శ్రీనివాస్ నుంచి ఇంకా కవితా సంపుటి వెలువడకపోవడం అభినందనీయం కాదు. త్వరలో తెస్తాడని ఆశిస్తాను.

 

   కుహువు 

 

ఆమె అక్కడికొచ్చింది.

అతన్ని గమనించలేదు.

ఇంటి ముందు ముగ్గులాగా

అందంగా ఉండేది.

 

వరి పొలం లాంటి దేహం

కనిపించగానే అతని కంటి ప్రమిదలు

అసంకల్పితంగా వెలిగేవి.

అతని గుండె చీకటి కోసిన నెలవంక కొడవలి.

ఆమె నవ్వులో వెన్నెల మీగడ

 

ఇన్నాళ్ళ తరువాత ఎదురయ్యింది.

ఇప్పుడు ఇంటి ముందున్న ముగ్గు అమె తలని అలంకరించింది.

వరి పొలంలోని కాలువలు ఆమె దేహం మీద ఎండిపోయాయి.

చరమ రేయేలిక’

 

“బాగున్నావా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి”

తిరిగి చూస్తే ఆమె!

సమూహంలో గుర్తు పట్టి

 

ఆ పలకరింపుతో అతని ముఖమంతా

వరికోతలయ్యాక నేల నెర్రెలు

అతని దేహం నుండి కృష్ణపక్షపు దుర్గంధం.

 

అతని ఊపిరి ఆవిరికి  కోరిక మరక ఉంది.

ఎప్పుడూ ఆమె ఆమె లాగానే ఉంది.

పంట లాగా … ప్రకృతి లాగా !

*

 

రాజారామ్ తూముచర్ల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సర్
    మీరు నన్నిలా ఆశ్చర్య పరిచారు. మీ సమీక్ష నా సృజనకు ఊపిరి లూదుతోంది . నేను కవిత్వం రాసిన సమయంలో ఎంత భావోద్వేగానికి లోనయ్యానో, మీ సమీక్ష చదవుతూ కూడా అంతే భావోద్వేగానికి లోనయ్యాను. “ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ ” అంటాడు పెద్దన. మీరు విమర్శకోత్త్తములు. కవి భావనలను అద్భుతంగా విశ్లేషణ చేసారు. Thank you so much sir

  • రాజారాం
    నీ సమీక్ష చదివిన. తర్వాత కుహువు. కవిత ను
    చదవకుండా ఉండ లేక పోయ

    ఎడారి లొ ఐన
    బిటు వాడిన. నేల ఐన ఒక

    ప్రేమ పలకరింపుతో… వళ్ళు
    ఎలా..పులకరిస్తుంది…అది
    అనుభవించిన…. వారికి.. మాత్రమే
    తెలుస్తుంది….అనే…ఊహ… ఈ..కుహువు….

    అద్భుతం శ్రీనివాస్ గారు

    అభినందనలు

    .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు