స్ఫూర్తినిచ్చిన సిరికోన నవలల చర్చ

“సిరికోన సాహితీ అకాడమీ”- జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక 2024 నవలా రచనల పోటీలలో ఎంపికైన నవలా విజేతల సన్మాన సభా కార్యక్రమం, అక్టోబరు 26 వ తేదీ ఆదివారం అంతర్జాలంలో జరిగింది.  అనేకమంది సాహితీ వేత్తలతో  పాటు, పురస్కార ప్రదాతలు అయిన  జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వారి శ్రీమతి  శారద  ఈ కార్యక్రమాన్ని  నిర్వహించారు.

తొలుత “అక్షర పరబ్రహ్మ యోగి” స్వర్గీయ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ వారిని గుర్తు చేసుకొంటూ, వారితో  తమకు సాహిత్య పరంగాను, వ్యక్తిత్వ పరంగాను  ఏర్పడిన అనుబంధం, ”సిరికోన సాహితీ అకాడమీ” స్థాపనలో  ఆచార్యులవారు చూపిన చొరవ,  ఆశయాల  గురించి సిరికోనీయులు, పాలడుగు శ్రీచరణ్ చక్రవర్తి, దర్భముళ్ళ చంద్రశేఖర్, జె ఎస్ ఆర్ మూర్తి , అత్తలూరి విజయలక్ష్మి, నిర్మల ఘంటసాల, అరవింద పారనంది. తదితరులు ఆత్మీయంగా స్పందించారు.

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సదస్సుకు హాజరైన సాహితీ ప్రియులకు స్వాగత వచనాలు పలికారు. 2021  వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పోటీలను గత నాలుగేళ్ళుగా  సమర్ధవంతంగా  నిర్వహించడం తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నారు. 2024 వ సంవత్సరానికి కథావస్తువును సూచించకుండా, రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తం మీద తాజాగా రచించిన నవలలు పోటీకి సమర్పించవచ్చని ప్రకటించగా, అనూహ్యమైన స్పందన లభించిందనీ. ఎక్కువమంది ప్రేమను కేంద్ర వస్తువుగా తీసుకుని  రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు పోటీకి వచ్చాయని తెలిపారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయని, a. కథావస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందనీ నవలల ఎంపిక గురించి వివరించారు.

అసాధారణ నిర్మాణ చతురతతో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తూ  డా.బి.నాగశేషు రచించిన”కిలారి”  ఉత్తమ నవల గా ఎంపిక కాగా, నాలుగు తరాల నారీ చేతన కు అద్దం పడుతూ  రెంటాల కల్పన రచించిన నవల ” కావేరికి అటూ ఇటూ”, నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని సమగ్రంగా చిత్రిస్తూ యువ రచయిత  శ రంజిత్ గన్నోజు రచించిన నవల”. లింగాల కంఠంలో” ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యాయని, ఈ  మూడు నవలలు సిరికోనకు  గర్వకారణంగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

ముఖ్య అతిథి ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆచార్య గంగిశెట్టిలక్ష్మీ నారాయణ  గారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రథమ బహుమతి పొందిన కిలారి నవల గురించి మాట్లాడుతూ, గ్రామాలలో అతి సామాన్యులైన  బలహీన వర్గాలను, చిన్న చిన్న కుల వృత్తులు చేసుకుంటూ జీవనము సాగిస్తున్న అట్టడుగువర్గాలను సంపన్నులు  ఎలా పీడిస్తారో పాఠకుల మనసులకు హత్తుకునేలా రాశారని ప్రశంసించారు. వివిధ కులవృత్తుల వారు గ్రామాల్లో  సాగించే వాడుక పదాల  సంభాషణల రచన ఒక విశిష్టత కాగా , ఉన్నత  చదువులకోసం  పట్టణాలకు వలసవెళ్లిన కొందరు తమ శక్తి యుక్తులనుపయోగించి ఆర్ధికంగా ఎదిగి  తాము పుట్టిపెరిగిన గ్రామాల్లోని  అట్టడుగు పీడిత వర్గాలకు ఆర్ధికంగా తోడ్పడడం వంటి సంఘటనలు వెలుగులోనికి తేవడం వెనుక  గ్రామీణుల జీవితాలలో  సామాజిక చైతన్యాన్ని రచయిత నాగశేషు తన నవల ద్వారా సాధించారని అన్నారు.  ప్రధాన వక్త, న్యాయ నిర్ణేత  డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు  బహుమతి పొందిన నవలల మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను విధించుకున్న నియమానుసారం తాను సమీక్షించే ప్రతి నవల ను క్షుణ్ణంగా చదివానని నవలలను గూర్చిన విశ్లేషణను మంచి  చెడుల నిర్ణయాత్మక దృష్టితో తరచి చూడడంతో పాటు   ప్రతి నవలలోనూ తనకు నచ్చిన  అంశాలను, నచ్చని అంశాలనూ ప్రస్తావించారు.ప్రముఖ సాహితీ విశ్లేషకులు  లెనిన్ వేముల మాట్లాడుతూ, డాక్టర్ నాగశేషు  తాదాత్మ్యము చెంది రచన సాగించే  కవి గా అభివర్ణించారు. నవలలో  సాగిన గ్రామదేవత జాతర వర్ణన ను ప్రస్తావిస్తూ అందెశ్రీ గారి ”కొమ్మ చెక్కితే బొమ్మరా”అనే   వీనుల విందైన పాట పాడి సభికులను మెప్పించారు.

డాక్టర్ నాగశేషు స్పందిస్తూ తన నవలలోని  పాత్రలు, కథావస్తువును  గురించి చక్కగా వివరించారు. స్త్రీ  పాత్రతోనే  ఈ”కిలారి ” నవల మొదలవుతుందన్నారు.   ఆవులు మేకలు మొదలగు వాటిని పెంచడం వంటి కుల వృత్తులు చేసుకుంటూ జీవించే  వారి పేర్లకు ముందు కిలారి అనే పదాన్ని జోడించి పిలిచే  పద్దతి తాము పుట్టి పెరిగిన గ్రామీణ జన జీవనస్రవంతి లో భాగమైనందున తన నవలకు ”కిలారి” నామం అతికినట్లుగా సరిపోయిందన్నారు. ఊరిలో  మంగలి వృత్తి చేసుకొనే  పాత్ర  చేత కొన్ని సందర్భాల్లో చెప్పించిన ఆత్మీయ మాటలను, హృద్యంగా మలిచినట్లు చెప్పారు.అనేకమంది గ్రామాలనుండి  పట్టణాలకు ఆర్ధికముగా బలపడడానికి  వలస వెళ్లినప్పటికీ తమ గ్రామాలలో ఇప్పటికీ మూఢనమ్మకాలతో పోటీపడుతూ  కుల వృత్తులు అనుసరిస్తున్న గ్రామీణులకు  విద్య వైద్య రంగాల్లో ఎంతో కొంత సహాయం చేయడం దేవాలయ నిర్మాణంలో భాగస్వాములను చేయడం వంటివి తన మనసుకు నచ్చిన అంశాలని  చెప్పారు.

”కావేరికీ అటూ ఇటూ”నవలా రచయిత  కల్పన రెంటాల  మాట్లాడుతూ  సమాజ చరిత్రలో కుటుంబ చరిత్రలు కూడా ఒక భాగమని, అలాగే స్త్రీల వైపు నుంచి కుటుంబ చరిత్రను చూసినపుడు కొత్త కోణాలు వ్యక్తమవుతాయని, తన శక్తి మేరకు ఈ నవలలో అంతర్గత వలస థీమ్ ఆధారంగా నాలుగు తరాల స్త్రీల గురించి నవల రాసినట్లు చెప్పారు.

” లింగాల కంఠంలో” నవల రచయిత శ రంజిత్ గన్నోజు మాట్లాడుతూ         ”ఇప్ప సారా కత్తిసారం” అనేది ఈ నవలకు ఉపశీర్షిక అని పేర్కొన్నారు.  లింగాల ఒక ప్రాంతము పేరు అనీ సారాను కాచి అమ్మడం లేదా త్రాగడానికి అలవాటుపడ్డ  చెంచుల జీవన విధానమును దగ్గరగా చూచినవాడిని కావడంచేత లింగ దాసు, మల్లి దాసుఅనే  రెండు పాత్రలను,చిన్నవయసులోనే పెళ్లయిన ఒక చెంచు బాలిక పాత్ర ను ఎంచుకొని, అడవికి దగ్గరిగావున్నవారు మాట్లాడే తీరు వారి జీవన విధానం  ఈఅడవుల్లోనివసించే వారి  పిల్లలకు  విద్య అవకాశాలు వంటి విశేషాలతో ఆటవిక ,ఆధ్యాత్మిక  చారిత్రక సామాజిక అంశాలు మేళవించి ఈ నవలనురాసినట్లు చెప్పారు. రాసిన మొదటి నవలకే బహుమతి రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. తన మీద గోరటి వెంకన్న లాంటి వారి ప్రభావముందని చెప్పారు.

నీలకంఠం నరస రాజు, రచయిత్రి సరోజ కొమరవోలు లతో బాటు, డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి,  గోవర్ధనరావు నిడిగంటి,  ఇక్బాల్.. ఆచార్య గంగిశెట్టి వారిని స్మరించుకుంటూ తమ స్పందన తెలియచేసారు .

ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో, ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చు.

https://www.youtube.com/watch?v=agJBcdbizu8

 

సుబ్బు జొన్నలగడ్డ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు