గత వారంతో సారంగ ఎనిమిదో యేడులోకి అడుగు పెట్టింది. మధ్యలో ఒక ఏడాది విరామం తప్ప గత యేడు సంవత్సరాలుగా “సారంగ” మొదట వారపత్రికగా, తరవాత పక్ష పత్రికగా క్రమం తప్పకుండా మీ ముందుకు వస్తూనే వుంది. సామాజిక సాహిత్య రంగాలలో ఈ యేడేళ్లు మనం అనేక మలుపులూ మార్పులూ చూశాం. వాటన్నిటినీ మీ ముందు అక్షరబద్ధం చేయడంలో “సారంగ” పాత్ర పట్ల మాకు సంతృప్తిగా వుంది. మీకూ సారంగతో ఈ ప్రయాణం సంప్తృప్తినిచ్చిందనే మా నమ్మిక.
2013 మార్చి మొదటి వారం “సారంగ” పత్రిక తొలి సంచిక మీ ముందుకు తీసుకువచ్చినప్పుడు సాంస్కృతిక సాహిత్య రంగాలలో మా వంతు బాధ్యత యేమిటో మాకు స్పష్టంగానే వుంది. మరోసారి మా తొలి పలుకులను మీరూ తలచుకుంటే:
మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల.
అయితే, కలలన్నీ నిలబడవు కదా! అనివార్య కారణాల వల్ల వారపత్రికగా “సారంగ”ని కొనసాగించలేకపోయాం. 2017 లో పత్రిక విరామం ప్రకటించినప్పుడు చదువరులూ, రచయితలూ భరించలేని వెలితిని అనుభూతిస్తూ, సుదీర్ఘ లేఖలు రాశారు. “సారంగ” కొనసాగాలి అంటే తమ వంతుగా యేం చేయాలో చెప్పండి అంటూ వందలాది మంది చేయూత, చివరికి ఆర్థిక సాయం కూడా అందిస్తామంటూ ముందుకు వచ్చారు. యేడాదికింత చందా పెట్టించినా పత్రిక కొనుక్కొని మరీ చదువుతామని అన్నారు. సౌజన్యం ప్రకటిస్తూ కొన్ని సంస్థలు సైతం బహిరంగ ప్రకటనలు చేశాయి. కానీ మాటిచ్చిన మేరకు అది “విరామమే” తప్ప మూసివేత కాదని నిరూపిస్తూ మళ్ళీ “సారంగ” మీ ముందుకు వచ్చింది రెండో సారి పక్ష పత్రికగా-
ఆ విరామ సమయంలో మీరంతా ప్రకటించిన ప్రేమని “సారంగ” ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ పునరాగమనం పాపులర్ భాషలో చెప్పాలంటే “సూపర్ హిట్” అయింది. ఇంతకుముందు కంటే మక్కువగా ఎక్కువ మంది చదువరులూ, రచయితలూ పత్రికని అక్కున చేర్చుకున్నారు. ఆ విధంగా అనేకానేక వ్యక్తిగత వృత్తిగత వొత్తిళ్ల మధ్య కూడా వాయిదా వేయకుండా పత్రికని మీ ముందుకు తీసుకురావడంలోని కష్టనష్టాలని యెదుర్కొనే శక్తిని చాలా విధాలుగా మీరే మాకు ఇచ్చారు. పునరాగమనం కేవలం మరో పత్రికగా కాకుండా అనేక కొత్త శీర్షికలతో మొదలయింది. ఇప్పటిదాకా “సారంగ” ప్రచురించిన ప్రతి శీర్షికా ప్రత్యేక శీర్షికగానే మీ ముందు సహృదయ స్థానాన్ని సంపాదించుకుంది.
అన్నింటికంటే మరీ ముఖ్యంగా, గతంతో పోల్చినప్పుడు పైలా పచ్చీసు యువతరం “సారంగ”లో ఎక్కువ సంఖ్యలో కనిపించడం సాహిత్య భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు పుట్టిస్తోంది. “సారంగ” చదువరులలో కూడా వాళ్ళ సంఖ్యే పైచేయిగా వుందని మాకు అందుతున్న పాఠక లోకపు ప్రతిస్పందనల్ని బట్టి అర్థమవుతోంది.
అయితే, ఈ సందర్భంగా కొన్ని బాధాకరమైన సంగతుల్ని కూడా యేకరువు పెట్టక తప్పడం లేదు. ముఖ్యంగా, సాహిత్య విమర్శకి సంబంధించిన వ్యాసాల విషయంలో మాకు ఇప్పటికీ అంతగా తృప్తి లేదనే చెప్పాలి. తెలుగు సాహిత్య విమర్శ దీపం అసలే చిన్నది—ఈ మాట మనం పదేపదే వింటూనే వున్నాం. కానీ, ఈ దీపం పోనుపోనూ మరీ చిన్నదీ గుడ్డిదీ అయిపోతోందని మాకు అనిపిస్తోంది. విశ్లేషణ సాధనాలు పెరిగితే తప్ప సృజనాత్మక ప్రక్రియల వెలుగు విస్తరించదని అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో కథా సాహిత్య విమర్శకి సంబంధించి విశేషమైన కృషి మొదలైంది. కథా సాహిత్య విశ్లేషణలో కనీసం అయిదారుగురు చేస్తున్న కృషి మన కళ్ల ముందు కనిపిస్తున్నదే.
కానీ, అంత శ్రద్ధగా, వోపికగా అంతకంటే ముఖ్యంగా ఏకాగ్రతతో రాస్తున్న విమర్శకులు మనకు ఎంతమంది వున్నారన్న ప్రశ్న ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా, తామర తంపరగా వెలువడుతున్న కవిత్వం మీద అంత చిత్తశుద్ధితో పనిచేసే విమర్శకులు లేకపోవడం ఆ ప్రక్రియని విపరీతంగా దెబ్బ తీస్తోంది. ఆ వచ్చే అరకొర విమర్శ వ్యాసాలు కూడా ఫేస్ బుక్ గీసిన పరిధుల్లోనే శకలాలుగా మిగిలిపోతున్నాయి తప్ప లోతైన విమర్శనాత్మక దృష్టి వున్న సాక్ష్యాలు దొరకడం లేదు. యెంతోకొంత రాసే కవిత్వ విమర్శకులు వున్నప్పటికీ వాళ్ళు కూడా ఫేస్ బుక్ విషయ వలయంలో బందీలుగా మిగిలిపోతున్నారు. ఇది విషాదమే కాదు, కవిత్వ రంగానికొక ప్రమాద సూచిక.
ఈ యేడాది కవిత్వ విమర్శకి సముచిత స్థానమివ్వాలని “సారంగ” సంకల్పం. దీనికి బలాన్నిచ్చే వారికి మా ప్రేమపూర్వక ఆహ్వానం. కవిత్వం గురించి చక్కని శీర్షిక రాయగలమనే నమ్మకం మీకుంటే మాకు వెంటనే తెలియజేయండి.
ఇక సృజనాత్మక ప్రక్రియల్లో సారంగ సాధించిన విజయాలు ఎన్నో వున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు ప్రవాస సీమల్లోనూ తెలుగు కథా కవిత్వ సంకలనాల్లో ఇప్పటికీ “సారంగ”లో ప్రచురితమైన రచనలు పెద్ద సంఖ్యలో వుండడం మాకు గర్వంగా వుంది. అట్లాంటి కృషి ఇకముందు కూడా రచయితలూ కవుల వైపు నుంచి కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. ఎప్పటిలానే కొత్త కవిత్వానికీ, కథలకూ మా సాదర స్వాగతం.
అట్లాగే, వచన ప్రక్రియల్లో ప్రయోగాత్మకమైన రచనలూ, సినిమా విమర్శకి సంబంధించి ఎన్నో విలువైన వ్యాసాలూ వెంటవెంటనే ప్రచురించడంలో “సారంగ” ఇప్పటికీ అగ్రభాగాన వుండడం కూడా మాకు సంతోషంగా వుంది. వచనంలో యెట్లాంటి ప్రయోగాత్మక రచనకైనా “సారంగ”లో స్థానం పదిలమే. కాబట్టి, ప్రతి ఆలోచనకూ ఒక రూపం ఇవ్వండి. ఏ మంచి ఆలోచనా వృధా పోదన్న గాఢమైన నమ్మకం మాది.
రాయండి, రాయించండి. చదవండి, చదివించండి!
ఈ ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా “సారంగ”కి మీ శుభాకాంక్షలే కాకుండా ఇక ముందు మరింత మెరుగైన పత్రికగా రూపుదిద్దడానికి “సారంగ”కి మీ సూచనలూ సలహాలు కూడా ఇవ్వండి. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలూ రాయండి.
గమనిక: “సారంగ”కి రచనలు పంపించేటప్పుడు మా గమనికలూ, ఫార్మాటింగ్ సూచనలు తప్పక అనుసరించండి.
*
ఫోటో: సీతారాం దండమూడి
హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వెబ్ మ్యాగజైన్ లో 8 ఏళ్లంటే యవకుడి కింద లెక్క . మరింత ఉత్సాహంగా జాతీయ మ్యాగజైన్ గా మారాలని మనసారా కోరుకుంటున్నా.
సారంగ పుట్టి ఎనిమిదేళ్లయిందంటే నమ్మలేనంత వడిగా సాగింది సారంగ ప్రయాణం
రాయాలనుకున్న వాళ్లందరి చేతా రాయించిన సహృదయ , సారంగ
వైవిధ్యాలకు వేదిక
సారంగ మరిన్ని ఏళ్లు పుట్టిన రోజులు జరుపుకోవాలి
Congratulations
సారంగ కు 8 వసంతాల శుభ దిననానికి మిత్రులు అఫ్సర్ గారికి వారి సహచరికి హార్దిక అభినందనలు. సారంగ నాలాంటి రాయడం రాని వాడిని కూడా బాగా ప్రోత్సహించారు.
సరి అయిన విమర్శ రావటం లేదన్న విషయం గురించి రాయాలంటే చాలా కష్టం. మీకు తెలియనదేమి లేదు.
ఈ నాడు సాహిత్యం లో బాగా సమీక్షలు రాయించుకోవడం ఒక పెద్ద జబ్బు.
సంవత్సరం పైన అయింది నేను ఇంకో అంతర్జాల పత్రికలో ఒక నవలని విమర్శించాను. చాలామంది ఆ విమర్శ ఒప్పుకున్నారు కూడా. అనవల రాసిన వ్యక్తి, ఒకప్పుడు నా స్నేహితులే, నా మీద చాలా కోప పడ్డారు స్నేహం కూడా … .
రాస్తున్న వాళ్ళలో చాలా మంది స్నేహితులే ఉంటారు. అలాంటప్పుడు విమర్శించడం చాలా కష్టం. అసలు ముందు మాట రాసిన వారుకుడా మొహమాటానికి రాస్తున్నట్టున్నారు.
అయ్యా అంచాత అదీసంగతి (మా మేనమావ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు విశాఖలో లేబర్ యూనియన్ లో ఉండగా కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చెప్పి “అంచాత అదీసంగతి” అని వాడుతుండేవారు)
సారంగ కు ఎనిమిది వసంతాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు.
Congrats to the whole team.
ముంబైలో ఉండగా – తెలుగు పత్రికలు దొరకనప్పుడు ‘సారంగ’ చదవడం మొదలుపెట్టాను. ఈ పత్రిక ఆధునికతకూ, అభ్యుదయానికీ పెద్దపీట వేస్తుందని నాకు త్వరలోనే అర్థం అయింది. ‘భారతి’, ‘సృజన’ల కాలం ముగిసాక, తెలుగులో సాహితీ పత్రికలులేని లోటును ‘సారంగ’, అలాగే మరికొన్ని ఇతర అంతర్జాల పత్రికలు కొంతవరకూ పూరిస్తున్నాయని నాకు అనిపించింది. వ్యాపారదృష్టితో కాకుండా కేవలం సాహిత్యసేవ కోసమే ఈ బాధ్యతను నెత్తినవేసుకున్న సంపాదకుల దృష్టి విశాలమైనది; తెలుగు వారందరూ హర్షించతగ్గది. కానీ, కాసే చెట్టుకే రాళ్లు తగులుతాయి. పైగా మన తెలుగువాళ్లకి మంచి పని చేస్తున్నవారిని ప్రోత్సహించే సంప్రదాయం ఒక పాలు తక్కువ. ఇబ్బందులెన్ని ఉన్నప్పటికీ ‘సారంగ’ తాను సృష్టించిన సాహితీ స్థావరాన్ని కాపాడుకోగలదనే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు మనల్ని చుట్టుముట్టిన చీకటి రాత్రులలో ఈ స్పేస్ ని కాపాడుకోవడం చాలా అవసరం. అయితే అందుకుగాను పాఠకుల, రచయితల, విమర్శకుల సహకారం వారికి చాలా అవసరం. ఇది మన అందరి పత్రిక అని వారంతా భావించాలి. నా కథలు కొన్నింటిని ప్రచురించి ‘సారంగ’ నన్ను ప్రోత్సహించింది. అందుకుగాను సంపాదకులకు నా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఈ బృహత్ ప్రయోగానికి చేయూతనిస్తున్నవారందరికీ నా హృదయపూర్వక అభినందనలు!
memu Mee venta vunnamu.munduku sagandi.
hearty congrats sahithee SARAMga!
పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐సారంగ..మారోజు వారి పనుల్లో, నిన్ను ఏదోసమయము లో,చదువుకోవడం,, మా అలవాటు గా పెట్టుకున్నాం… అంత గా,పెనవేసుకు పోయావు.. ఇక కవిత్వ విమర్శలు గురించి రాయాలని,ఎంతగానో, ప్రయత్నం చేసి,రాసి పంపిన ఏవి,ప్రచురణ కాలేదు.మావి.అందులో, మా తప్పు ఉండవచ్చు., ok, సారంగ సారధి లకు,మా మనః పూర్వక అభినందనలు!💐.
ఇంకా బాగా కొనసాగుతుంది సారంగ..ఎన్నో విజయాల్ని అందుకుంటుంది..congrats