తెలుగు కవిత్వపు రౌడీ శిష్ ట్లా ఉమా మహేశ్వర రావు ?!!

భ్యుదయ కవులని అప్పట్లో మూడు తరాలుగా వర్గీకరించి మాట్లాడేవారు. రెంటాల గోపాలకృష్ణ మూడో తరానికి చెందిన వారు గా శ్రీరంగం నారాయణ బాబు లాంటి వారు చెప్పేవారు. నిజానికి శిష్ట్లా నుంచి రెంటాల వరకూ కూడా ఈ కవులందరూ అయిదు, పదేళ్ళు గా ఒకే వయసు వారు. మరి ఈ వర్గీకరణ చేయటానికి కారణం మొదట ఎవరు రాశారు, తర్వాత ఎవరు అనుసరించారు, ఎవరిమీద ఎవరి ప్రభావం ఉంది లాంటి కారణాల ద్వారా ఈ వర్గీకరణ జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

మూడో తరం వారి  మీద అంటే రెంటాల , ఆయన సమకాలీకుల మీద శ్రీశ్రీ, నారాయణ బాబు ప్రభావం ఎక్కవ ఉందని అన్నప్పటికీ, అసలు శ్రీశ్రీ మీదనే శిష్ట్లా ప్రభావం ఉందన్న విషయాన్ని మొదట ఒప్పుకోవాలి. శిష్ట్లా ఆధునిక లేదా నవ్య కవిత్వానికి ఆద్యుడు గా చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ తన మీద శిష్ట్లా ప్రభావం ఉందని స్వయంగా చెప్పుకున్నాడు కాబట్టి పేచీ లేదు. రెంటాల గోపాలకృష్ణ కూడా తన పై శిష్ట్లా ప్రభావం ఉందన్న  విషయాన్ని అంగీకరించి ప్రకటించారు. శిష్ట్లా విష్ణు ధనువు రాస్తే, రెంటాల శివధనువు రాశారు. శ్రీశ్రీ నుంచి రెంటాల దాకా ఆనాటి కవులను అంతగా ప్రభావితం చేసిన శిష్ట్లా జీవితం గురించి కవిత్వం గురించి ఈ సందర్భంగా ఒక సారి గుర్తు చేసుకోవటం సముచితం. రెంటాల కవిత్వం గురించి మాట్లాడే ముందు రెంటాల తో పాటు, ఆ నాటి కవులను ప్రభావితం చేసిన శిష్ట్లా లాంటి వారిని స్మరించుకోవటం అవసరం.

శ్రీశ్రీ గురించి తెలిసినంతగా తెలుగు సాహిత్యం లో శిష్ట్లా గురించి చాలా మందికి తెలియదనుకుంటాను. శిష్ట్లా ఉమామహేశ్వర రావు జనన తేదీ గురించి బోలెడు అనుమానాలున్నాయి. కొందరు 1909 లో పుట్టాడు అన్నారు. మరి కొందరు 1912 అన్నారు. ఎప్పుడైతేనేం ఆయన పుట్టినది నిజం. గుంటూరు జిల్లా మంచాళ అగ్రహారం లో జన్మించాడట . చాలా మంది చెప్పిన దాని ప్రకారం, దొరికీనా ఋజువుల ప్రకారం శిష్ట్లా జనన మరణాలు 1909-1953 అని ఎక్కువ మంది నిర్ధారించారు. శిష్ట్లా ఉమామహేశ్వరరావు జీవితం , సాహిత్యం గురించి ఏటుకూరి ప్రసాద్ గారి సంపాదకత్వం లో వచ్చిన పుస్తకం లో ఎక్కువ వివరాలు  ఉన్నాయి ఎవరైనా చదివి తెలుసుకోవాలనుకుంటే.

శిష్ట్లా బాగా చదువుకున్న వ్యక్తి. కేవలం చదువు ఆయనను ని అందరికంటే భిన్నం గానో, ప్రత్యేకం గానో నిలబెట్టలేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన అధునాతన భావాలు, ఆయనను విలక్షణంగా నిలబెట్టాయి. శిష్ట్లా వ్యక్తిగత జీవితం గురించి బోలెడు కథలు ప్రచారం లో ఉన్నాయి. వాటిలోని నిజానిజాలు, సాధ్యాసాధ్యాలు చాలా మంది లాగానే నాకు కూడా వీరి ద్వారా వారి ద్వారా విన్నవి, చదివినవి మాత్రమే. కాబట్టి నేను “ ట” వాడాల్సి ఉంటుంది చాలా చోట్ల.

తెలుగు కవుల్లో ఓపెన్ గా “ గే “ గా ఎక్కువ మందికి తెలిసిన కవుల్లో శిష్ట్లా పేరు ప్రస్తావిస్తారు.  ఆయన సాహిత్యానికి, ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అప్పట్లో అదొక చర్చనీయాంశమే.

“ తెలుగు కవితా రంగం లో ఆధునికత ను – నవ్యత ను ముందు తరాల వారికి అందించిన అతి నవ్యులలో అతి నవ్యుడు. వచన కవిత కు ఆరంభకుడు. ఉపిరిలూదిన వాడు. బొడ్డు కోసిన వ్యక్తి.” మేం మాత్రం కవులం కామా” అని ప్రతి ఒక్కరూ విర్ర వీగుతున్న కాలం లో , భావ కవిత్వం బావుటా రెప రెపల క్రింద తెలుగు సాహిత్యం -ముఖ్యం గా కవిత్వం -నిద్ర జోగుతున్న సమయం లో ; అతి నవ్య కవిత్వం కొరడా ఝళిపించి , మత్తు వదిలించి, “ అదిగో చూడండి, రాబోవు యుగం కాంతి రేఖలు, ఇదిగో ఇవీ ఆ  యుగాన కవితా రేఖలు “- అంటూ కళ్ళు తెరిపించి బలవంతాన చూడమన్న వాడు శిష్ట్లా. జానపద వాంజ్గ్మయం సింగారాలు ఉగ్గుబాలతో చూపిన వాడు. సంప్రదాయ రక్తం ఊరకలెత్తే నరాల బిగువున్న వాడు. ఆంగ్ల సాహిత్యఅంగారం దర్శించి చేతులు కాలేలా స్పర్శించిన వాడూ  – శిష్ట్లా  ఉమా విజయ మాహేశ్వరం,”

ఇదీ శిష్ట్లా గురించి ఏటుకూరి ప్రసాద్ ముందు మాట లో రాసినది. ఇంతకన్నా ఎక్కువ చెప్పటానికి ఎవరికైనా ఏముంటుంది? మాటలకు అర్థాలు మార్చాలని చెప్పి మరీ ఆ పని చేశాడు శిష్ట్లా. అందువల్ల అందరూ ఆయన మార్గాన నడవటం లో ఆశ్చర్యం ఏముంది? కొత్త గా ఆలోచించటం, కొత్త గా రాయటం, కొత్త గా జీవించటం ఇలా ఎన్నొ కొత్తదనాల్ని కవిత్వానికి, సాహిత్యానికి, జీవితానికి రుచి చూపించాడు శిష్ట్లా. అందువల్లనే ఆయన ప్రభావం ఆనాటి సాహిత్య వేత్తలందరి మీదా ఉంది. నిజానికి చాలా మంది ఈ చరిత్ర తెలియక, తెలుగు కవిత్వం లో ఈ అధునాతన మార్పులని భాషాపరం, గా, భావ పరం గా తీసుకొచ్చినది శ్రీశ్రీ అనుకుంటారు కానీ అది నిజం కాదు. శిష్ట్లా ఆ పని చేశాడు. అందుకు ఎంతో ధైర్యం, గుండెనిబ్బరం కావాలి. అవి పుష్కలంగా ఉన్న కవి, రచయిత శిష్ట్లా. నాకైతే శిష్ట్లా ఎంత ఆధునికుడో అంతా సంప్రదాయం గా కనిపిస్తాడు. భాష విషయం లో, ఉపమానాల విషయం లో.  నాకు నచ్చే విషయం అది. భావం పేరుతో భాష ను పక్కన పెట్టేయలేదు. సంప్రదాయ చదువు చదువుకున్నారు. కానీ ఆధునికంగా కాలం తో పాటు ఆలోచించారు. కేవలం భాష ను సంప్రదాయం అంటూ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నేను నూరు శాతం అంగీకరించే విషయం. నవ్య కవిత్వం అంటే ఒక లైన్ కింద మరో లైన్ రాసుకు పోవటం కాదు ఆనాటి కవులు చేసింది. భావానికి తగ్గ భాషా సౌందర్యం వుండేది వారి కవితల్లో. లయ, తూగు ఉండేవి. కవిత పైకి చదవటానికి ఉత్తేజంగా, ఉత్సాహం గా ఉండేది. కాశీ లో ఎమ్మె ఇంగ్లీష్ చేసిన శిష్ట్లా 1930 ల నాటికి తెలుగు కవిత్వ రంగ ప్రవేశం చేశాడు. శిష్ట్లా మొదటి పుస్తకం “ విష్ణు ధనువు” 1938 నాటికి అచ్చయింది. అచ్చు వేసిన కాపీలు ఆశ్చర్యం గా 128 మాత్రమే. గుంటూరు నవ్య సాహిత్య పరిషత్తు వారు దీన్ని అచ్చు వేశారు. మొత్తం 64 పేజీలే కానీ రెండు ప్రెస్ లలొ   అచ్చు వేయాల్సి వచ్చింది. సంచలనం రేకెత్తించింది ఈ “ విష్ణు ధనువు”. ఈ పుస్తకానికి పీఠికలు రాసిన వారు, సమీక్ష రాసిన వాళ్ళు ఆనాటి ప్రముఖ సాహితీవేత్తలు. 1933 లో బరంపురం లో జరిగిన సాహిత్య సభల్లో కవులు  శిష్ట్లా కవితలు చదివి “ షాక్” తిని తర్వాత  తేరుకొని తిరుగుబాటు జెండా పట్టుకొని  ఆయన మార్గాన నడిచారని వినికిడి.

శిష్ట్లా వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకోవటం అవసరం. ఆయన మద్రాస్, కాశీ లలొ చదువుకున్నారు. ఎమ్మె ఇంగ్లీష్ పట్టభద్రుడు. శిష్ట్లా తండ్రి వెంకటకృష్ణయ్య టీచరు గా పని చేసేవాడు. ఖాదీ ప్రచార ఉద్యమం లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుడయ్యాడు. తన పేరు “ శిష్ ట్లా “ అని రాసుకునేవాడు. ఆయనకు చాలా పేర్లు. వినాయకరావు అందులో ఒకటి.  సంగీతం, జ్యోతిష్యం లాంటి వాటిల్లో ఆసక్తి. రకరాకాల ఉద్యోగాలు చేశాడు. కంపెనీ లో, కాలేజీలో, మిలటరీ లో.. ఇలా ఒక దానికొకటి  పొంతన లేని ఉద్యోగాలు. ఒక క్రమ మైన   జీవితం, స్థిరమైన ఉద్యోగం లేని ‘అనార్క్సిస్ట్ ‘ ‘ సూడోమిస్ట్’ లాంటి పేర్లు ఉండేవి ఆయనకు. శివలెంక శంభు ప్రసాద్ స్నేహితుడు గా మద్రాస్ ఆంధ్ర పత్రిక లో కొంత కాలం 1940 లలొ పని చేశారట. ఎప్పుడూ కూడా ఆయన నాటు సారా ప్రభావం లో ఉండేవారని కొందరి ఉవాచ. శిష్ట్లా  గురించి, శ్రీశ్రీ కి శిష్ట్లా కు ఉన్న సన్నిహితం, విభేదాల గురించి బోలెడు కథనాలు. వీటిల్లో నిజానిజాల మాట ఎలా ఉన్నా వీటికి ప్రచారం మాత్రం బ్రహ్మాండం గా వచ్చింది. అబ్బూరి వరద రాజేశ్వర రావు గారు “ కవితా రంగం లో రౌడీ వేషం వేసిన వ్యక్తి శిష్ ట్లా ఉమా మహేశ్వర రావు’ అన్నారట. అందుకు తగ్గట్లు మనిషి రూపు రేఖలు కూడా అలాగే ఉండేవట . మనిషి ఆజానూబాహువు, అందగాడు, మంచి నటుడు కూడా ఆట. కేవలం కవిత్వమే కాకుండా మిలటరీ లో పని చేసిన అనుభవాల ఆధారంగా రాసిన “ సిపాయి కథలు” ఇటీవలి కాలం లో ఆచ్చు అయి మళ్ళీ శిష్ ట్లా ను ఒక కథకుడి గా మళ్ళీ సాహిత్య పటం పై నిలబెట్టాయి.

శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ , నోరి నరసింహ శాస్త్రి, జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి, గోపీచంద్, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు తిరుమల రామచంద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ, ఆవంత్స సోమసుందర్.. వీళ్ళంతా హితులు , సన్నిహితులు శిష్ ట్లా కి..

శిష్ ట్లా రచనలు రావటం ప్రారంభం అయ్యాక పూడిపెద్ది వెంకట రమణయ్య,  శ్రీశ్రీ, నారాయణ బాబు, పురిపండా అప్పలస్వామి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, కొడాలి ఆంజనేయులు వీళ్ళ రచనలు కొనసాగాయి.

“ తన కవిత తాను నిలుస్తుంది- ఎవరి పోటీ కర్ర ఊతం అక్కరలేదన్నాడు” శిష్ ట్లా. కవి కి తన మీద, తన కవిత్వం మీద తనకు ముందు నమ్మకం ఉండాలి. శిష్ ట్లా నుంచి ఏ కాలపు కవి అయినా నేర్చుకోవాల్సింది ఇదే.

శిష్ ట్లా కవిత్వాన్ని విశ్లేషించే శక్తి నాకుందో లేదో తెలియదు కానీ ఆయన ఈ కవిత మాత్రం నాకు నచ్చిన  కవిత. అలాగే ఆయన “ నవమి చిలుక” నా ఫేవరెట్.

ఇటు వెన్నెల                                                 అటు వెన్నెల

నడి శిరసు కు                                                శ్రీ వెన్నెల

ఇటువెన్నెల                                                   అటువెన్నెల

చిరునవ్వుల                                                    కలవెన్నెల

ఇటు వెన్నెల                                                   అటు వెన్నెల

విరులల్లిన                                                      జడ వెన్నెల

ఇటు వెన్నెల                                                  అటు వెన్నెల

చెంగల్వల                                                             జిగి వెన్నెల

 

ఇటు వెన్నెల                                                    అటు వెన్నెల

ఈశ్వరునికి                                                     తల వెన్నెల

ఇటు వెన్నెల                                                    అటు వెన్నెల

ఆకాశం                                                          మొల వెన్నెల

ఇటు వెన్నెల                                                    అటు వెన్నెల

మనసుల్లో                                                        మరు వెన్నెల

ఇటు వెన్నెల                                                     అటు వెన్నెల

ఎటు చూచిన                                                  కను వెన్నెల

ఇటు వెన్నెల                                                     అటు వెన్నెల

పిచ్చెత్తె వళ్ళంతా వెర్రెత్తె దిక్కులకై పరుగెత్తే నా మనసున

వెన్నెల్లో ప్రేయసి లేక

అమావాస్య!                        అమావాస్య!                  అమావాస్య!

మహాలయ అమావాస్య !

వెన్నెలలు వల్లెవాటు వేసి

వల్లెవాటు వేసి

యాదవ వల్లెవాటు వేసి

అష్టభార్యల కళలు ఏక కళయై

సీత చెంచీతయై

నిశీధ సౌందర్య మూర్తి యయై

వెన్నెలలు వల్లె వాటు వేయ

వల్లె వాటు వేయ

యాదవ వల్లెవాటు వేయ

మాధవుడనై – మత్స్యావతారి నైతి!

నా మన సవినాశియై

అ.. అ వినాశియయ్యే .. అవినాశి !

( ++++ అవినాశి! x x x x  )……..

ఇలా ఈ కవిత కొనసాగుతుంది.

పై కవిత మొదటి పాదాలు “ ఇటు వెన్నెల , అటు వెన్నెల “ అంటూ పైకి చదివినప్పుడు వెంటనే శ్రీశ్రీ కవితలు కొన్ని గుర్తొస్తాయి. అలాగే రెంటాల కవితలు కూడా. శిష్ ట్లా ప్రభావం ఆ నాటి , తర్వాత తరం నాటి కవుల మీద ఉందన్నది నిర్వివాదాంశం.

రాబోయే కొత్త కవిత్వ మార్గం నాదే అని ధీమా గా ప్రకటించాడు శిష్ ట్లా. శ్రీశ్రీ లాంటి వాళ్ళను ఎందుకు ఒప్పుకోరని నిలదీశాడు. కొండొకచో శారీరక దార్డ్యం కూడా చూపించాడని కథనం. శిష్ట్లా కవిత్వం , నవమి చిలుక లాంటి వచన రచనలతో పాటు ఆయన ప్రధాన కృషి ఆయన రాసిన సిపాయి కథలలొ బాగా కనిపిస్తుంది. తెలుగు కథ లో యుద్ధ నేపథ్యం ఆధారంగా, సైనికుల అనుభవాల ఆధారంగా వచ్చిన ఈ కథలు తెలుగు సాహిత్యాభిమానులు తప్పక చదవాల్సిన కథలు.

ఇంత విలక్షణమైన, ఆత్మ విశ్వాసం ఉన్న రచయిత ఎలా మరణించాడు అన్నది కూడా చర్చించారు. తాగి తాగి చనిపోయాడు అని తీర్మానించారు. ఆయన మరణం గురించి కానీ, ఆయన ఎన్నుకున్న జీవిత విధానం గురించి కానీ ఎవరికైనా ఎందుకు పేచీ ఉండాలి? ఆయన తాను విధించుకున్న రూల్స్ లో బతికాడు.

నన్ను ఇబ్బంది పెట్టె విషయం మాత్రం ఒక్కటే. శిష్ ట్లా ను చూసి అప్పటికే కవిత్వ రంగం లో ఉన్న వారు ఆయన గురించి, ఆయన రచనల గురించి ఎంతొ కొంత అభ్యంతరాలు పెట్టుకున్నారు. 1930 ల నుంచి కవిత్వం రాస్తూ , సాహిత్యం లో యాక్టివ్ గా ఉన్న శిష్ ట్లా కు ముద్దుకృష్ణ లాంటి వాళ్ళు “ వైతాళికులు” లో కనీస స్థానం కల్పించకపోవటం మాత్రం అన్యాయం. వైతాళికులు 1935 లో మొదట ప్రచురితమైంది. అప్పటికి శిష్ ట్లా కవిత్వ పుస్తకం అచ్చు కాలేదు కానీ 1930 నుంచి తన కవితలతో శిష్ ట్లా తెలుగు కవుల నోట బాగానే చర్చ కు వచ్చాడు. 1933 బరంపురం సభల్లో శిష్ ట్లా కవితల మీద జరిగిన చర్చలు కూడా ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా “ వైతాళికులు” లో శిష్ ట్లా కు స్థానం కలిపించకపోవటం కారణం ఊహించవచ్చు. కవులకు, కవిత్వానికి ఇలాంటి అన్యాయాలు చరిత్ర లో చాలానే జరిగాయి.

అయినా శిష్ ట్లా లాంటి అతి నవీన నవ్య కవిని , తన తరం తో పాటు మరో రెండు మూడు తరాల వారిని ప్రభావితం చేసిన శిష్ ట్లా ని  అలా అణగదొక్కేయడం ఎవరి తరం కాదని నా భావన. ఇప్పుడు శిష్ ట్లా ను ఇలా సిపాయి కథల ద్వారా, నవమి చిలుక , విష్ణు ధనువు లతో గుర్తు చెసుకోవటం అందుకే.

సాహిత్యం లో రౌడీ గా పేరు పడినా, డోంట్ కేర్ అన్నట్లు తనకు నచ్చిన విధంగా బతికాడు. తనకు నచ్చిన విధంగా రాశాడు.

అలాంటి   శిష్ ట్లా కోసం ఈ స్మరణ !!!

కల్పనారెంటాల

 

 

 

 

 

*

 

కల్పనా రెంటాల

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అయినా శిష్ ట్లా లాంటి అతి నవీన నవ్య కవిని , తన తరం తో పాటు మరో రెండు మూడు తరాల వారిని ప్రభావితం చేసిన శిష్ ట్లా ని అలా అణగదొక్కేయడం ఎవరి తరం కాదని నా భావన. ఇప్పుడు శిష్ ట్లా ను ఇలా సిపాయి కథల ద్వారా, నవమి చిలుక , విష్ణు ధనువు లతో గుర్తు చెసుకోవటం అందుకే.

    సాహిత్యం లో రౌడీ గా పేరు పడినా, డోంట్ కేర్ అన్నట్లు తనకు నచ్చిన విధంగా బతికాడు. తనకు నచ్చిన విధంగా రాశాడు.

    అలాంటి శిష్ ట్లా కోసం ఈ స్మరణ !!! చాలామంది పాఠకులకు తెలియని వారి గురించి చాలా వివరంగా రాశారు కల్పన గారు, ధన్యవాదలు & అభినందనలు

  • వారి సాహిత్యం తెలుసును కానీ వారి గురించి పెద్దగా తెలియదు. ఆ కోణంలో ఈ వ్యాసం విలువైనది. ధన్యవాదాలు కల్పన గారికి.

  • తెలుగు సాహితీ ఆకాశంలో ఎప్పుడో ఒకేసారి అలా మెరుపులా వచ్చిపోతుంది శిష్ట్లా ప్రస్తావన. ఇప్పటి వందల కవులకు ఆ మెరుపేమిటో కూడ తెలియదు. ఎప్పుడో.. నాలుగైదు ఏళ్ల కిందట.. బహుశా ఆయన కుమార్తె కాబోలు ఆయనకు సాహితీ లోకం అన్యాయం చేసిందని బాధపడ్డారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన్ని చూశాను.. మీ అక్షరాలలో. ఒక శిష్ట్లా, ఒక బైరాగి… ఇలా మరెందరో…
    కాలం పొరల్లోంచి సందర్భానుసారంగా నైనా ఆ మెరుపును మరోసారి చూపించినందుకు ధన్యవాదాలు

  • “ శిష్ట్లా ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా మంచాళ అగ్రహారంలో జన్మించారు. నవంబరు 2, 1909 జన్మదినం అని చెప్పబడుతున్నా ఆ తేదీపట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. 1953లో మరణించాడని చెప్పుకోవటం. అతని మరణం తేదీ, ఇతర వివరాలూ నిర్దుష్టంగా తెలీవు.

    బెనారస్ యూనివర్శిటీలో ఆంగ్లంలో ఎం.ఏ. పట్టా పుచ్చుకొన్నాడు. కొడవటిగంటి కుటుంబరావు, మాధవపెద్ది గోఖలేలకు బంధువు.

    శ్రీరంగం నారాయణబాబు, సభాపతి శివశంకరశాస్త్రి, ఆరుద్ర, సోమసుందర్, శ్రీశ్రీ వంటి వారిచే కవిగా శిష్ట్లా విరివిగా ప్రశంసలు పొందాడు; శ్రీశ్రీ కన్నా శిష్ట్లాయే గొప్ప కవి అని శివశంకరశాస్త్రిగారు, ఇతరులు అనేవారని వరద రాజేశ్వరరావు కథనం. గత శతాబ్దపు పూర్వార్థపు కవితా చరిత్ర తెలిసినవారు శిష్ట్లా ఉమామహేశ్వరరావుని “అతి నవ్యులలో అతి నవ్యు”నిగా, “వైచిత్రికీ, విచిత్ర ప్రయోగ పరతకీ పేరు మోసిన”వాడుగా కీర్తిస్తారు. ఇప్పుడు

    లభ్యం కాని శిష్ట్లా కవిత “మారో మారో మారో” (1928) మహాప్రస్థానం కవితకు ప్రోద్బలమని శ్రీశ్రీయే స్వయంగా చెప్పాడు.

    సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన 21తెలుగు కథలు 1947-48 మధ్య నెల్లూరునుండి వచ్చే జమీన్‌రైతు పత్రికలో కూడా వచ్చాయట. ఈ కథల్ని 1984లో కె.వి.రమణారెడ్డి గారు సంకలించగా విజయవాడ నవోదయా పబ్లిషర్స్ వారు ప్రచురించారు. స్వంత అనుభవాలను, చిన్న చిన్న సంఘటనలను మాండలికంలో చిన్న కథలుగా వ్రాయటం నామినితో మొదలయ్యిందని, నామిని బాటనే చాలామంది నడుస్తున్నారని వాడుకలో ఉన్న మాట. ఈ పని శిష్ట్లా ఉమామహేశ్వరరావు ఏనాడో చేశాడని తెలుస్తుంది ఈ కథలు చదివితే. “

    https://pustakam.net/?p=9267 డా. జంపాల వి. చౌదరి గారి వ్యాసం నుండి.

  • తెలుగు కవుల్లో ఓపెన్ గా “ గే “ గా ఎక్కువ మందికి తెలిసిన కవుల్లో శిష్ట్లా ఆద్యుడు గా చెప్పుకోవచ్చు. ఆయన సాహిత్యానికి, ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అప్పట్లో అదొక చర్చనీయాంశమే.

    ఇది కేవలం ఆరోపణ లేదా శ్రీశ్రీ చేసిన ప్రచారంగానే చెబుతారు కదండి, ఋజువులు లేకుండా మొదటి గే కవి అని ముద్ర వేయడం సమంజసం కాదేమో అనిపించింది. ఎక్కువ మందికి తెలుసు అని చెబుతున్నారు. ఆ విషయం ఎవరెవరో చెప్పారో చెప్పాల్సింది మీరు. ఆయన కవిత్వం గురించి కథల గురించి విశ్లేషణ కూడా పెద్దగా కనిపించలేదు వ్యాసంలో. అది చేయగలిగి ఉంటే కొత్త బావుండేదేమో

    • భాస్కర్ గారు, శిష్ ట్లా గే అని ఎవరు చెప్పారు అంటే .. వ్యాసం లో చెప్పినట్లు వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే ఆండీ. మా నాన్న గారి దగ్గర నుంచి విన్నాను.. అలాగే శిష్ ట్లా బుక్స్ రీ ప్రింట్ జరిగినప్పుడు హైదరాబాద్ మీటింగ్లో వక్తలు ( ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ సి. నారాయణ రెడ్డి , ప్రభృతులు ఆ వేదిక మీద ఉన్నారు, నాతో సహా) ప్రస్తావించారు. అందువల్ల మాత్రమే నేను రాశాను.

      ఇక ఇది శిష్ ట్లా సాహిత్య విమర్శ వ్యాసం కాదు ఆండీ. అందుకే ఈ వ్యాసం లో ఆయన రచనల గురించి చర్చించ లేదు. ఇది రెంటాల గోపాలకృష్ణ ( మా తండ్రి) గారి సాహిత్యజీవిత చరిత్ర. ఆయన మీద శిష్ ట్లా, శ్రీశ్రీ ల ప్రభావం ఉంటుంది అని విమర్శకులు చాలా మంది చెప్పారు కాబట్టి అందులో భాగం గా మాత్రమే మొదట శిష్ ట్లా గురించి, ఆ కాలం నాటి పరిషితుల గురించి రేఖా మాత్రం గా మాట్లాడాను.

      శిష్ ట్లా గే అవునా? కాదా? అనేది చర్చించాల్సిన విషయం కాదు ఆండీ నిజానికి. అయితే ఆ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఆయనకు రావాల్సిన పేరు రాకపోవటం లో, అలాగే వైతాళికుల్లో కూడా ఆయనకు స్థానం కల్పించకపోవటం వెనుక ఈ అంశం ఏమైనా ఉందేమో అన్న చిన్న సంశయం తో ప్రస్తావించాను. మీకు మరిన్ని వివరాలు తెలిస్తే తప్పకుండా ఇక్కడ షేర్ చేయండి. ఏదైనా సమాచారం తప్పు అయితే సరి దిద్దుకోవటానికి నేను సిద్ధం.

      యార్లగడ్డ రాఘవేంద్ర రావు గారు తమ కామెంట్ లో శిష్ ట్లా వాళ్ళ అమ్మాయి గురించి ప్రస్తావించారు. వారి కుటుంబ వివరాలు నాకు తెలియదు. నేను ఇలా రాయటం వారి కుటుంబాన్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందనుకుంటే ఈ విషయాల్ని వ్యాసం నుంచి పరిహరించటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.

      కల్పనారెంటాల

      • కల్పన గారు ధన్యవాదాలు. అవి అతని వ్యక్తిగత విషయంపైన ఆరోపితమైనమాటలు లేదా ప్రచారంలోకి తీసుకురాబడ్డమాటలుగానే చూడటం మంచిదేమో ఆలోచించండి. దీన్ని బయటేసి, పదిమంది నోళ్లలో నానేట్లు చేసింది శ్రీశ్రీ అనే చెబుతారు కొంతమంది. మనం ఎవరినుంచైతే కాపీ చేస్తామో లేదా అనుసరిస్తామో వాళ్లను క్షమించలేం అని తెలుగులో చలం అన్నట్లు, శ్రీశ్రీ శిష్ట్లా విషయంలో వ్యవహరించారేమో అనిపిస్తుంది. శ్రీశ్రీ దీనికి వివరణ ఇచ్చారనే అనుకుంటా. శిష్ట్లా పట్ల శ్రీ శ్రీ కి ఉండే గిల్ట్ అతని కలలో వ్యక్తమైనట్లు మనం శ్రీ శ్రీ మాటల్లోని చదవచ్చు. ఆ కలను కొంచెం విస్తృతంగా అధ్యయనం చేయగలిగితే శిష్ట్లాను మరికొంత అర్థం చేసుకోగలమేమో. ఆయనకు ఆయన గే అని ప్రకటించుకుంటే ఓకే, అలా కాకుండా విన్నవాటితో మీరు ఆ మాట వాడటం ఎందుకో సరైంది కాదు అనిపించింది. ఆరుద్ర కూడా దాన్ని బలంగా చెప్పలేదు దాన్ని. శ్రీశ్రీ మాటల్లోనే చెప్పినట్లున్న్నారు. ఓకే అండి అది ఉంచాలా వద్దా అనేది మీ నిర్ణయం, కాని తొలి గే కవి అనే హోదా మాత్రం ఓ సంశయజ్ఞానంతో నిర్థారించేమాట ఆయన్ను అలానే నిలపాలనే ప్రయత్నానికి తప్ప కవిగా ఆయనకు చేసే మేలు ఏమీ లేదు. ఆయన వ్యక్తిత్వం కొంతైనా తెలుసుకోవడానికి మనకు ఉండే దగ్గరదారి ఆయన పుస్తకాలు మాత్రమేనేమో. థాంక్యూ అండి

  • ” అబ్బూరి రామకృష్ణారావులాంటి కవి పండిత విమర్శకుడు శిష్‌ట్లా ధోరణిని ”కవిత్వంలో రౌడీవేషం”గా లెక్కగట్టి తీసిపారేశారని వరద రాజేశ్వరరావు రాశారు.

    తల్లావజ్ఘల శివశంకర శాస్త్రి మాత్రం ”అతి నవీనమార్గంలో అన్నివిధాలా వెళ్ళుతున్నవాడు ఇతనే”నని తీర్మానించారు.

    ”ఈ కవికి అనంతమైన కవితాశక్తి ఉం”దని వెన్నుతట్టి ప్రోత్సహించారు విశ్వనాథ సత్యనారాయణ.

    శిష్‌ట్లాను భావకవిత్వం మీద విప్లవం తీసుకొస్తున్న వైతాళికుడిగా పరిగణించిన గోపీచంద్‌ ”పూర్వ వాసనలను పోగొట్టుకుంటే గాని సిసలైన ప్రోలిటేరియన్‌ కవిత్వం రాదు. గమనించగోరుతా”నని మృదువుగా హెచ్చరించారు.

    ఆచార్య కురుగంటి సీతారామ భట్టాచార్యులవారూ, పిల్లలమర్రి వేంకటహనుమంతరావుగారూ ఉమ్మడిగా నిర్మించిన ‘నవ్యాంధ్ర సాహిత్యవీధు’లలో శిష్‌ట్లాకి ప్రత్యేక ప్రాముఖ్యం లభించింది.

    ‘బోర విరుచుకు తిరుగుతున్న అతి నవీనులకు కూడా నవీను”డని శిష్‌ట్లాను శ్రీరంగం నారాయణబాబు అభివర్ణించారు.

    అన్నివర్గాల చేత మహాకవిగా ఆరతులందుకున్న శ్రీరంగం శ్రీనివాసరావు శిష్‌ట్లా పట్ల తన వైరభావాన్ని కడదాకా కొనసాగిస్తూనే వచ్చారు.

    శిష్‌ట్లాకు చరిత్రలో జరిగిపోయిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఆరుద్ర ఎంతో శ్రమించారు. ఉమామహేశ్వరరావ్‌ది ‘సొంత గొంతుకే కానీ వింత గొంతుక’ అన్నది ఆరుద్ర తీర్పు.

    వచన కవితా పితామహుడనిపించుకున్న కుందుర్తి ఆంజనేయులు ”వచన కవితకు ఆద్యుడుగా శిష్‌ట్లానే చెప్పుకోవా”లన్నారు.

    ప్రముఖ కవి డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ కష్టపడి సేకరించి, జాగ్రత్తపెట్టిన ‘విష్ణుధనువు’ కాపీని ఎనభయిదశకం చివర్లో ఒకానొక పత్రికకు అందచేస్తే తప్ప శిష్‌ట్లా కవిత రూపరేఖావిలాసాలు తిలకించే భాగ్యం ఈ తరం పాఠకులకు దక్కనేలేదు. ”

    https://telugu.oneindia.com/sahiti/essay/2004/sistla.html

  • ” కవిత్వంలో రౌడీ వేషం ” ~ అబ్బూరి వరదరాజేశ్వర రావు

    “దాగుడు మూత పడ వీమనస్సంచారములు
    కత్తెర పెట్టినన్‌ తెగవు. ఎక్కడ కేగుచుంటిరని
    పోవునపు డడిగిన నవి పక పక నవ్వు. అక్కడ
    ఏమి చేసితిరన సిగ్గుచే లోనికి
    జొత్తురు. వెంటనే యుప్పెన వచ్చినట్టు మహా
    ర్నవమి పిల్లలవలె అల్రరిచేతురు…. “ ~ శిష్ట్లా ( 1933 )

    నేను చూపించిన శిష్ట్లా పద్యం చదివి ” కవిత్వంలో వీడిది రౌడీ వేషంలా ఉందిరా ” అన్నారు నవ్వుతూ మా నాన్నగారు అబ్బురి రామకృష్ణారావు గారు.

    శిష్ట్లా ఉమామహేశ్వరరావుకి తెలుగు సాహిత్యంలో సముచిత స్టానం లేకపోలేదు. అతను రాసిన ఒకటి, రెండు గీతాలు కలకాలం చెప్పుకోదగ్గవి. అందులో “ జ్ఞాపకాలు” అన్న గీతం “ వెర్స్ లిబ్ర్‌ “లో తలమానికంలాంటిది Vers libre, (French: “free verse”), 19th-century poetic innovation that liberated French poetry from its traditional prosodic rules. In vers libre, the basic metrical unit is the phrase rather than a line of a fixed number of syllables, as was traditional in French versification since the Middle Ages. It does not use consistent metre patterns, rhyme, or any musical pattern. It thus tends to follow the rhythm of natural speech.

    ” జ్ఞాపకాలు ” ~ శిష్ట్లా

    నా పేరు లీల!
    ఆ ఊరిగోల పడలేక నేను పొరుగూరొ
    చ్చాను! అందాలవాడే అడవిలో ముం
    చాడు; అందరిని తలచుకొని అల్లాడు
    చున్నాను.

    అది ( “ జ్ఞాపకాలు” గీతం ) చదువుతున్నప్పుడల్లా “ఎజ్రాపొండ్‌” గుర్తుకు రాకమానడు. ఉమామహేశ్వరరావు నాతోనూ, బెల్లంకొండ రామదాసుతోనూ ( 1940 సం|| మద్రాసులో ) కలిసి వున్న రోజుల్లో ఈ గేయాన్ని తరచు పాడుతుండేవాడు. గుండె కదిలి కరిగిపోయేది. అమాంతం ఒళ్ళు కంపించేది. ఇప్పటికీ అ పాటా, అతని గానమాధుర్యమూ నాకు స్పురణకు వస్తుంటాయి. ” ~ కవనకుతూవాలం అన్న గ్రంధం నుండి

    ( ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు ).

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు