రాజువయ్యా మహారాజువయ్యా!

కరోనా కహానీలు-2

ఎందుకో అతనికి వొళ్ళు టివటివ లాడుతోంది.

అంతకన్నా ముందు వొళ్ళంతా పట్టేసినట్టుంది. పులిసినట్టుగా కూడా వుంది. ఇంకా చెప్పాలంటే యెవర్నన్నా తంతే బాగుణ్ణు అన్నట్టుగా వుంది. కనీసం యెవరితోనన్నా తన్నులు కాసినా బాగుణ్ణు అన్నట్టుగా కూడా వుంది. రెండు చేతులూ యెత్తి పట్లు విరిచాడు. వెన్ను వొంచాడు. కాళ్ళూ చాపాడు. కీళ్ళూ వొంచాడు. ఒళ్ళు విరిచాడు.

ఊహూ…

ప్చ్!

తీరినట్టు లేదు.

“అలా వొడ్డు మీద పడ్డ చేపలా నులుసుకోకపోతే, యెక్సరసైజులు యేవో చెయ్యరాదా?”

ఊ అనలేదు. ఆ అనలేదు.

ఉనుగులు అనలేదు. జునుగులు అనలేదు.

కూర్చున్న చోట కూర్చోలేకపోయాడు. నిల్చున్న చోట నిల్చోలేకపోయాడు. కాలుగాలిన పిల్లిలా తిరిగాడు. ఆపసోపాలు పడుతున్నాడు.

“అలా నెలలు నిండిన దానిలాగ నొప్పులు పడకపోతే యేమి? యింటి పని పనికాదా? పనిల చెయ్యెట్టరాదా?”

చెవికి కాదు కదా, చెవిలోని వెంట్రుక్కి యెక్కలేదు.

చెవిలోని గులిమికి కూడా యెక్కలేదు.

నులుసుకున్నాడు.

పిలిచి పక్కింటాయనతో గొడవ పడదామనుకున్నాడు.

వాడు వాళ్ళావిడ ముందూ ఆఫీసు బాసు ముందూ నోరెత్తడని తెలిసి వూరుకున్నాడు. అలాగని వూరుకోక వుండలేక కయ్యానికి కాలు దువ్వాడు.

“వొంటికి దూలగొండాకు రాసుకున్నట్టు యెందుకు యెర్రెక్కి పోతున్నావు, రా నాతో తగువులు పడు”

వద్దనుకున్నాడు.

మాపిటికి గెంజి వుండదనుకున్నాడు.

ఉసూరుమన్నాడు. ఈసురోమన్నాడు.

“పనిలేని మంగలోడు పిల్లిబుర్ర గొరిగినాడని… నీకా పనీ లేదు – బతుకూ లేదు”

వెతికినాడు.

పిల్లిని పట్టుకున్నాడు.

అడ్డాల్లో కూర్చోబెట్టుకొని బుదరించి రేజరుతో నున్నగ గుండు గీసినాడు.

మ్యావ్ మ్యావ్…

ఒంట్లోని సలుపు తీరలేదు.

“ఎల్లిరా రోడ్డు మీదకి… వేడినీళ్ళు పెడతాను, వొస్తే కాపడం పెడతాను”

విసిగిన గొంతు విని ముఖంలోకి వెలుగొచ్చింది.

వొంట్లోకి సత్తువొచ్చింది.

ఇంట్లోంచి యెగిరి వీధిలోకి దూకాడు.

రయ్ రయ్ మని బండేసుకు రోడ్డెక్కాడు.

లాఠీకన్నా ముందు మైకు అడ్డంపడి అడిగింది.

“ఆశీర్వాద్ ఆటా కోసం”

ఐడీ కార్డు చూసి ‘మీరు మూడు కిలోమీటర్లు దాటి రాకూడదు, అలాంటిది యేడు కిలోమీటర్లు దాటి వచ్చారు’ అని గుర్తు చేసింది.

వదిలితే హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళి కొనుక్కురానూ- అనుకున్నాడు.

మైకుని దాటితే మళ్ళీ లాఠీ అడ్డంపడింది.

లేదు, నడ్డి కింద కడ్డీ పడినట్టు పడింది.

ఇదివరకే యెరిగిన ముఖం కాబట్టి అడగను కూడా అడగలేదు. వొడ్డించేసాడు. దోరదోరగ.

పిర్రలు పేలి పోయాయి.

పిగిలిన మామిడి పళ్ళయిపోయాయి.

“ఈ యెండాకాలానికి యివే మామిడి పళ్ళు… చూసి ఆనందించడమే”

అమ్మా అన్నాడు. అబ్బా అన్నాడు.

అబజబజబ్బా అన్నాడు.

“కరోనా కాలం… కదలకురా మొగుడా అంటే విన్నావా?”

కాపడం పెట్టింది.

నాల్రోజులకు నొప్పులు యెగిరి పోయాయి.

ఒంట్లో కొవ్వు కువకువ లాడింది.

కథ మళ్ళీ మొదటికొచ్చింది.

నొప్పులు పడ్డాడు.

అర్థం చేసుకుంది.

“ఎల్లిరా రోడ్డు మీదకి… వేడినీళ్ళు పెడతాను, వొస్తే కాపడం పెడతాను”

విసిగిన గొంతు విని ముఖంలోకి వెలుగొచ్చింది.

వొంట్లోకి సత్తువొచ్చింది.

ఇంట్లోంచి యెగిరి వీధిలోకి దూకాడు.

రయ్ రయ్ మని బండేసుకు రోడ్డెక్కాడు.

లాఠీకన్నా ముందు మైకు అడ్డంపడి అడిగింది.

“టాటా సాల్ట్ కోసం”

‘మీరున్న చోట వుప్పు కూడా దొరకలేదా?’ అడిగారు.

బ్రాండ్ అన్నాడు.

బ్రాండ్ అంబాసిడర్ని- అనుకున్నాడు.

ఏదిపడితే అదివాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడు.

మైకుని దాటితే మళ్ళీ లాఠీ అడ్డం పడింది.

లేదు, పిర్రల మీద అడ్డ దిడ్డంగా పడింది.

బండి సీజయిపోయింది.

కుంటుకుంటూ యిల్లు చేరాడు.

“బండి కూడా పోయింది… మంచి పనయ్యింది”

కాపడం పెట్టింది.

దేవుడా బతుకుజీవుడా అన్నాడు.

నాల్రోజులకు నొప్పులు యిగిరి పోయాయి.

ఒంట్లో కొవ్వు రవరవ లాడింది.

కథ యెక్కడ మొదలయ్యిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది.

నొప్పులు పడ్డాడు.

అర్థం చేసుకుంది.

“ఎల్లిరా రోడ్డు మీదకి… వేడినీళ్ళు పెడతాను, వొస్తే కాపడం పెడతాను”

విసిగిన గొంతు విని ముఖంలోకి వెలుగొచ్చింది.

వొంట్లోకి సత్తువొచ్చింది.

ఇంట్లోంచి యెగిరి వీధిలోకి దూకాడు.

కుంటుకుంటూ రోడ్డెక్కాడు. కాళ్ళకి చక్రాలు మొలిసాయి.

లాఠీకన్నా ముందు మైకు అడ్డంపడి అడిగింది.

“పేరా చూట్ కొబ్బరి నూనె కోసం”

‘మీరున్న యేరియాలో నూనె కూడా దొరకలేదు, బ్రాండు వాడకపోతే జుట్టూడిపోతుంది’ అన్నది.

యా అన్నాడు. యా యా అన్నాడు.

గాటిట్ అనికూడా అన్నాడు.

మైకుని దాటితే మళ్ళీ లాఠీ తనపని తాను చేసుకుపోయింది.

పిర్రలు పళ్ళు కాదు పుల్లు అయిపోయాయి.

దేక్కుంటూ యిల్లు చేరాడు. విరిగిన చక్రాల బండిలాగ చేరాడు.

“ఇప్పటికే వాట్సప్ వీడియోల్లో వైరల్ అయిపోయారు… యికనైనా ఆపుదురు”

కాపడం పెట్టే వీలు లేక ఆయింట్మెంటు రాసింది.

పుల్లు తొక్కుగట్టాయి.

ఏ మూలో దాగిన కొవ్వు కండగట్టింది.

కథ ముగియకముందే మొదలయ్యింది.

నులుసుకున్నాడు.

నొప్పులు పడ్డాడు.

అర్థం చేసుకుంది.

“ఎల్లిరా రోడ్డు మీదకి… వేడినీళ్ళు పెడతాను, వొస్తే కాపడం పెడతాను”

అవసరం లేదన్నాడు.

అగత్యం రాదన్నాడు.

రాజులా కదిలాడు. మహారాజులా కదిలాడు.

ఇంట్లోంచి యెగిరి వీధిలోకి దూకాడు.

రయ్ మని రోడ్డెక్కాడు.

రాజు వెడలె రవి తేజములలరగ.

లాఠీకన్నా ముందు మైకు అడ్డం పడి అడిగింది.

“మందు కోసం”

‘మీరు రెడ్ జోన్లో వున్నారు’ అన్నది.

మాకన్నీ గ్రీన్ జోన్లే అన్నాడు.

ఎవ్వర్ గ్రీన్- అనుకున్నాడు.

మైకుని దాటితే మళ్ళీ లాఠీ తనపని తాను చేసుకోలేకపోయింది.

“వైన్ కోసం”

కనిపించిన మూడు సింహాలతో పాటు కనిపించని నాల్గో సింహం కూడా సెల్యూట్ చేసింది. రాజముద్ర వేసింది.

స్వాగతం పలికి దారిచ్చింది.

ఒంటరితనం పోయి గుంపయిపోయాడు. మంది మీద పడ్డాడు. మందిలో కలిసాడు. రాసుకున్నాడు. పూసుకున్నాడు. వేసుకున్నాడు.

ఊక్కుంటూ వూసుకుంటూ యిల్లు చేరాడు.

వేడినీళ్ళని కాలితో తన్నాడు. ఆయింట్మెంటుని అవతలికి విసిరేసాడు.

“నాకేం నొప్పుల్లేవ్… లేవ్ లేవ్…”

అడ్డు తప్పుకుంది ఆమె.

ఆనందంగా ఫేంటు విప్పి చూపించాడు.

కళ్ళు పులుముకు చూసింది.

ఆశ్చర్యం.

పిర్రల మీద దేశ చిత్రపటం!

ఆమె చేతులు జోడించి నమస్కరించింది!!

*

 

బమ్మిడి జగదీశ్వరరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది.రాజ్య స్వభావం ఎలావుంటుందో స్పష్టంగా వుంది.. చివరి జలక్…. బలవంతపు దేశభక్తి ప్రకటీంచక తఫ్పని స్థితి గుర్తు చేసింది.
    మొదటి ఘటనలు ఎక్కువ కొంత ఫోర్సు తగ్గినట్టనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు