మై హీరో ముళ్ళపూడి రవణ..

“కానుక” ….ముళ్ళపూడి సాహిత్యం మీద ఎంవీయెల్ సమగ్ర పరిశోధన..ఎంవీయెల్ గారి అమ్మాయి అనురాధ చదివిన “కానుక” ఇది!

మృదు స్వభావం, కళారాధన, సాహిత్యం మీద గౌరవం, సంగీతం మీద ఇష్టం, పాడే అభిరుచి, బాపూ రమణల మీద ప్రేమ, బుడుగంటే పిచ్చి ఇష్టం, అన్నిటినీ మించి తన ప్రతి కదలికలోనూ, వేసే అడుగులోనూ “ఎంవీయెల్ గారి అబ్బాయిని ” అనే ఐడెంటిటీ !

తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న “పన్” రామ్ సొంతం. ఏ చిన్న ఇష్యూ మీద  అయినా సరే , పన్ లతో పెన్ను చేసుకుని క్షణాల్లో పదాలల్లి పాటో పద్యమో మన ముందు ఉంచుతారు.

ఎక్కడో యూరప్ లో నార్వేలో ఉంటూ తెలుగు నేలకు దూరమైనా, సాహిత్యం ద్వారా, వాళ్ల నాన్నగారిని నిత్యం వెదుక్కునే క్రమం ద్వారా రామ్ గుండె ఎప్పుడూ నూజివీడు పరిసరాల్లోనే కొట్టుకుంటూ చివరి వరకూ తిరిగింది.

ముళ్ళపూడి సాహిత్యం మీద ఎంవీయెల్ చేసిన సమగ్ర పరిశోధన “కానుక”

దాన్ని తనే చదివి ఆడియో బుక్ గా అందించాలని రామ్ ప్రసాద్ ఎంతో తపించారు. నాతో అన్నారు కూడా

“మీరు తరచూ రాయాలి. ఇంత “పన్” తో రాసే వాళ్ళు ఇపుడు ఎవరూ లేరు” అని దబాయిస్తే “రాద్దాం రాద్దాం” అంటూనే, రాయని రాముడై తిరిగి రాని చోటికి తరలి పోయారు.

ఆయన సోదరి అనూరాధ, ఎంవీయెల్ గారి అమ్మాయి, చెట్టంత తమ్ముడిని పోగొట్టుకుని కడివెడు దుఃఖాన్ని మోస్తూ, తమ్ముడు చేయాలనుకుని చేయలేక పోయిన పనిని ఆయన కోసం తను తలకెత్తుకున్నారు.

చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళిద్దరూ, ఒకరికొకరు అండగా కొమ్మకు పూసిన పూలల్లే రామ్ చివరి రోజు వరకూ ఒకే ఆత్మగా కలిసున్నారు.

-సుజాత వేల్పూరి

అనురాధ చదివిన “కానుక” ఇది!

 

Kaanuka Final

 

అనురాధ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది అనూరాధ స్వరంలో స్పష్టత, గద్గత, ఆర్ద్రత ప్రస్పుటమైనాయి. రమణ ను రవణ గా పలకటం లో ఆంతర్యం అర్ధంకాలేదు…. ముళ్ళపూడి వెంకట రమణ గారి జీవిత యాత్రను వింటుంటే ఈ కాలంలో అలా కష్టపడి, తనదంటూ ఓ ప్రత్యేక ఒరవడి కూర్చుకునే రచయితలు వున్నారా అనిపిస్తోంది. ఎంతసేపు కాపీలు, అనువాదాలే…. రామ్ ప్రసాదు కూడా అందుకేనేమో ఈ కాపీ కలియుగ ప్రపంచంలో ఇమడలేక అర్దాయుష్షుతోనే తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఈ ఆడియో విడుదలకు మీరు చేసిన కృషికి బహుపరాక్. ధన్యోస్మి🙏💐😊

  • చెట్టంత తమ్ముడు రామ్ ప్రసాద్ ని పోగొట్టుకుని కడివెడు దుఃఖాన్ని మోస్తూ, తమ్ముడు చేయాలనుకుని చేయలేక పోయిన పనిని ( ఎమ్మీయల్ గారి “కానుక” పుస్తకాన్ని ఆడియో బుక్ గా అందించే పనిని ) ఆయన కోసం తలకెత్తుకున్న ఎంవీయెల్ గారి అమ్మాయి అనూరాధ గారికి హృదయపూర్వక కృతజ్నతలు.

    ” ముళ్లపూడి భాయి జాన్సన్ కి ఎమ్మీయల్ సెబాస్వెల్ ” అని ఆరుద్ర గారు మెచ్చిన ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యంపై ఎమ్మీయల్ సమగ్ర పరిశోధన ” కానుక ” 1973 వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రచురించారు. నలభై ఏళ్ల ఒక తెలుగు రచయిత (ముళ్లపూడి) సాహిత్యం పైన ముప్పై ఏళ్ల మరో తెలుగు రచయిత (ఎమ్మీయల్) పరిశోధన చేయటం అరుదైన విషయం. యీ కానుక లో ముళ్లపూడి సాహిత్యంపై ఎమ్మీయల్ అందమైన, లోతైన విశ్లేషణ సాహిత్యంలో సౌందర్యం ఎలా ఆస్వాదించాలో అన్న కోణంలో కూడా ఆవిష్కరిస్తుంది. ” ముత్యాల ముగ్గు” చిత్ర నిర్మాతగా, యువజ్యోతి శీర్షిక నిర్వాహకులుగా ప్రసిద్దులు, వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకులు ఎమ్మీయల్. యీ ” కానుక ” విశిష్ట రచన ఎమ్మీయల్ గారి డెబ్భై అయిదవ జయంతి ( 1944 – 1986 ) కానుకగా కొత్త తరానికి అందించారు ఎమ్మీయల్ సాహితీ సమాఖ్య, నూజివీడు వారు.

    ” కానుక ” ప్రింటు పుస్తకం నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైద్రాబాదు లో లభ్యం
    https://www.telugubooks.in/products/kanuka?_pos=4&_sid=e66910ad7&_ss=r

  • ఎమ్మీయల్ గారి అరుదైన ఫొటోలు చేర్చిన “కానుక” పుస్తకం మూడవ ముద్రణ ( సెప్టెంబర్, 2019 ముద్రణ ) PDF కాపీని యీ వ్యాసంతో జతచేసి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కలిగించి నందుకు కృతజ్నతలు.

    ఎంవీయెల్ గారి అమ్మాయి అనురాధ గారు చదివిన “కానుక” ఆడియో ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పి పుణ్యం మూటకట్టుకోరా సుజాత గారూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు