విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన మొయిద శ్రీనివాసరావు ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న సున్నితమైన భావజాలమున్న కవి, రచయిత, అనువాదకుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (ఆంగ్ల సాహిత్యం) పూర్తిచేసిన వీరు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమవుతూనే, ప్రవృత్తిగా అక్షర సేద్యం చేస్తున్నారు.
బాల్యంలో జ్యూట్ మిల్లు కార్మికుడైన తండ్రి జీవన పోరాటాన్ని, మిల్లుల సమ్మెలు, లాకౌట్ల తాలూకు ఆకలి కేకలను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యం వల్ల వీరి రచనల్లో శ్రామిక వర్గ అనుకూల దృక్కోణం, సహజమైన సామాజిక స్పృహ బలంగా వ్యక్తమవుతాయి. సమాజపు అట్టడుగు పొరల జీవన వేదనను ఆర్ద్రంగా చిత్రించడం వీరి ప్రత్యేకత.
సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వీరు ఇప్పటివరకు రెండు కవితా సంపుటాలను వెలువరించి పాఠకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కథారచనలోనూ సిద్ధహస్తులైన వీరి కథా సంపుటి త్వరలోనే వెలుగుచూడబోతోంది. కేవలం స్వీయ రచనలకే పరిమితం కాకుండా, ఇతర భాషల్లోని ఉత్తమ సాహిత్య భావనలను తెలుగు పాఠకులకు చేరువ చేయాలనే తపనతో దాదాపు 30కి పైగా విశిష్ట కవితలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు; ఈ అనువాద కవితల సంపుటి కూడా త్వరలోనే పాఠకుల ముందుకు రానుంది. తరగతి గదిలో అక్షరాలు దిద్దించే గురువుగా, సమాజపు అంతరంగాన్ని ఆవిష్కరించే సృజనకారుడిగా శ్రీనివాసరావు సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నారు. ఇటీవల తను రాసిన కవిత “రెండు కాలాల మధ్య” పై విశ్లేషణ ‘సారంగ’ పాఠకులకు ప్రత్యేకం.
రెండు కాలాల మధ్య
ప్రతీ రాత్రి…
రెండు కాలాల మధ్య
నేను నిద్రిస్తాను
ఒక కాలం నన్ను కంటే
వేరొకదానిని నేను కన్నాను
ఒకటి ఆసరాకోసం
నాపై చేయివేస్తుంది
వేరొకటి అధికారంతో
నాపై కాలేసి నిద్రపోతుంది
ఒకటి రాత్రంతా
ఖణేల్మని దగ్గుతుంటే
మట్టిలోంచి వేరు తెగిన
శబ్దం వినిపిస్తుంది
వేరొకటి సన్నగా శ్వాసిస్తుంటే
ఓ చిగురుటాకు చిగురిస్తున్న
చప్పుడొస్తుంది
ఆ రెండింటి మధ్య మౌనంగా
వర్తమాన వాక్యంలా
రాత్రంతా… మెలకువగా
నేను నిద్రపోతుంటాను
-మొయిద శ్రీనివాసరావు
పై కవితలోని ప్రధాన వస్తువు కుటుంబ వ్యవస్థలో ‘మధ్యతరం’ మోసే అంతులేని బాధ్యతల, భావోద్వేగాల బరువు. కాలమంటే గడియారపు ముల్లు కాదని, అది రక్తం పంచుకుపుట్టిన సజీవ శరీరాల స్పర్శ అనేదే ఈ కవితలో సారాంశం.
“ఒక కాలం నన్ను కంటే
వేరొకదానిని నేను కన్నాను”
అన్న ప్రాణప్రదమైన వాక్యంతో కవి కాలమనే అమూర్త భావనను పేగుబంధపు మూర్తిమత్వంలోకి మార్చేశారు. తనను కన్న తల్లిదండ్రులు ఒక కాలమైతే, తాను కన్న బిడ్డ మరొక కాలం; తాను ఆ రెండు కాలాల సంధిబిందువునని చెప్పడం ద్వారా కాలానికీ, మానవ సంబంధాలకూ మధ్య ఉన్న అవినాభావ బంధాన్ని ఒక్క వాక్యంలో బంధించారు. ఈ రెండు జీవన ప్రవాహాల నడుమ నలిగిపోతూనే నిలబడే ఒక మధ్యతరగతి మనిషి ఆంతరంగిక వేదన, బాధ్యతలే ఈ కవితకు ప్రాణాధారమైన వస్తువు.
ఈ తాత్విక నేపథ్యం నుంచి కవి మనల్ని నేరుగా ఒక మంచం మీది స్పర్శల వైరుధ్యంలోకి తీసుకెళ్తారు.
“ఒకటి ఆసరాకోసం నాపై చేయివేస్తుంది
వేరొకటి అధికారంతో
నాపై కాలేసి నిద్రపోతుంది”
అన్న వాక్యాలలో స్పర్శల వెనుక ఉన్న మానసిక స్థితిని అత్యంత సూక్ష్మంగా ఆవిష్కరించారు. వయసుడిగి పట్టు తప్పుతున్న పాత కాలానికి వర్తమానమే ఊతకర్ర కావాలన్న ఆర్తి ఆ చేతి స్పర్శలో ఉంటే; భవిష్యత్తుగా ఎదుగుతున్న కొత్త కాలానికి వర్తమానంపై సర్వహక్కులూ తనవేనన్న అమాయకపు ధీమా ఆ కాలి స్పర్శలో కనిపిస్తుంది. ఒకరి అస్తిత్వానికి తాను ఆధారమైతే, మరొకరి ఎదుగుదలకు తాను పునాదిగా మారే ఈ స్పర్శల వైరుధ్యం ఒక అనివార్యమైన బాధ్యతా భారాన్ని కళ్ళకు కడుతుంది.
ఈ శారీరక స్పర్శల బరువు రాత్రివేళ క్రమంగా రెండు పరస్పర విరుద్ధమైన శబ్దాల ద్వంద్వంలోకి విస్తరిస్తుంది.
“ఒకటి రాత్రంతా ఖణేల్మని దగ్గుతుంటే
మట్టిలోంచి వేరు తెగిన శబ్దం వినిపిస్తుంది”
అన్న వాక్యాలు కవిత మొత్తానికీ అత్యున్నతమైన భావోద్వేగ కేంద్రాలు. రాత్రివేళ వినిపించే వృద్ధాప్యపు దగ్గును సాధారణ శబ్దంగా కాక, నేలలోంచి క్రమంగా పట్టు కోల్పోతూ ‘తల్లి వేరు’ తెగుతున్న చప్పుడుగా చిత్రించడం కవి ప్రతిభకు పరాకాష్ట. ఈ వేదనకు సమాంతరంగా;
“వేరొకటి సన్నగా శ్వాసిస్తుంటే
ఓ చిగురుటాకు చిగురిస్తున్న చప్పుడొస్తుంది”
అంటూ పక్కనే పసిపాప తీసే లేత శ్వాసను ఒక కొత్త చిగురుటాకు విచ్చుకుంటున్న నిశ్శబ్ద జీవనోత్సవంగా మలిచారు. ఒకవైపు వేరు తెగుతున్న శూన్యం, మరోవైపు చిగురు తొడుగుతున్న పూర్ణత్వం… ఈ రెండింటి శబ్ద చిత్రణ ద్వారా జీవిత చక్రపు లయను, పుట్టుక-ముగింపుల వైరుధ్యాన్ని కవి పాఠకుడికి అనుభవంలోకి తెస్తారు.
ఇలా ఒకవైపు ముగిసిపోతున్న గతాన్ని, మరోవైపు మొగ్గ తొడుగుతున్న భవిష్యత్తును తన రెండు భుజాలపైనా మోస్తూ వర్తమాన మనిషి ఏకాకిగా నిలబడతాడు. అందుకే కవితను;
“ఆ రెండింటి మధ్య మౌనంగా
వర్తమాన వాక్యంలా
రాత్రంతా… మెలకువగా
నేను నిద్రపోతుంటాను”
అని ముగిస్తారు. తాను కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, గతాన్నీ భవిష్యత్తునూ కలిపి ఒక సంపూర్ణార్థాన్ని ఇచ్చే ‘వర్తమాన వాక్యం’నని ప్రకటించుకోవడం అందమైన అభివ్యక్తి.
తల్లి వేరు ఎక్కడ తెగిపోతుందోనన్న ఆందోళన, లేత చిగురు ఎలా ఎదుగుతుందోనన్న బాధ్యత రెండూ కలిసి అతడి నిద్రను ‘మెలకువగల నిద్ర’గా మారుస్తాయి. మధ్యతరం అనుభవించే ఈ మూగ వేదనను, కాలం మనుషుల రూపంలో పక్కనే పడుకునే జీవన సత్యాన్ని ఈ కవితలో అత్యున్నత తాత్విక స్థాయిలో చిత్రించబడింది.
అయితే, అనుభూతి ప్రధానంగా సాగిన ఈ కవితలో కొన్ని శిల్పపరమైన సూక్ష్మ లోపాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా దగ్గులోని ‘ఖణేల్’ అనే శబ్దానికి సమాంతరంగా పసిబిడ్డ సన్నని శ్వాసను పోల్చే క్రమంలో “చిగురుటాకు చిగురిస్తున్న చప్పుడొస్తుంది” అనడం భావాన్వయ లోపంగా అనిపిస్తుంది; ఎందుకంటే చిగురించడం అనేది నిశ్శబ్ద జీవన ప్రక్రియే తప్ప శ్రవ్య బింబం (Auditory image) కాదు. అలాగే ‘చిగురుటాకు-చిగురిస్తున్న’ అనే పదాల పునరుక్తి కూడా వాక్య సౌందర్యాన్ని కొంత తగ్గించింది. అందుచేత ‘చిగురుటాకు విచ్చుకుంటున్న స్పర్శ తెలుస్తుంది’ లేదా ‘లేత చిగురు తొడుగుతున్న లయ తెలుస్తుంది’ అని వాడితే పునరుక్తి పోవడమే కాక ఇంద్రియ జ్ఞాన వైరుధ్యం తొలగిపోతుంది. అయినప్పటికీ, ఇలాంటి చిన్నపాటి శిల్ప పరిమితులను అధిగమించి, మధ్యతరపు జీవన వేదనను గుండెలకు హత్తుకునేలా చేయడంలో కవి సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు.
*








విశ్లేషణ బావుంది
సార్ కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. కవితపై సమీక్షా వ్యాసం చదివాక… రాసిన నాకే అంత బాగా రాసానా? అనిపించింది. చివరిలో విలువైన సూచన చేశారు. ధన్యవాదాలు.
“సిద్ధహస్తులు, బహుముఖ ప్రజ్ఞాశాలి” అనే పదాలు లేకుండా వుంటే బాగుండేది అనిపించింది.