LOC – లైన్‌ ఆఫ్‌ కాన్ఫిడెన్స్‌

కొన్ని ప్రయాణాలు మనం వెళ్లిన ప్రదేశాలను కాదు..
మనుషులను గుర్తు పెట్టుకునేలా చేస్తాయి.
సత్యకు అలాంటి ప్రయాణమే అది.ఆంధ్ర, తెలంగాణలకు చెందిన నలుగురు తెలుగు యువకులు..సత్య, రవి, మల్లేష్‌, శ్రీను బతుకుతెరువు కోసం సెర్బియాకు వెళ్లారు.

లోడింగ్‌-అన్‌ లోడింగ్‌ వర్కర్లుగా అక్కడ కొంతకాలం పనిచేసి.. మంచి అవకాశాల కోసం పోర్చుగల్‌కు బయలుదేరారు.

వాళ్ల దగ్గర పెద్దగా డబ్బు లేదు.
పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో విమానం దిగినప్పుడు..
వాళ్లందరి కళ్లలో ఒకటే ప్రశ్న.. “ఇక్కడ మనం ఎలా బతకాలి? ఏ పని చేయాలి?”

లిస్బన్ వాళ్లకు ఒక అందమైన చిత్రంలా కనిపించింది. కొండల మీదుగా నెమ్మదిగా కదిలే పసుపు రంగు ట్రామ్‌లు..

పాత భవనాల గోడలపై మెరుస్తున్న నీలిరంగు అజులెజో పలకలు.. చిన్న చిన్న కేఫ్‌ల ముందు కాఫీ తాగుతూ ప్రశాంతంగా కూర్చున్న వృద్ధులు..

రోడ్డు దాటడానికి ఎదురు చూస్తున్న పాదచారుల కోసం ఆగిపోయే కార్లు.. సముద్రపు గాలి తాకే వీధులు..ఇలా పోర్చుగల్‌లో భిన్నమైన జీవితం!

సత్య అండ్‌ ఫ్రెండ్స్‌కి పోర్చుగీస్‌ భాష రాదు.
కొత్త మనుషులు..మునుపెన్నడూ చూడని ప్రశాంతత!
ఎవ్వరూ తొందర పడటం లేదు. ఎవ్వరూ గట్టిగా అరవడం లేదు. తమ పని తాము చేసుకుంటూ..ఎదుటివారిని గౌరవిస్తూ..

పోర్చుగల్‌ రాజధానిలో ఒక నిశ్శబ్దమైన సంస్కృతి కనిపించింది. ఆ దృశ్యాలు వాళ్లలోని భయాన్ని కొంచెం తగ్గించాయి.

అంతలోనే వాళ్లకు ఒక తెలుగు వ్యక్తి ఎదురయ్యాడు. అతను ఇండియాలో వాళ్ల ఫ్రెండ్‌కి ఫ్రెండ్‌.

దేశం కాని దేశంలో వాళ్లకు అతను దేవుడులా కనిపించాడు.

“కొత్తగా వచ్చారా? గది కావాలా? నేను చూపిస్తాను” అన్నాడు.
అంతే, పోర్చుగల్‌లో మన భాష మాట్లాడే మనిషి కనిపించడంతో.. తెలుగు కుర్రాళ్లకు లేచొచ్చింది.

అతన్ని నమ్మారు. రూమ్‌ కోసం ఐదువందల యూరోలు, అంటే మన కరెన్సీలో దాదాపు
యాభై వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని చెప్పాడు. సత్య తన దగ్గరున్న డబ్బును బయటకు తీశాడు.

స్నేహితులంతా ఒకరినొకరు చూసుకున్నారు. “ఇవ్వు… మనవాడే కదా” అన్నట్టుగా తలలు ఊపారు.

యాభై వేలు అతని చేతిలోకి వెళ్లాయి. “మీరు ఇక్కడే ఉండండి. ఓనర్‌తో మాట్లాడి వస్తాను” అని చెప్పి బయటికి వెళ్లాడు.

అతను వెళ్లిన వైపే వాళ్లు చూస్తూ నిలబడ్డారు.

పది నిమిషాలు..అరగంట..గంట..

రాత్రి అయిపోయింది. అతని ఫోన్ స్విచ్‌డ్‌ ఆఫ్.

ఆ రాత్రి లిస్బన్ నగరం ఎప్పటిలాగే ప్రశాంతంగా నిద్రపోయింది.
కానీ ఆ నలుగురు జీవితాల్లో మాత్రం ఒక తలుపు పూర్తిగా మూసుకుపోయింది.
డబ్బు పోయింది. గది పోయింది. అన్నిటికీ మించి నమ్మకం పోయింది.

“మనవాడే కదా అని నమ్మాం…” అన్న రవి గొంతులో
కోపం కంటే బాధ ఎక్కువగా ధ్వనించింది.

సత్య ఏమీ మాట్లాడలేదు.
కొత్త దేశంలో కొత్త మనిషిని నమ్మినందుకు తన మీద తనకే కోపం వచ్చింది.

ఆ రాత్రి వాళ్లు లిస్బన్ వీధుల్లో బ్యాగులు పట్టుకుని నిలబడినప్పుడు,
ప్రపంచంలో తాము మాత్రమే ఒంటరిగా ఉన్నామనిపించింది.

అప్పుడే ఒక ట్రక్ వాళ్ల ముందుకొచ్చి ఆగింది. డ్రైవర్ కిందికి దిగాడు.
పొడవాటి శరీరం. మాసిన గడ్డం. అలసిపోయిన అతని కళ్లలో మాత్రం అపరిచితుల పట్ల ఆసక్తి.

వాళ్లను కొద్దిసేపు గమనించాడు.
“ఇండియానా?” అని అడిగాడు.
సత్య తల ఊపాడు.
“ఏమైంది?”
ఎవరూ సమాధానం చెప్పలేదు.
వాళ్ల దగ్గరున్న బ్యాగులు, ముఖాల్లోని ఆందోళన చూసి అతనికి అర్థమైంది.
“రండి” అన్నాడు.

“ఎక్కడికి?”
సత్య కళ్లలో అనుమానం, అప నమ్మకం స్పష్టంగా కనిపించాయి.

అతను ప్రశాంతంగా నవ్వాడు. “నా పేరు ఇక్బాల్‌” అని పరిచయం చేసుకున్నాడు.
“ముందు పడుకోవడానికి చోటు చూద్దాం. మిగతాది రేపు మాట్లాడుకుందాం.” అన్నాడు.
ఐదుగురినీ ఒక చిన్న గదికి తీసుకెళ్లాడు. పడుకోవడానికి చోటు చూపించాడు. తినడానికి ఏదో తెచ్చిపెట్టాడు.

మరుసటి రోజు నుంచి వాళ్ల కోసం ఉద్యోగం వెతకడం మొదలుపెట్టాడు.
అతనికి వాళ్లు ఎవరో తెలియదు. వాళ్ల కుటుంబాలు ఎవరో తెలియదు.
వాళ్ల మతాలు తెలియవు. వాళ్ల దృక్పథాలు తెలియవు.

వాళ్లు ఇండియా నుంచి వచ్చారన్న విషయం తప్ప ఇంకేమీ తెలియదు.
అయినా ఇక్బాల్‌ వాళ్ల కోసం తిరిగాడు. ఇద్దరికి ఒక గిడ్డంగిలో పని దొరికేలా చేశాడు.
మరో ఇద్దరికి ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో డ్రైవర్లుగా పని చూపించాడు.
“ముందు మీరు నిలబడాలి. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం” అని ధైర్యం చెప్పాడు.

***

నాలుగు వారాలు గడిచిపోయాయి. ఎవరి ఉద్యోగాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఒక శుక్రవారం రాత్రి ఇక్బాల్‌, సత్యకి ఫోన్‌ చేశాడు.

“వీకెండ్‌కి అంతా దగ్గర్లోని సింట్రా పట్టణానికి వచ్చేయండి, సరదాగా ఎంజాయ్‌ చేద్దాం” అన్నాడు.

దేశం కాని దేశంలో పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాళ్లు ఎవరుంటారు? శనివారం ఉదయం అందరూ సంతోషంగా బయలుదేరారు.

లిస్బన్‌ నుంచి 30 కి.మీ. దూరం.. అరగంట ప్రయాణం. చుట్టూ పచ్చని కొండలు,

పాత రాజ భవనాలతో సింట్రా పట్టణం అందంగా ఉంది. చాలాకాలంగా ఇక్బాల్‌ అక్కడే ఉంటున్నాడు.

సత్య మిత్ర బృందం వచ్చేసరికి.. బిర్యానీ చేస్తూ కనిపించాడు.. ఇక్బాల్‌..!

పాత్రలో మసాలా కలుపుతుంటే గది అంతా ఘుమఘుమలతో నిండిపోయింది.

కిచెన్‌లోకి దగ్గరకు వెళ్లి చూశాడు..సత్య.
“మన హైదరాబాద్ బిర్యానీలా లేదే?” అన్నాడు.

“సింధీ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీలా ఎందుకుంటుంది?” అని ఇక్బాల్ నవ్వాడు.
“సింధీ బిర్యానీయా?” ఆశ్చర్యంగా చూశాడు సత్య!

“అవును..మీ బిర్యానీకి పుదీనా వాసన ఎక్కువ. మా పాకిస్థానీ బిర్యానీలో మసాలా కొంచెం గట్టిగా ఉంటుంది. సింధీ వాళ్లం కాస్త కారం, పులుపు కూడా ఇష్టపడతాం” అన్నాడు.

రవి వెంటనే అన్నాడు..
“నువ్వు పాకిస్థానీవా?” అని..!

మరో రెండు పచ్చిమిర్చి వేసి..
“అవును” అన్నాడు ఇక్బాల్‌ నవ్వూతూ..!

ఒక్కసారి అంతా షాక్‌ అయ్యారు.
“ఒరేయ్‌, మనకు ఇంత సాయం చేసింది పాకిస్థానీయా?
పైగా మనకు బిర్యానీ కూడా ఒండిపెడుతున్నాడు” మల్లేష్‌ గొణిగాడు.

“ఇంకా బిర్యానీ తినలేదు. అప్పుడే తీర్పులా?” అన్న ఇక్బాల్‌ మాటకు
గది మొత్తం నవ్వులతో నిండిపోయింది.

సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు. “నమాజ్‌కి టైమ్‌ అయింది” అంటూ ఇంటికి దగ్గర్లోని మసీదు వైపు నడిచాడు ఇక్బాల్‌..! సత్య అతన్ని చూస్తూ మిత్రులతో అన్నాడు-
“దేశంకాని దేశంలో మనకి ఎంత సాయం చేశాడు. తోటి భారతీయుడు మోసం చేసి వెళ్లిపోతే..ఓ పాకిస్థానీ అండగా నిలబడ్డాడు. ఇంతకాలం మనం ఊహించిన పాకిస్థానీలు వేరు. పోర్చుగల్‌ వచ్చాక మనకు కనిపించిన మనిషి వేరు. దేశభక్తి అంటే మరో దేశాన్ని తిట్టడం కాదు కదా! బతుకుతెరువు కోసం మరో దేశానికి వస్తేనే బహుశా ఇదంతా అర్థమవుతుందేమో..!” అంటూ..నమాజ్‌ పూర్తి చేసుకుని వచ్చిన ఇక్బాల్‌ను మనసారా కౌగిలించుకుని మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెప్పాడు.

“అరే భాయ్‌, దేశం అనేది మ్యాప్‌లో ఉంటుంది. మనిషి మాత్రం మనసులోనే ఉంటాడు.” అంటూ ఇక్బాల్‌ అందరికీ కొసరి కొసరి సింధ్‌ బిర్యానీ వడ్డించాడు. “నువ్వు ఇంత బాగా బిర్యానీ చేశావంటే ఏదో కలిపేవుంటావ్‌. ఏంటా సీక్రెట్‌..?” అంటూ ఇక్బా్‌ల్‌ను ఆటపట్టించారు తెలుగు స్నేహితులంతా! సరదా కబుర్లతో అంతా వీకెండ్‌ ఎంజాయ్‌ చేశారంతా!

మరో వారం రోజులు గడిచాయి. “ఈ వీకెండ్‌ ఏం చేద్దాం?” అనుకుంటుండగా..తలుపు చప్పుడయింది. హలో అంటూ ప్రత్యక్షమయ్యాడు ఇక్బాల్‌..! “మీకు మంచి బిర్యానీ వండిపెడతా..సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి సరుకులు తెండి” అని ఆర్డర్‌ వేశాడు ఇక్బాల్‌. “అదేంటి? నీ సింధ్‌ బిర్యానీకి ఏం కావాలో నీకే బాగా తెలుస్తుంది. నువ్వే తేవచ్చు కదా అవన్నీ..!” అన్నాడు రవి. “బిర్యానీలో నేనేదో కలిపానన్నారు కదా లాస్ట్‌ వీక్‌..! అందుకే మీరు తెచ్చిన సరుకులతోనే వండుతాను.” అన్నాడు..ఇక్బాల్ నవ్వుతూ.

“అసలు ఈ వారం కూడా మేమే సింట్రా వచ్చేవాళ్లం కదా..?”అన్నాడు సత్య. “లేదు భాయ్‌, మీరంతా వస్తే దారి ఖర్చులకు ఐదు వేలు ఖర్చయిపోతాయి. అదే నేను ఒక్కడ్ని వస్తే, మీ అందర్నీ చూడొచ్చు. మీకు ఆ డబ్బులు మిగులుతాయ్‌” అన్నాడు ఇక్బాల్‌. “నిజమే కదా..కొత్తగా ఉద్యోగాల్లో చేరిన మాకు.. ఐదు వేలు చాలా ఎక్కువ”- థాంక్స్‌ భాయ్‌ అన్నాడు సత్య.

అలా..ఆ రోజు నుంచి ప్రతి వారం ఇక్బాల్‌ తెలుగు కుర్రాళ్ల గదికి రావడం మొదలైంది.
కొన్నిసార్లు బిర్యానీతో..కొన్నిసార్లు పండ్లతో.. కొన్నిసార్లు ఏమీ తేకుండా..“ఈరోజు మీతో కూర్చోవడానికి వచ్చా” అని చెప్పేవాడు.

వంటగదిలో ఇక్బాల్‌..పక్కనే నిలబడి తెలుగు కుర్రాళ్లు..
పాకిస్థానీ బిర్యానీ సువాసనల మధ్య తెలుగు మాటలు..
అలా మొదలైన శని, ఆదివారాలు.. వాళ్ల జీవితంలో చిన్న పండుగలుగా మారిపోయాయి.

అన్నట్టు పండుగంటే గుర్తుకొచ్చింది. ఒకసారి సంక్రాంతి వచ్చింది.
ఆ రోజు సత్య, రవి, మల్లేష్‌, శ్రీను తెల్లవారుజామునే లేచారు.
వాళ్ల గది ముందు చిన్న ముగ్గు వేశారు.
ఆ ముగ్గుకు పసుపు, కుంకుమ అద్దారు.
తెలుగు పాటలు పెట్టుకున్నారు.
పులిహోర చేశారు. స్వీట్‌ కూడా చేశారు. అప్పుడే ఇక్వాల్‌ వచ్చాడు.
తలుపు దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ “ఏమిటిదంతా?” అని అడిగాడు.
“సంక్రాంతి” అన్నాడు సత్య. “ఇది మా తెలుగువాళ్ల పెద్ద పండగ” అని చెప్పాడు శీను.

“ఈ దేశంలో నువ్వే మా సంక్రాంతి అల్లుడు” అంటూ కొత్త బట్టలు పెట్టారు ఇక్బాల్‌కి..!
పండక్కి చేసిన స్పెషల్‌ వంటలతో కొసరి కొసరి భోజనం వడ్డించారు.
మొదటి ముద్ద తిన్న ఇక్బాల్‌ “ఇది బిర్యానీ కాదు” అన్నాడు.
అందరూ నవ్వారు. “ఇది మా స్పెషల్‌-పులిహోర” అన్నాడు మల్లేష్‌.
“మా బిర్యానీ కంటే బాగుంది” అంటూ ఇష్టంగా తిన్నాడు ఇక్బాల్‌.
అలా పులిహోర-బిర్యానీ మాటల్లో పడిపోయాయి.

ఆ రోజు వాళ్ల గదిలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది.
ఒక పక్క సింధ్‌ బిర్యానీ పాత్ర..మరో పక్క తెలుగింటి పులిహోర..
మధ్యలో నలుగురు తెలుగు యువకులు, ఒక పాకిస్థానీ ట్రక్ డ్రైవర్.
బయట లిస్బన్ నగరం.. లోపల మాత్రం రెండు దేశాలు లేవు..
ఒకే స్నేహ బంధం ఉంది..!

వాళ్లను చూసి ఇక్బాల్‌ అన్నాడు-“మీ దేశం గురించి నాకు చాలా విషయాలు తెలుసు. కానీ మీరొచ్చాక నాకు మరో విషయం తెలిసింది.”
“ఏమిటది?” అని సత్య అడిగాడు.
“మీరు దాయాదిని కూడా ఎంతో ప్రేమిస్తారని..”-అన్నాడు ఇక్బాల్.

వెంటనే సత్య ఎమోషనల్‌గా మారాడు. “ఆ రోజు మమ్మల్ని మోసం చేసినవాడు మా దేశంవాడే! పైగా తెలుగువాడు. అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఈ దాయాదే..!

అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది..మనం దేశాల్ని ప్రేమించాలి. కానీ మనుషుల్ని దేశాలుగా చూడకూడదు.” అని! సత్య మాటలకు ఇక్బాల్‌ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. అందరూ అలాయ్‌ బలాయ్‌ చేసుకున్నారు.

…అన్నట్టు ఇక్బాల్‌కు వీళ్లు తెలుగు పదాలు అలవాటయ్యాయి.
వాళ్లకు ఉర్దూ, సింధ్‌ పదాలు పరిచయం చేసేవాడు ఇక్బాల్‌.
వాళ్ల మధ్య మాటలు వేరు. నవ్వు మాత్రం ఒకటే..!
వీకెండ్స్‌ వచ్చినప్పుడు వాళ్లంతా కలిసి లిస్బన్‌ నగరంలో తిరిగేవారు.
సిటీలోని పాత వీధుల్లో నడిచేవారు. ట్రామ్‌లో ప్రయాణించేవారు.
టాగస్ నది ఒడ్డున కూర్చునేవారు. అట్లాంటిక్ సాగరం వైపు చూస్తూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.

***

“నిజంగా, ఆ రోజులే వేరు సార్‌..” అన్నాడు సత్య..
హుస్సేన్ సాగర్‌ మీదుగా కారు పోనిస్తూ..!

“అసలు అంత అందమైన నగరాన్ని..ఉద్యోగాన్ని, నీ స్నేహితుల్ని, అన్నిటికీ మించి ఇక్బాల్‌ని విడిచి ఇక్కడికి ఎందుకొచ్చావ్?” అని అడిగాను.

“నేను పోర్చుగల్‌లో సెటిల్‌ అవుతున్న సమయంలో ఒకరోజు నాన్న ఫోన్‌ చేశాడు సార్‌- తమ్ముడు సూసైడ్‌ చేసుకున్నానని చెప్పాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. మైండ్‌ పనిచేయలేదు. ఇండియాకి తిరిగి ఎలా వచ్చానో కూడా తెలీదు. అంతా పోర్చుగల్‌లో ఫ్రెండ్స్‌, ఆఫీస్‌ మేనేజ్మెంటే చూసుకున్నారు. విషయం తెలియగానే.. ఇక్బాల్‌ విమాన టిక్కెట్‌ కొని ఇచ్చాడు. ఆఫీస్‌లో మా బ్రెజిలియన్‌ మేనేజర్‌ రెండు లక్షలు ఇచ్చి.. ఖర్చులకు ఉంచమన్నాడు సార్‌..” అన్న సత్య మాటలకు నేను ఆశ్చర్యపోయాను. కష్టమొస్తే అయినవాళ్లే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో.. ఒక పాకిస్థానీ, ఒక బ్రెజిలియన్‌ ఒక ఇండియన్‌కి చేసిన సాయం చాలా గొప్పది.

“అసలు మీ తమ్ముడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?” అని అడిగాను. “బెట్టింగ్‌ భూతం సార్‌. మా తమ్ముడు లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. ఇద్దరు చిన్నచిన్న పిల్లలు. అయినా బాధ్యత లేకుండా బెట్టింగ్స్‌కి అలవాటుపడి డబ్బు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు” అని చెప్పాడు.

లిబర్టీ నుంచి అబిడ్స్‌ వైపు మా కారు వెళ్తోంది. “పోర్చుగల్‌లో ఉద్యోగం చేస్తున్నంతసేపూ నాకు పెద్దగా ఖర్చులుండేవి కాదు. నెలకి లక్ష రూపాయలు ఇంటికి పంపేవాడ్ని. ఇప్పుడు నా ఫ్యామిలీ, నా తమ్ముడి ఫ్యామిలీ బాధ్యత కూడా నాదే సార్‌! అందుకే, ప్రస్తుతం డబ్బుల కోసం క్యాబ్‌ నడుపుతున్నాను” అని చెప్పాడు సత్య.

“మరి ఇక్కడే ఉండిపోతావా?” అని అడిగాను.
“లేదు సార్‌, ఇక్కడ ఉంటే నా భార్యా పిల్లల్ని, నా తమ్ముడి పిల్లల్ని సెటిల్‌ చేయలేను. మా తమ్ముడి సంవత్సరీకాల వరకు హైదరాబాద్‌లో ఉంటాను. తర్వాత మళ్లీ పోర్చుగల్‌ వెళ్లిపోతాను” అన్నాడు సత్య.

“మరి అక్కడ నీకు మళ్లీ ఉద్యోగం దొరుకుతుందా?” అనుమానంగా అడిగాను.
“పర్వాలేదు సార్‌, మా బాస్‌ మంచివాడే. ఎప్పుడొచ్చినా జాబ్‌ ఇస్తానన్నాడు. అంతగా ఇబ్బంది ఉంటే, నా దోస్త్‌ ఇక్బాల్‌ ఉండనే ఉన్నాడు”- అని నమ్మకంగా చెప్పాడు సత్య! అతని కళ్లలో ఒక ధీమా కనిపించింది.

మలక్‌పేట్‌ మెట్రో దాటాం. మరో రెండు నిమిషాల్లో నా ఇల్లు వచ్చేస్తుంది.
రోజూ క్యాబ్‌ ఎక్కడం కామన్. కానీ ఈ జర్నీ చాలా ప్రత్యేకం.

కారు దిగుతూ అడిగాను-“నీకెంత సాయం చేసినా, ఇక్బాల్ పాకిస్థానీ కదా!
నీకెప్పుడూ వేరుగా అనిపించలేదా? మన శత్రు దేశంవాడు అన్న ఫీలింగ్‌ రాలేదా?” అని!

కారు రివర్స్‌ చేస్తున్న సత్య కాస్త ఆగి.. నన్ను సూటిగా చూశాడు.
తర్వాత చాలా ఇలా మెల్లగా అన్నాడు..
“స్నేహానికి మతం లేదు సార్‌.. మనిషి ఉంటే చాలు.”
ఆ మాటలో అతని మొత్తం ప్రయాణం ఉంది.
నా ప్రయాణానికి నిండుదనం వచ్చింది. నిజంగా అంతే కదా!
సరిహద్దులు మనుషులను విడదీయగలవు.
కానీ మనసులు మాత్రం నియంత్రణ రేఖ మీద కూడా నమ్మకాన్ని పూయించగలరు.

*

భాను కిరణ్‌

భాను కిరణ్ టీవీ9లో అవుట్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వార్తలపై మంచి పట్టుతో పాటు, సమాజాన్ని ప్రభావితం చేసే సున్నితమైన అంశాలను మానవీయ కోణంలో కథనాలుగా మలచడంలో ప్రత్యేక ఆసక్తి ఉంది.

ఆర్థికశాస్త్రం, జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తి చేసిన ఆయన, 2003లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో టీవీ9లో చేరి, అంచెలంచెలుగా అవుట్‌పుట్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు.

సమాజంలోని ఎన్నో సమస్యలను సున్నితంగా, ప్రభావవంతంగా చూపించిన వందలాది కథనాలు ఆయన జర్నలిస్టు ప్రయాణంలో భాగం. వాటిలో అవార్డు పొందిన ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.

వార్తను చెప్పడమే కాదు.. దాని వెనుక ఉన్న మనిషిని, అతని బాధను, సమాజంపై దాని ప్రభావాన్ని చూపించాలన్నదే భాను కిరణ్ ప్రయత్నం.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.