ఒక చిత్రమో, ఒక సంఘటనో ఓ వ్యక్తిని తన చుట్టూ తిప్పుకుంటూంటుంది – ఆ వ్యక్తి మానసిక స్థితిని బట్టి. కొందరి అక్షరాలు కూడా మనల్ని అలానే తమ చుట్టూ, ఆ అక్షర అంతరంగం చుట్టూ చక్కర్లు కొట్టేలా చేస్తాయి. అలా ఆ అక్షరమొకటే కాకుండా ఆ అక్షర అధినాయకుడే మన చుట్టూ తిరుగుతూ మనకు కనిపిస్తే, మనల్నికదిలిస్తే … మన పరిస్థితి ఏంటి? నాకు మాత్రం ఇటువంటి అనుభూతి తొట్టతొలిసారి జరిగింది. “ఆకుపచ్చ ఆకుల చీకటి” లో దారి కానరాక తల్లడిల్లిపోయే ఓ మనసును, సన్నని కాంతిరేఖలా మొదలై అనంత వెలుగు పరదాలా పరుచుకుని, దిక్సూచిలా మారి చేయి పట్టుకొని తానే ముందుకు నడిపిస్తున్నట్లుంటే…!
ఆ అనుభూతికి పేరు ఉంటే – అది కాశీభట్ల వేణుగోపాల్ గారు.
నిజానికి ఆ దిక్సూచి పేరు స్నేహితుల ద్వారా వినడమే తప్ప మిగిలిన వివరాలు… అంటే ఆయన రాతకు చెందినవి నాకు తెలియదు అని చెప్పడానికి నాకేం పరువు తక్కువ కాదు. లేనిపోని భేషజాలేవీ అడ్డురావు కూడా. సాహిత్యం అనేది నా జీవితంలోకి ప్రేవేశించి కేవలం అయిదు సంవత్సరాలు అయ్యింది. అది కూడా అడపాదడపానే సుమీ. గత రెండు మూడు సంవత్సరాలుగా నేను నాకు నచ్చినట్లుగా కవిత్వం రాసుకుంటూ ఉండడం, కనబడిన కథలను, కవితలను చదువుకోవడం మాత్రమే చేసేదాన్ని.
అయితే, 2025 లో ముక్కామల చక్రధర్ గారి పరిచయం తరువాతే తెలిసింది అసలు సాహిత్యం అంటే ఏమిటో… చదువంటే ఏమిటో… రచనలంటే ఏమిటో. “ఫలానా వారిని చదువమ్మా… ఫలానా పుస్తకం చదవండమ్మా … ఊరికే బుర్రలో పుట్టిన ప్రతి అక్షరాన్ని రాసేయకుండా ఎక్కువ చదవండి” అని చెబుతూనే ఉన్నారు. అంతేకాదు, చక్రధర్ గారు చదివిన గొప్ప పుస్తకాలను అమలాపురం నుండి నాకు కొరియర్ చేసి చదవండి అని చెప్పేవారు. ఇదిగో అలా వచ్చి చేరింది “నిహితమ్” పుస్తకం.
నా బద్దకంలో భాగంగా… నేనేమీ వెంటనే చదివేయలేదు. కొరియర్ వచ్చిన కట్టను పక్కన పడేసాను. ఆ మధ్య అలమారాలు సర్దుతున్నప్పుడు ఆ పుస్తకాల కట్ట జారి అందులోంచి నా రెండు చేతుల్లోకి ఒరిగిపోయింది ఈ “నిహితమ్”.
పనిలో భాగంగా పక్కన పడేస్తున్న సమయంలో పుస్తకం శీర్షిక చూశాను… నిహితమ్ – అంటే ఏదో దాచబడిన రహస్యం, తెలుసుకోవాల్సిన విషయం, వంట పట్టించుకోవాల్సిన నిగూఢత. శీర్షిక గురించి ఆలోచిస్తుంటే ఆ కవర్ పేజీలో ఉన్న వ్యక్తి కళ్ళద్దాలలోంచి ఆ కళ్ళు నన్ను పిలుస్తున్నట్లు ఏదో తెలియని ఒక వింతైన భావన. అంతే, చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టి పుస్తకం లోపలి పేజీల్లోకి అడుగుపెట్టాను. వెంకట కృష్ణ గారి సంపాదకత్వంలో వెలువడిన పుస్తకం అని ఉంది.
మొదటి వ్యాసం చదివాను. ఏకబిగిన కూర్చుని ఏ పుస్తకాన్నీ చదవకపోవడం నా అలవాటు. కానీ, మొదటి వ్యాసం నాకు ఓ కొత్త విషయాన్ని రుచి చూపించింది. ఆ రుచి నాలుక చివర నుండి మెదడులోకి నీటిలో పడిన సిరా చుక్కలా మొత్తంగా పరుచుకుంది. ఆ రుచి కాశీభట్ల వేణుగోపాల్ గారు. నా గురించి తెలుసుకో అంటున్నట్లుగా ఆయనే నా చేతిని స్వేచ్ఛగా తన చేతిలోకి తీసుకొని ఒక్కో పేజీ తిప్పి… చూడు ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నాను. ఇది నా అంతరంగం. ఇదిగో ఇందులో నాతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు చూడు! ఇలా ప్రతి పుటలో తన అంతరంగాన్ని ఆయా రచయితలు ఎలా వర్ణించారో చూడమని నా మెదడును పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. చిట్టచివ్వరి వ్యాసం… ఇదిగో ఇక్కడ నేను స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అని సరాసరి అక్కడికి తీసుకువెళ్లారు.
“విన్నావా నేను చెప్పిన మాటలు? ఏం తెలుసుకున్నావు నా గురించి? ఎప్పుడూ బహిరంగంగా కనబడే నువ్వు… నీ అంతరగంలో ఏముందో చూసుకున్నావా?” అని ప్రశ్నించేరు. మనసు, మెదడు, నా రోజు అన్నీ అన్నీ ఆక్రమించేశారు. వెంటనే అరణ్య జ్వాల, ఆస్పష్ట చిత్రం చదివించారు. వాక్యం అంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. నాచేత కవితాక్షరాలు దిద్దిస్తున్నారు.
ఒక పుస్తకం మనిషిలో మార్పు తెస్తుంది అని చాలా మంది నోటితో వింటూంటే… అన్నీ పనికిమాలిన కబుర్లు అనుకునేదాన్ని. కానీ, స్వయంగా అనుభవంలోకి వస్తే గాని తెలియలేదు దాని రహస్యం.
సాధారణంగా కథలు చదివితే ఆ కథలోని పాత్రలు మనల్ని వెంటాడతాయి. అలా నేను చదివిన కథలు, నన్ను వెంటాడే పాత్రలు చలం గారు, రావి శాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, అద్దేపల్లి ప్రభు గారు, ముక్కామల చక్రధర్ గారు రాసిన కథలలోనివి కొన్ని… కానీ ఒక రచయితే తన చుట్టూ తిప్పించుకుంటే…! అదీ ఓ పుస్తకం ద్వారా…! చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను.
బహుశా మీరు అనుకోవచ్చు ఈ పుసక్తం మొత్తం ఒక వ్యక్తి గురించే కాబట్టి నాకు అలా అనిపించింది అని. కానే కాదు. ఆ పుస్తకం మీదున్న ఆ చిత్రం, ఆ శీర్షిక చేసిన మాయ ఇదంతా. ఇంత మంచి పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చి నాకు ఒక మార్గదర్శిని అందించిన వెంకట కృష్ణ గారికి హృదయపూర్వక నమస్సులు.
*








Add comment