ఆధునికానంతర కవిత్వం మానవ జీవితంలోని Dystopian భావనలనూ కొన్ని సందర్భాలలో అస్తిత్వ వాద కొనసాగింపునూ ప్రతిబింబిస్తూ మనిషిలోని ఆకాంక్షలను తుత్తునియలు చేసింది. సాటి మనిషిపై ఉన్న విశ్వాసాన్ని సడలించింది. మనిషిని తన మీద తనకే విశ్వాసం లేని జీవిగా మార్చింది. తన జీవితాన్నీ, తన కుటుంబాన్నీ సమాజాన్నీ మొత్తం ప్రపంచాన్నీ అనుమానంతో చూసేట్టు చేసింది. ఈ అనుమానమే చివరకు అస్తిత్వ వాద పోరాటాలను సైతం తెలుగునాట విచ్చిన్నం చేసింది.. అందుకోలేని మరీచికలకై పరుగులు పెట్టిస్తూ సంఘ జీవితానికి అననుకూలంగా చేసింది.
ఆధునికానంతర ధోరణి సమాజంలో అపనమ్మకాన్నీ అభద్రతనూ పెంచి మనిషిని ఒంటరిని చేసి మనిషి శ్రమనూ శ్రమ ఫలితాన్నీ కూడా యదేచ్చగా దోపిడీకి గురిచేసింది. తరచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనిషికి అండగా నిలవాల్సిన వ్యవస్థలు తమ వైఫల్యాన్ని మనిషిపై నెట్టి నిరాశావహ ధోరణిని పెంచి మనిషిని ఒంటరిని చేశాయి. ఇదంతా ఎందుకంటె ఆ వాతావరణంలో వ్యవస్థలకు ఎదురుండదు. వారి లాభాపేక్షలకు తిరుగుండదు.
ఆధునిక యుగంలోని ఊహాత్మక యుటోపియన్ ప్రపంచం నుండి ఆధునికానంతర Dystopian నకారాత్మక ప్రపంచంలోకి మానవాళిని తోసిన శక్తి ఎదోగానీ అది సమస్త రంగాలనూ ఆవరించింది.
“రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను” అన్న కవి ఆధునికానంతర యుగంలో “దేన్నయినా ఆపడానికతడు అసమర్థుడు” అనవలసిన స్థితి వచ్చింది. మనిషి తనమీద తను విశ్వాసం కోల్పోవడం ఎలా ఉంటుందో ఈ కాలంలో కవులు మనకు కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు.
మనకాలపు ప్రముఖ కవి కె శివారెడ్డి రాసిన ఈ కవితను చూడండి.
“దేన్నయినా”
“దేన్నయినా ఆపడానికతడు అసమర్థుడు
అతడు దేన్నీ ఆపలేడు, ఆపడానికి సిద్ధంగా లేడు
మంచిగానీ చెడుగానీ
సమర్థమైన దాన్నిగానీ అసమర్థమైన దాన్నిగానీ
కాలవ వొడ్డున ఎండిన చెట్టులా నుంచోవడం తప్ప
చేతులు చాచడం గానీ పైకెత్తడం గానీ
దిశల్ని చూయించడం గానీ లేదు
ఆశాహీనుడైన అతను దీన్ని వివరించగలడు విడమర్చగలడు
పోయిన రోజునిగానీ రాగల రోజునిగానీ దేన్నీ సంధించలేడు
నిష్ప్రయోజనపు చావులాంటి అతను దేన్ని లెక్కించగలడు
ప్రతీదీ రెండవుతున్న సందర్భంలో అతడేకాదు
ప్రతి ఒక్కరూ అసమర్థుడేనేమో
కె శివారెడ్డి కవితా’లయ’ డీటీఎఫ్ కవితా సంకలనం ఫిబ్రవరి 2024
పై కవితలో కవి ఒకకాలంలో మనిషి అశక్తతను వివరించిన వైనం మనం చూడొచ్చు. అతడెలాంటి వాడో కవి మాటల్లోనే చూద్దాం
“నిష్ప్రయోజనపు చావులాంటి అతను”
చావుకు కూడా ఒక ప్రయోజనం ఉంటుందని నమ్ముతున్న ఒక కవి అతడిని నిస్ప్రయోజనమైన చావులాంటి వాడు అంటున్నాడు. అతడెంత ఆశక్తుడంటే చేతులతో దిక్కులను కూడా చూపలేనివాడు. ఇక అతడేమి చెయ్యగలడు? అతడు ఎవరైనా కావచ్చు ఒక కార్మికుడు, ఒక కర్షకుడు ఒక ఉపాధ్యాయుడు ఒక కవి కూడా కావచ్చు.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ కవితను సంకలనంలో ప్రచురించినది ఒక ఉపాధ్యాయ సంఘం ఆ సంఘం వారు ఆ సంకలనానికి పెట్టిన పేరు కూడా dystopian కావడం యింకా ఆశ్చర్యం.
ఈ కవితను చూశాక అదే సంకలనంలోని యింకొక కవితను చూశాను కవితలోని కొన్ని వాక్యాలు ఆధునికానంతర ఆలోచనాస్థితిని ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూద్దాం.
కవిత్వమూ యుద్ధమే
కవీ! ప్రజలవైపు నిలబడ్డప్పుడు
కవిత్వం నీచేతిలో మెరుస్తున్న ఆయుధం
నువ్వు యుద్ధభూమిలో నిలబడ్డ యోధునివే
ఇప్పుడు కవిత్వమంటే యుద్ధాన్ని లక్ష్యించిన యుద్ధం
ప్రజలవైపు నిలబడ్డప్పుడు
యుద్ధాన్ని తలమీద మోయడం అత్యవసరం
రక్తంలో జీర్ణించుకుపోయిన అక్షరం
రాజ్యం మీదికి తూటాలై దూసుకుపోవడం అనివార్యం
ఇప్పుడు యుద్ధమంటే మనిషిని ప్రేమించడం
బతుకులమీద విషాదాగ్నులు పుక్కిలించబడుతున్నప్పుడు
పచ్చని నేలమీద ఎడతెగని ఎడారులు విస్తరిస్తున్నప్పుడు
బతకడమేకాదు బతకడంకోసం చావడమూ యుద్ధమే
చావుబతుకులమధ్య పోరాటమే కవిత్వం
కవిత్వం రాయడమంటే యుద్ధానికి సన్నద్ధం కావడం
యుద్ధం చేయడమంటే బతుకును నిండు గుండెతో ప్రేమించడం.
తోకల రాజేశం కవితా’లయ’ డీటీఎఫ్ కవితా సంకలనం ఫిబ్రవరి 2024
కవిత్వం కవి చేతిలో మెరుస్తున్న ఆయుధమనగానే అదెంత ప్రమాదకరమని కవి భావనో చూడండి.
“బతకడమేకాదు బతకడంకోసం చావడమూ యుద్ధమే
చావుబతుకులమధ్య పోరాటమే కవిత్వం”
అంటూ కవి బతకడం కోసం చావడం దాకా తన యుద్ధాన్ని మోహరించాలని చెబుతున్నాడా? చావు తర్వాత ఉండేదేమిటి?
కవి ఒక ఊహాత్మక యుటోపియన్ ప్రపంచం నుండి dystopian భావనలను చావు దాకా తీసుకు పోతున్నాడు.
ఈ సంకలనాన్ని సంపాదకులు “గత 25 ఏళ్ళ …… ప్రస్థానంలో అధ్యాపక జ్వాల, ఉపాధ్యాయ క్రాంతి కవితాశీర్షిక ద్వారా అందించిన కవితలు” అని చెప్పుకున్నారు.
ఆధునికానంతర ధోరణి ఉపాధ్యాయులను సైతం ఎంత ప్రభావితం చేసిందో ఈ సంకలనం చెబుతోంది.
ఇక నీళ్లు లేని ఎడారి వంటి రాయలసీమ నుండి ఆగస్ట్ 2001 న వచ్చిన “సీమ కవిత” కవితా సంకలనంలో మనం dystopian పలవరింతలను చూడడం వింత అనిపించదు. దీనికి ఎవరూ మినహాయింపు కాలేదు అని చెప్పడానికి ఈ క్రింది కవితను చూడండి.
చర్నాకోల
ఒక్కొక్క పక్షీ వచ్చి చెట్టుమీద వాలుతుంది
ఇక్కడొక సాయంకాలాన్ని పరుద్దామని ప్రయత్నం
ఆత్మ దొరకని అలమటింతలో నేను ఇప్పుడేవిశ్వాసాన్నీ కిరణించలేను
ఒక రోజును జీవించానని తృప్తిగా నిదురించలేను
ఎక్కడివో అవి ఎప్పటివో ఆశగా ఇంటికొస్తున్న ఎద్దుల
మెడగంటల చల్లని చప్పుడు నాన్నా నాన్నా వద్దు వద్దు
అప్పులబాధల పగబట్టిన పలునాల్కల చర్నాకోల
నీ భుజం మీద ఒద్దొద్దు వద్దు నన్నొక ఎద్దును చెయ్యొద్దు
నువ్వొక చర్నాకోలాగా గుర్తుండి పోవద్దు
బెల్లం తియ్యగుంటుందని చాలా బాగుంటుందని నా ఒక్కడికే తెలుసు
అమ్మ కనుగప్పి అంగడికెళ్ళడానికి నా నిక్కరు జేబులో దాగిన
పాపడి జొన్నలకు కొంచం తెలుసు
జేబు చూసిన నాన్న చేతిలోంచి నన్ను కాటేసిన చర్నాకోలకు
ఆ తీపి మరింత బాగా తెలుసు
ఒద్దొద్దని కదా ఉన్న ఉనికిని ఉన్మత్తంగా పేల్చుకుని గగనానికెగసి గిరికీలు కొట్టింది
ఏ అవకాశం మీద వాలినా రెక్కముడవనివ్వని గుండుసూది మొన
నాన్నా నాన్నా నీ చర్నాకోల విశ్వవ్యాప్తమయి నన్నింకా భయపెడుతూనే వుంది
ఒక బాలిస్టిక్ క్షిపణినై భూగోళం పెన్ బండకు తల బాడుకోవాలనిపిస్తోంది.
రాత్రవుతుంది చెట్టు నిద్రపోతుంది చెట్టుకొమ్మలు నిద్ర పోతాయి
కొమ్మలకు వేలాడే పక్షులూ నిద్రపోతాయి
విషం కురిసే తెలిమేయిలు పాలపుంత నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను
తెల్లారేవరకూ
హనుమంత రెడ్డి ‘సీమకవిత’ కవితా సంకలనం ఆగస్ట్ 2001
“సీమ కవిత” సంకలనంలోని ఈ కవిత ఒక అనివార్య స్థితి నుండి పారిపోవాలనుకుంటున్న సీమ రైతు కొడుకు అంతరాత్మ విలాపం. ఈ కవితలో కవి నాన్న ‘చర్నాకోల’ గా మారడాన్ని చెబుతున్నాడా? నాన్న నిస్సహాయతను కప్పిపుచ్చే ‘చర్నాకోల’ ను చెబుతున్నాడా లేక ఆ చర్నాకొలను చూసి పాలపుంతనుండి పారిపోవాలనుకుంటున్న కొడుకును చెబుతున్నాడా? ఆ అనివార్య స్థితికి కారణం ఎవ్వరో కవి చెప్పడు. అయితే అది ఏమిటో చదువరికి తెలుస్తూ ఉంటుంది. కవి చెప్పిన చర్నాకోల నాన్న చేతులలో ఉన్నదేనా? ఆ చర్నాకోల అజమాయిషీకి సంకేతమా లేక అసహాయతకు నిలువెత్తు రూపమా?
నాన్న చర్నాకోలగా మారిపోకూడదని కవి కోరుకుంటాడు. కానీ అది అనివార్యమని కవికీ తెలుసు. చెట్టు నిద్ర పోతుంది. చెట్టు కొమ్మలు నిద్రపోతాయి పక్షులూ నిద్రపోతాయి. నిద్ర రానిది ఆలోచనలు ఉన్న మనిషికే. ఆ ఆలోచనలు ఆనందాన్నిచ్చే ఆలోచనలు కావు. పాలపుంత నుండి పారిపోవడానికి ఉసిగొలిపే ఆలోచనలు. ఈ ఆలోచనలకు కారణాలు కవి కనుగొంటాడో లేదో.
ఆధునికానంతర భావన చరిత్రే లేదంటుంది ఇంక కార్య కారణ సంబంధం ఎక్కడినుండి వస్తుంది? మనిషి ఆధునికానంతర ప్రపంచంలో నండూరి చెప్పిన “పెక్కు నేనులు” కాదు. ఒక్క “నేను” లో పరస్పరం కలహించుకుంటున్న “పెక్కు నేనులు” మనిషి. ఇంకా ఆ మనిషి ఆలోచనలోకి “నువ్వు” రావడం దుర్లభం
అయితే ఆధునికానంతర కాలమూ ముగిసిన పోయి కొత్త ఆకాంక్షలు ఇప్పుడు ఊపిరి పోసుకుంటున్నాయి. అవి సాహిత్యంలోకీ మరీ ముఖ్యంగా కవిత్వంలోకీ ఎలా ప్రవేశిస్తున్నాయో ముందుముందు చూద్దాం.
*








Add comment