ఇటీవల చారిత్రక నవలలు రాయలసీమ నుండి విరివిగా రావడం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే విజయనగర రాజ్యానికి సంబంధించి నవలలే ఎక్కువగా వస్తున్నాయి. అటు కన్నడ నవలా సాహిత్యంలోనూ, ఇటు తెలుగు నవలా సాహిత్యంలోనూ విజయనగర రాజ్య కథాంశంతో చారిత్రక నవలలు వస్తున్నాయి.
అసలు ఈ చారిత్రక నవలల స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి? ఆధునిక నవలాసాహిత్యంలో ఏ దృష్టికోణంలో విశ్లేషించాలి? అని పరిశోధించినప్పుడు నిజానికి నూతన అధ్యయనాన్ని చారిత్రక నవల కోరుకుంటుంది. సాహిత్యంలో చరిత్ర జ్ఞానాన్ని కలిగించడం తేలికైన పని కాదని, ఈ పనిని చారిత్రక నవలలు సులభతరం చేసాయన్నది విశ్వజనీన సత్యం.
వర్ణనాత్మకంగా చరిత్రపై ఆధారపడి ఊహాత్మకంగా చరిత్రను చెప్పడానికి సంఘటన కూర్చుకోవడం కళాత్మకంగా చరిత్రను పునర్నిర్మించడం చారిత్రక నవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గత కాలపు సంఘటనలను ఊహాత్మకంగా పునర్నిర్మించడానికి చరిత్ర ఆధారంతో చారిత్రక నవల ఉంటుంది. చారిత్రక విషయాల్ని తీసుకుని పాత్రల్ని కల్పితం చేసి రాయడం కూడా చారిత్రక నవల అంటున్నారు.
సామాజిక అంశాలను తీసుకుని చారిత్రక విషయాల్ని జోడించి రాయడం చారిత్రక నవలల జాబితాలోనే చేరుస్తున్నారు. అయితే ప్రధానంగా చారిత్రక నవలలో కథనం నేరుగా చారిత్రక ఘటనలతో సంబంధం ఉండాలి. సాధారణ పాత్రల మధ్య చారిత్రక పాత్రలు ఉండాలి. నవలాకారుడు ప్రత్యేకించి వివరించదలచుకున్న చారిత్రక అంశం పట్ల ఒక దృక్పథం కలిగి ఉండాలి. చరిత్ర అనేది మానవుని జ్ఞాపకం అనే స్పృహ చారిత్రక నవలాకారుడికి ఉంటే గొప్ప చారిత్రక నవలలను వర్తమాన సాహిత్య సమాజానికి అందించవచ్చు.
రాయలసీమలో వచ్చిన చారిత్రక నవలలను పరిశీలించినపుడు 1917లో అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దేశాయి వెంకట్రావు సిరియాళదేవి చరిత్రను రాసినట్లు ఆధారాలున్నాయి. ఇతనే స్వాతంత్య్రసమరయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి చరిత్రను ఝాన్సీలక్ష్మీ పేరుతో నవలగా రాశారు. ఇదే ధర్మవరానికి చెందిన సిరిపి ఆంజనేయులు పృథు చక్రవర్తి పేరుతో నవల రాశారు. గత కాలపు సంఘటనలను ఊహాత్మకంగా పునర్నిర్మించడానికి చరిత్ర ఆధారంతో చారిత్రక నవల ఉంటుంది. ఐతే చరిత్రనంతా నవలగా చేయడం కూడా సరైన పద్దతి కాదు. వీళ్లు కేవలం చారిత్రక వ్యక్తులపైనే దృష్టి ఉంచి రాశారనిపించింది. చారిత్రక వ్యక్తుల గూర్చి రాసే క్రమంలో కొత్త ఊహలతో చిత్రించడం ఆ కాలంలో చేయలేక పోయారు.
ఇటీవల కాలంలో రాయలసీమ నుండి చారిత్రక నవలలు వచ్చాయి. అనంతపురం నుండి చారిత్రక నవల శప్తభూమి రాసి కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన బండినారాయణ స్వామి విజయనగర రాజ్య కథాంశంతో కడపటి యుద్దం రాశారు. ఆ నవల ఎంతమేరకు చారిత్రక నవలా లక్షణాలను కలిగివుందో, అందులో ఎంతమేరకు చరిత్ర వక్రీకరించబడిందో సాహిత్యలోకం చర్చిస్తూనే వుంది. ఈ క్రమంలోనే కర్నూలు నుండి మారుతీ పౌరోహితం ప్రణయ హంపి అనే చారిత్రక నవల అంతకుమునిపే తీసుకొచ్చారు.
ఇందులో రాజు ప్రధాన భూమిక కాకుండా రాజ్యంలోని సాధారణ వ్యక్తుల్ని నవల లోకి తీసుకువచ్చారు. చారిత్రక నవల సౌందర్యాత్మకమైన చారిత్రక మార్పు అనే విషయాన్ని నవలాకారుడు ఈ ప్రణయహంపీలో నిజం చేశారు. అళియరామరాయల కాలంనాటి సమాజాన్ని, సామాజిక జీవితాన్ని నవలలో దృశ్యంగా చూపించడంలో నవలాకారుడు సఫలమయ్యాడనపించింది. మరింత వెనక్కి వెళ్లి పరిశీలించినప్పుడు కర్నూలు నుండి నరహరి గోపాలకృష్ణమ శెట్టి శ్రీరంగరాజ చరిత్రము అనే నవలను 19వ శతాబ్దంలో విజయనగర–రాయలసీమ ప్రాంతీయ నేపథ్యంలో రాశారు. రేనాటి వీరుడు కల్వటాల జయరామారావు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, పాలెగాళ్ల తిరుగుబాటు, బ్రిటిష్ పాలన గూర్చి చారిత్రక నవలలు రాశారు. వీర కంకణము పేరుతో దండిపల్లి వేంకటసుబ్బశాస్త్రి శ్రీకృష్ణదేవరాయల కాల నేపథ్యంలోనే రాశారు. బోయకొట్టములు పన్నెండు అనే పేరుతో కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె నల్లమల ప్రాంత బోయల చారిత్రక నేపథ్యం రాశారు.
ఈ మధ్య వచ్చిన కడపటి యుద్ధం, ప్రణయ హంపి రెండూ నవలలు రాకముందూ చాలా చారిత్రక నవలలు వచ్చాయి. వాటిని పరిశీలించినపుడు ముఖ్యంగా అనంతపురం జిల్లా నుండి సడ్లపల్లి చిదంబర రెడ్డి లేపాక్షి నవల, రొద్దం రంగారావు రాసిన పద్మావతి, హిందూపురంవాసి రాఘవేంద్రరావు రాసిన ఉపాసన, అంతటి నరసింహం రాసిన రామరాయలు, నాగశేషు రాసిన హంపీ చేరిన ఉత్తరం ప్రముఖంగా చారిత్రక నవవల జాబితాలో కనిపిస్తాయి.
ఇటీవల తిరుపతి నుండి భక్త వత్సలరెడ్డి రాసిన గంగజాతర నవలను చారిత్రక నవలగానే చూడాలి. ఇక రాయలసీమలోని కర్నూలు జిల్లా చారిత్రక నవలా సాహిత్యంలో ప్రముఖ పాత్ర పోషించింది. యస్‌డివి అజీజ్ ఐదు చారిత్రక నవలలు రాశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని పాలెగాడు పేరుతో తన సాహిత్య జీవితం ఆరింభించిన తొలినాళ్లలోనే యువకుడిగా ఉన్నప్పుడే రాశారు. ముత్తుకూరుుు గౌడప్ప జీవితాన్ని తెర్నేకంటి ముట్టడి పేరుతో, కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్, మహాదాత బుడ్డావెంగళరెడ్డి, ఓబన్న మొదలైన స్వాతంత్య్రసమరయోధుల చరిత్రలను చారిత్రక నవలలుగా రాశారు. వర్తమాన సాహిత్యంలో చారిత్రక నవలా సాహిత్యంలో రాయలసీమ కీలక పాత్ర పోషిస్తున్నది.
*








Add comment