-పారుల్ ఖక్కర్
మృతులంతా ఏకకంఠంతో అన్నారు..జయము!జయము!.. రాజావారు!
నేటి మీ రామరాజ్యంలో.. మా శవాలు కూడా గంగపాలు!
నిత్యం జరిగే దహనాలతో , చోటే లేని శ్మశానాలు..
పెరుగుతున్న దేహాల గుట్టలను కాల్చేందుకు కరువైన కట్టెల మోపులు!
పాడెలు మోసీ మోసి అలిసిన మా భుజస్కంధాలు..
అయిన వాళ్ళకై ఏడ్చీ ఏడ్చి కన్నీరు ఇంకిన మా కళ్ళు!
ఇంటింట యమదూతల కరాళ నృత్యాలు..
ప్రభూ! నీ రాజ్యంలో శవాలు కూడా గంగపాలు!
ఎటు చూసినా కాలుతున్న ఈ చితులు… ఎప్పటికైనా ఆగేనా
ప్రతి ఇంట పగిలే గాజుల, రగిలే గుండెల మంటలు..ఎన్నటికైనా ఆరేనా!
తగలబడుతున్న నగరం నడిబొడ్డున,
ఫిడేలు వాయిస్తున్న బిల్లా రంగాలు!
ప్రభూ! నీ రాజ్యంలో శవాలు కూడా గంగపాలు!
నలు దిశలా వ్యాపించిన నీ కీర్తిప్రభలు!
నీ దేహంపై మెరుస్తున్న ఆ దేవతా వస్త్రాలు!
ఎవరైనా గుర్తిస్తే బాగుండును.. ఆ చేదు నిజం!
నువ్వు రత్నానివి కాదు , వట్టి రాయివన్న కఠిన వాస్తవం!
దమ్ము ఉంటే వచ్చి ధైర్యంగా చూపండి..
రాజు గారి దుస్తుల అసలు రహస్యం!
పవిత్ర గంగా జలాలు మోసుకొస్తున్న ఆ శవ ప్రవాహం!
(గుజరాతీ కవయిత్రి పారుల్ ఖక్కర్ కవిత ’ శవవాహిని గంగా’
కు స్వేఛ్చానువాదం)
హిందీ అనువాదం: ఇల్యాస్ షేక్
తెలుగు సేత: సింగరాజు రమాదేవి
Add comment