ప్రేమరెక్కల తూనీగ

కల్మషాల కుటిలకుండ కాలవవతలే పగలగొట్టేసి
ప్రేమించడం నేర్చుకున్నాను

దున్నేగిత్తలుపై వాలి
మన్నుబెడ్డలపై వాలి
పరమ మురిపెంగా
పవిత్రాతి పవిత్రంగా
నొగపైనా
మేడిపైనా
కాడిపైనా
మట్టిపై మమకారాన్ని
పాదాలనిండా మోసుకుని వాలే
నా ప్రేమరెక్కల తూనీగా..!
వాలొచ్చునుగదా వొకతూరి
కావళ్ళుమోసిన నా భుజాలమీద
కాయలు కాసిన నా ముంజేతులమీద!
కల్మషాల కుటిలకుండ కాలవవతలే పగలగొట్టేసి
ప్రేమించడం నేర్చుకున్నాను
నేలని
గాలిని
గాలిపీల్చి నేలమీద బతుకు పాటపాడే
సమస్తాన్ని..!
తలపై
కలపై
లోలోపల అలలపై నువ్వలా వాలితేచాలు
నువ్వలా వాలితే చాలు…
ఎదవాకిళ్ళల్లో వాన కురుస్తుంది
పాదులపొత్తిళ్లలో
ప్రాణం మొలుస్తుంది.!
*

పల్లిపట్టు నాగరాజు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు