పేరు చివర సూఫీ ఎందుకంటే…?!

ఇస్లాం అనే ఒక మతం నుంచే వచ్చినా సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమని ప్రచారం చేయటానికి వచ్చిన మహా విప్లవం లాగా అనిపించింది.

ది నన్ను చాలామంది అడిగిన అడుగుతున్న ప్రశ్నే… నీ పేరు వెనుక సూఫీ ఎందుకుందీ? అని అడిగినవాళ్ళనే కాదు. సూఫీ అనే ఎందుకు? అని అడిగినవాళ్ళూ ఉన్నారు. రెండు పెద్ద వేపచెట్లు, చేదబావి, నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంగణం. 8 ఇంక్లైన్ కాలనీ దాటాక పెంచికల పేట అనే ఊరి వైపు ఉండే దారిలో ఉండేదా దర్గా. ఇంటర్ దోస్తు ప్రదీప్ గాడితో కలిసి వాడి దూదేకుల దోస్త్ షరీఫ్‌తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ పీల్చిన ఊదు వాసనలో ఉన్న ప్రశాంతత ఆకట్టుకుంది. అయితే అప్పటికి మసీద్‌కీ దర్గాకి తేడా కూడా తెల్వదు. ఊరిలో పీరీల ఆట, కుడుకల దండలు…. దూలా అన్న అరుపులు, డప్పుల మోతలు, పీరీలని మోసినప్పుడు మాత్రమే ఉర్దూ మాట్లాడే “పిస లింగయ్య తాత” అంతా యాదికొచ్చిన రాత్రుల్లో అది ఈ దేశపు నరనరాల్లో నిండిపోయిన తత్వమనీ, దానికి ప్రత్యేకంగా “సెక్యులరిజం” అనే పేరు వచ్చి పడిందనీ అనిపిస్తుంది.

సూఫీ అనే పదానికీ పీరీలకూ సంబంధం ఉన్నదా లేదా అని ఏ క్లారిటీ అప్పటికి లేదు గానీ. హిందూ ముస్లింలని కలిపి ఉంచే ఇంకేదో ఒక శాఖ ఉన్నదనే ఎరుక నా ఇరవైల్లో మొదలైంది. ఊళ్ళో ఉండే పెద బాద్దూర్, చిన్న బాద్దూర్ మామ వాళ్ల ఇళ్ళలో జెండా ఎత్తుకునుడు చూసినట్టే వాళ్లమ్మ గోర్బీయమ్మ పోశమ్మ గుడి ముందట కట్టే గుడ్డ చిలకలని కుట్టించుకోవటానికి అమ్మ దగ్గరికి రావటం నాకు ఇంకో ఆశ్చర్యం. “తుర్కోళ్ళకు పోశమ్మ గుడికాడ ఏంపని?, గఫార్ మామోళ్ళు, జమాల్ కాకోళ్ళు కూడా పోశమ్మ కాడికి వోతరా?” అని అడిగితే వీళ్ళు ముస్లింస్ కాదు, వీళ్ళు వాళ్లకు మనకు నడిమిట్లనే ఉంటరు అని చెప్పినప్పుడు పెద్దగా అర్థం కాలేదు.

ఆ తర్వాత మరో నాలుగేళ్ళకి కాజీపేట దర్గాలోకి అడుగు పెట్టాను ఊపిరాడనివ్వని ఆ ఊదుపొగల ఆవరణలోకి  తలమీద కర్చీఫ్ కట్టుకొని, ఊదు బెల్లం పొట్లాలు పట్టుకొని లోపలికి అడుగు పెట్టిన ఙ్ఞాపకం ఇప్పటికీ అట్లనే ఉంది. పక్కన నిలబడ్డవాళ్ళలో ఉన్న ఒకరకమైన ప్రశాంతమైన నిమ్మళత్వాన్ని గమనిస్తూ అక్కడ పక్కన కూచున్నాను. నన్ను తీసుకుపోయిన మా బావ మాత్రం అక్కడ చాదర్లు పరిచి ఉన్న సమాధి దగ్గరగా వెళ్ళిమరీ దాని మీద వాలిపోవటం విచిత్రంగా అనిపించింది. “దర్గ దేవుని గుడికాడికి పోతున్న, అత్తవారా?” అన్న మొగిలిబావ మాటని తల్చుకుంటే ఇప్పటికీ భారతదేశంలో ఉండే సెక్యులరిజం ఎవరిదగ్గరనుంచి ఎట్లా నిలుస్తూ వచ్చిందో అర్థమౌతున్నట్టు అనిపిస్తుంది. ఊరు వదిలి ఉద్యోగమంటూ పట్లంలకు వచ్చి పడ్డంక అక్కడక్కడా మళ్ళీ దర్గాలని చూడటం మొదలైంది.

నెల్లూరు గూడూరు దగ్గరలో ఒకసారి వర్క్ సైట్ దగ్గరలో ఉన్న దర్గా దగ్గర కూచున్నప్పుడు. ఒకబ్బాయి తెచ్చిచ్చిన ప్రసాదాన్ని తింటున్న పెద్దాయన్ని. “మీరు ప్రసాదం తినరు కదా అన్నప్పుడు. దాదాపు ఒక గంట పాటు మాట్లాడిన ఆ పెద్దాయన మాటల్లో మొదటిసారి సూఫీ అనే మాట విన్నాను. ఆయన కంజిర కొడుతూ పాట పాడి… నేను బయల్దేరుతున్నప్పుడు “వెళ్ళొస్తా” అంటే… మొహం పక్కకు తిప్పుకొని “ఎక్కడికి వచ్చావని, ఎక్కడికి పోతున్నావ్?” అంటూ ఉర్దూలో పాడిన పాట భాష, పదాలతో సంబంధం లేకుండా అట్లా గుర్తుండి పోయింది.

అయితే అప్పటికి నేను హిందూత్వ అనే పద్దతిని పాటించటం అంటే ఇతర ఆరాధనా పద్దతులని ద్వేషించాలి అనే భావనలోనే ఉన్నవాణ్ణి. గుడికి వెళ్ళి తలనీలాలిస్తూ ఉన్నవాన్ని. అదే సమయంలో మా ప్రాంతం నుంచే వచ్చి చీమకుర్తిలో ఇంకో కంపెనీలో పని చేసే ఆరీఫ్ పరిచయం, అతనితో కలిసి మజీద్ కి వెళ్ళటం, తెలుగు ఖురాన్ చదవటం మొదలైంది. అక్కడితో అటు హిందూ, ఇటు ఇస్లాంలోనూ దేవుడు అనే ప్రత్యేక భావన పూర్తిగా పోయినట్టైంది. ఖురాన్ చదివినా అల్లా మీద పెద్ద భక్తి ఏమీ కలగలేదు. అట్లా…. ఆ ఉద్యోగాన్ని వదిలి హైద్రబాద్‌కి పూర్తిగా వచ్చేసాక కవి యాకూబ్ దగ్గరికి తీశాడు. పైన గదిలో ఉన్న పుస్తకాల్లో  అట్టలు చినిగి ఉన్న పుస్తకంలో “సూఫీ తత్వము” లాంటి టైటిల్ ఏదో కనిపించి చదవటం మొదలు పెట్టాను. ఇంట్లోకి వచ్చేటప్పుడు “సూఫీ ఘర్” అనే అక్షర్రాలు చూశాక మరింత ఆసక్తి కలిగింది.

ఇస్లాం అనే ఒక మతం నుంచే వచ్చినా సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమని ప్రచారం చేయటానికి వచ్చిన మహా విప్లవం లాగా అనిపించింది. హిందూత్వ మూలాలున్న సిద్దాంతాలనూ కలుపుకోని. ఒక రూపాన్నో, ఒక మనిషి సిద్దాంతాన్నో కాక సంపూర్ణ దైవత్వాన్ని ఆహ్వానించిన “భక్తి ఉద్యమాల్లో సంపూర్ణత్వాన్ని పొందిన విధానంగా సూఫీ తత్వం కనిపించింది.” అన్నిటికన్నా నన్ను బాగా ఆకర్షించింది “భౌతిక శ్రమతో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని అన్వేషించాలి.” సోమరిపోతుకి దైవానుగ్రహం కలగదు అని చెప్పే సూఫీ ఫిలాసఫీ నన్ను ఆకర్షించిన విష్గయం. బహుశా అప్పటికే నన్ను కమ్ముకుంటున్న కమ్యూనిజం లాంటి సిద్దాంతాలకు దగ్గరగా ఉండటం కూడా నన్నాకర్షించిన విషయం. “నమాజ్, హజ్, రోజా’ల వంటి పద్దతులకంటే పాట ద్వారా దేవున్ని చేరవచ్చు” అని చెప్పటం కన్నా గొప్ప సామాజిక విప్లవం ఏమున్నది?

మనిషిని శ్రమనుంచి, అతని జీవన విధానాన్నుంచి దూరం చేయని, అతన్ని సోమరిగా మార్చని ఏమతమైనా మనిషికి చేసే హాని ఏమీ ఉండదు. నిజానికి, నేను వ్యక్తిగతంగా నమ్మని విషయాల్లో పునర్జన్మ, దైవ ఆరాధన వంటి చాలా విషయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ, నా ప్రమేయం లేకుండా పుట్టుక నాకో మతాన్నిచ్చింది. దానిని ఖండించటానికి మరికొన్ని మతాలను ఎదురుగా ఉంచింది తప్ప… అన్నిటినీ కలిపేసుకొని “ప్రేమే దైవం, శ్రమ కూడా దేవుడే” అని చెప్పిన హిందూ, ముస్లిం మూల సిద్దాంతాలని కలుపుకున్న సూఫీలు నన్ను ఆకర్షించారు. ‘నేను ఎవరికీ చెందని వాన్ని, కానీ అందరితోనూ ఉండాలనుకుంటున్నవాన్ని’ అని చెప్పుకుంటానికి అన్నట్టుగా సూఫీ అనే పదాన్ని చేర్చుకున్నాను. (నాకు రెండో జీవితాన్నిచ్చిన ‘యాకూబ్ సూఫీఘర్’కి చెందిన వాణ్నిగా కూడా ఆ పేరుని తీసుకున్నాను.)

అట్లాగని నేనేమీ పూర్తి సూఫీగా మారిపోలేదు. అక్కడ ఉన్న ఆధ్యాత్మికత అనే విషయంలో కొంత విభేదమూ ఉన్నది. మతం ఒక మత్తు మందు అని చెప్పిన మార్క్సే మరో సందర్భంలో దేవుడు అనే భావన ఒక సాంత్వన అని కూడా అన్నాడు. అట్లాంటి సాంత్వనకోసం ఏదైనా మతం మనిషికి “అవసరం” అనుకునే స్థితిలోకి వచ్చినప్పుడు అది సూఫీయిజం అవటమే మంచిది అనుకుంటాను. నన్ను నేను సూఫీగా చెప్పుకోవటం వెనుక నన్ను నేను “పెద్ద కవి” అని ప్రకటించుకోవటం ఉందని ఒకరిద్దరు మిత్రులు ఆరోపించారు. సూఫీ అనే పదం ఉందని నన్ను “ముస్లిం ఫాలోవర్” అనే ప్రయత్నమూ చేశారు. అయితే… నేను ఈ దేశ  ప్రతీకగా నన్ను నేను చెప్పుకోవటానికి మాత్రం ఆ రెండు మతాల సారాన్ని నాలో చూపించుకునే ప్రయత్నంలో భాగంగా… నా పేరు నరేష్కుమార్ సూఫీ అని చెప్పుకుంటూనే ఉంటాను.

*

నరేష్కుమార్ సూఫీ

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీ మాటల్లో నిజాయితీ ఉంది నరేష్… నువ్వు నిజంగా సూఫీ వే. నీ జీవితమూ అంతే నాకు తెల్సు , నీ ఆలోచనలు, నీ భావజాలం, నీ రాతల్లో ఉండే పదును అవన్ని నీ పేరు మార్పును సమర్దిస్తాయి. ఇవన్నీ లేకుండానే పేరు మార్చుకుంటే కాలం నవ్వుకుంటుంది.. కానీ నిన్ను చూస్తే గర్వపడుతుంది….

  • నీ వివరణ బాగుంది సూఫీ. ఎవరెన్ని అనుకున్నా నీదైన ప్రయాణం గొప్పది. మా అమ్మమ్మ, అమ్మలు నల్ల పోచమ్మను కొలిచేవారు. ఇది చదివాక నా ఎక్స్ పీరియన్స్ గుర్తొచ్చింది. అది పంచుకుంటాను.

  • Chala rojula nundi anukunna adugutha anukunna kani mire chepparu anna sufi ante name anukunna dhanivenuka intha undhi ani theliyadhu tnq vivarinchi chepparu

  • దాదాపుగా నా ప్రయాణాన్ని ఆ క్రమంలో నా తప్పటడుగులనీ, దిద్దుబాట్లనీ చూసిన మనిషిగా నువ్వు స్పందించడం సంతోషం డాని అన్నా.
    సంఘీర్ భాయ్…. ఎప్పుడు నీ జ్ఞాపకాన్ని చెప్తావో ఎదురు చూస్తాను. స్పందించిన మిత్రులకు, సోదరులకూ ప్రేమ 💝

  • మీ అనుభవాలు మీ ఉనికి మీ యోక్క ఆలోచనలు అమోఘం bro

  • నీ వెదురుకున్న ప్రత్యేక సందర్భాలు నా జీవితంలో ఎదురు పడకపోవచ్చు కానీ నీ అనుభవాలు నిన్ను ప్రభావితం చేసిన తీరు నీలో సుస్థిరమైన భావజాలం ఇంచుమించు నాలోను ఉండడం నా ఆలోచనలే నేను చదువుకున్నట్టు అనిపించింది థాంక్యూ బ్రదర్ ఫర్ యువర్ రైట్ అప్ వి నీడ్ ఇండియా and ఇండియా నీడ్స్ us

  • మీ సూఫీ యాత్ర చాలా స్ఫూర్తిగా ఉంది. మీ పేరు వెనుక ఉన్న ఈ పేరు ఏదో ఫ్యాషన్ గా పెట్టుకున్నారనుకున్నా. ఇప్పుడు తెలిసిెంది. ఈనాడు మనకి ఇటువంటిదే కావాలి. వేరే మతం మీద భక్తి లేకున్నా గౌరవం ఉండాలి. మీలాంటివారివల్ల మన సమాజం, దేశంలో శాంతి వెల్లి విరుస్తుందనే నమ్మకం ఉంది. నాకూ సూఫీ తత్వం చాలా ఇష్టం. రూమీని, ఇతర సూఫీ కవులనీ చదువుతూంటాను.

  • బాగా రాశారు నరేష్. William Dalrymple రాసిన Nine lives book ఒక సారి వీలైతే చదవండి. Pakistan లోని sindh ప్రాంతంలో సూఫీ తత్వము ఎదుర్కొంటున్న సమస్యల్ని చక్కగా చెప్పాడు. ఆ Lal peri(pari) మీకు ఖచ్చితంగా గుర్తు ఉండిపోతుంది.

    • ఆలస్యంగా చూశాను… తప్పకుండా ఆ పుస్తకం చదువుథాను. థాంక్ యూ సర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు