నాకు తెలిసిన మాటల్నే రాస్తున్నాను

ఈ మధ్య కాలంలో అనిల్ డానీ కవిత్వానికి అనేక అవార్డులు దక్కాయి. అవార్డుల మాట ఎలా వున్నా, కొత్త తరం కవిత్వం అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో అనిల్ డానీ పేరు తప్పకుండా వుంటుంది.

మారుతున్న తరానికి దొరికిన అరుదైన స్వరం- అనిల్ డానీ. కవిత్వంలో అయినా, వచనంలో అయినా అనిల్ దారి సరికొత్త ఆలోచనల అనుభూతుల ప్రయోగ మార్గం. శిఖామణి అవార్డు అందుకున్న సందర్భంగా అనిల్ డానీతో ఒక చిన్న సంభాషణ!

1.కవిసంధ్య యువ పురస్కారం పట్ల మీ స్పందన ఏంటి?

తెలుగు సాహిత్యం లో ఎన్నదగిన అవార్డు, శిఖామణి గారు ఇచ్చే సాహితీ పురస్కారం. అందులో గత ఏడాది నుంచి ఇస్తున్న యువపురస్కారానికి నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ కవి శిఖామణి గారు మరియూ పెద్దలు దాట్ల దేవదానం రాజు గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ అవార్డ్ కి నా పేరు పరిశీలనకి తీసుకోవడం పెద్దలు నగ్నముని గారు, శివారెడ్డి గారు ఆమోదించడం ఇంతకు మించిన అవార్డ్ ఏముంటుంది.

  1. ప్రముఖ విమర్శకులు లక్ష్మీ నరసయ్య గారు మిమ్మల్ని రాజకీయ కవి అన్నారు. మీరు ఎలా సమర్థించుకుంటారు?

నాకెంతవరకు తెలుసో,  అంత మేరకు  కవిత్వం మాత్రమే రాయడం  వచ్చు అనుకుంటాను. ఎవరి కవిత్వం అయినా మనం చదివినప్పుడు ఒక్కోక్కళ్ళకి ఒక్కో అర్ధం ధ్వనిస్తుంది. సామాజికమైన  ప్రతీ అంశమూ రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది అనుకుంటాను.

” నీ ఇంటికి వేసిన తాళానికి

గుర్తింపు కార్డు ఒకటి చూపించి లాగిన్ అవ్వాలి”అని రాస్తూ ఊపిరి పీల్చడానికి ఆధార్  అవసరమవుతుంది అని రాశాను.

ఇది మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా.

దీన్ని సామాజిక బాధ్యత అనుకున్నాను కానీ, అది రాజకీయంతో ముడిపడి ఉన్న అంశం కావడం వలన పెద్దలకు , విమర్శకులకి అలా అనిపించి ఉండొచ్చు. నాకైతే ప్రత్యేకంగా ఇలాంటి కవిత్వమే రాయాలని నియమం ఏది లేదు. కవిత్వానికి ఉండే బేసిక్ ఎలిమెంట్ ప్రజల పక్షాన రాయడం అనేది మాత్రమే నా థంబ్ రూల్ అనుకున్నాను, అదే రాస్తున్నాను. ఆకోవలోనే గర్భాలని తన్నిన కాళ్ళు అనే కవిత, నల్ల మరియమ్మ అనే కవిత రాశాను , ఈ రెండిటి నేపధ్యాలు సామాజిక పరమైనవే కానీ వాటి వెనక రాజకీయ కోణం ఉంది. ఆ రెండు కలసిపోయి ఉండడం వలన , నా శైలి వలన కూడా రాజకీయ కవి గా నేను కనబడవచ్చు.

లక్ష్మీ నరసయ్యగారు ఆధునిక వచన కవిత్వాన్ని క్షుణ్ణంగా చదువుతూ అధ్యయనం చేస్తున్నారు.

ఆయన అబ్జర్వేషన్ ప్రకారం  నన్ను రాజకీయ కవి అన్నారు అంటే బహుశా నా వస్తువు ఎంపికని బట్టి అని ఉంటారు.వారి మాటని ఒప్పుకుంటూనే నా మాటగా నేనెప్పుడూ దళిత, బహుజన పక్షపాతి గానే నా ఉంటాయి అని చెప్పగలను.

  1. సమకాలీన తెలుగు కవిత్వంలో మీ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే ఏం చెబుతారు?

నాకు తెలిసిన మాటల్నే రాసుకుంటు వచ్చాను, రాస్తున్నాను. ఆ మాత్రానికే నా కాంట్రిబ్యూషన్ ఉంది అనే పెద్దమాట చెప్పలేను.

నేను సాహిత్యానికి చాలా కొత్త. నాకు ఇప్పటికి వాక్యాన్ని సరిగా రాయడం రాదనే విమర్శ సీనియర్ల నుంచి ఉంది. నేను ప్రతీ విమర్శని స్వీకరిస్తాను. ఈ కాలమే కాదు ఏ కాలానికి చెందిన కవి కూడా తనకు తానేదో సాహిత్యానికో కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అని అనుకున్నా కూడా తప్పే అనుకుంటాను. మన పని మనం చేసుకుంటూ వెళితే , ఆ మార్గాన్ని,మన పని గమనాన్ని కాలమే నిర్ణయం చేస్తుంది. సాహిత్యం చాలా విలువైనది , కవిత్వం స్వయం ప్రకాశమానమైన ప్రక్రియ ఎవరూ దాన్ని వెలిగించలేరు, అంతా ఆ వెలుగులో ఉండి మాత్రమే తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు కాబట్టి ఇందులో కవిత్వానికి ఎవరి సహకారం అవసరం లేదు. అయినా నేను ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు లేదా, యువతకి సలహాలు ఇచ్చేస్థాయికే రాలేదు, ఇక కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడేదాకా ఎక్కడ..! రెండు పుస్తకాల వయసు మాత్రమే నాది.సమకాలీన తెలుగు కవిత్వం చాలా మంచి స్థితిలో ఉంది. చాలా మంది యువకవులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సమాజానికి అవసరమైన వాక్యాలేవో వస్తున్నాయి, అంతవరకు మనం గర్వపడొచ్చు.

4 అస్తిత్వ వాద ఉద్యమాల పట్ల మీ అభిప్రాయం చెప్పండి.

సానుకూల, సదభిప్రాయమే ఉంది. అస్తిత్వవాద ఉద్యమం అనేదానికంటే కూడా వర్గపరమైన ఉద్యమం అంటే బాగుంటుందేమో అనుకుంటాను. మనంఎప్పటికప్పుడు ఏడాదికి ఏడాదికి చిలవల పలవలుగా చీలిపోతూ ఉన్నాం, దళితులు, స్త్రీలు, బీసీ వాదాలు కూడా తాము మొదలు పెట్టిన దారి నుంచి ఇప్పుడున్న స్థితికి చాలా దారులుగా వేరైపోయాయి.  ఇప్పుడు అంతా ద్రవాధునిక సమాజం నడుస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పోరాటాలని అస్తిత్వం కోసం జరిగే వాటిగా పరిగణిస్తూనే వాటిలో జరిగే వర్గ పరిణామాలని, వాటితో పాటు అస్తిత్వాల ఉనికి కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. దళిత వాద ఉద్యమం మొదలైన తర్వాత అందులోనే వచ్చిన దండోరా ఉద్యమాన్ని , అలాగే స్త్రీ వాద దృక్పథాలు అందులోనుంచి మళ్ళీ ఆధునిక మహిళా జీవన స్థితిగతులు, ఒంటరి మహిళల హక్కులు, అలాగే ట్రాన్సజండర్స్ ల హక్కులు , ఇలా అనేక పార్శ్వాలుగా సమాజం ఉన్నప్పుడు ప్రతీ వ్యక్తి ఆలోచనలు, మనం గమనిస్తూ ఉండాలి, వాళ్ళ బాధామయ సందర్భాలని బయటకి తీసుకురావాలి,  కాబట్టి ప్రతీ సంఘర్షణ గమనించ దగిందే , మనం మన వాయిస్ వినిపించవలసిన సందర్భంలో వాళ్ళకి తోడుగా నావైన నాలుగు మాటల సంఘీభావాన్ని తెలుపుతాను. మాట్లాడవల్సిన సందర్భం వస్తే నా గొంతును వినిపిస్తాను.

అంతేకాని పైకి సమర్ధిస్తూనే లోపల మాత్రం ఆ వాదనలు పసలేనివని చులకన చేస్తూ మాట్లాడను. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయా సమూహాలు పట్ల బాధ్యతతో మెలగడం నా ప్రథమ కర్తవ్యం గా భావిస్తాను. నా మెజారిటీ కవిత్వం వెనుక దళిత దృక్పథం ఉంది, ద్రవిడ దృక్పథం ఉంది. నేను వాటిని సమర్ధిస్తాను.

5 . దళిత సాహిత్య విమర్శ పట్ల మీ పరిశీలన తెలియజేయండి.

దళిత సాహిత్య విమర్శ ఎప్పటికప్పుడు నూతనంగా మారుతూ వస్తుంది. సాహిత్యం లోకి దళిత అనే మాట ప్రవేశించిన తర్వాత ఎంతోమంది కవులు ఎంతో విలువైన  దళిత సాహిత్యాన్ని మనకి ఇచ్చారు, అందులో ఉండే లోతు ని అందులో ఉండే పెయిన్ ని వివరిస్తూనే, అది మారవాల్సిన దారిని కూడా దళిత సాహిత్య విమర్శ చెప్పింది, ఇంకా చెబుతూనే ఉంది. అయితే ఈ విమర్శ ప్రశంసలకి అతీతంగా కొంత దళిత కవిత్వం నడుస్తుంది. ఏ కవిత్వం అయినా విమర్శ ని అంగీకరించాల్సిందే. అయితే కొన్ని సార్లు కవుల యొక్క భావన , అనుభవం, జీవిత సంఘర్షణలు విమర్శకులకి అర్ధం కాకపోవచ్చు. అది రూపం లోనో లేక శిల్పం లోనో ఉన్న చిక్కు తప్పా ఇద్దరి లోపమూ కాదు. ఏ కవిత్వానికి అయినా విమర్శ తప్పని సరి అందులో దళిత కవిత్వంకి మినహాయింపు ఉండకూడదని నా ఉద్దేశం.

  1. మీ కవితల్లో మధ్యతరగతి జీవిత చిత్రణ కనిపిస్తుంది, కారణం ఏమంటారు?

అది నాజీవితపు గమనం లోనుంచి వచ్చింది మాత్రమే. నాకు తెలియని విషయాన్ని నేను రాయలేను.చేతకాదు కూడా. ఒక ప్రయివేట్ ఉద్యోగిగా ఉన్నాను. నాది మధ్య తరగతి జీవితమే. ఆకలి, ఆర్థిక అసమానతలు , ఆరోగ్య సమస్యలు ఇలా మధ్యతరగతి జీవితాల్లో ఉండే లోతు పాతులు అన్ని క్షుణ్ణంగా తెల్సు.వాటిని అనుభవించిన వాడిని. ఒక కవి సమ్మేళనానికి వెళ్లి వస్తూ మధ్యలో బైక్ ఆగిపోతే దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్లిన సందర్భం లోనుంచి పుట్టిన వేదనను అక్షరం రాయడం తెల్సిన వాడిగా ఆ అనుభవాన్ని కవిత్వం లోకి తీసుకురావాలి కదా. సాల్విన్ కోల్డ్ టాబ్లెట్ వరసగా వారం రోజుల పాటు వాడే అవసరం ఉన్నా మర్చిపోయి వెళ్లిన సందర్భం కేవలం నా ఒక్కడి జీవితం లోదే అనుకోలేదు,అనుకోను కూడా అది మధ్య తరగతి జీవితపు అసలు రంగు.అక్కడ కవిత్వం ఉండదు, వాస్తవం ఉంటుంది.అది నా చేతిలో అక్షరాలుగా మారి కవిత్వం అవుతుంది.

పైగా నా లోపల ఆ భావం నన్ను నిలబడనివ్వకుండా చేస్తుంది.అందుకే నేను నా జీవితాన్నే రాస్తాను. నేను ఆ నేపథ్యం లోనుంచి రాసిన కవితలు చాలామందిని ఆకర్షించాయి. వాళ్ళు ఆ కవిత్వాన్ని హత్తుకున్నారు. దళిత, బహుజన వాదం తో పాటుగా ఇలాంటి వస్తువును కూడా రాయడం అంటే నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి దొరికిన అవకాశంగా భావిస్తాను. దాన్ని మీరు గుర్తించి అడిగినందుకు సంతోషం.

  1. ఇప్పుడొస్తున్న కవిత్వం పట్ల మీ తక్షణ స్పందన తెలియజేయండి.

ఆరోగ్యకరమైన సాహిత్యమే వస్తుంది.ఒకప్పుడు మేం కవిసంగమం వేదిక నుంచి రాస్తున్న సందర్భంలో ఆ సమయానికి మేం కొత్త వాళ్ళం మా తర్వాత ఎంతోమంది కొత్తవాళ్ళు మాతో పాటుగా తెలుగు కవిత్వానికి, సారస్వతానికి జతగా కలిశారు.

కవిత్వం ఎంత ఉందో కవిత్వం కానిది కూడా ప్రజల్లో కలిసిపోయి ఉంది. రచయితల కన్నా పాఠకులు చాలా తెలివైన వాళ్ళు. ఏ కవిత్వాన్ని సొంతం చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు.

*

 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ఇంటర్వ్యూ. అనిల్ గారికి అభినందనలు.

  • అస్తిత్వవాదం, వర్గ దృక్పథం వేరు వేరు. సామ్యవాదులకి,దళిత బహుజన వర్గాలకి ఇక్కడే పేచీ.అంతా వర్గమే అయితే ఇక కుల వివక్షల మాటేమిటి ? ఇది గుర్తించ నిరాకరించడం వల్లే కమ్యూనిజం ఇక్కడ ఫలితమివ్వడం లేదు.
    ఇక్కడ భారతదేశంలో దళిత బహుజన వాదాలను వర్గం కళ్లద్దాలతో చూడడం హాస్యాస్పదం.

  • చక్కటి సాహిత్య ప్రశ్నలు ,ప్రశ్నలకు తగిన జవాబులు.. సారంగ వెబ్ సాహిత్య పత్రికకు ,మిత్రుడు గోపాలయ్యకు ,కవిసంధ్య యువపురష్కారగ్రహిత తమ్ముడు అనిల్ డ్యాని కి హృదయపూర్వక అభినందనలు

  • చక్కటి సాహిత్య ప్రశ్నలు ,ప్రశ్నలకు తగిన జవాబులు.. సారంగ వెబ్ సాహిత్య పత్రికకు ,మిత్రుడు గోపాలయ్యకు ,కవిసంధ్య యువపురష్కారగ్రహిత తమ్ముడు అనిల్ డ్యాని కి హృదయపూర్వక అభినందనలు

  • మంచి ప్రశ్నలు. సమాధానాల్నవి సమర్ధవంతంగా రాబట్టాయి.

    దళిత అస్తిత్వ వాదం పట్ల విమర్శ పట్ల అనిల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.

    గోపాల్ మీ ప్రయత్నానికి అభినందనలు

  • ఎడిటోరియల్ టీమ్ కి మిత్రుడు గోపాల్ కి కృతజ్ఞతలు

  • ఇద్దరు మంచి కవులు, ఎదుగుతున్న ఇద్దరు విమర్శకుల మధ్య సంభాషణ అనగానే అంతా చెవులు రిక్కించి వింటారు.

    ఇద్దరూ న్యాయం చేసారని నమ్ముతున్నాను.

    మీ ఇరువురికీ అభినందనలు

  • చాలా నేర్పుగా ఓర్పుగా సమాధానాలు చెప్పావ్ డానీ. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు ఇటీవలి అనేక వ్యాఖ్యలకు సమాధానాలుగా వచ్చాయి సమాధానాలు. ఇక కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడిన మాటలు నీ మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ సూచిస్తూ, చక్కటి సమాధానం గా వచ్చాయి. అభినందనలు. మీ ఇరువురికీ.. ఇంకోమాట. గోపాల్, నువ్వూ ఇద్దరూ ఒకేరకమైన మనస్తత్వం ఉన్నవాళ్లు. అది ఆద్యంతం ప్రతిఫలించింది.

    ఎవరైనా బాగా యారొగెంట్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ప్రశ్నలతో వేధించగలిగిన విమర్శకుడితో మీ ఇద్దర్నీ ఇంటర్వ్యూ చేయించాలని అఫ్సర్ గార్కి వినతి.😃

  • శుభాకాంక్షలు అన్న…మంచి ఇంటర్వ్యూ
    మీదైన అభిప్రాయం, ఆలోచన చెప్పారు.
    బావుంది.💐

  • చాలా గొప్ప ఇంటర్వ్యూ… తెలియని వాటికి తెలుసుకునేలా ఉన్నాయి సమాధానాలు..అభినందనలు అండి… మీరు ఇలాగే ఇంకా గొప్ప అవార్డ్స్ తెచ్చుకోవాలి అని కోరుకుంటున్న🙏🙏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు