ఒక అపరిచిత నగరంలో ………

దిహేడు వేల ద్వీప సమూహాల దేశం ఇండోనేషియా. వీటిలో కొంచెం పెద్ద ద్వీపమే అయిన సుమత్రాలో ఒకానొక అపరిచిత  నగరం మెడాన్. నేను అంతకుముందు ఆ పేరు విని ఉండలేదు కాబట్టి అపరిచిత  నగరం అంటున్నా కానీ నిజానికి ఉత్తర సుమత్రా ప్రావిన్స్ కు రాజధాని ఈ  మెడాన్. సుమత్రా ద్వీపంలో అతి పెద్ద నగరం, మొత్తం ఇండోనేషియా లో నాలుగవ అతి పెద్ద నగరం. వృత్తిరీత్యా ఈ నగరానికి వెళ్ళవలసి రావడంతో హైదరాబాద్ నుండి బయలుదేరి పదమూడు గంటలు ప్రయాణం చేసి కౌలాలంపూర్ మీదుగా మెడాన్ లోని కౌలానము ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాను. నిజానికి ప్రయాణ సమయం ఆరుగంటల కన్నా కొంచెం తక్కువ. కాకపోతే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఏడు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే ఏడుగంటల ఎదురుచూపులు ఏమంత విసుగు అనిపించలేదు. కాసేపు   లాంజ్ లో విశ్రాంతి తీసుకుని తర్వాత ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూడడంతో కొంత సమయం గడిచిపోతే మిగిలిన సమయం పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న హజ్ యాత్రికుల బృందాలను చూస్తూ గడిచిపోయింది.

ఈ హజ్ యాత్రికులంతా ఇండోనేషియా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు. ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా ఈ యాత్రకు బయలుదేరారు. ఒక్కో ఏజెన్సీ కు సంబంధించిన బృందం వారంతా ఒకే రంగు దుస్తులు వేసుకుని ఉన్నారు. ఒక్కో బృందంలో దాదాపు ముఫై నుండి యాభై వరకు సభ్యులు ఉన్నారు. నేను కౌలాలంపూర్ లో దిగి  కనెక్టింగ్ ఫ్లైట్ గేట్ దగ్గరకు చేరుకునేటప్పటికి అక్కడ పది మంది  కూడా లేరు. కాసేపటికి మెల్లగా ఈ యాత్రా బృందాలు రావడంతో ఎయిర్పోర్ట్ అంతా కోలాహలంగా మారింది. ఎరుపు,  పసుపు,ఆకుపచ్చ, నీలం ఇలా రకరకాల రంగుల బట్టలు వేసుకున్న ఎనిమిది బృందాల సందడితో ఆ ఏడు గంటల విరామ సమయం ఊరికే గడిచిపోయింది. అంతసేపూ ఎదురుచూసి విమానం ఎక్కితే నలభై ఐదు నిముషాలలో మెడాన్ లో దిగిపోయాను. కౌలానము అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మెడాన్ నగరానికి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది.

నాకోసం బుక్ చేసి ఉంచిన గ్రాండ్ సిటీ హాల్ హోటల్ సిటీ సెంటర్ లో ఉండడంతో అక్కడకి చేరుకోవడానికి గంటకి పైగానే పట్టింది. దారిలో కరెన్సీ ఎక్స్చేంజి కోసం ఆపమని డ్రైవర్ కు ముందే చెప్పి ఉండడంతో ఒక చిన్న కిరాణా దుకాణంలా ఉన్న ఫారెన్ ఎక్స్చేంజి ప్లేస్ దగ్గర ఆపాడు. లోపలికి వెళ్ళగానే  ఒకామె ఎదురు వచ్చి ఏమిటన్నట్లు చూసింది. డాలర్స్ ను ఇండోనేషియన్ రూపయా లోకి మార్చుకోవాలి అని చెబితే బహాస భాషలో ఏదో చెప్పింది. నాకు అర్ధం కాక మళ్ళీ చెప్పమంటే కాలిక్యులేటర్ తీసుకుని 14600 అని వేసి చూపించింది. అంటే ఒక డాలర్ కు అన్ని ఇండోనేషియన్ రూపయాలు ఇస్తాను అని. సరే అని కొన్ని డాలర్లు మార్చుకుని హోటల్ కి చేరుకున్నాను. చెక్ ఇన్ చేస్తుంటే డిపాజిట్ కట్టాలి మీరు చెక్ అవుట్ చేసేటప్పుడు తిరిగి ఇచ్చేస్తాము అన్నాడు రిసెప్షన్ లో వ్యక్తి. ఎంత అని అడిగితే వన్ మిలియన్ అనగానే పదిలక్షల రూపాయలా అని గుండెల్లో రాయిపడింది. అయితే ఈ భారీ సంఖ్యలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందనీ, కొన్నిరోజుల పాటు వాటిని మన ఇండియన్ రూపాయిలలో లెక్కించుకుని చూడమని ముందే కొందరు చెప్పి, అందుకు ఒక సులువైన మార్గం కూడా చెప్పారు. ఏదైనా వస్తువు లేదా సేవ విలువ చెప్పగానే దానిలో చివరి మూడు సున్నాలు తీసివేసి మిగిలిన సంఖ్యను ఐదుతో హెచ్చవేస్తే (ఇలా చేస్తే వచ్చే విలువ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది) దాని విలువ మన ఇండియన్ రూపాయలలో తెలుస్తుందని చెప్పారు. అది గుర్తు వచ్చి మనసులో టకాటకా లెక్క వేసుకుంటే ఐదువేలు అని వచ్చింది. హమ్మయ్య అనుకుని డిపాజిట్ కట్టేసాను.

రూమ్ కీ ఇస్తూ రిసెప్షన్ లో అబ్బాయి కొన్ని కండిషన్స్ చెప్పాడు. వాటిలో ఒకటి నాకు అర్ధం కాక మళ్ళీ చెప్పమని అడిగాను. దురియన్ ఫ్రూట్ హోటల్ రూమ్ లోకి తీసుకురాకూడదు అని చెప్పాడు. నేను ఆ దురియన్ పేరు ఎప్పుడూ  విని ఉండలేదు. పైగా పండ్లు తినే అలవాటు పెద్దగా లేదు. కాబట్టి, అలాగే అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయాను. కానీ ప్రత్యేకంగా ఈ దురియన్ గురించి ఎందుకు చెప్పారా అని ఆసక్తి అలాగే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నాకు కలిసిన ఇండోనేషియన్ సహోద్యోగిని ఈ దురియన్ గురించి అడిగాను. తాను ఈ పండు గురించి ఎన్నో విషయాలు  చెప్పడమే కాకుండా మేము బయటకి వెళ్ళినప్పుడు ఒక దురియన్ లు అమ్మే దుకాణానికి తీసుకువెళ్ళి మరీ చూపించింది. దక్షిణాసియాలోని కొన్ని దేశాలలో మాత్రమే పండే దురియన్ చూడడానికి మన పనసపండు లాగా ఉంటుంది. కాయనిండా ముళ్ళతో ఉండే ఈ పండు భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతుంది. ఆ వాసనను భరిస్తూనే అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా ఈ పండును తింటారు. కానీ దాని వాసన చాలామంది భరించలేరు కాబట్టే హోటల్స్ లోకి దురియన్ ను తెచ్చేటందుకు అనుమతి లేదు. ఇండోనేషియా మొత్తంలో దాదాపు అరవై రకాల దురియన్ లు పండుతాయట. అందులో ఉత్తర సుమత్రాలో పండే దురియన్ కు ఎంతో డిమాండ్ ఉంది. ఉత్తర సుమత్రా ప్రావిన్సులో పండే దురియన్ లను మెడాన్ దురియన్ అనే అంటారు. దురియన్ ఇక్కడి స్థానికులకు ఎంతో ప్రియమైన ఆహారం. వాటిని తినేందుకు ప్రత్యేకమైన దురియన్ కేఫ్ లు ఉన్నాయి. దురియన్ ను ఇష్టపడే మిత్రులంతా కలిసి వారాంతాలలో ఈ దురియన్ కేఫ్ లకు వెళ్ళి మంచి సంగీతం వింటూ అందరూ కలిసి ఈ పండును తింటూ ఆహ్లాదంగా గడుపుతారు. మీరు వీకెండ్ వరకూ ఉంటే మనం దురియన్ కేఫ్ కు వెళ్దాం అన్నది నా సహోద్యోగి నవ్వుతూ. కానీ దాని వాసన గురించి తెలిసాక దానిని నేను తినగలను అనిపించలేదు.

ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పంతేలాబు అనే ఊరికి వెళ్ళాను. మెడాన్ కు ఆనుకుని ఉన్న డెలి సెర్దాన్గ్ రీజెన్సీ లో ఒక సబ్ డిస్ట్రిక్ట్ ఈ పంతేలాబు. సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ హెడ్ ను కలిసాను. ఆయనను భూపతి అంటారు. భూపతి ఆ ప్రాంతపు పరిస్థితి అంతా వివరించారు. పందొమ్మిది గ్రామాలు, యాభై వేల జనాభా ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయం, చేపల వేట ప్రధాన జీవనోపాధులు. వరి, మిరప ఇక్కడ ప్రధాన పంటలు. మంచి సారవంతమైన నేలలు, నీటి సౌకర్యం ఉండడంతో పంటలు పుష్కలంగా పండుతాయి. అయితే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలకు నష్టం కలుగుతుంది. అది తప్పితే వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు.

ఆ తర్వాత ఆ సబ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న దేశ దేనై లామా అనే ఊరికి చేరుకున్న అక్కడ ఒక గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ఆఫీసుకు వెళ్ళాను. ఎంత అందంగా ఉందో ఆ ప్రదేశం! పొలాల మధ్యలో చక్కటి రిసార్ట్ లాగా ఏర్పాటు చేసిన ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక మూలన ఉన్న చిన్న బిల్డింగ్ లో కొంతమంది మహిళలు కుట్టుపని నేర్చుకుంటున్నారు. వారి దగ్గరకు వెళ్ళి కూర్చుని కాసేపు మాట్లాడితే (ఎలా అనుకుంటున్నారేమో, నాతో పాటు ఒక అనువాదకులు ఉన్నారు) తమకి ఇంకా కుకింగ్, ఏరోబిక్స్ లాంటివి నేర్చుకోవాలని ఉందని చెప్పారు. పిండివంటలు చేయడంలో ఎవరైనా శిక్షణ ఇస్తే కుటీర పరిశ్రమలాగా పెట్టుకోవాలని ఉంది అని కూడా కొందరు చెప్పారు. అదే ఆఫీస్ ఆవరణలో మరొక వైపు ఒక చెట్టు కింద కొంతమంది పిల్లలు వలయాకారంలో కూర్చుని పుస్తకాలు చదువుతున్నారు. ఒక యువతి వారికి ఏదో వివరిస్తుంది. వారి దగ్గరకి వెళ్ళి కూర్చుని ఈ పిల్లలకు స్కూల్ లేదా ఇక్కడ కూర్చుని ఇలా కథలు చదువుకుంటున్నారు అని అడిగితే ఇక్కడ బడులు ఒకటిన్నర వరకే ఉంటాయనీ, తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇక్కడకి వస్తారు అనీ చెప్పింది ఆ యువతి. ఆమె అక్కడకి దగ్గరలోనే ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ లో టీచర్. బడి తర్వాత ఈ కేంద్రానికి వచ్చి వాలంటీర్ గా పనిచేస్తుంది. సాయంత్రం వరకూ అక్కడ పిల్లలతో కథల పుస్తకాలు చదివించడం, ఆటలు  ఆడించడం,వ్యక్తిత్వ వికాస పాఠాలు నిర్వహించడం చేస్తుందట ఆ అమ్మాయి. మరొక యువకుడు కూడా అక్కడ వాలంటీర్ గా పని చేస్తున్నాడు. పిల్లలకు సంప్రదాయ మలై నృత్యంలో శిక్షణ ఇస్తున్నాడు. మరి కొంతమంది కాలేజీ పిల్లలు అక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ అందులో భాగంగా కాఫీ తయారు చేయడం నేర్చుకుంటున్నారు. పక్కనే ఉన్న పంటపొలంలో వేసిన టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పి చక్కటి కాఫీ కలిపి ఇచ్చారు. మరొక వైపు ఇంకొక యువతి కొద్దిగా సీనియర్ పిల్లలకు ఇంగ్లీష్ క్లాసులు తీసుకుంటుంది. ఇలా ఆ ప్రాంతమంతా పిల్లల ఆటలు, పాటలతో, వారి ఎనర్జీతో  ఎంతో ఆహ్లాదంగా ఉంది. తిరిగిరాబోయే సమయంలో కొంతమంది యువతులు,  మహిళలు వచ్చి నాతో ఫోటో తీసుకోవాలని ఉంది అని అడిగారు. వాళ్ళు ఇంతవరకూ ఎవరినీ చీరకట్టులో చూడలేదట. నా చీర బాగుందనీ, నాతో ఫోటో తీసుకుంటామనీ అడిగి ఒకరి తర్వాత ఒకరు నాతో ఫోటో దిగి కాసేపు నాకొక సెలబ్రిటీని అన్న అనుభూతిని ఇచ్చారు.

అక్కడ నుండి పక్కనే ఉన్న మరొక గ్రామానికి వెళ్లాను. అది ఒక వ్యవసాయ పర్యాటక గ్రామం. పాబ్లో నాగా అనే ఆ పర్యాటక ప్రాంతానికి ప్రతి వారాంతంలో మెడాన్ సిటీ నుండి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారట. నగరాలలో పుట్టి పెరిగిన పిల్లలకు వ్యవసాయం ఎలా చేస్తారు, రైతుల జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందంగా రూపొందించిన పార్క్ లాంటి ప్రదేశంలో పర్యాటకులు బస చేస్తూనే పక్కనే ఉన్న పొలాల్లో నాట్లు వేయొచ్చు, కలుపు తీయొచ్చు, కుప్ప నూర్చవచ్చు (ఆయా కాలాలను బట్టి). అందుకు అక్కడి వాలంటీర్లు సహాయం చేస్తారు. అలా వ్యవసాయం చేసిన అనుభూతి పొందడం కోసం వారు కొంత రుసుము చెల్లిస్తారు. అది ఆ పంట పొలాలు ఎవరివో ఆ రైతులకు అందుతుంది. అలాగే ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహార వసతి కోసం గానూ ఆ పొలాల గట్ల వెంబడి ఫుడ్ స్టాల్ల్స్ ఏర్పాటుచేశారు. వాటిలో స్థానికులు ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఆ ప్రాంతమంతా తిరిగి చూస్తుండగానే కపాలదేసా (గ్రామ అధికారి) అక్కడకి వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ఇలా ఒక వ్యవసాయ పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయాలనేది ఎంతో చక్కని ఆలోచన అంటే అది ఊరివారందరి ఉమ్మడి ఆలోచన అనీ, ఒక గ్రామసభలో గ్రామంలోని ప్రజలకు ఆదాయాలు పెరిగేందుకు మార్గాల గురించి చర్చ చేస్తుండగా ఈ ఆలోచన వచ్చిందనీ, కొంతమంది రైతులు స్వచ్చందంగా తమ పొలాలను ఈ పర్యాటకుల కోసం వినియోగించేందుకు ముందుకువచ్చారనీ ఆయన అన్నారు.

ఇలా స్వచ్చందంగా తమ పంట పొలాలను  పర్యాటక అభివృద్ధి కోసం,  ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం వెనుక ఆ ఊరివారి ఒక ప్రాచీన నమ్మకం ఒక కారణమని కూడా ఆయన అన్నారు. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా డ్రాగన్ నివాసమట. వేరెవరూ అటువైపు వెళ్ళేవారు కాదు. ఊర్లోని కొంతమందికి వ్యవసాయ భూమి లేక డ్రాగన్ ను వేడుకుంటే ఆ ప్రాంతాన్ని తాను వదిలి వెళ్ళిపోతాననీ, అయితే ఆ భూమిని కేవలం స్వలాభానికి కాక అందరి ప్రయోజనాలకూ ఉపయోగించాలనీ, లేదంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తాననీ డ్రాగన్ చెప్పిందట. అందుకే ఆ భూమిపై వచ్చే ఆదాయంలో కొంతైనా ఎప్పుడూ ఊరి అభివృద్ధికోసం ఖర్చు చేసేవారనీ, ఇప్పుడు ఈ ఆలోచన చేశామనీ చెప్పారాయన.

ఆయనకు, అక్కడి గ్రామస్థులకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి హోటల్ కు బయలుదేరాను. అప్పటికే సాయంత్రం అయిపోయింది. అక్కడి నుండి నేను బస చేసిన హోటల్ కు చేరుకోవడానికి గంట పైనే పడుతుంది. ఆ ముందు రోజు ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండీ సరైన భోజనం లేదు. అలవాటు లేని ఆహారం నోటికి అంతగా రుచించక ఆ రోజు సాయంత్రం ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్ లు ఉంటే నేరుగా అక్కడకి వెళ్ళి డిన్నర్ చేసేసి హోటల్ కి వెళదాం అని వాటి గురించి నా సహోద్యోగితో వాకబు చేసాను. ఆమె నన్ను కార్ లో ఎక్కించి డ్రైవర్ కి నన్ను లిటిల్ ఇండియా అనే ప్లేస్ కు తీసుకెళ్లమని చెప్పింది. అక్కడ చాలామంది ఇండియన్స్ ఉంటారు అనీ, అక్కడ ఇండియన్ భోజనం దొరకొచ్చు అనీ చెప్పి అక్కడకు వెళ్ళాక ఏదైనా ఇబ్బంది కలిగితే డ్రైవర్ నెంబర్ నుండి తనకు ఫోన్ చేయమని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది. డ్రైవర్ నేరుగా లిటిల్ ఇండియా దగ్గర ఉన్న రిచ్ అనే చిన్న రెస్టారెంట్ దగ్గరకు తీసుకువెళ్లి ఆపాడు. మెడాన్ అనే ఈ అనామక నగరంలో భారతీయులు ఇలా చిన్న ప్రాంతాన్ని తమకంటూ ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. కార్ దిగి చుట్టూ చూడగానే రెస్టారెంట్ కు ఎదురుగా మరియమ్మన్ టెంపుల్ అని రాసి ఉన్న అమ్మవారి గుడి కనిపించింది. ఆ రోజు నవమి. తెల్లారే విజయదశమి. అక్కడ స్థానికంగా ఉన్న భారతీయులు అంతా కలిసి ఆ గుడిలో నవరాత్రులను ఘనంగా జరుపుతున్నారు. ధగధగలాడే దీపాలతో, పువ్వులతో ఘనంగా అలంకరణ చేసిన గుడిని చూడగానే లోపలికి వెళ్లి చూడాలి అనిపించింది. విశాలమైన మండపంలో దాదాపు వందకు పైగా భారతీయులు లయబద్ధంగా శ్లోకాలు చదువుతూ ఉన్నారు. సరస్వతీ రూపంలో అలంకరించిన అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా ఉంది. మండపంలో ఒక మూలగా కూర్చుని కాసేపు ఆ మంత్రోచ్చారణను వింటూ గడిపి బయటకొచ్చాను. దసరా పండగకు ఇలా ఎక్కడో దూర దేశంలో ఉన్నాననే బెంగ కొంత తీరినట్లు అనిపించింది. తర్వాత గుడికి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో ఒక మసాలా దోస తిని (అది మన మసాలా దోస అయితే కాదు. స్థానికుల రుచికి తగినట్లు కస్టమైజ్ చేసిన మసాలా దోస) బయటకు వచ్చి మా డ్రైవర్ కోసం వెతుక్కుని ఈ లిటిల్ ఇండియా గురించి  ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటూ హోటల్ కు చేరుకున్నాను.

*

 

భారతి కోడె

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏదైనా ప్రదేశానికి వెళ్ళిరావడం అంటే నిజానికి అక్కడి ప్రజలను దగ్గరగా చూసి అనుభూతి చెందడమే! అదే మేము చెయ్యలేం! మీరు అలా చూసి మీ కళ్ళతో మాకు చూపించారు. తరువాయి భాగంకోసం ఎదురుచూస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు