నాదాన్ పరిందే… ఘర్ ఆజా !
వాడు
వక్రాసనమో
వామనావతారమో
వంచనల రాజకీయ కులటై
వాచస్పతులని వాగ్బంధనంలో బిగదీస్తూనే ఉంటాడు
అప్పుడే
అమ్మల వడిలో
ఆడుకోవాల్సిన కొన్ని పసిగుడ్లు
అండా సెల్లోనో ఆకురాలని ఆడవుల్లోనో
అకారణంగా అదృశ్యమై అనంతమైపోతూ ఉంటాయి
అక్కడ
రిథింలెస్
రేవ్పార్టీల్లో నలిగిన
యూనివర్సిటీ కారిడార్లిప్పుడు
కుడిఎడమలు మరచి మొత్తంగా మునగదీసుకున్న
గుండు సున్నాల్లా సర్కిల్స్లో సపసాలు మరచి
కాక్టెయిల్ వ్యర్ధగీతాలు ఆవేశంలేని ఆక్రోశంతో ఆలపిస్తూ ఉంటాయి
ఇక్కడ
గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లంలో
వేసినా కరగని కాఠిన్యాలు
కనిపించని మానసికరోగపు
మనోభావాలై పూచికపుల్లల్లా విరుగుతూ
సీరియల్ కన్నీళ్ళలోనో సిగారు ధూపంలోనో
ఎండిపోయిన బానిసల కళ్ళు చెమర్చడం మానేసి వట్టిపోతాయి
అప్పటికీ ,
కొన్ని హృదయాల్లో
ఖేదరాగాల భారంతో దాచిన నిప్పురవ్వ
బండబారిన అమానవత్వపు మంచుల్లో ఇరుక్కొని
అచేతనావస్థకి అనియంత్రిత జాగృతావస్థకి మధ్య వ్యధవాక్యంగా మిగిలిపోతుంది
కానేందుకో
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వమని
తేల్చి చెప్పిన కవి ఆత్మ మరో ఎర్రబడ్డ ఉదయానికి
కలవరపడుతూ సమాధిలోతుల్లో అస్థిమితంగా కదులుతూనే ఉంటుంది
నాదాన్ పరిందేలని
అన్యాయంగా మింగేసిన మరో రోజు
ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప
ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని
ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ
పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది
2015 జూన్ 25
*
డాంటే, ఓ డాంటే!
సమాధుల తలుపులు మూసాక తెరుచుకున్న
నరక ద్వారాల గురించి మాత్రమే రాసినప్పుడు
బ్రతికున్నప్పుడు మూసుకున్న మనసు ద్వారాల
వెనక కాలుతున్న శ్మశానాలు మర్చిపోయావా??
లేదా అజ్ఞానపు ఆజ్ఞలలో ఇరుక్కొని సూర్యుడి
నీడలన్నీ చీకట్లలో నిండిపోయినప్పుడు
సాల్వేషన్ ఆకర్షణలు అన్నీ పత్తికాయలే
ఆకర్షణ వికర్షణ అగ్ని వత్తిళ్ళల్లో కాలిపోతున్న
హృదయం డివైన్ కామెడిని మించింది అని భయపడ్డావా ?
ఇంటెలిజెన్స్ అంతా ఈగోల ముసుగుల్లో
దూరి పెయింట్ ఇట్ రెడ్ అంటూ
ప్రపంచం కక్షల ఎరుపులు చల్లుతున్నప్పుడు
అమానవత్వం అంటువ్యాధి లా ప్రబలుతుంటే
శారీరక యుద్ధాలు తట్టుకోలేని సున్నితపు మనస్సుల్లో
మానసిక హింస ని చూసి బిత్తరపోయి
బిగుసుకుపోయిన నీ కలం మరిక కదల్లేదా ?
దురదృష్టాలు తప్పుడు సంపాదనలా పెరిగిపోయి
పవిత్రాత్మల వైన్ లో విషం చుక్కలు కలిసాక
జీవితాలు చిరుజల్లుల్లా మనసు ని తడపడం మానేసి
కుంభవృష్టిలా ఎడాపెడా కొడుతుంటే బ్రతుకే నరకమైనప్పుడు
నరకం ఎక్కడో గీసుకున్న ఇల్యూజన్స్ లో కాకుండా
బ్రతుకు రిఫరెన్సుల అల్యూజన్స్ లోనే దాగి ఉందని
మర్చిపోతే ఎలా పిచ్చి డాంటే ?
అయినా ఇంత బాధ ఎందుకు ?
రెక్కలు తెగిన గువ్వ పిట్టలాంటి మనసు ని
ఒక సారి చేతుల మధ్యలోకి తీసుకొని
దిల్ యే తో బతా ..క్యా ఇరాదా హై తేరా ?
అని మార్దవంగా అడిగితే నరకంలో
కూడా నీకూ, నాకొక “లా విటానౌవా”
ది న్యూ లైఫ్ కి రాచ మార్గం పరిచేది కాదా ?
మరిచిపోయిన మృదుత్వాలు గుర్తు చేస్తూ
ఇంకోసారి బ్రతకటం నేర్పించేది కాదా ?
* Durante degli Alighieri, simply called Dante ( 1265–1321), was a major Italian poet of the Middle Ages. His Divine Comedy, originally called Comedìa and later called Divina by Boccaccio, is widely considered the greatest literary work composed in the Italian language and a masterpiece of world literature. La Vita Nuova (“The New Life”), the story of his love for Beatrice Portinari, who also served as the ultimate symbol of salvation in the Comedy.
సెప్టెంబర్ 11, 2014
ఇంకేమి కావాలి మనకి?
ఉహూ ….కారణాలేమయిన ?
జిందగీ మౌత్ నా బన్ జాయే సంభాలో యారో :
శరత్కాలం ఆకుల్లా కలలన్ని రాలిపడుతున్నపుడు
జ్ఞాపకాల వంతెన పగుళ్ళు పాదాలని
సుతిమెత్తగానే అయినా కోస్తూ ఉంటే
గుండె మంటలను చల్లార్చే మేజిక్ నైపుణ్యాలు
నిశ్శబ్దం గా నిద్ర పోతూనప్పుడు
తడి ఆరని కళ్ళు రాత్రి పాటల నైటింగేల్ లా
రెప్పలు అలారుస్తూ
ప్రపంచాన్ని ప్రేమించాల్సిన చిన్న హృదయం
ఒకే వ్యక్తి ప్రేమ కోసం మరింత చిన్నబోతుంటే
నైతికతల జలదరింపు లో శూన్యమైన
ఆకుల గుస గుస లలో ఒక ఉత్కంఠభరితమైన నిట్టూర్పుతో
శరదృతువు ఇంకోసారి ఎర్రబడినప్పుడు
ఒంటరి రాత్రుల నిదురలనెందుకు లేపటం ?
ఎన్నిసార్లో
చీకటి కి మెలుకువకి మద్య మగతల్లో
జీవితాన్ని ఇంకో సారి దగ్గర కి తీసుకొవాలని
గుండెల్లో దాచుకొని హత్తుకోవాలని
మునివేళ్ళతో తన బుగ్గలను మృదువుగా సృశించాలని ,
తన చెంపల మీద కన్నీటి మచ్చలను నెమ్మదిగా తుడవాలని
తన కి మాత్రమే వినపడేటట్లు సుతిమెత్తగా
మృదు స్వరం లో లాలి పాడి నిద్రపుచ్చాలి
అని ఎన్ని సార్లు మనసు కొట్టుకుంటుంది
బహిష్కరించలేని బాధలు భూమ్మీద
ప్రతి ప్రాణికి విజయపు ఓటములంత నిజం
అని చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటాను
అలాగే
ఉదయపు ఎండలు శరీరం తో ఆటలడుతున్న వేళ
ఊహల ఉచ్చుల ఇమేజ్ అద్దం లో ఉండదని
ఫెయిరీ టేల్ కవిత్వం కనులముందు కనిపించదని
నిజం అబద్ధం కి మధ్య గీతలు చిన్నవని
మనసుకు గోలుసులేసి అవి తమతో
లాగుతూ ఉంటాయని
గుండె చప్పుడు స్థిరంగానే ఉంటుంది
కాని (వి)శ్వాసలే విరిగి ముక్కలవుతాయని
మనసుకు మనసుకు మద్య ద్వేషాల చైనా వాల్
స్థిరంగా , బలంగా ఉండిపోతుందని
స్మైల్స్ మద్యలో మైళ్ళ దూరం దాగుందని
చెప్పాలి అని గుండె విప్పాలి అని అనుకుంటాను
ఉహూ ….కారణాలేమయిన ?
విరిగిన అద్దం ముక్కల ను అతికించి
పైన ఎంత gloss పెయింటింగ్ చేసినా
నవ్వుతున్న పగిలిన పెదవుల లా
గాయాల వికృతత్వం కనిపించకుండానే
కనిపిస్తూ ఉన్నంతవరకు
వర్షించని నల్ల మబ్బుల్లో నీళ్ళు ఉంటాయని
కనిపించని ఆకాశం ఉక్రోషంలో గర్జిస్త్తే
వర్షం పడుతుంది అని
ముసుగుల వెనక దాగిన
గుండెల్లో ఎక్కడో వినిపించని
మానవత్వం చిరుమువ్వలు సవ్వడి చేస్తూంటాయని
నమ్మని , నమ్మించలేని వెక్కి వెక్కి ఏడ్చే వెర్రి గుండె
మౌలా మేరి లేలే మేరి జాన్ పాడే పాటల్లో
కష్టం వెనక మిగిలిన నిజం ఒక్కటే
అబ్సొల్యూట్ ట్రూత్స్ అంటూ లేని జీవితం లో
వందలు గా వేలుగా కూడి చేరి
గూడు కట్టిన నిస్పృహల ప్రయాణం
దేవుడి మేనిఫెస్టో నుండి
రొమాంటిక్ మేనిఫెస్టో దార్లను వెతుకుతూ
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కి చేరి ఓడిపోయినపుడు
కన్నీళ్ళకు తప్ప యూనివర్సల్ ఈక్వాలిటీ ఎవరికీ సాధ్యం ?
జిందగీ తో జి తే జి మౌత్ బన్ గయా
అబ్ క్యా సంభాల్నా మేరె దోస్త్ ?
నవంబర్ 27, 2013
చిత్రం: ఏలే లక్ష్మణ్
Add comment