తెరుచుకో ఇక హాయిగా!

ఏరువాక శీర్షిక కవితల ప్రత్యేకం. మీ కవితలు editor@saarangabooks.com కి పంపించండి!

1

నీ మూసిన మనసును తెరుచుకో ఇక
నిశ్చింతగా నీ తలుపులు తెరుచుకో
నీకోసం తపనపడే కనులు నిన్ను తాకవు
నీ స్పర్శకు చాచే చేతులు లేవు
నోరారా నీ పేరు పిలిచే పెదవులు పలకవు

ప్రణయ మారుతాలు చొరబడతాయని భయం వద్దు
నీ వాకిట్లోని ఆశల పూలు పూసే మొక్క వాడిపోయింది
ఇప్పుడప్పుడే చిగురించే అవకాశమూ లేదు

నిర్లక్ష్యాన్ని తట్టుకునీ తట్టుకునీ అలసిపోయింది
కన్నీళ్ళను కార్చి కార్చి ఎండిపోయింది
నీ కోసం ఎదురు చూసి చూసి వగచిపోయింది
ఎన్నాళ్ళని అలా బతుకుతుంది పాపం!

నిన్ను చూడాలనీ…ఆకాశం అంచులు తాకాలనీ
పదేపదే నీ తలుపుల్ని తట్టే వాళ్ళెవరూ లేరు
నీ చుట్టూ నువ్వు గీసుకున్న గిరిలో
నువ్విక హాయిగా తిరగొచ్చు

సగం ప్రాణాలతో తిరిగిన ఆశ చచ్చిపోయింది
నీకోసమే కాచుకుని కూర్చున్న ఒక జీవితం ముగిసిపోయింది
ప్రేమే లోకం అనుకున్న ఆమె అలల తాకిడికి కొట్టుకుపోయింది
నీ మూసిన మనసును తెరుచుకో ఇక హాయిగా

మూసిన తలపుల మాటు నుంచి ఎన్నాళ్ళీ ప్రపంచాన్ని చూస్తావు
నీ కోసమే పరితపించిన గుండె వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో మూల చస్తూ బతకడానికి
ఎవరెలా పోతేం నీకేం…
నీ మూసిన మనసును తెరుచుకో ఇక హాయిగా

*

2

సామీప్యం

ఎక్కడో దూరంగా నువ్వు
ఒకనిముషం దిగులు
పక్కనే ఉన్నావన్న తలపు
మరునిమిషమే సాంత్వన
జీవితం మోహాల సమాహారం అంటావు
నాకు మాత్రం శాశ్వత సుందర స్వప్నం

ఒంటరిగా నిశ్శబ్దంలో కూరుకుపోయినప్పుడు కూడా
ఎన్నో స్మృతులు
నీతో మాట్లాడినవీ, పోట్లాడినవీ
నీ నవ్వులవీ,
నువ్వొచ్చిన సంబరాలవీ
నువ్వు వెళ్ళిన కన్నీళ్ళవీ
నాలోనూ, నా ఖాళీతనంలోనూ
అల్లుకుపోయింది అంతా నువ్వే

ఒకరి అవయవాలు
వేరొకరి శరీరంలో చిక్కుబడ్డం సరే
నీకై నేను కట్టుకున్న ఈ చిన్ని
ప్రపంచంలో నేనే నువ్వైపోయాక
నా ఊపిరే నీ గుండెల్లోంచి
వస్తుంటే ఇంకా నీకుదూరంగా
ఎలా ఉండడం….?

అనిశ్చల సాగరంలో
మూడు పడవలు
ఒకదానిలో నువ్వూ
మరొకదానిలో నేనూ
మూడవదానిలో మనిద్దరం
కలిసి తీరం చేరేదెన్నటికో
గమ్యాన్ని ఆస్వాదించేదెప్పటికో!

*

మనోజ్ఞ ఆలమూరు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు