కీలు గుర్రం –లక్క రథం

రానుర్రాను
రాజు గుర్రం గాడిదయింది

తరాజు
నా రాజు అయింది
బాట్లు లేని త్రాసుతో
జోకడం బ్రోకర్లా మారింది

దర్బార్రాగం కచేరి
గార్దభ గాండ్రిపుల్లా మారింది
ఇంట్లో దొంగలు పడుతుంటే
సాదుకం శునకం మొరుగాల్నా
పదవిలో ఉన్న సూడిద గాడిద
ఒట్టు ఓండ్ర పెడుతుంది

కూట్లె రాయి తీయ లేనోడు
ఏట్లె రాయి తీస్తానని కాయిస్ పడి
ఏ కాడికో ఓ కాడికి చెడి
మస్తు మస్తుగా
ఇచ్చంత్రాల ఇకమతుల  పడుతుండు

మొదటి రోజు సినిమా విడుదలైనట్టు
హంగు ఆర్బాటం చేస్తుండు

బలం లేని కథతో
స్టార్ హీరో హీరోయిన్ల  క్యాపెయిన్ చేసినా
అట్టర్ ప్లాప్ కానున్న ఫిలింలా
హీరో పక్కన
అత్తిరి బిత్తిరి వ్రాయసగానిలా
హీరోయిన్ చెంతన నత్తి చెలికత్తెలా

ఎంతకూ ఆకం రాని బెల్లంలా
పైత్యానికి ఒకారానికి అల్లంమురబ్బా
మా కుంటి పోషయ్య
బస్సు బస్సు తిరిగి అమ్మినట్టు
తావు తప్పిన మేతావులు

కీలుగుఱ్ఱం
ముందుకు పోదు వెనుకకు రాదు
లక్క రథం
సురుకు తాకితే మలమల మాడిపోతుంది

 

మనిషి సరుకై పోతున్నప్పుడు

ఏది మిగిలిందని
ఏమి మిగిలిందని
మనిషీ వస్తువు భూమి
నీళ్లు గాలి వైద్యం విద్య
సమస్తం  అమ్మకం సరకై పోయాయి

‘కలం’కారీకులు అలంకారప్రాయమయ్యారు
‘ఛా’నళ్లు పత్రికలు సోషియల్ మీడియా
ప్రజాస్వామ్యం సేవలో తరించి
యధా శక్తి యుక్తిగా
స్వామి భక్తి పారవశ్యంతో
పులకించిపోతున్నాయి

ఏమి అన్నదని  ఏమి ఉన్నదని
ప్రశ్న ఎన్నడో జవాబుగా నిలిచిపోయింది
అంతా మాట పోగొట్టుకోవద్దు
లేని మర్యాద ప్రదర్శిస్తే
నిజం చెప్పే వాళ్ళు ఎవరు
అమాయకులకు సామాన్యులకు
కనువిప్పు కలిగించే వారెవరు

ముందు బావండ్ల ఇల్లు
వెనుక  వైశ్యుల గృహం
మధ్యలో కోడి పిల్ల మాయం చేసింది ఎవరు అంతా శాకాహారులే మాంసాహారం ముట్టనే ముట్టరు
పంచుకుతిన్నది ఎవరు  ఎంతకూ  తేలని లెక్క

టీవీ ఒక సేల్స్  రిప్రజెంటేటివ్
ప్రభుత్వం ఒక బ్రాండ్ అంబాసిడర్

ఇక ఇప్పుడు ఉన్నదంతా
ఒకే ఒక్క మార్కెటింగ్ చేయడం
ఎలాగో నేర్చుకోవాలి
అది ప్రజాస్వామ్యమైన
అది రాజకీయమైనా
నమ్ముకోవడం కాదు
ఏదైనా అమ్ముకోవడం ముఖ్యం

శ్రమ పరిశ్రమ రూపాయల్లోకి
సరాసరి పరావర్తనం చెందుతుంది
అవస్థ పడుతూ వ్యవస్థ అంతా
ఏకంగా లాభనష్టాల ఖాతాల్లో ప్రతిబింబిస్తుంది.

*

చిత్రం: సృజన్ రాజ్ 

జూకంటి జగన్నాథం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు