ఒంటరిగా దారి వెతుక్కుంటూ వెళ్లి……..

మెడాన్ నగరానికి వెళ్లిన మొదటి రోజు తప్ప తర్వాత రెండు రోజులూ రాత్రి భోజనం లెబనాన్ అనే రెస్టారెంట్ లోనే. అక్కడ ఒక్క చోటే సరైన భారతీయ భోజనం దొరికింది మాకు. పగలంతా బయట  గ్రామాలలో, మెడాన్ నగరంలో తిరుగుతూ దారిలో ఎక్కడో  ఒక చోట ఇండోనేషియన్ భోజనం  చేసేయడం, సాయంత్రం తిరిగి హోటల్ కు బయలుదేరాక మా డ్రైవర్ ను నేరుగా లెబనాన్ కు తీసుకువెళ్ళమని అడిగి అక్కడ తిన్నాక హోటల్ కి చేరుకోవడం. ఇలా రెండురోజులు చేసాక ఈ లెబనాన్ కి, మేము ఉంటున్న హోటల్ కి ఎంతో దూరం లేదనీ, మూడు కిలోమీటర్లే కాబట్టి బయట మనం తినేదాకా డ్రైవర్ ను  వెయిట్  చేయించకుండా నడిచి వెళ్ళిపోదామని అనుకున్నాం నేను, నా సహోద్యోగి.

నాలుగవ రోజు ఉదయం పనులు ముగించుకున్నాక డ్రైవర్ ను నేరుగా హోటల్ కు తీసుకువెళ్ళమని అడిగాను. ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా సహోద్యోగి వేరే పని మీద  మరొక చోటకి వెళ్లారు. డిన్నర్ టైం అవగానే మూడురోజుల నుండీ వెళ్తున్నా కదా దారి తెలుస్తుందిలే అనుకుని  ఎందుకైనా మంచిదని గూగుల్ మ్యాప్స్ లో లెబనాన్ రెస్టారెంట్ అని లొకేషన్ సెట్ చేసుకుని నడుచుకుంటూ బయలుదేరా. కొంతదూరం వెళ్ళాక దారి తెలియలేదు. గూగుల్ మ్యాప్ కూడా పనిచేయకుండా ఆగిపోయింది. ఆ దారిలో అన్నీ వాహనాలు వెళ్లడమే తప్ప నడిచి వెళ్లేవారు లేరు. అక్కడక్కడా ఉన్న పెద్ద భవనాల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరకు వెళ్లి లెబనాన్ అని అడిగితే వాళ్లకు తెలియలేదు. హార్వర్డ్ మాల్ లో ఉంది ఈ రెస్టారెంట్ అని గుర్తు వచ్చి మాల్ పేరు చెబితే యేవో డైరెక్షన్స్ బహాసా భాషలో చెప్పారు కానీ నాకు అర్ధం కాలేదు. అక్కడ మెజారిటీ ప్రజలకు ఇంగ్లీష్  రాదు, కొంచెం కూడా అర్ధం కాదు. కనీసం లెఫ్ట్, రైట్ పదాలు కూడా రావు. ఇక నాకు డైరెక్షన్ ఏమి చెబుతారు?

దారీ, భాషా ఏదీ తెలియని చోట వెనకా ముందూ చూసుకోకుండా అలా వచ్చేసినందుకు నన్ను నేను తిట్టుకుని చివరకి ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఏ దిక్కు చెయ్యి చూపించారో ఆ వైపు వెళ్లి కొంచెం ముందు మరొక జంక్షన్ దగ్గర మళ్ళా  ఎవరినో అడిగి అలా ఇద్దరు ముగ్గురిని అడిగి వాళ్ళు ఎటు వైపు వేలు చూపిస్తే అటు నడుచుకుంటూ వెళ్లి ఎట్టకేలకు లెబనాన్ చేరుకున్నా. తిన్నాక మళ్ళీ నేను ఉన్న గ్రాండ్ సిటీ హాల్ కు అలాగే ఆ పేరు అడుగుతూ వేలు చూపించిన వైపు వచ్చేసి హోటల్ కి చేరుకున్నా.  ఒక పూటకి ఉన్న హోటల్ లోనే ఏదో ఒకటి తినక ఇలా నానా తిప్పలు పడీ ఇక్కడికే రావాలా అనుకున్నాను కానీ అలా ఒంటరిగా దారి వెతుక్కుంటూ వెళ్లి ఒక్కదాన్నే ఇష్టమైనవి ఆర్డర్ చేసుకుని తినడం ఏదో ఎచీవ్మెంట్ లాగా అనిపించింది.

మరుసటి రోజు ఉదయాన్నే మెడాన్ నగరంలోని ఇండియన్ కాన్సులర్ జనరల్ తో నాకు అపాయింట్మెంట్ ఉంది. నన్ను, నాతో పాటు వచ్చిన ఇండోనేషియా అమ్మాయి మెటా ను కాన్సులర్ జనరల్ శుభమ్ సింగ్ చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి భారతీయుల స్థితిగతుల గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. ఒక చక్కని లెమన్ టీ ఇప్పించి మేము ఇంకొంత మంది స్థానిక వ్యాపారవేత్తలను కలిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని తన సెక్రటరీ ని పిలిచి అప్పటికప్పుడు కొందరికి ఫోన్లు చేయించి వాళ్ళతో అపాయింట్మెంట్ లు ఫిక్స్ చేశారు. ఆయన దగ్గర సెలవు తీసుకుని నేరుగా ఆయన వెళ్ళమన్న కడిన్ (ఇది మెడాన్ నగర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేరు) ఆఫీస్ కు వెళ్లాం. అక్కడ ఉన్న ఇండోనేషియన్ వ్యాపారవేత్తలు స్థానిక ఆర్ధిక వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇండోనేషియా అనగానే అందరికీ జకార్తా, బాలి వంటి నగరాలే గుర్తు వస్తాయి కానీ మెడాన్ మొదటి నుండీ పారిశ్రామిక నగరం  అనీ, ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉండడంతో మొదటి  నుండీ మెడాన్ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న నగరం అనీ చెప్పారు.

దాదాపు 300 మంది వ్యాపారవేత్తలు తమ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారనీ వారిలో మెజారిటీ సభ్యులు పామాయిల్, రబ్బర్, కాఫీ, వక్కలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన  వ్యాపారాలు చేస్తున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా పుంజుకుంటుందనీ, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగే యువతకు ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయనీ చెప్పారు. యూత్ కి ఏమైనా స్కిల్ ట్రైనింగ్ అవసరం ఉందా అని అడిగితే  ఇంగ్లీష్ కూడానేర్పిస్తే బాగుంటుందనీ, ప్రతి రెండు అడుగులకీ ఒక కాఫీ షాప్ ఉన్న నగరం కాబట్టి మంచి కాఫీ తయారు చేయగలిగిన వాళ్ళ అవసరం కూడా బాగా ఉందనీ చెప్పారు.

కడిన్ నుండి వచ్చాక అశుతోష్, నరేంద్ర, గజానన్ అనే ముగ్గురు ఇండో-ఇండోనేషియన్ వ్యాపారవేత్తలను కలిసాను. వీరిలో అశుతోష్ పామాయిల్ ఎగుమతుల వ్యాపారం చేస్తుంటే గజానన్ ఒక ఎఫ్ఎంసిజి కంపెనీ నడుపుతున్నారు. ఇక అందరిలోకి పెద్దవారు నరేంద్ర ‘దాదాపు  నలభై ఏళ్ళ క్రితం కర్ణాటక నుండి ఇక్కడకి వచ్చాను’ అని చెప్పారు. నరేంద్ర  నాన్నగారు ఇండోనేషియా నుండి దిగుమతైన వక్కలతో కర్ణాటకలో వ్యాపారం చేసేవారు. అప్పట్లో దిగుమతులపై విధించిన నిషేధాల వలన వారి వ్యాపారం దివాళా తీసి కుటుంబం అప్పులపాలయ్యింది. మళ్ళీ వ్యాపారాన్ని పట్టాలెక్కించే బాధ్యత తీసుకున్న నరేంద్ర మెడాన్ నగరానికి వచ్చి, అక్కడే స్థిరపడి, అదే వ్యాపారం చేసే నగరంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది నా సిద్ధాంతం అని నవ్వుతూ చెప్పారాయన.

ఆ రోజు సాయంత్రం మళ్ళీ లిటిల్ ఇండియాలో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు కాన్సులర్ జనరల్ ఆఫీస్ వాళ్ళు. స్థానిక ఇండో-ఇండోనేషియన్ కమ్యూనిటీ పెద్దలను కలవమని వాళ్ళు పంపారు. లిటిల్ ఇండియా లో ఉన్న చిన్న ఇండియన్ కెఫె లో మీటింగ్. ఆ కెఫె  నిర్వాహకులు, మరొక ఇద్దరు పెద్దలతో పాటు జూలియస్ రాజా అనే తమిళ కమ్యూనిటీ లీడర్ ఆ మీటింగ్ లో ఉన్నారు. అక్కడి భారతీయుల, ముఖ్యంగా బలవంతంగా కూలీలుగా అక్కడకి తీసుకురాబడి అక్కడే స్థిరపడ్డ తమిళుల స్థితిగతుల గురించి, వారికోసం కమ్యూనిటీ పెద్దలుగా వారు చేస్తున్న కార్యక్రమాల గురించి జూలియస్ రాజా చెబుతుంటే ఆయన మాట్లాడే స్టైల్, చేతులకి ఉన్న ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు చూస్తూ కూర్చున్న నాకు ఆయన అక్కడి లోకల్ రజనీకాంత్ లాగా కనిపించారు.

అక్కడి తమిళులతో మెజారిటీ భాగం టెక్స్టైల్ షాప్ లలో పనిచేసేవారే. కొంతమంది సెక్యూరిటీ గార్డులుగా, ఫ్యాక్టరీలలో కూలీలుగా పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ లుగా పనిచేయాలనేది అక్కడ చాలామంది యువకులకు కోరిక. కానీ అక్కడ అది అంత తేలిక కాదు. మనలాగా ప్రైవేట్ ఏజెన్సీలు ట్రైనింగ్ ఇచ్చేసి గార్డులుగా నియమించడానికి వీలు లేదు. సెక్యూరిటీ గార్డ్ కావాలనుకుంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించే ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక లైసెన్స్ తీసుకోవాలి, అది తరచుగా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే ఆసక్తి ఉన్నా ఆ పనిచేయలేక చాలామంది బట్టల షాపులలో పనిచేస్తున్నారు. బాతిక్ బట్టలకు అక్కడ ఎంతో ఆదరణ ఉంది. అవి వారి సంప్రదాయ దుస్తులు. బాతిక్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడమే కాక తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇండోనేషియన్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బంది ప్రతి శుక్రవారం ఖచ్చితంగా బాతిక్ ధరించాలని నిబంధన విధించింది. ప్రభుత్వ కార్యాలయాలే కాక ప్రైవేట్ కార్యాలయాలలో, బయట సాధారణ పౌరులు కూడా శుక్రవారం రంగు రంగుల బాతిక్ దుస్తులలో కనిపించారు. అది చూసాక మనకి కూడా ప్రభుత్వం అలా వారానికి ఒకరోజు చేనేత దుస్తులు ధరించడం తప్పనిసరి అనే నిబంధన పెడితే బాగుంటుంది కదా అనిపించింది.

ఇలా వరసగా ఉన్న మీటింగ్ ల మధ్యలోనే మెటా, నేను కలిసి దారిలో కనపడ్డ ఒక మ్యూజియంలోకి దూరిపోయి అక్కడ పదిలపరిచిన పురాతన వస్తువులను, ఆ ప్రాంతచరిత్రను తెలిపే అనేక పెయింటింగ్ లను కాసేపు పరిశీలించాం. ఆ పెయింటింగ్ ల కింద వివరణ ఉన్నా అది బహాసాలో ఉండడంతో నాకేమి అర్ధంకాలేదు కానీ ఆ బొమ్మల ద్వారా అర్ధమయ్యింది ఏమిటి అంటే అంతులేని ప్రాకృతిక సంపద ఉన్న ప్రాంతం కావడంతో విదేశీ దండయాత్రలను వరుసగా ఎదుర్కొన్న నేల ఇది. అన్ని దండయాత్రలు ఎదుర్కొన్నా, ఎంత సంపద పోగొట్టుకున్నా తిరిగి నిలదొక్కుకుని ఆర్ధిక వ్యవస్థను పటిష్టంగా పునర్నిర్మించుకున్నారు. అక్కడి ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఎంతో ఎక్కువ. మ్యూజియం బయటకి వచ్చాక కాసేపు బేచ్చా (స్థానిక మోటార్ రిక్షా) ఎక్కి మార్కెట్ లో తిరిగాను. మార్కెట్ నిండా చిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంది మహిళలే. స్త్రీల హక్కుల పట్ల ఏ మాత్రమూ సహానుభూతి లేని ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా ఇండోనేషియన్ ముస్లింలలో స్త్రీల స్థితిగతులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. చైతన్యవంతమైన స్త్రీలు, చక్కగా చదువుకుంటున్న యువతులు, వ్యాపారాలు, ఉద్యోగాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న స్త్రీలు మెడాన్ నగరంలో, చుట్టుపక్కల పల్లెలలో అడుగడుగునా ఎదురై ఆనందాన్ని కలిగించారు.

అలా వారం రోజులపాటు ఇండోనేషియా గురించిన అందరికీ తెలిసినది కాక మరొక భిన్న పార్శ్వాన్ని చూడగలిగే అవకాశం వచ్చినందుకు సంతృప్తితో అక్కడి నుండి తిరిగి బయలుదేరాను. అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేదారిలో మళ్ళీ ఒక బడ్డీ కొట్టులాగా ఉన్న ఫారెన్ ఎక్స్చేంజి ఏజెన్సీ దగ్గర ఆగి ఇండోనేషియన్ కరెన్సీ ని డాలర్ లలో మార్చుకుని ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాను. ముందు ఎయిర్పోర్ట్ లో కరెన్సీ ఎక్స్చేంజి చేసుకోవచ్చులే అనుకుంటే క్యాబ్ డ్రైవర్ ఎందుకు మేడం దారిలో చాలా ఏజెన్సిస్ ఉన్నాయి. ఎక్కడో ఒకచోట మార్చుకోండి అన్నాడు. అతని మాట వినడం మంచిదయ్యింది. ఎయిర్పోర్ట్ ఉన్న ఒక్క ఫారెన్ ఎక్స్చేంజి కౌంటర్ మూసేసి ఉంది. మొత్తానికి మళ్ళీ మలేసియా చేరుకొని అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టాను, కొత్త జ్ఞాపకాలను, స్నేహితులను ఇచ్చిన ఉత్తర సుమత్రా ద్వీపానికీ, మెడాన్ నగరానికీ సెలామత్ జలాన్ (కృతఙ్ఞతలు) అని మనసులోనే చెప్పుకుంటూ.

*

భారతి కోడె

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు