డర్టీ ఫెలోస్ (దేశమిచ్చిన బిరుదు)

నా పేరు గుమ్మరాజు శ్రావణి, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి??  విద్యార్హతను బట్టి చేసుకోవాలా?? వద్దులే అనిపించింది. విద్యకు, సంస్కారం కు సంబంధం లేదని నా అభిప్రాయం. ఇక కులాన్ని, మతాన్ని, స్థాయిని చూపించి పరిచయం చేసుకోవాలా?? వాటికి, జ్ఞానానికి సంబంధం లేదని నా అభిప్రాయం. అందుకే ఇలా నన్ను నడిపిస్తున్న అక్షరాల ద్వారానే పరిచయం చేసుకుంటా. చదవడం అనే ఆసక్తి నుండి మెల్లిగా నాలో భావాలకు అక్షర రూపం ఇచ్చేదాన్ని, నాలోని భావాలు రాస్తూనే సమాజంలోకి తొంగి చూస్తూ, సమాజాన్ని చదువుతూ, అక్షరాలను పేర్చడం నేర్చుకుంటున్నా. రచనా ప్రపంచంలో ఇంకా అ,ఆ లు నేర్చుకుంటున్నదాన్ని నేను. ఏదైనా తప్పులు ఉన్నా, పొరపాట్లు కనిపించినా, మీ సలహాలు, సూచనలతో నన్ను సరిదిద్దగలరు. 

      బడి గంట మోగగానే బయటకు పరిగెత్తే పిల్లలతో మొదలయ్యే కథ ఇది.  కొందరు ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత పనులకు పిల్లలను ఎలా వాడుకుంటారో చెప్పే కథ,  కాలం తో పాటు సమాజం మారుతుందని అనుకుంటున్నా కొందరి మీద బిరుదుల్లాంటి మాటల శాసనాలు చూపించే కథ. పసిమనసుల అంతఃసంఘర్షణ కు మూలమైన కథ. ఒక పిల్లాడు చిన్న ఆశతో రేపటి కోసం వేచి చూస్తుండగా ముగిసే కథ. ముఖ్యంగా నేటి స్వార్థపు సమాజం అవసరం కోసం ఎలా పొగుడుతుందో అవసరం తీరాక ఎలా వెలివేస్తుందో అద్దం పట్టే  కథ. డర్టీ ఫెలోస్( దేశమిచ్చిన బిరుదు). సాటి మనిషి, సమాజం, దేశం మొత్తం అవసరానికి పొగుడుతూ అవసరం తీరిపోయాక విసిరే బిరుదు లాంటి కథ.

***

బడి వదిలారు,  తరగతులలో నుండి పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు వచ్చారు.  ఒక్కడు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.

   “ఒరేయ్ సూరి ఇట్రా……..”  పిలుపుకు తలతిప్పి చూసాడు ఆ పిల్లవాడు. దూరంగా మాస్టారు పిలుస్తున్నాడు. ఆయన పేరుతో పిలవడం చాలా అరుదు,  అలాంటిది కోపం, చిరాకు కూడా లేకుండా పిలిచాడంటే ఏదో పని ఉంది అనుకుంటూ మెల్లిగా ముందుకు అడుగులేసి ఆయన్ను సమీపించాడు.

“సార్ చెప్పండి” అన్నాడు  భుజాన ఉన్న స్కూల్ బాగ్ బరువు సరిచేసుకుంటూ.

       “బాత్రూమ్ గుంత నిండినట్టుందిరా ఇంట్లో, ఓసారి మీ నాయిన్ను రమ్మను, రేపు  ఆదివారం కదా రేపు రమ్మను” అన్నాడు హెడ్మాస్టర్ వీరేశ్.

      “సరే సార్” అని చెప్పి వెనుదిరిగాడు సూరి అలియాస్ సురేష్.

నడుస్తూ వెళ్తుంటే మధ్యలో కలిసాడు వెంకీ అలియాస్ వెంకటేష్.

“ఏరా నిన్ను సార్ పిలిచేది చూస్తి ఏమంట” అన్నాడు వెంకీ.

    “ఏముంటాది బాత్రూమ్ గుంత నిండింది అంట, మీ నాయిన్ను రమ్మను రేపు అన్నాడు.” ఆ మాటలు చిరాగ్గాను, కోపంగానూ, అసహనంగానూ  కూడ ఉన్నాయ్.

    “అనుకున్నారా, ఎప్పుడు ఒరేయ్ కంపోడా అనే వాడు పేరు పెట్టి పిలుస్తుంటే ఏదో విషయం ఉంది అనుకున్నా….. మీ నాయినకు చెప్పద్దు, అసలు మీ నాయిన పోకుంటే ఏం చేస్తాడో చేసుకోని. అందితే కాళ్ళు అందకుంటే జుట్టు పట్టుకునే నాకొడుకు మన హెడ్మాస్టర్ గాడు. అసలు చెప్పద్దు మీ నాయినకు” అన్నాడు కోపంగా.

      “నిజమే కదా చెప్పను, ఏం చేసుకుంటాడో చేసుకోని”  అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు సూరి. అనుకున్నట్టే తండ్రికి ఏ విషయం చెప్పలేదు, ఆదివారం అవడటం తో ఆటలు, అల్లరితో ఆ విషయం మరిచిపోయాడు కూడా.

    మరుసటిరోజు బడికి పోగానే ప్రార్థన అవ్వగానే తరగతుల్లోకి వెళ్లబోతున్న పిల్లల్ని ఆపి కాపీ నోటు పుస్తకాలు ఎవరెవరు కొన్నారు అని అడిగాడు. నిజానికి అతను పిల్లలకు అవి తీసుకోమని చెప్పి పది రోజులు దాటింది, నెల చివర కావడం తో డబ్బుల్లేవ్, జీతం వచ్చాక ఇస్తాను కొనుక్కో అన్నాడు సూరి తండ్రి. ఇపుడు మాస్టారు ఇలా అడిగేసరికి ఒక్కసారి గుండెలో రాయిపడ్డట్టు అయింది. మాస్టారు ఏం చేస్తాడో తెలుసు. పిల్లలందరి ముందు కొడతాడు, అంతేనా అందరికి గట్టిగా వినబడేలా కంపోడా, నీకు చదువెందుకురా అంటాడు. ఇంకా ఆరోజు గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయిస్తాడు, తనతో అయితే స్కూల్ టాయిలెట్లు కూడా క్లీన్ చేయిస్తాడు.

     వరుసగా పిల్లలందరి దగ్గరా కాపీ పుస్తకాలు చూస్తూ వస్తున్నాడు. ఆయన చూపులు మాత్రం సూరి మీదనే ఉన్నాయి. జింకను వేటాడబోయే పులి పంజాలా ఉన్నాయ్ ఆ చూపులు. మొన్న చెప్పిన పని జరగనందుకు ఆయన చాలా కోపంలో ఉన్నాడు, దాన్ని కోపం అనడం కంటే తను చెప్పింది జరగలేదు అనే అహమే ఎక్కువ కనిపిస్తోంది అనచ్చేమో. నా మాట అంటే అంత లెక్కలేదా అనుకున్నాడు ఆయన మనసులో.

    సూరి వంతు వచ్చింది. “ఏదిరా కాపీ బుక్కు” అన్నాడు.

  “సార్ మా నాయిన జీతమొచ్చాక కొనిస్తానని చెప్పాడు సార్” అన్నాడు భయపడుతూనే.

   “అసలు నీకు ఎందుకురా చదువు, మీ నాయిన లాగా గుంతలు కడుక్కో, ఒక కాపీ బుక్కుకు పది రోజులు, ఒక నోట్ బుక్కుకు నెల. ఇలా అవుతుంటే సంవత్సరమంతా గడిచినా నీకొచ్చేది అ, ఆ లే” అన్నాడు. మనసులో దాచుకున్న అహము, వృత్తి ఇచ్చిన అధికారము, అతని చేతిలో బెత్తాన్ని నృత్యం చేయిస్తున్నాయ్. చివరకు కర్ర విరిగింది, అతని అహము కాస్త తృప్తి పడింది. “పోయి ఆ  బాత్రూమ్ లు కడుగుపొ కంపు నా…కొడకా…. ఇదే నీకు పనిష్మెంట్” అన్నాడు కసిగా.

  ఎదురు చెప్పలేక మెల్లిగా అటువైపు కదిలాడు సూరి. కంపు గొడుతున్న బాత్రూమ్ లు క్లీన్ చేస్తుంటే గుర్తొచ్చాయి తండ్రి మాటలు. “నాలాగా నువ్వూ ఇట్టా తయారవ్వద్దురా, ఈ మురికి పనులు నీకొద్దు, నువ్ మంచిగా చదువుకోరా” అని. “నువ్వు ఏ పని అయితే చేయగూడదు అని నన్ను చదువుకోమన్నావో, ఆ చదువుకోసం ఇక్కడ అదే మురికి కడగాల్సి వస్తోంది నాయిన” అనుకున్నాడు మనసులో.

    కాలం దొర్లింది, బడి గంట మోగింది మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కోపం, బాధ మనసును కుతకుతలాడిస్తున్నాయ్. ఇంటికెళ్లగానే చేతిలో పుస్తకాల సంచి విసిరి గొట్టాడు. తల్లి పరిగెత్తుకొచ్చి “ఏరా… బుక్కుల సంచి ఇసిరిగొడతావు, సదువంటే గౌరవం లేకుండా పోయిందిరా నీకు. మీ నాయిన కష్టపడి సదివిస్తావుంటే నీకు కొవ్వెక్కువైందిరా” అంది వీపుకు గట్టి దెబ్బ తగిలిస్తూ.

     ఒకవైపు కోపం, మరోవైపు తల్లి దెబ్బ, అంతలోనే గుర్తొచ్చిన మాట. మాస్టారు తిట్టే మాట, కంపునాకొడకా అని. నేను కంపు గా ఉన్నానా అని తనని తాను వాసన చూసుకున్నాడు. దుర్గంధం ఏం లేదు, ఏమో నాకే అలా అనిపించలేదేమో అనుకుని బాత్రూమ్ లోకి దూరాడు. తొట్లో, బకెట్ లో పెట్టిన నీళ్ళన్ని చల్లగా ఉన్నాయని కూడా చూడకుండా పోసుకుని సబ్బుతో రుద్దుకుంటూనే ఉన్నాడు, నీళ్లు గుమ్మరించుకుంటూనే ఉన్నాడు. కన్నీళ్ళన్ని సబ్బు నురగతో కారిపోయి మురికిగుంతలోకి వెళ్లిపోయాయి.

       పొద్దు మునగగానే తండ్రి ఇంటికొచ్చాడు. తండ్రి కోసమే చూస్తున్న  సూరి వేగంగా తండ్రికి ఎదురెళ్ళాడు. కొడుకు మొహం చూడగానే ఏదో అయ్యిందని అర్థమైంది సుబ్బరాయుడు కు.

  “ఏమైందిరా అట్లా ఉన్నావు” అని అడిగాడు.

సూరి నోరు విప్పబోయేలోపు “ఆడికి సదువంటే సులకనైపోయింది, బడి నుండి వత్తానే బుక్కుల సంచి ఇసిరిగొట్టాడు అతినాకొడుకు” అంది కోపంగా సూరి తల్లి.

    “ఏరా అమ్మ చెప్పింది నిజమా?? ఎందుకు బుక్కులు అలా విసిరిగొట్టావ్. తప్పు కదా సరస్వతమ్మకు కోపమొస్తుంది అట్లా చేయకూడదు” అన్నాడు బయట వాల్చిన నులకమంచం మీద కూర్చుంటూ.

     సూరి కళ్ళలో నుండి కన్నీళ్లు, అది చూసిన సుబ్బరాయుడు “ఎందుకురా ఏడుస్తావు ఏమే పిల్లొన్ని కొట్టినావా ఏంది” అన్నాడు సూరిని దగ్గరకు తీసుకుంటూ.

     “కొట్టేది కాదు పొగులు పెట్టాలి ఈడికి. మంచిగా సదువుకుంటే మంచి ఉజ్జోగంలో చేరితే మనలాంటి బతుకు ఈడికి లేదని సంబరపడదాం అనుకుంటే, సదువుమీద మనసుందా ఏమైనా అసలు” అంది ముక్కులు తుడుచుకుంటూ.

     “మీయమ్మ చెప్పింది నీ మంచికే కదరా మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు చేయచ్చు. ఇంకెప్పుడు అట్లా చేయద్దు మీయమ్మ కూడా కొట్టదులే అన్నాడు సూరిని” ఒడిలో కూర్చోబెట్టుకుంటూ.

         “అమ్మ కొట్టిందని నేను ఏడ్చలేదు” అన్నాడు తండ్రిని గట్టిగా పట్టుకుని.

  “మరి ఏమైందిరా ఎందుకు ఏడ్చావు” అన్నాడు  భుజాలు పట్టుకుని.

    రెండురోజుల క్రితం హెడ్మాస్టర్ చెప్పిన మాట, తను కావాలని చెప్పకపోవడం నుండి, ఆరోజున బడిలో జరిగినది అంతా పూస గుచ్చినట్టు చెప్పాడు తండ్రికి.

      “కల్మషం లేని పసిబిడ్డలను ఇలాంటి మాటలతో మానసికంగా సంపుకుతింటారు ఇలాంటోళ్లే” అనుకున్నాడు మనసులో.

    “సూరి ఇట్లా చూడు నీకోమాట చెప్పనా, తామరపువ్వు ఎంత బాగుంటుందో తెలుసా అది పుట్టేది, పెరిగేది, వికసించేది కూడా బురదలోనే, కానీ అది దేవుని పూజకు చాలా గొప్పది.  ఎక్కడ ఎలా పుట్టాము అనేది సమస్య కాదురా మనం చివరికి ఎక్కడికి చేరతాం అనేది ముఖ్యం. నేను ఇట్లా మురికి పనులు చేసి నిన్ను చదివిస్తున్నది నువ్వో తామరపువ్వులా వికసించాలని. బయటోళ్ల నోర్లు లేస్తే మనం ఆ చెవుల్లో విని ఈ చెవిలో విడిచెయ్యాలి. ఇంకెప్పుడు ఎవరో అన్నమాటలకు బుక్కులు విసిరేయ్యకు సరేనా??” అన్నాడు బుజ్జగిస్తున్నట్టే.

   “సరే” అంటూ తల ఊపి లోపలికెళ్లిపోయాడు సూరి.

   రోజులతో పాటు కాలం పరిగెడుతూపోతోంది, దేశానికి రోగమొచ్చింది. మనిషి ముక్కులకు, నోటికి కూడా తాళం బిగించుకున్నట్టు మాస్క్ లు వేసుకున్నాడు. అన్ని స్తంభించిపోయాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు త్రిమూర్తుల్లా సమాజాన్ని నడుపుతూ దేశానికి పట్టిన దెయ్యం కు ఎదురుగా వెళ్లి పోరాటం చేస్తున్నారు.  తనకూ రోగం వస్తుందని ఇంట్లో కూర్చుండిపోతే వీధులు, గ్రామాలు, పట్టణాలు, ఇలా దేశం మొత్తం చెత్తతో నిండిపోయి భారతదేశం లో స్వచ్ఛభారత్ కాస్త చెత్త భారత్ అయ్యేదేమో!! అనే మాటలు  మెల్లగా బయటకు రాసాగాయ్. అవన్నీ ఒకరి నుండి ఒకరికి విస్తరిస్తూ టీవీల్లో పారిశుద్ధ్య కార్మికులను పొగిడేసే ప్రసారాలు, పత్రికల్లో ఆర్టికళ్ళు, మొబైల్ లో మెసేజులు ఒకటేమిటి పారిశుద్ధ్య కార్మికుడు పరబ్రహ్మ స్వరూపమైపోయాడు. ఇవన్నీ చూస్తున్న సూరి కళ్ళు మెరిసాయి, మనసు మురిసింది. కంపోడా అనేమాట ఇకమీదట ఎవరు అనరు, తాము ఎంత గొప్ప వాళ్ళమో ఇపుడు అందరికి తెల్సింది అనుకున్నాడు. “థాంక్యూ కరోనా నువ్వే అందరికి మా విలువ తెలియజెప్పావ్” అని ఆనందపడిపోయాడు.

       లాక్డౌన్ తో బడులు మూతపడి ప్రతి పిల్లవాడు వేసవి సెలవులను తలపించేలా గడుపుతుంటే సూరి మాత్రం ఎప్పుడు బడి తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాడు. బడి తెరవగానే బడిలో మా నాన్న గొప్ప అని చెప్పుకోవడానికి, కంపోడా అనే మాట అందరి మనసుల నుండి చెరిపెయ్యడానికి.

     పాపం ఆ పిల్లవాడికి  తెలియదు, బంగారు గుడ్లు పెట్టె బాతును కూడా కోసి ఒకేసారి సంపదను పొందాలనుకే అత్యాశాపరులు ఈ మనుషులని, అవసరం తీరేవరకే వీళ్ళ పొగడ్తలని, అవసరం తీరి పోయాక సూపర్ హీరో కాస్తా డర్టీ ఫెలో అయిపోతాడని.

*

గుమ్మరాజు శ్రావణి

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతంగా ఉంది శ్రావణి గారు. ఇలాంటి రచనలే నేటి యువ రచయితల నుండి ఆశిస్తున్నాం.

    • కిరణ్ విభావరి థాంక్యూ సో మచ్ రా

  • నీ కథ సారంగలో చూడటం చాలా ఆనందంగా ఉంది రా .అభినందనలు .నీ నుండి మంచి మంచి కథలు రావాలని ,నువ్వు ఎంతో వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

    • కథ వొస్తువు బాగుంది..విద్యను నేర్పి సంస్కారాన్ని రాబట్టే గురువులే సంస్కారహీనంగా గబ్బుగా తయారుకావటం పిల్లలు చేసుకున్న దురదృష్టం.కధ క్లైమాక్స్ పట్ల అభ్యంతరాలు ఉన్నాయి శ్రావణి గారు….ఇంకోలా ముగించి ఉంటే కథకి సాధికారత ఉండదేమో…సూరికి వాళ్ళనాన్న చేస్తున్న పనిపట్ల కరోనా ఏర్పరిచిన భావం కాకుండా.. సహజంగానే తనకి ఆపనిలో ఉండే ఔన్నత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసుంటే..సూరికి అన్ని పనులు పట్ల అదే అభిప్రాయం కలిగుండే చైతన్యం వొచ్చేదేమో..కరోనా లేకపోయుంటే.. రాకపోయుంటే…..సూరికి ఆపని మీద గౌరవం రాధా? కథని కాలం చేతిలో పెట్టారు.ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే…

      .

      • ధన్యవాదములు సర్ మీ సమీక్షకు. మీలాంటి వారి వారి సలహాలతో నా రచనా తీరును మార్చుకోవాలనే నేను సలహాలు, సూచనలు అడిగాను. మీరు చెప్పింది నిజమే సర్ కథను కాలం చేతిలో పెట్టాను, ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా రాసాను తప్పకుండా మీరు చెప్పినట్టు మరో కోణంలో ముగింపు వైపు ఈ కథను మలచుకుంటాను. మీ ప్రోత్సహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదములు సర్🙏🙏

    • థాంక్యూ సో మచ్ అక్కా, రాము ప్రోత్సాహం, నువు చెప్పే ధైర్యం నాతో రాయిస్తాయి కథలు.

      • కామెంట్ రాసాక రాయకుండా ఉంటే బాగుండేది అనుకున్నాను.మీరు ఎలా తీసుకుంటారో అని….మీ taking మనస్ఫూర్తిగా అనిపించింది..thanks for that…

  • సరైన కథాంశం
    చక్కనైన కథనం, వెరసి
    ఆలోచింపజేసే సందేశాత్మక కథారూపం

    ముగింపు వాక్యాలు
    వాస్తవికతకు ప్రతిబింబం

    • థాంక్యూ సో మచ్ నాగేంద్ర గారు మీ సమీక్షకు ధన్యవాదములు😊😊

  • కథ వస్తువు చాలా బాగుంది శ్రావణి గారు.
    ప్రతి రోజు ఊపిరాడక సెప్టిక్ ట్యాంక్ లో మాన్యువల్ స్కావంజర్ లు ప్రాణాలు కోల్పో తున్న పట్టని , ‘స్వచ్ భారత నినాదం కూడా ఈ జీవతాలను వెలుగును ప్రత్యామ్నయ జీవించే అవకాశం కల్పించలేని మన దేశంలో ఈ కథ వస్తువు ఎన్నుకోవటం అభినందనీయం .

    రేపటి జాతి ని నిర్మించాల్సిన బడులలో , అమానవీయ దృక్పదం మనువాద మనస్తత్వం కల్లిన పవిత్ర వృత్తి ని అపవిత్రం చేసే సంకుచిత ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులుఎదుర్కొంటున్న మానసిక ఘర్షణ ల ను చక్కగా ఎండ కట్టారు.

    మీలాంటి యువ రచయిత లను ప్రొత్సహిస్తున్న సారంగ కు ధన్యవాదాలు .
    ఇలాంటి సమాజిక అంశాల పై మరెన్నో కథలు మీ కలం నుండి సృష్టించ బడాలని కోరుకుంటున్నాను

  • కథ చాలా బాగుంది శ్రావణి…నాకు తెలుసు నువ్వు ఇలాగే ఒక్కొమెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి ఎదగగలవని…ఇలానే నీ కలాన్ని ఇంకా పదునుపెట్టి గొప్ప స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు