వర్షాసమయం

“వానొస్తుంటే కిటికీ తెరిచావెందుకు? మూసేయ్”

ఈ మనిషికి వానను అనందించడం రాదు. ఆస్వాదించడం తెలియదు. అర్థం చేసుకోవడం?? ఊహూ..!

“టిఫిన్ అయ్యిందా?”

“షర్ట్ ఇస్త్రీ చేశావా?”

“ఫైల్ ఇక్కడే పెట్టానే? నువ్వేమైనా తీశావా?”

ఆకాశంలోంచి అందంగా చినుకులు రాలుతున్న ఈ సమయంలో అడగాల్సిన ప్రశ్నలా ఇవి?

అన్నింటికీ విసుగ్గా ఊ కొట్టాను.

హడావుడిగా ఆఫీసుకి బయల్దేరి వెళ్లిపోయాడు. వెళ్లొస్తానన్న మాటైనా చెప్పలేదు.

అతనిలా ఉండేవాడు కాదు. మబ్బులు నల్లగా మారి వర్షం కురవబోతోందని తెలిస్తే చాలు! బైక్ ఎక్కించుకొని తీసికెళ్లేవాడు. చినుకులు మొదలవగానే అతణ్ని గట్టిగా పట్టుకొనేదాన్ని. వాన నిండుగా ఇద్దర్నీ తడిపేశాక ఊరి చివర ఎక్కడో ఉన్న చిన్న హోటల్ దగ్గర ఆపేవాడు. వణుకుతున్న చేతుల్తో టీ గ్లాసులు అందుకుని ఊదుకుంటూ తాగేవాళ్లం. నాకు ఐదు నిమిషాలు పడితే, అతను రెండు గుక్కల్లో తాగేసి బయట వర్షం కేసి చూస్తూ కూర్చునేవాడు. తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు. అలా తిరిగి తిరిగి, వానలో ఊరంతా కొలిచాక ఇంటి దగ్గర దింపేవాడు.

వానలో ఒట్టి వాననే చూడటం అతనికి రాదు. ఆ వెంట వచ్చే సమస్త ఆనందాల్నీ అతను చూసేవాడు. కాగితం పడవలు, రంగుల గొడుగులు, బురద నీళ్లలో ఆటలు, మిర్చీ బజ్జీలు.. వర్షం వచ్చిందంటే అతను అతను కాదు. ఇంకెవరో!

“జ్వరం వస్తుంది”

“రానీ”

“జలుబు చేస్తుంది”

“చేయనీ”

ఏం చెప్తాం అతనికి? చినుకుల్ని దోసిట్లో నింపుకుని భద్రంగా దాచుకునే వానజీవి. అతనికీ, ఇంట్లో ఉన్న ఈ మనిషికీ పోలికా? ఛ!

సెల్‌ఫోన్ చేతిలోకి​ తీసుకుని అతనికి కాల్ చేశాను. రెండు రింగుల తర్వాత ఎత్తాడు.

“వర్షం వస్తోంది”

“అవును”

“నన్ను బయటకు తీసుకెళ్లవా?”

“ఇప్పుడా?”

“బిజీయా?”

“కాదులే! మీ ఆయన లేడా?”

“ఆఫీసుకి వెళ్లాడు”

“సడన్‌గా వస్తే..?”

“రానీ”

“మనల్ని చూ‌స్తే?”

“చూడనీ”

అతను నవ్వి ఫోన్ పెట్టేశాడు. వర్షం మరింత అందంగా కురుస్తోంది.

*

 

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వస్తే రాని , చూస్తే చూడని , ఆనందం ఎక్కడుంటే అక్కడే ఉండాలి అని అనుకునే మనిషిని నేను 🙌🙌🙌

  • వానలో ఒట్టి వాననే చూడటం అతనికి రాదు. ఆ వెంట వచ్చే సమస్త ఆనందాల్నీ అతను చూసేవాడు. కాగితం పడవలు, రంగుల గొడుగులు, బురద నీళ్లలో ఆటలు, మిర్చీ బజ్జీలు.. వర్షం వచ్చిందంటే అతను అతను కాదు. ఇంకెవరో!
    Simply super 💐💐👌👍..

  • అతనిలా ఉండేవాడు కాదు. మబ్బులు నల్లగా మారి వర్షం కురవబోతోందని తెలిస్తే చాలు! బైక్ ఎక్కించుకొని తీసికెళ్లేవాడు.

    👌👌Superb lines Anna ..Chala baga rasaru.

  • ఈసారి వాన కురిసినప్పుడు వాన మాత్రమే.. కాదు. దాని వెంట వచ్చే సమస్త ఆనందాల్ని చూస్తాను. ఆస్వాదిస్తాను. మీ అక్షర జల్లులో తడిసిన నా మనసు.. పులకరించింది.

  • ఇలాంటి ఊహలు సాహిత్యానికి మాత్రమే పరిమితం. నిజ జీవితం లో వానని అందరూ ఆస్వాదించ లేక పోవచ్చు. అదేమీ పెద్ద తప్పు కాదు. అంత సేపు ఊరంతా వర్షాన్ని కొలిస్తే వర్షం లో drive చేసినందుకు ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంది.

    ఒక అయిదు నిమిషాల వాన ఆనందం కోసం జీవిత కాలపు సహచర్యం కోల్పోతాం ఏమో అని అనిపించింది. ఈ కథలో లా చేస్తే.

    నేను రైటర్ ఊహని తప్పు పట్టడం లేదు. I am.just searching for practicality.

  • చిన్ని కథలో చాలా చెప్పారు వంశీ…వానని ఆస్వాదించడం తెలిసినవారికి వర్షం పడితే ఆరేసిన బట్టలు గుర్తొచ్చేవారికి మధ్య అనుబంధం ఎంత నిస్తేజంగా ఉంటుందో వర్షపు అందాల మధ్య కనిపించని వేదన లాగా…వర్షపు అందాలు మనసుని జ్ఞాపకాల పడవలలో ముంచేస్తే…కనిపించని వేదన గడప దగ్గరే నిలిపేస్తుంది.

  • వానజీవి తో తిరిగి వేరొకరిని ఎందుకు పెళ్లిచేసుకోవాలి? పెళ్లి చేసుకున్న తరవాత ఒకరిని ఉంకొకరితో పోల్చడం యెంత వరకు కరెక్ట్? ఒక వేళ పెళ్లి చేసుకున్న తరువాత నచ్చకపోతే విడిపోయి వానని ఆనందిచేవారినే పెళ్లి చేసుకోవచ్చు. అలా కాకుండా why promote illegal or immoral relationships?

    Anyway, I like your style of writing.

  • చినుకుల్ని దోసిట్లో నింపుకొని భద్రంగా దాచుకునే వానజీవి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు