దుకాణం సర్దేసే రోజు

సాదత్ హసన్ మంటో kingdoms end కథకి అనువాదం

ఫోన్ రింగ్ అయింది. మన్మోహన్ ఫోన్ తీసుకొని

“44457” అన్నాడు.
“సారీ, రాంగ్ నెంబర్”, ఆడగొంతు.
మన్మోహన్ ఫోన్ పెట్టేసి మళ్ళీ తన పుస్తకం అందుకున్నాడు.ఆ పుస్తకాన్ని అతను ఇప్పటికో ఇరవైసార్లు చదివుంటాడు. అదేదో గొప్ప పుస్తకం అని కాదు.ఆ గదిలో ఉన్నది అదొక్కటే పుస్తకం.
ఇప్పటికొక వారంరోజులునుంచీ ఏకాకిలా అతను ఈ ఆఫీసులో ఉంటున్నాడు. ఇది అతని స్నేహితుడి ఆఫీసురూమ్.ఆ స్నేహితుడు ప్రస్తుతం వ్యాపారం నిమిత్తం అప్పుకోసం బయటికెళ్లి ఉన్నాడు.ఈ మహానగరంలో కొంపాగోడూ లేక ఫూట్పాత్ ల మీద పడుకొనే వేలాదిమందిలో మన్మోహన్ ఒకడు.తను లేని సమయంలో తన వస్తువులు కనిపెట్టుకొని ఉంటాడని మన్మోహన్ ని అతని స్నేహితుడు ఉండమన్నాడు.
అతను ఎప్పుడోగాని బయటికెళ్ళడు.అతనికి దాదాపుగా ఏపనీలేనట్టే,అసలు అతనికి పనిచెయ్యడమే ఇష్టం లేదు.అతను ప్రయత్నించి ఉంటే ఏదో ఒక సినిమా కంపెనీలో డైరెక్టర్ గా చేరి ఉండేవాడే.ఎందుకంటే గతంలో అతను అదే పని చేసి మానేసాడు.ఏదేమైనా,అతనికి మళ్ళీ పనిలో చేరి చాకిరీ చెయ్యాలనే కోరిక లేదు.అతను ఎవరికీ ఏ హానీ తలపెట్టని చక్కటి సాధుజీవి.అతనికి సొంతఖర్చులు అంటూ కూడా ఏం లేవు.అతనికి కావాల్సిందల్లా పొద్దునపూట ఒక కప్పు ఛాయ్, రెండు బ్రెడ్డు ముక్కలూ.మధ్యాహ్నం చపాతీ అందులోకి కాస్తంత కూర, ఒక సిగరెట్ ప్యాకెట్టు.అంతే. అదృష్టం కొద్దీ అతనికి ఇలాంటి చిన్నచిన్న అవసరాలు సంతోషంగా తీర్చగలిగే మిత్రులు చాలినంతమంది ఉన్నారు .
మన్మోహన్ కి కుటుంబసభ్యులూ,దగ్గరి స్నేహితులంటూ ఎవరూ లేరు.మరీ గడవడానికి ఇబ్బందిగా ఉన్నరోజుల్లో తిండి లేకుండా కూడా కొన్నిరోజులు నడిపించగలడు.అతని మిత్రులకి అతని గురించి పెద్దగా ఏం తెలీదు.వాళ్ళకి తెలిసిందల్లా అతను చిన్నప్పుడెప్పుడో ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి, ఈ బొంబాయి మహానగరపు విశాలమైన ఫూట్పాత్ ల మీద కొన్నేళ్ళు గడిపాడు. అతని జీవితానికి ఉన్న ఒకేఒక్క లోటు -ఆడది
“ఎవరైనా అమ్మాయి నాతో ప్రేమలో పడితే,నా జీవితం మారొచ్చు” అంటాడతను.స్నేహితులు దాన్ని తిప్పికొడుతూ “అయితే అప్పుడూ నువ్వు ఏ పనీ చెయ్యవు కదా” అంటారు
“అసలు పని అప్పటినుంచే మొదలవుతుంది”అని అతను జవాబు
“అయితే దేన్నైనా తగులుకో మరీ”
“మనం తగులుకుంటే ఏం బావుంటుందీ?”
మధ్యాహ్నం,భోజనం చేసే సమయం.ఉన్నట్టుండి ఫోన్ రింగ్అయింది.అతను ఎత్తి “హలో 44457″అన్నాడు
“44457?” ఎవరో ఆడమనిషి అడిగింది
“ఆ..అదే”అన్నాడు మన్మోహన్
“మీరెవరూ” అడిగింది ఆడగొంతు
“నేను మన్మోహన్”
అవతలనుంచి సమాధానం లేదు.”హలో..మీకెవరు కావాలి?” అడిగాడతను
“నీతోనే” అంది ఆమె
“నాతోనా?”
“నీకే అభ్యంతరం లేకపోతేనే”
“అబ్బే..అస్సలు లేదు”
“నీ పేరు ఏంటన్నావు, మదన్ మోహనా?”
“కాదు మన్మోహన్”
“మన్మోహన్?”
 అవలతల మౌనం.”హలో..మీరు నాతో మాట్లాతాను అన్నారూ”
“అవునూ”
“మరయితే మాట్లాడండి”
“నాకేం చెప్పాలో తెలీడం లేదు.నువ్వే ఏదన్నా చెప్పొచ్చుగా”
“అయితే సరే” అని మన్మోహన్ “నేను ఇప్పటికే నా పేరు చెప్పేసాను.ఇప్పటికీ ఈ ఆఫీసులో ఉంటున్నాను.ఒకప్పుడు ఫుట్పాత్ ల మీద పడుకునేవాడిని, ఒక వారం రోజులుగా ఈ పెద్ద ఆఫీస్ టేబుల్ మీద పడుకుంటున్నాను”
“రాత్రిపూట దోమలు కుట్టకుండా ఏం చేసేవాడివి?,ఫుట్పాత్ మీద దోమల తెర కట్టుకునేవాడివా?” అడిగిందామె
మన్మోహన్ నవ్వాడు. “దీనికి జవాబు చెప్పేముందు ఒక విషయం స్పష్టం చెయ్యనీ.నేను అబద్ధాలు చెప్పను.ఈ ఆఫీసుకి నా చేతికి రావడానికి ముందు కొన్ని సంవత్సరాలు నేను ఫుట్పాత్ ల మీదే పడుకున్నాను.నేను ఇలాగే ఉంటున్నాను “
“ఎలా ఉంటావు అలా?”
అక్కడ
అతను చేతిలో ఉన్న పుస్తకాన్ని చూస్తూ”ఏముందీ… నా చేతిలో ఒక పుస్తకం ఉంది.చివర్లో కొన్నిపేజీలు లేవు,అయినా కూడా ఇప్పటికో ఇరవైసార్లు చదివాను. ఆ చిరిగిన పేజీలు నా చేతికి వచ్చినరోజు ఈ ప్రేమికుల కథ చివరికి ఏమైందో తెలుస్తుంది”
“నువ్వు భలే విచిత్రంగా మాట్లాడతావే”
“ఏదో మీ దయ”
“నువ్వు ఏం చేస్తావు”
“అంటే?”
“అంటే..,నువ్వేం ఉద్యోగం చేస్తుంటావు అని?”
“ఉద్యోగమా?అబ్బే..ఏం లేదు.ఏ పనీ చెయ్యనోడికి ఉద్యోగం ఏంఉంటుంది?కానీ నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి,నేను పగలంతా గాలికితిరిగి రాత్రి నిద్రపోతుంటాను”
“నీ జీవితం నీకు నచ్చుతుందా?”
“ఆగండీ”అని మన్మోహన్ “నాకు నేను ఎప్పుడూ ఈ ప్రశ్న వేసుకోలేదు,ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ముందు నన్ను నేను ప్రశ్నించుక్కొని తర్వాత నీకు చెప్తాను.నేను గడుపుతున్న  జీవితం నాకు నచ్చుతుందా?”
“సమాధానం ఏంటో?”
“సమాధానం ఏం లేదు,కానీ ఆలోచిస్తే నేను ఇప్పుడున్న మాదిరిగానే  చాలాకాలంగా ఉంటున్నాను అంటే నా జీవితం నాకు నచ్చుతుందనే చెప్పొచ్చు”
అవతలనుంచి నవ్వు వినిపించింది “నీ నవ్వు చాలా అందంగా ఉంది” అన్నాడు మన్మోహన్
“థాంక్యూ” అంది అవతలినుంచి సిగ్గుపడుతున్నట్టుగా. కాల్ డిస్ కనెక్ట్ అయింది. చాలసేపటివరకూ అతను రిసీవర్ పట్టుకొని తనలో తనే నవ్వుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం ఎనిమిది అవుతుందనగా  మళ్ళీ ఫోన్ రింగ్ అయింది.అతను మాంచి నిద్రలో ఉన్నాడుగాని ఆ ఫోన్ శబ్దానికి లేచి రావాల్సి వచ్చింది.
“హలో..దిస్ ఈజ్ 44457”
“గుడ్ మార్నింగ్, మన్మోహన్ సాహబ్”
“గుడ్ మార్నింగ్,ఓహ్ నువ్వేనా.. గుడ్ మార్నింగ్”
“ఏంటి మంచి నిద్రలో ఉన్నట్టున్నారు?”
“అవును,అసలు చెప్పాలంటే నేనిక్కడికి వచ్చిన దగ్గర్నుంచి పాడయిపోయాను.మళ్ళీ ఫుట్పాత్ మీదకి పోతే నేను ఇబ్బంది పడాల్సివస్తుంది”
“ఏ..?”
“ఎందుకంటే  ఫుట్పాత్ మీద  పడుకున్నవాళ్ళు ఐదింటిలోపు లేచిపోవాలి”
అవతల నవ్వు
“నువ్వు నిన్న ఉన్నట్టుండి ఫోన్ పెట్టేసావు” అన్నాడతను
“హ..నా నవ్వు అందంగా ఉందని ఎందుకన్నావు?”
“అదేం ప్రశ్న! ఏదైనా అందంగా ఉంటే అది అందంగా ఉంది అంటాం,ఏం అనకూడదా?”
“అనకూడదు”
“నువ్వు నాకు షరతులు పెట్టకు.నేను ఈ షరతులూ, నియమాలు పాటించేవాడిని కాదు.ఒకవేళ ఇప్పుడు నువ్వు మళ్ళీ నవ్వితే, మళ్ళీ నువ్వు అందంగా నవ్వుతావు అంటాను”
“అలాగయితే నేను ఫోన్ పెట్టేస్తా”
“నీ ఇష్టం”
“నేను నొచ్చుకుంటానని నీకేం అనిపించదా?”
“విషయం ఏంటంటే,నన్ను నేను నొప్పించుకోవాలనుకోను.అంటే ఇప్పుడు నువ్వు నవ్వినప్పుడు, నేను నీ నవ్వు అందంగా ఉందీ అని నేను చెప్పలేదనుకో,  నేను నా అభిరుచికి అన్యాయం చేసినవాడిని అవుతాను”
కాసేపు నిశ్శబ్దం,మళ్ళీ ఆ గొంతు తిరిగొచ్చింది:సారీ,నేను మా పనిమనిషితో మాట్లాడుతున్నాను.సరే..నువ్వేం చెప్తున్నావు నువ్వు నీ అభిరుచికి పక్షపాతిని అంటున్నావు అవునా,ఇంకా ఏమేమి పక్షపాతాలు ఉన్నాయి నీ అభిరుచికి?”
“ఏంటి?,నాకు అర్థం కాలా?”
“అదే..తమరి హాబీస్ అంటే ఇష్టమైన పనులు, నేను అడగొచ్చా..నీ హాబీస్ ఏంటి?”
మన్మోహన్ కి నవ్వొచ్చింది “పెద్దగా ఏం లేవు కానీ నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్-కొద్దిగా “
” మంచి హాబీనే”
“నేనెప్పుడూ అది మంచిదా?చెడ్డదా?అని ఆలోచించలేదు”
“అయితే నీ దగ్గర ఒక కెమెరా ఉండే ఉంటుంది”
“నా దగ్గర ఉట్టిగానూ,నిజంగానూ ఎలాంటి కెమెరా లేదు.నేను నా మిత్రుడు దగ్గర తీసుకుంటుంటాను.ఎప్పటికైనా కాసిన్ని డబ్బులు సంపాదించగలిగితే నేనో కెమెరా కొనాలనుకుంటున్నాను”
“ఏ కెమెరా”
“Exacta. రిఫ్లెక్స్ ఉండే కెమెరా.నాకు చాలా ఇష్టం”
అతవలివైపు మౌనం.”నేనొకటి ఆలోచిస్తున్నా”
“ఏంటీ?”
“నువ్వెప్పుడూ నా పేరు గానీ ఫోన్ నెంబర్ గానీ అడగలేదేం”
“నాకు అది అవసరం అనిపించించలేదు”
“ఎందుకూ?”
“నీ పేరు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది?నీ దగ్గర నా నెంబర్ ఉంది అది చాలు.నువ్వెప్పుడైనా నేను నీకు ఫోన్ చేయాలనుకుంటే,నాకు కచ్చితంగా తెలుసు నువ్వు నీ పేరూ,ఫోన్ నెంబరూ చెప్తావు”
“లేదు,నేను చెప్పను”
“అది నీ ఇష్టం,నేను అడగను కూడా”
“నువ్వు చాలా విచిత్రమైన మనిషివి”
“అవును,నిజమే”
మళ్ళీ ఇంకొకసారి మౌనం.
“ఏంటి నువ్వు మళ్ళీ ఆలోచిస్తున్నావా?” అడిగాడు అతను
“అవును,కానీ దేనిగురించి ఆలోచించాలనుకుంటున్నానో దాని గురించి ఆలోచించలేకపోతున్నాను”
“అయితే ఇంకోసారి ఫోన్ పెట్టేసి తీరిగ్గా ఆలోచించుకోకూడదూ?”
విసుక్కుంటున్న స్వరంలో “నువ్వెంత మొరటు మనిషివి,నేను ఫోన్ పెట్టేస్తున్నాను”
మన్మోహన్ నవ్వుకొని ఫోన్ కింద పెట్టేసి.ముఖం కడుక్కొని,ఒంటికి బట్టలు తగిలించుకొని బయటికెళ్తుండగా ఫోన్ రింగ్అయింది.అతను ఫోన్ ఎత్తి చాలా మాములుగా “హలో.. ట్రిపుల్ ఫోర్ ఫై సెవెన్ “అన్నాడు
“హలో మన్మోహన్ గారేనా మాట్లాడుతుంది”అడిగింది అవతలనుంచి
“ఆ చెప్పండీ, నేను మీకు ఏవిధంగా సహాయపడగలను”
“సరే,నేను మీకు ఏం చెప్పదల్చుకున్నానంటే నేను ఇంక మిమ్మల్ని విసుక్కోవాలనుకోవడం లేదు”
“చాలా సంతోషం”
“నీకు తెలుసా నేను టిఫిన్ చేస్తుండగా అనిపించింది నేను నిన్ను విసుక్కోని ఉండకూడదు అని,అన్నట్టు నువ్వు టిఫిన్ చేసావా?”
“లేదు నేను ఇలా బయటికి వెళ్లబోతున్నాను నువ్వు ఫోన్ చేసావు”
“ఓహ్ అవునా, సరే వెళ్ళు అయితే”
“ఆ.. ఏం పర్లేదు ఇప్పుడు నాకు కొంపలు మునిగిపోయే పనులేం లేవు,నా దగ్గర డబ్బులు కూడా లేవు.ఈ ఉదయం నాకు టిఫిన్ ఉంటుందని అనుకోవడంలేదు”
“ఎందుకు అలాంటి మాటలు అంటావు?నీకు ఇష్టమా అలా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం?
“లేదు.నేనిప్పుడు ఎలా ఉన్నానో అలాంటి జీవితానికి అలవాటు పడిపోయాను”
“నేనమన్నా నీకు కొద్దిగా డబ్బులు పంపించనా”
“అలా అయితే, నేను అప్పులు తీసుకున్నవాళ్ళ లిస్ట్ లో ఇంకో పేరు చేరుతుంది”
“అయితే పంపించను”
“నీ ఇష్టం వచ్చింది చేసుకో”
“నేను ఫోన్ పెట్టేస్తాను అయితే”
” పెట్టేసుకో”
మన్మోహన్ ఫోన్ పెట్టేసి ఆఫీసు నుంచి బయటికెళ్లిపోయాడు.సాయంత్రం చాలా పొద్దుపోయాక తిరిగొచ్చాడు.అతను తనకు ఫోన్ చేసిన మనిషి గురించే ఆలోచిస్తున్నాడు.ఆమె వయసులో ఉన్న, చదువుకున్నదానిలాగే అనిపిస్తుంది. చాలా అందంగా నవ్వుతుంది కూడా.పదకొండు అవుతుండగా  ఫోన్ రింగ్ అయింది.
“హలో..”
“మిస్టర్ మన్మోహన్?”
“వాడినే”
“నేను రోజంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను.మీరు ఎక్కడ తగలడ్డారో కాస్త చెప్పగలరా”
“నాకు ఉద్యోగం ఏం లేకపోయినా,నేను చెయ్యాల్సిన పనులు కొన్ని ఉంటాయి”
“ఏం పనులు?”
“గాలికి తిరగడం.”
“నువ్వు తిరిగి ఎప్పుడు వచ్చావ్?”
“గంట క్రితం”
“నేను ఫోన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావ్?”
“నా టేబుల్ మీద పడుకొని నువ్వెలా ఉంటావా అని ఊహించుకుంటున్నాను.కానీ ఊహించుకోవడానికి నాకు నీ గొంతు తప్ప ఏం తెలీదు కదా”
“ఎలా ఉంటానో తెలిసిందా?”
“లేదు”
“అయితే వద్దులే,నేను చాలా అసహ్యంగా ఉంటాను”
“నువ్వు నిజంగా అసహ్యంగా ఉంటే వెంటనే ఫోన్ పెట్టెయ్,నాకు అసహ్యంగా ఉండేవాళ్ళంటే ఇష్టం ఉండదు”
“అలా అయితే నేను చాలా అందంగా ఉంటాను,నన్ను ఎవరైనా అసహ్యించుకుంటే నాకు నచ్చదు”
వాళ్లిద్దరూ కాసేపు ఏం మాట్లాడుకోలేదు.మన్మోహనే అడిగాడు “ఏంటి మళ్ళీ ఆలోచనలో పడిపోయావా?”
“లేదు,కానీ నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను”
“ఏం అడిగినా, ఆలోచించి అడుగు”
“నేను నీకోసం ఒక పాట పాడొచ్చా?”
“అయ్యో తప్పకుండా”
“అయితే, ఉండు.”
ఆమె గొంతు సవరించుకోవడం వినిపించింది అతనికి,ఆ తర్వాత ఒక లలితమైన,లోగొంతుకలో అతడి కోసం ఆమె ఒక పాట పాడింది”
“అద్భుతంగా ఉంది”
“ధన్యవాదాలు”అని ఫోన్ పెట్టేసిందామె
 ఆ రాత్రంతా అతను ఆ అమ్మాయి గొంతు గురించే ఆలోచించాడు.మరుసటి రోజు అతను మామూలు కంటే కాస్త ముందుగానే లేచి ఆమె ఫోన్ కోసం ఎదురుచూశాడు.కానీ ఆ ఫోన్ ఎంతటికి రింగ్ అవలేదు.ఆ గదిలో ఊరికే అటూ ఇటూ పచార్లు చేసి,ఆ తర్వాత అక్కడున్న టేబుల్ మీద వెల్లకిలా పడుకొని అప్పటికి ఇరవైసార్లు చదివిన ఆ పుస్తకాన్ని అందుకొని ఇరవై ఒకటోసారి మళ్ళీ చదివాడు,ఆ రోజంతా అలా గడిచింది.రాత్రి ఏడు అవుతుందనగా  ఫోన్ రింగ్ అయింది.చాలా గాభరాగా వెళ్లి ఫోన్ అందుకొని “హలో ఎవరూ?” అన్నాడు.
“నేనే..”
“ఏమైపోయావు రోజంతా” సూటిగా అడిగేసాడు అతను.
“నీకెందుకూ?”
“నా దగ్గర డబ్బులు ఉండికూడా ఏం తినకుండా,నీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను”
“నేను నాకిష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను…”అలా అంటుండగానే మన్మోహన్ మధ్యలో అందుకొని “అయితే ఇది ఇక్కడితో ఆపేయ్, లేదా నువ్వెప్పుడెప్పుడు ఫోన్ చేస్తావో చెప్పు,అంతే గాని రోజంతా ఇలా నీ ఫోన్ కోసం పడిగాపులు కాయాలంటే నాకు చిరాకు”
” ఈ రోజు చేసిందానికి క్షమించు.రేపటి నుంచి తప్పకుండా ఉదయం, సాయంత్రం ఫోన్ చేస్తా సరేనా” అంది బాధపడుతున్నట్టుగా
“మంచిది”
“నాకు తెలీదు నువ్వు రోజంతా..”
“అదేం లేదు.విషయం ఏంటంటే నేను  ఎదురుచూడడం భరించలేను, నేను దేన్నైనా భరించలేనప్పుడు నన్ను నేను శిక్షించుకుంటాను”
“అదెలా?”
“ఏముంది నువ్వు ఇవాళ ఫోన్ చెయ్యలేదు.నేనీ ఉదయం బయటికి వెళ్లాల్సి ఉంది. అయినా కూడా వెళ్లకుండా నీ ఫోన్ కోసం రోజంతా ఎదురుచూస్తూ కూర్చున్నాను కాలీ కడుపుతో”
“నేను కావాలనే అలా చేసాను”
“ఏ..?”
“నువ్వు నా ఫోన్ కోసం ఎదురుచూస్తావో? లేదో? తెలుసుకుందామని”
“నువ్వు చాలా తుంటరి దానివి,సరే మరి  నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే నేను బయటికెళ్లి ఏమైనా తినేసి వస్తాను”
“ఎంతసేపు పడుతుంది?”
“అరగంట”
అతను ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.ఆమె ఫోన్ చేసింది. వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.అతను తనకోసం మళ్ళీ ఆ పాట పాడమన్నాడు.ఆమె నవ్వి ఆ పాట పాడి వినిపించింది.
ఆమె ఇప్పుడు అతనికి రోజూ ఉదయమూ, సాయంత్రమూ ఫోన్లు చేస్తుంది.కొన్నికొన్నిసార్లు వాళ్లిద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు.మన్మోహన్ ఆమె పేరు గానీ ఫోన్ నెంబర్ గానీ ఎప్పుడూ అడగలేదు.మొదట్లో ఆమె ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించేవాడు.ఇప్పుడు అది  మానేశాడు ఆమె ముఖం,మనసు,శరీరం-అంతా ఆమె స్వరమే.ఒకరోజు ఆమె అడిగింది “మన్మోహన్ నువ్వు నా పేరెందుకు అడగవు?”
“ఎందుకంటే నీ గొంతే నీ పేరు కాబట్టి”
మరుసటి రోజు ఆమె అడిగింది “మోహన్,నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా?”
“లేదు”
“ఏ..?”
అతను చాలా దిగులుగా “నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నేను నా జీవిత శిథిలాలన్నింటిని తవ్వి చూసుకోవాలి. అక్కడేం ఉండకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది”
“అయితే వద్దులే”
ఒక వారం గడిచింది. ఒకరోజు మోహన్ కి అతని మిత్రుని దగ్గర్నుంచి  ఉత్తరం వచ్చింది.వ్యాపారానికి కావాల్సిన డబ్బు సర్దుబాటు కావడంతో ఒకవారంలో అతను బొంబాయి తిరిగొస్తున్నట్టుగా ఉందా ఉత్తరంలో.ఆ సాయంత్రం ఆమె ఫోన్ చేసినప్పుడు అతను చెప్పాడు “నా దుకాణం సర్దేసే టైమ్ వచ్చింది”
“ఎందుకూ?”
“నా స్నేహితుడు తిరిగొచ్చేస్తున్నాడు”
“నీకు ఫోన్లు ఉన్న వేరే స్నేహితులు ఉండేఉంటారుగా?”
“నాకు ఫోన్లు ఉన్న వేరే స్నేహితులు ఉన్నారు.కానీ నీకు ఆ నెంబర్లు ఇవ్వలేను”
“ఎందుకూ?”
“ఎందుకంటే వేరే ఎవరన్నా నీ గొంతు వినడం నాకు ఇష్టం లేదు”
“ఎందుకూ?”
“నాకు కుళ్లు అనుకో”
“ఏంచేద్దాం మరి”
“నువ్వే చెప్పు”
“నువ్వు దుకాణం సర్దేసుకునే రోజు చెప్పు,నీకు నా నెంబర్ ఇస్తాను”
అప్పటిదాకా ఉన్న దిగులు మొత్తం పోయింది. మళ్ళీ అతను ఆమె ముఖాన్ని రూపు కట్టడానికి ప్రయత్నించాడు.కానీ అక్కడ ఆమె రూపం లేదు.కేవలం స్వరం మాత్రమే.ఇంకా కొన్నిరోజులే, తనకు తాను చెప్పుకున్నాడు.తనని చూసే ఆ క్షణం  తనకు కలిగే ఆ సంభ్రమాన్ని అతను ఊహించలేకపోతున్నాడు.
ఆ మరుసటిరోజు ఆమె ఫోన్ చేసినప్పుడు ” నిన్ను చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది”అన్నాడు.
“ఎందుకూ”
“నువ్వే చెప్పావు కదా,నా రాజ్యం దుకాణం సర్దేసుకునే రోజు నీ నెంబర్ ఇస్తానని”
“అవునూ”
“అంటే  అప్పుడు నువ్వు ఎక్కడుంటావో కూడా చెప్తావు కదా?నాకు నిన్ను చూడాలని ఉంది”
“నువ్వు నన్ను నికెప్పుడు నచ్చితే అప్పుడు చూడొచ్చు, ఈ రోజు కూడా”
“లేదు లేదు ఈ రోజు కాదు.నేను నిన్ను కలిసే ఆ రోజు నేను మంచి బట్టల్లో ఉండాలి,నా స్నేహితుడొకడిని అడిగాను,వాడు ఇస్తాను అన్నాడు”
“నీదంతా చిన్నపిల్లాడి వ్యవహారం, మనం కలిసే రోజు నేను నికోక బహుమతి ఇస్తాను”
“నిన్ను కలవడం కంటే గొప్ప బహుమతి ఉండదు నాకు”
“నేను నీకు నీ ఇష్టమైన exacta కెమెరా కొన్నాను”
“ఓహ్,నిజమా!”
“కానీ ఒక షరతు,ఆ కెమెరాతో మొదట నా ఫోటో తియ్యాలి”
“అది మనం కలిసినరోజు చూద్దాంలే”
“విను, నేను నీకో రెండు రోజులు ఫోన్ చేయలేను”
“ఏ..?”
“నేను మావాళ్ళతో కలిసి బయటికెళ్తున్నాను,రెండు రోజులే”
మన్మోహన్ ఆ రోజు ఆఫీసు నుంచి బయటికెళ్లలేదు.ఆ మరునాటి ఉదయం అతనికి నీరసంగా అనిపించింది.ముందు అతను అదంతా ఆమె ఫోన్ చేయకపోవడం వల్ల వచ్చిన విసుగు అనుకున్నాడు.కానీ మధ్యాహ్నానికి అతనికి జ్వరం వచ్చేసింది. ఆ టేబుల్ మీద అతను అలాగే పడున్నాడు.అతనికి దాహం విపరీతంగా వేస్తుంది, ఆ రోజంతా నీళ్లు తాగుతూనే ఉన్నాడు.అతనికి గుండెల్లో బరువుగా అనిపిస్తుంది.ఆ మరుసటి రోజు తెల్లారేసరికి అతను పూర్తిగా అలిసిపోయాడు.శ్వాస ఆడటమే ఇబ్బందిగా ఉంది.గుండెల్లో మంటగా అనిపిస్తుంది.
అతనికి వచ్చిన  విపరీతమైన జ్వరం వల్ల అతను చిత్తభ్రమలోకి వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ తీసుకొని ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడూ, ఆమె గొంతు వింటున్నాడు. సాయంత్రానికి అతని పరిస్థితి పూర్తిగా క్షిణించింది.అతని బుర్రలో వెయ్యి ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నట్టు ఒకటే శబ్దం.
అదేపనిగా ఫోన్ రింగ్ అవుతున్నా, అతనికి ఆ శబ్దం వినిపించట్లేదు.అది అలా చాలాసేపు రింగ్ అవుతూనే ఉంది.కాసేపటికి బుర్రలో శబ్దం  తగ్గి ఒక స్పష్టత వచ్చింది.ఇప్పుడు అతను వినగలుగుతున్నాడు.అతను పైకి లేచి అడుగులు వెయ్యబోయాడు. పాదాల్లో తడబడుతున్నాయి, అతను దాదాపు పడిపోబోయాడు.సరిగ్గా నిలబడం కోసం గోడకి ఆనుకొని,వొణుకుతున్న చేతులతో ఫోన్ అందుకున్నాడు.పెదాల మధ్య నాలుక కదిలించాడు.అవి చెక్కలా బిగుసుకుపోయి ఉన్నాయి.”హలో..”
“హలో, మోహన్” అందామె
“ఆ.. మోహన్నే.”అతని నోట్లోంచి మాట బయటికిరావట్లేదు
“నాకేం వినిపించట్లేదు..”
అతను ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గానీ మాటలు గొంతులోనే ఉండిపోతున్నాయి.
ఆమె చెప్తుంది “మేం అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేసాం,నీకు ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా,ఏమైపోయావు”
మన్మోహన్ తల తిరగడం మొదలైంది.
“ఏమైంది?”ఆమె అడుగుతుంది.
చాలా కష్టం మీద మాటలు కూడదీసుకొని “ఇది నా దుకాణం సర్దేకునే రోజు”
నోట్లోంచి రక్తం భళ్ళున బయటికొచ్చి ధారగా అతని గెడ్డం మీదనుంచి గొంతుమీదకి  కారింది.
ఆమె చెప్తుంది “నా నెంబర్ రాసుకో.ఫైవ్ జిరో త్రీ వన్ ఫోర్…ఫైవ్..జీరో..త్రి..వన్.. ఫోర్(50314)ఇప్పుడు నేను బయటికెళ్తున్నాను.రేపు ఉదయం చెయ్”
ఆమె ఫోన్ పెట్టేసింది. మన్మోహన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అతని నోట్లోంచి రక్తం నురగలు కడుతుంది.
*

 

ప్రసాద్ సూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు