చెప్పే పాఠాలూ : నేర్చుకునే పాఠాలూ!

కొన్నేళ్ళ క్రితం నా చేతికి తెలుగు వాచకం వచ్చింది. లోపల చూస్తే చాలా మట్టుకు సరళంగా వుంది. చాసో గారి కథ వుంది. వ్యాకరణం కూడా ఇదివరకులా చాలా కష్టంగా లేదు. నాన్ డీటైల్ లో బేరిస్టర్ పార్వతీశం లోని ఒక భాగం వుంది. చాలా సంతోషం అనిపించింది. సంస్కృతాంధ్రం చాలా మందికి కష్టమే. బళ్ళో నేర్చుకున్న తర్వాత ముందు ముందు అంత ఉపయోగపడేదీ కాదు. చాలా కొంతమందికి ఆసక్తి వుంటుంది, అదీ సాహిత్యం పట్ల ఆసక్తి వున్న వాళ్ళకి. ఆ కొద్దిమందికి స్పెషల్ తెలుగు అని పెట్టి నేర్ప వచ్చు. నాకు నేను బడిలో చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి.

అప్పట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ లంగ్వేజెస్ వుండేవి. ఇంగ్లీషు థర్డ్ లంగ్వేజ్ కాగా ఫస్ట్, సెకండ్ లు గా హిందీ గానీ తెలుగు గానీ తీసుకోమనేవారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారికి (ముఖ్యంగా ఏడాది మధ్యలో) తెలుగు కష్టం కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఇంగ్లీష్ వుండేది. నేను ఎలాంటి ఆలోచనా లేకుండానే ఫస్ట్ లంగ్వేజ్ గా హిందీ తీసుకున్నా. తెలుగు సెకండ్. తెలుగు మరీ సులువుగా వుండేది, శిష్ట వ్యావహారికంలో చిన్న చిన్న కథలు, వ్యాసాలు; వేమన పద్యాలు; వ్యాకరణంలో తెలుగు సంధులు, ఒకటో అరో సంస్కృత సంధులు … అంతే. అదే ఫస్ట్ లంగ్వేజ్ తెలుగు పుస్తకం చూస్తే చెమటలు పట్టేస్తాయి. ‘నాకు తెలుగు వచ్చు’ అనుకునే నాకు ఆ పద్యాలు అస్సలు అర్థం అయ్యేవి కావు. ఆ సంధులు సమాసాలు చందస్సు,అలంకారాలూ ఇంకా ఏవేవో వుండేవి. అది గనుక నేను తీసుకుని వుంటే బహుశా పది తప్పి వుండే వాడినేమో. ఇప్పటి పిల్లలకి ఆ బాధ తప్పింది.

ఇక హిందీ సబ్జెక్ట్ విషయానికి వస్తే కొన్ని నాకు అభ్యంతరాలు ఉండేవి. పిల్లల కోసం కథలవీ ఏ ప్రాతపదిక మీద ఎంపిక చేసేవారూ అని. నాకు రచయిత పేరు గుర్తు లేదు గాని “దుఃఖ్” అని వో కథ వుండేది. దిలీప్ (ఈ పేరెందుకు గుర్తుంది అంటే మా అన్నయ్య పేరు కూడా అదే కాబట్టి) వొక పార్కులో బెంచి మీద ఉదాసీనంగా కూర్చుని వున్నాడు. భార్య గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించిన కొద్దీ అతనికి కోపం పెరిగిపోతూ వుంది. చిన్న విషయం లో అలిగి పుట్టింటికి వెళ్ళి పోయింది. ఆమె దృష్టిలో ఆమెకున్న దుఃఖం ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదని. తను ఆమెను ఏం దుఃఖ పెట్టాడని? ఇంతలో వో కుర్రాడు బుట్ట చేత పట్టుకుని వస్తాడు దిలీప్ దగ్గరికి. సమోసా లాంటిదేదో అమ్ముతున్నాడు. కొంటారా అని అడుగుతాడు. ఒక్కటి అణా. ఆ చిన్న పిల్లవాడు బడికి వెళ్ళకుండా ఇలా పనిచెయ్యడం బాధ కలిగిస్తుంది. నీ దగ్గర వున్నవన్నీ నేను కొంటాను గాని నువ్వు బడికి ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతాడు. అతని తండ్రి పోయాడనీ, తల్లికి అనారోగ్యం అనీ, ఆమె చేసి పెడితే తను ఇలా అమ్మడానికి పార్కుకు వస్తాడనీ అర్థమవుతుంది. అతనికి వొక పెద్ద నోటు (పదేమో మరి) ఇస్తాడు. ఆ కుర్రాడి దగ్గర చిల్లర వుండదు. పర్లేదు మీ ఇంటి వరకూ వస్తాను మీ అమ్మ దగ్గర వుండొచ్చు చిల్లర అంటాడు. అలా ఆ పిల్లవాడితో వాళ్ళుంటున్న గుడిసె వరకూ వెళ్తాడు. లోపలినుంచి సంభాషణ అంతా వినిపిస్తూ వుంటుంది. అంత పెద్ద నోటుకు చిల్లర డబ్బులు నా దగ్గర మాత్రం ఎక్కడుంటాయి, ఆ బాబుగారు మంచివారిలా వున్నారు, ఈ నోటు ఆయనకిచ్చేయి, రేపు పార్కులో తీసుకుంటానని చెప్పు అంటుంది అతని తల్లి. పిల్లవాడు అలాగే బయటికొచ్చి ఆ నోటిచ్చి ఆ మాట చెబుతాడు. అది తీసుకున్న తర్వాత కూడా దిలీప్ అక్కడే తచ్చాడుతూ వుంటాడు. లోపలినుంచి సంభాషణ. తల్లి తినడానికి రొట్టె ఇచ్చినట్టుంది, ఈ రోజు కూడా ఉత్త రొట్టేనా, పప్పు లేదా అని రోషంగా అంటాడు పిల్లవాడు. లేదు బిడ్డా, ఉప్పు వేశానుగా రొట్టె తిని పడుకో, రేపు తప్పకుండా పప్పు వండుతానుగా అని అనునయంగా తల్లి. బయట నిలబడ్డ దిలీప్ అనుకుంటాడు : నా భార్య ఇలాంటి జీవితం చూడలేదు కాబట్టి తనకు వచ్చిందే దుఃఖం అనుకుంటుంది.

కథలో చాలా స్పష్టంగా ఆర్థిక కష్టాలే దుఃఖం అని చెప్పడం వొక్కటే కాదు, చాలా అవసరమైన విషయాలు చెప్పబడలేదు. కథకుడు దిలీప్ తరపునుంచి కథ చెబుతున్నాడు. వాళ్ళ సంసారం, అనుబంధం ఎలా వుంది? క్రితం రాత్రి ఏం జరిగింది? నిజంగా దిలీప్ ఆమెను అనాలోచితంగా నైనా కష్ట పెట్టలేదా? ఆమె వుంది అని చెప్పుకుంటున్న దుఃఖం ఇంకెవరిదో దుఃఖంతో పోల్చి రద్దు చేసెయ్యడమేనా?అసలు ఆమె ఎలాంటి స్త్రీ, ఆమె ఆలోచనలు ఎలాంటివి, ఆమె ప్రత్యేకంగా ఎలాంటి సందర్భాల్లో కష్టపెట్టుకుంటుంది; మనకు ఏమీ తెలీదు. ఈ కథనం అయితే ఆమెను మన కళ్ళల్లో చులకన చేసినట్టే వుంటుంది.పిల్లలు ఇలాంటివి చదివితే వాళ్ళ మనసుల్లో ఎలాంటి భావాలు నాటినట్టు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పే బదులు పనిమనుషుల గురించి హేళన భావం కలిగించడం (హాస్యం పేరుతోనైనా) అనారోగ్యకరం కాదా. ఇలాంటి ఆలోచనలు వచ్చి నాకు కథ నచ్చలేదు. కానీ పరీక్షల్లో ఇలాంటివేవీ వ్రాయకూడదు, వ్రాస్తే నాకు మార్కులు రద్దు చేస్తారు.

మరో పాఠం “తుం చందన్ హం పానీ”. రచయిత బాగా పేరున్న వాడన్నట్లు గుర్తు, పేరు గుర్తు లేదు. ఈ శీర్షిక చదివితే దేవుడిని ఉద్దేశిస్తూ సంత్ రవిదాస్ వ్రాసిన కవిత గుర్తుకొస్తుంది. కాని ఇది గద్యం. హాస్యంగా సాగే వ్యాసం. ఇక్కడ దేవుడిని ఉద్దేశించి కాదు, పనిమనిషిని ఉద్దేశించి వ్రాసినది. జీతం పుచ్చుకునీ సరిగ్గా చెయ్యని పనిమనిషి చందనం అయితే, జీతం ఇచ్చి సర్దుకునే వారు నీళ్ళుట. నాకు అది హాస్యంగా కాదు అపహాస్యంగా, వల్గర్ గా అనిపించింది. ఇలాంటివి పిల్లల పాఠ్య పుస్తకాలలో ఎందుకు పెడతారో అర్థం కాదు.

చాలా సేపు నెట్ లో వెతికా ఈ రెంటి గురించి. దొరకలేదు. అందుకే అనుకున్నంత వివరంగా వ్రాయలేకపోయాను. ఇంకొన్ని వున్నాయి చెప్పుకోవాల్సినవి. వాటి గురించి ఎలాగైనా ఆ ఒరిజినల్ టెక్స్ట్ సంపాదించి వ్రాస్తాను మరోసారి.

*

పరేశ్ దోశి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు