ఒక అసంబద్ధ పీడకల

ఆ రాత్రి ఏదో  జరిగింది ? ఏమిటది? అదేమిటో తెలుసుకోవాలి. పాపం ఆ కుందేలు ఎంత బేలగా చూసింది? ఆ చూపు తలుచుకుంటే దుఃఖం ముంచెత్తుకొచ్చింది తల్లి జింకకు. ఇలా వదిలేయకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి?

న్యాయవనం… ఆ పేరులోనే ఒక క్రూరమైన వ్యంగ్యం ఉంది. పైన పచ్చదనంతో ముసుగు వేసుకున్నా, లోపల వ్యవస్థ అనే పురుగు ఆ అడవిని లోపలి నుండి తినేస్తోంది. అక్కడ సింహం గర్జన శాసనం కాదు, అది కేవలం తెర వెనుక ఉండే నక్కలు ఆడే నాటకానికి ఒక నేపథ్య సంగీతం మాత్రమే.

ఒకానొక వర్షాకాలపు రాత్రి, ఆకాశం ఉరుములు మెరుపులతో హోరెత్తుతుండగా, అడవిలోని ఒక సురక్షితమైన “దాగుడు స్థలం” లో చిన్న జింకపిల్ల ఒకటి ఒంటరిగా గంతులు వేస్తూ ఆడుకుంటోంది. బయటకు వెళ్లిన తల్లి జింక ఇంకా రాలేదు. తల్లి కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా కాసేపు ఆడుతూ, కాసేపు దాగుడు స్థలం ముందుకు వస్తూ లోపలకు వెళుతూ తిరుగుతోంది పిల్ల జింక. అది పుట్టి నాలుగు నెలలే అయింది. దానికింకా అడవి పూర్తిగా పరిచయం కాలేదు

ఆ జింక పిల్లకు ఇంకా లోకం తెలియదు. దాని దేహం నుండి శత్రువులకు దొరికిపోయేంత వాసన ఇంకా రాకపోవడం దానికి ప్రకృతి ఇచ్చిన వరం. కానీ అదే సమయంలో, తన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టే స్థాయికి దాని ఇంద్రియాలు ఇంకా ఎదగలేదు. తన తల్లి తిరిగి వస్తుందన్న నమ్మకంతో, ఆ చిన్న పరిధిలోనే తుళ్లుతూ, ఆడుకుంటూ గడుపుతోంది.

సరిగ్గా అదే సమయం లో మాంచి ఆకలి మీద వున్న యువ తోడేలు ఒకటి ఆ ప్రాంతం లో సంచరిస్తోంది. తోడేళ్ళు చాలా తెలివైన వేటగాళ్లు. గాలిని పీలుస్తూ, అతి చిన్న శబ్దాన్ని కూడా గమనిస్తూ అవి అడుగులు వేస్తాయి. జింక పిల్ల ఆడుకుంటూ చేసిన చిన్నపాటి అలజడిని తోడేలు పసిగట్టింది. జింకకు వాసన తెలియకపోవడం వల్ల, మృత్యువు తన ముంగిట నిలబడే వరకు అది ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది.

ఒక్కసారిగా తోడేలు పొదలపై నుండి జింక పిల్లపైకి దూకింది. ఆకస్మిక దాడితో జింక పిల్ల ఉలిక్కిపడింది. తన మరణం ఇంత అకస్మాత్తుగా, ఇంత అకారణంగా ఎలా సంభవిస్తుందో దానికి అర్థం కాలేదు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ చిన్న ప్రాణి శాయశక్తులా ప్రయత్నించింది. అప్పుడప్పుడే గట్టిపడుతున్న తన కాళ్లతో తన్నడానికి, తోడేలు పట్టు నుండి తప్పించుకోవడానికి విఫలయత్నం చేసింది. కానీ, అనుభవం ఉన్న క్రూర మృగమైన తోడేలు బలం ముందు ఆ నాలుగు నెలల పిందె నిలవలేకపోయింది.

తోడేలు తన పదునైన పళ్లతో జింక పిల్ల కంఠాన్ని పట్టుకుని, క్షణాల్లో దాని ప్రాణం తీసింది. వేట ముగిసింది. తోడేలు తన ఆకలిని తీర్చుకోవడానికి జింక శరీరాన్ని చీల్చి, అత్యంత పోషక విలువలున్న గుండె భాగాన్ని తిని, మిగిలిన భాగాన్ని వదిలేసి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అది వేట కాదు, ఒక అరాచకపు సంతకం

కాస్త ఆలస్యంగా వచ్చిన తల్లి జింక నెత్తుటి మడుగులో పడివున్న పిల్లను చూసి మ్రాన్పడిపోయింది. ఏం జరిగిందో అర్ధం అయ్యేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. అలా ఏడుస్తూనే పిల్ల జింక శరీరాన్ని ఒళ్ళోకి తీసుకుంది.

“తన చిన్నారి శరీరాన్ని నాలుకతో నాకుతూ, ఆ చల్లబడిపోయిన దేహంలోకి తన శ్వాసను ఊదాలని చూసింది. ఆ బిడ్డ ఇంకా పాలు తాగుతూ తన పొట్ట కింద దూరిన వెచ్చదనం ఆ తల్లి చర్మంపై ఇంకా ఆరిపోలేదు. ‘అమ్మా’ అని పిలిచే గొంతు మూగబోయిందని తెలిసినా, ఆ తల్లి జింక తన ముక్కుతో బిడ్డను నిమురుతూ, లేమ్మని ప్రాధేయపడింది. ఆ రాత్రంతా అది పెట్టిన కేకలు, అడవిలోని క్రూర మృగాల గుండెల్లో కూడా భయాన్ని నింపాయి. తన బిడ్డకు ప్రాణం పోయలేకపోయినా, కనీసం ఆ బిడ్డను చంపిన వాడికి శిక్ష పడకపోతే, తానూ బతికి ఉండి వ్యర్థమని ఆ తల్లి ప్రాణం కొట్టుమిట్టాడింది.”

మరుసటి రోజు ఉదయం అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ జింక తల్లిదండ్రులు, ముసలి జింకలు, తమ బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అడవి మధ్యన  దుఃఖ సమావేశం పెట్టాయి. “అడవి తోడేళ్లది, సింహలదీ ,పులులదీ మాత్రమేనా? జింకలు బతకడానికి వీల్లేదా?” అని గట్టిగా అడుగుతూ మృగరాజు వచ్చి సమాధానం చెప్పేవరకు విశ్రమించేది లేదని పట్టుపట్టి కూర్చున్నాయి. ఇది ఎటు దారితీస్తుందో అని అడవిలోని ఇతర జంతువులన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. కొన్ని జంతువులు జింకలకి మద్దతుగా నినాదాలు చేశాయి. చివరకు ఒత్తిడి తట్టుకోలేక మృగరాజు స్వయంగా జింకల దగ్గరకు వచ్చింది

సింహం తన గంభీరమైన గొంతుతో.

“నాలుగునెలల చిన్న జింక పిల్లను హత్య చేయడం నిజంగా ఘోరం. ఇలాంటి ఘోరం నా పాలనలో జరిగింది అంటే నాకు చాలా అవమానంగా వుంది.అడవిలో జంతువుల వేట సర్వ సాధారణమే! అయినా అడవిలో కూడా కొన్ని నియమాలు, నిబంధనలు వున్నాయి. వాటిని ఎవరైనా పాటించవలసిందే.  తమను తాము రక్షించుకోలేని చిన్న  పిల్లలను, వృద్ధులను,ఆడవాళ్లను వేటాడకూడదు అనేది మన అడవి నియమం. మనమా నియమాన్ని తప్పకుండా పాటిస్తున్నాము కనుకే మనకు అడవికి న్యాయ వనం అనే పేరొచ్చింది. అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా, వేటాడినా ఈ అడవి కి రాజు గా నేను ఉపేక్షించను. ఈ హత్య వెనుక ఎవరు వున్నా వాళ్ళని కచ్చితంగా పట్టుకుని  తీసుకుని వచ్చి మీ జింకల ముందే శిక్ష విధించి అమలు చేస్తాను. హంతకులను కనిపెట్టే బాధ్యత మన రాజ్యం లో సుశిక్షితులైన ఆ రెండు వేటకుక్కలకు అప్పగిస్తున్నాను. ఆ రెండు వేటకుక్కలు ఒక వారం రోజుల లోపల హంతకులను కనిపెట్టి నా దగ్గరకు తీసుకుని రావలసిందిగా ఆదేశిస్తున్నాను”   అని మాట్లాడేసరికి జింకల మందలు అన్నీ సంతోషం వ్యక్తం చేసాయి. కొన్ని జింకలు తమ నాలుగు కాళ్ళను ఒకేసారి పైకి లేపి విల్లులా వొంగి పైకి ఎగిరాయి. మరికొన్ని జింకలు తమ పిల్లలను దగ్గరకు తీసుకుని తోకలను అటూ ఇటూ వేగంగా ఊపుతూ సంతోషాన్ని చాటుకున్నాయి. కొన్ని జింకలు ఒక దానిదగ్గరకు మరొకటి వచ్చి తలలు రాసుకుంటూ.శరీరాలను నాక్కుంటూ అభినందనలు తెలుపుకున్నాయి. అన్ని జింకలూ ఒక్కుమ్మడిగా

“జయహో! రాజా వారూ!

జయహో రాజావారూ !!”

అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా ముక్కులతో గాలి బయటకు వదులుతూ ఈల వేస్తున్నట్టు స్నార్ట్ చేశాయి.

***********

ఆ విచారణ బాధ్యతను మోస్తున్న వేట కుక్కల గొలుసులు నక్కల చేతుల్లో ఉన్నాయి. అసలు నేరస్తుడు ఎవరో ఆ కుక్కల ముక్కులకు తెలుసు. ఆ రాత్రి ఆ “దాగుడు స్థలం దగ్గర తిరిగిన బలమైన తోడేలు వాసన వాటికి స్పష్టంగా తగులుతోంది. ఆ తోడేలు సామాన్యమైనది కాదు, అడవిలో శాంతి భద్రతలు పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కి సహాయ మంత్రి గా ఉన్న ఒక ముసలి తోడేలుకు అది మనవడు. వాడిని పట్టుకుంటే అడవిలోని అధికార వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుందని నక్కలు భయపడ్డాయి.

ఆ రాత్రి ముసలి తోడేలు, ఉప రక్షణ మంత్రి ఇంట్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. ఆ విందు విజయవంతం కావాలని మృగరాజు సందేశం పంపించాడు. వేటకుక్కల గొలుసులు తమ చేతుల్లో ఉంచుకున్న నక్కలు, న్యాయం చెప్పాల్సిన గూబలు, సకల జంతువుల ప్రతినిధులూ విందుకు హాజరయ్యారు. ఒక్క జింకల ప్రతినిధులే లేరు. ఆ రాత్రి ఆ విందులో మద్యం ఏరులై పారింది. తెల్లవారుజామున నెమళ్ళ క్రీంకారం చేసేంతవరకూ విందు కొనసాగింది ఆ రాత్రి జరిగిన విందులో మద్యం ప్రవహించింది. న్యాయం చెప్పాల్సిన గూబలు, దర్యాప్తు చేయాల్సిన కుక్కలు, అధికారం చెలాయించే నక్కలు—అందరూ కలిసి ఒక కొత్త “సత్యాన్ని” సృష్టించారు.

విందుతో పాటుగా కొన్ని ఒప్పందాలు కూడా కుదిరాయి. మొదటి ఒప్పందం ముఖ్య విచారణాధికారి తో

ముఖ్య విచారణాధికారి అయిన ఒక ముసలి వేట కుక్కముక్కుకు వాసనలు పసిగట్టడంలో అపారమైన అనుభవం ఉంది. ఆ జింక చనిపోయిన రాత్రి, ఘటనా స్థలంలో ఆ తోడేలు గోళ్లు, వెంట్రుకలు మరియు దాని అడుగుజాడలు స్పష్టంగా ఉన్నాయి. వాటి మీద మంచి మర్రిఆకులతో కుట్టిన ఒక నాణ్యమైన దళసరి పరదాను కప్పి వాటి రక్షణ కు తగిన చర్యలు తీసుకుంది. కానీ, ఆ కుక్క నక్కల తో ఒక భారీ మాంసం ముక్క,భవిష్యత్తులో అడవి రక్షణ దళానికి అధిపతి పదవికి ఎంపిక చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం తో తన నిజాయితీని గాలికి వదిలేసింది. దీంతో ఆ కుక్క తన గోళ్లతో తోడేలు అడుగుజాడలను చెరిపే సింది. తన కింద పనిచేసే ఇతర కుక్కలను బెదిరించి, “తోడేలు పేరు ఎత్తేవాడు అడవిలో మిగలడు” అని హుకుం జారీ చేసింది.

రెండవ ఒప్పందం అడవిలో అత్యంత తెలివైనవిగా పేరుగాంచిన ముసలి గూబల తో కుదిరింది

అవి జింక మృతదేహాన్ని పరీక్షించి జింక ఒంటిపై ఉన్న తోడేలు డీఎన్ఏ వాసన నమూనాలను అవి కావాలనే నాశనం చేశాయి. ఒక అడుగు ముందుకేసి,

“జింకపై ఎలాంటి  అత్యాచారం జరగలేదు, అది కేవలం కొన్ని గాయాల వల్ల జరిగిన మరణం మాత్రమే” అని ఒక నివేదికను తయారు చేశాయి. ఆ నివేదిక చూసి అడవిలోని ఇతర పక్షులు నివ్వెరపోయాయి, కానీ గూబల అధికారిక ముద్ర ముందు ఎవరూ నోరెత్తలేకపోయారు.

గూబలు ఇచ్చిన నివేదిక మీద గుసగుసలు ఆగలేదు. అడవిలోని సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. “డామ్ విత్ గూబ. జింక పిల్లకి న్యాయం జరగాలి.” అనే హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా ఒక డీర్ జస్టిస్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.నల్లమల, కళింగ,శేషాచల,సుందర్బన్ అడవుల నుండి జింక పిల్లకి సంఘీభావ ప్రకటనలు వెలువడినాయి. జరుగుతున్నది అంతా చూస్తున్న మృగరాజు కి చిర్రెత్తుకొచ్చింది. తన పదవికి మూడుతుందేమో అనే సందేహం ముంచుకొచ్చింది

“అసలేం జరుగుతోంది?” అని అడవి మధ్య భాగాన నిలబడి గట్టిగా గర్జించింది.

ఆ గర్జనకు భయం తో తోడేళ్ళు ఊళ లు వేసాయి,నెమళ్ళు భయం తో క్రీంకరించాయి,లంగూర్లు కోతులు చెట్ల కొమ్మల మీద భయం తో పరుగులు తీశాయి, మచ్చల జింకలు పిక్,పిక్ మనే శబ్దాలతో హోరెత్తించాయి,సాంబార్ జింకలు బెల్లోవింగ్ చేసాయి. అడవి ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

మృగరాజ గర్జనతో చురుకుగా కదలాడిన నక్కలు

మరుసటి రోజు, ఒక వికలాంగ కుందేలును నేరస్థుడిగా లాక్కొచ్చారు. ఆ కుందేలుకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

“నువ్వు జింకను చంపావు,” అన్నాయి కుక్కలు.

“నేను గడ్డి తింటాను కదా?” అంది కుందేలు దీనంగా.

“అది నీ పాత అలవాటు. ఈ రాత్రి నువ్వు రక్తదాహం పెంచుకున్నావు,” అని తీర్పు ఇచ్చేశాయి.

ఆ కుందేలుకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కుక్కలు దానిని చిత్రహింసలకు గురిచేశాయి. రాత్రంతా దాన్ని కొట్టి, భయపెట్టి,

“నువ్వే ఆ జింకను చంపావని ఒప్పుకో, లేదంటే నీ జాతిని అడవి నుండి వెలివేస్తాం” అని బెదిరించాయి. భయంతో వణికిపోయిన ఆ అమాయక కుందేలు, తన ప్రాణాలు కాపాడుకోవడానికి తాను చేయని నేరాన్ని ఒప్పుకుంది. అడవి పందులు కూడా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధమయ్యాయి. అప్పుడు ఆ ముసలి కుక్క వికలాంగ కుందేలు ను తీసుకుని పోయి తాను ఎక్కడైతే తోడేలు అడుగుజాడలను చెరిపేసిందో అక్కడే కుందేలు పాదముద్రలు,కుందేలు వేళ్ళ గోళ్లలో ఆ మట్టి ఉండేలా సీన్ రీక్రియేషన్ చేసింది. న్యాయ స్థానం లో కుందేలు మీద నేరం ఆరోపణ,విచారణ,నిరూపణ జరిగి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.

అలా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. చట్టం ముందు అందరూ సమానులే అనే ధీర,గంభీర ప్రవచనాన్ని వల్లించి మృగరాజు జింకల మంద ముందు కుందేలును ప్రదర్శించి తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంది. అయితే ఇంతకు ముందులా జింకలు తమ సంతృప్తిని పరి పరి విధాలా ప్రదర్శించలేదు

ఆ రాత్రి తల్లి జింక కి నిద్ర పట్టలేదు. దాగుడు స్థలం లో నుండి బయటకు వచ్చి చూసింది. పైన ఆకాశం అంతా నిర్మలంగా వుంది. అడవి నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దం సహజంగా లేదు. చాలాఅలజడిగా  వుంది.ఆ జింక పిల్లకి ఎందుకో వేట కుక్కలు తీసుకుని పోతున్న వికలాంగ కుందేలు గుర్తువచ్చింది. ఆ వికలాంగ కుందేలు తన చిన్న పిల్లను చంపింది అంటే నమ్మ శక్యం కావడంలేదు. కుందేళ్లు చాలా పిరికివి, ఏదైనా ప్రమాదం అనిపిస్తే అవి దాడి చేయడం కంటే వేగంగా పారిపోవడానికే మొగ్గు చూపుతాయి. ఒకవేళ కుందేలు పొరపాటున భయపడి ఎదురు తిరిగినా, అది జింకకు ఎటువంటి హాని కలిగించలేదు.అలాంటిది కుందేలు చంపిందని న్యాయస్థానం ఎలా చెపుతుంది?

ఆ రాత్రి ఏదో  జరిగింది ? ఏమిటది? అదేమిటో తెలుసుకోవాలి. పాపం ఆ కుందేలు ఎంత బేలగా చూసింది? ఆ చూపు తలుచుకుంటే దుఃఖం ముంచెత్తుకొచ్చింది తల్లి జింకకు. ఇలా వదిలేయకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి?

ఆ మరునాడు జింకలన్నీ సమావేశం అయ్యాయి. మళ్ళీ కొత్తగా కుందేలు తన బిడ్డని చంపలేదని పెద్ద న్యాయస్థానానికి మొరపెట్టుకోవాలని నిశ్చయానికి వచ్చాయి. కాస్త తెలివైన మచ్చల జింక దగ్గరకు వెళ్లి తమ బాధనంతా ఒక పెద్ద మర్రిఆకు మీద చిత్రించి పెద్ద గూబ  కి ఇవ్వాలని అనుకున్నాయి. అనుకున్నట్టే ఆ దరఖాస్తును పెద్దగూబ అందుకుంది. వరుస ప్రకారం విచారణ చేస్తానని భరోసా ఇచ్చింది

ఈలోగా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ కుందేలు జైలు గోడల మధ్య తన యవ్వనాన్నికోల్పోయింది.  ఆరోగ్యాన్ని కోల్పోయింది.చిక్కి శల్యం అయింది. దానికి బతుకు మీద ఆశ చనిపోయింది

చివరకు ఒకరోజు అడవిలోని అత్యున్నత ధర్మపీఠం మీద ఉన్న ఒక వృద్ధ గూబ ఈ కేసును మళ్ళీ విచారించింది. “వాన పడినప్పుడు కుందేలు బయటకు రాదు కదా? అది మాంసం తినదు కదా? ఇది అసంబద్ధం!” అని గ్రహించింది.

“ఆ కుందేలు జింక పిల్లను చంపిందని ఎలా అనుకున్నారు?”

“కావలసిన సాక్ష్యాలు అన్నీ వున్నాయి. ఆ రాత్రి కుందేలు జనక పిల్ల వున్న దాగుడుస్థలం దగ్గర తిరగాడటం ఎలుగులు చూశాయి. అవి సాక్ష్యం ఇచ్చాయి. కుందేలు పాద ముద్రలు అక్కడ మట్టిలో దొరికాయి. కుందేలు కాలి వేళ్ళ గోళ్ళ నడుమ ఉన్న మట్టికి అక్కడ మట్టికి సరిపోయింది”

ఆ మాటలు వింటూనే ఆ వృద్ధ గూబ కి వొళ్ళు మండింది.

“ఆ రాత్రి వాన పడిందా?” అని ప్రశ్నించాడు

“పడింది. మిలార్డ్”

“వాన పడినా కుందేలు బయటకువచ్చి జింక మీద దాడి చేసి చంపింది అంటావు అంతేగా ?”

“అంతే యువరానర్”

“సరే! అదుగో ఆ కుందేళ్ళ వైద్యుడు ఇక్కడే వున్నాడు కదా! అతడేం చెపుతాడో విందాం. చెప్పండి వైద్యుడు గారూ వాన పడితే కుందేళ్లు బయటకు వచ్చి వీర విహారం చేస్తాయా?”

“లేదు యువరానర్. కుందేళ్లు వాన పడగానే వెంటనే తమ బొరియల లోకి వెళ్లిపోతాయి. తడిసిపోతే వాటి శరీర ఉష్ణోగ్రత పడిపోయి, అవి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.ఒకవేళ కుందేలు కొంచెం తడిసినా, వాన తగ్గగానే అది వెంటనే తన బొచ్చును నాలుకతో శుభ్రం చేసుకోవడం మొదలుపెడుతుంది. తడి వల్ల బొచ్చు అతుక్కుపోకుండా చూసుకోవడం వాటికి చాలా ముఖ్యం.కుందేళ్లు పూర్తిగా తడిసిపోతే వాటికి హైపోథెర్మియా  వచ్చే అవకాశం వుంది. కనుక వాన వచ్చే సూచనలు ఉంటే అవి గబా గబా లోపలకు వెళ్లిపోతాయి.”

“ఒక కుందేలు అది చాలా ఆరోగ్యంగా ఉన్నాసరే, ఒక జింక పిల్ల మీద దాడిచేసి చంపేయగలదా ? శరీరాన్ని గోళ్ళతో చీల్చి గుండెను తినగలదా?’

“అసంభవం యువరానర్.కుందేళ్లు తినేవి అన్నీ ఆకులు,గింజలు. అసలా కుందేలు రెండొందల అడుగుల దూరం కంటే ఎక్కువ దూరం దాటి వెళ్లవు యువరానర్”

“మీరు సరిగ్గా విచారణ చేయకుండానే, కుందేలు ను తీసుకుని వచ్చి కారాగారం లో పెట్టారు అంతేగా. కథలు చెప్పినా అతికినట్టు ఉండాలిగా” అని వృద్ధ గూబ విసుక్కుంటూ, సాక్ష్యాలన్నీ కల్పితమని, కుక్కలు మరియు నక్కలు కలిసి ఆ అమాయక కుందేలును బలి చేశాయని ఆగ్రహించింది. కుందేలు నిర్దోషి అని తీర్పునిస్తూ దాన్ని విడుదల చేసింది.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుందేలు బయటకు వచ్చినప్పుడు దానికి నడవడానికి సత్తువ లేదు, చూడటానికి కళ్లు కనపడటం లేదు. బోను నుండి విడుదలైన కుందేలు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చని అనుకుంది కానీ, అడవిలో అది అడుగు పెట్టిన ప్రతిచోటా దానికి అవమానాలే ఎదురయ్యాయి.

చీకటి కొట్టులో కుక్కల పళ్ల మధ్య నలుగుతున్నప్పుడు, ఆ కుందేలుకు తన శారీరక గాయం కంటే, తనపై పడ్డ నింద ఎక్కువ నొప్పిని ఇచ్చింది. ‘నేను కనీసం ఒక చిన్న పురుగును కూడా చంపలేను కదా, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు?’ అని అది అడగాలని చూసింది. కానీ దాని గొంతు బయటకు రాలేదు. విచారణలో ఆ కుక్కలు దాన్ని కొడుతుంటే, ‘అమ్మో’ అని అరిచే సత్తువ కూడా లేక, కేవలం తన పెద్ద కళ్లతో మూగగా రోదించింది.

సొంత కుందేళ్ల జాతి కూడా దాన్ని వెలివేసింది.

“నీ వల్ల మా జాతికి మచ్చ వచ్చింది, నువ్వు ఈ అడవిలో ఉంటే మమ్మల్ని కూడా తోడేళ్లు వేటాడతాయి”

“నిర్దోషివని గూబ చెప్పవచ్చు, కానీ సమాజం నిన్ను హంతకుడిగానే గుర్తు పెట్టుకుంటుంది,” అన్నాయి

దాని సొంత బంధువులే పొదల్లో నుంచి దాన్ని తరిమేశారు. అది ఏ చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్లినా, మిగిలిన జంతువులన్నీ వెనక్కి తగ్గిపోయేవి. అది ఎంత మొత్తుకున్నా,

“నన్ను కుట్ర చేసి ఇరికించారు, నేను నిర్దోషిని” అని మొరపెట్టుకున్నా, వినే హృదయం ఆ అడవిలో ఎక్కడా లేదు. న్యాయస్థానం దాన్ని నిర్దోషి అని ప్రకటించినా, సామాజిక న్యాయస్థానం మాత్రం దాన్ని ఎప్పటికీ నేరస్తుడిగానే చూసింది. ఆ కుందేలు చివరకు ఒక పాడుబడ్డ బొరియలో ఒంటరిగా పడి ఉంది

అది ఆకలితో చావలేదు, అడవి తనను చూపిస్తున్న వివక్షతో, వెలివేతతో కుమిలి కుమిలి చనిపోయింది.

ఇంకోవైపు, ఆ చనిపోయిన జింక తల్లిదండ్రులు ఆ అడవిలో ప్రతి చెట్టును, ప్రతి రాయిని అడుగుతూనే ఉన్నారు. “మరి మా బిడ్డను చంపిన ఆ తోడేలు ఎక్కడ?” అని వారు అరిచే గర్జనలు అడవి అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. అసలు నేరస్తుడైన తోడేలు మాత్రం ఇప్పటికీ అడవిలో రాజభోగాలను అనుభవిస్తోంది.

సరిగ్గా అదే సమయం లో అడవిలో ఎన్నికలు జరిగాయి. “జింక పిల్లకి న్యాయం” అనే నినాదం తో ప్రతిపక్షం ఎన్నకలలో పాల్గొంది. అనూహ్యంగా పాత మృగరాజు ఓడిపోయి కొత్త  రాజు గద్దెను ఎక్కాడు. జింక పిల్ల కేసును మళ్ళీ పునర్విచారించాలని ఆదేశిస్తూ సరికొత్త గా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసాడు. ఆ బృందం నత్తనడకన దర్యాప్తు పూర్తి చేసింది.

జింక పిల్ల చనిపోయిన ఇరవై ఏళ్లకు ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదికను న్యాయస్థానానికి అందించింది. జింక పిల్ల మీద దాడి జరిగిన మాట వాస్తవం. దారుణంగా చంపిన మాట వాస్తవం. శరీరాన్ని చీల్చి గుండె తిన్న మాట కూడా వాస్తవం . కానీ సాక్ష్యాధారాలు ఏవీ లేనందున నిందితుడు ఎవరో కని పెట్టలేకపోతున్నాము అని నివేదిక ప్రకటించింది.

సాక్ష్యాలన్నీ కనుమరుగయ్యాయి, సమయం గడిచిపోయింది. ఆ జింక ఆత్మ ఇప్పటికీ ఆ పాత దాగుడు స్థలం దగ్గర తిరుగుతూనే ఉంది. అన్యాయం జరిగిందని గూబ చెప్పింది కానీ, ఆ జింకను చంపిన వాడు ఎవరో చట్టం చెప్పలేకపోయింది. అడవిలో చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ సత్యం మాత్రం నక్కల కుతంత్రాల మధ్య నలిగిపోయింది. బలవంతుడికి ఒక న్యాయం, బలహీనుడికి ఒక న్యాయం అనే చేదు నిజం ఆ న్యాయవనంలో గాలిలో కలిసిపోయింది.

ఆ రాత్రి జింకలు అన్నీ కలసి జింక పిల్ల చనిపోయిన చోట కూర్చుని ఏడవసాగాయి. దగ్గర దగ్గర నూటయాభయి జింకలు చిన్నవీ,పెద్దవీ,ముసలివీ,యవ్వనం లో ఉన్నవీ అన్నీ ఒక్క పెట్టున ఏడవడం మొదలుపెట్టాయి. వాటి కళ్ళ నుండి కారిన కన్నీళ్లు   జింక పిల్లను పూడ్చిన చోట పడి మొదట  ఒక గుంటలాగా మారి తరువాత తరువాత ఒక నదిలా , ఆ తరువాత ఒక సముద్రం లా మారి అడవిని ముంచెత్తాయి. ఒక వెల్లువలా, ఒక తుఫాను లా, ఒక సునామీ లా జింకల కన్నీళ్లు అడవిని అల్లకల్లోలం చేసాయి. శతాబ్దాలుగా అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు కూకటి వేళ్ళతో పెకలించబడినాయి. అడవి సముద్రం లో మునిగి పోయింది. ఆ సముద్రం మీద నాలుగు వేటకుక్కలు, రెండు తోడేళ్ళు, మరికొన్ని అడవి పందులూ తేలియాడసాగాయి. వాటిని ఆ కన్నీటి సముద్రం చుట్టచుట్టి కొన్ని కోట్ల చేతులతో బలంగా విసిరివేశాయి.

అడవి అంతా నీటితో నిండిపోయింది. ఆ నీటి అడుగున జింక ఆత్మ ఇంకా వెతుకుతూనే ఉంది— వ్యవస్థ నిర్మించిన ఆ అంతుచిక్కని పత్రాల మధ్య తన కోల్పోయిన గుండె ఎక్కడుందా అని.

*

వంశీ కృష్ణ

1 comment

Leave a Reply to Aravinda Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Your story was incredibly powerful. The way it exposed how justice can be compromised across multiple levels of society was deeply meaningful. What stayed with me most was the unimaginable pain of a mother feeling completely helpless. That emotion was portrayed so powerfully that it was impossible not to feel it deeply. Connected to move star Prathyusha’s life

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు