ఒంటరితనపు ఋతువు

  ఎదురైన అపరిచితుడిని యథాలాపంగా పలకరించాను

అప్రయత్నంగానే మాటలు కలిసిఅడుగులేసాయి.

మామధ్య కొత్తదనం చూస్తుండగానే పాతబడింది.

అతడికీ నాకూ తీరిక సమయాలంటూ విడివిడిగా లేకుండాపోయాయి!

 

అదేం మాయో,

ఇన్నాళ్ళూ నాలోని ఉత్సాహపు కెరటాల్ని తనలోకి లాక్కున్న

అరేబియా సముద్రం చప్పుడులేనిదైంది,

నగరం నన్ను భయపెట్టడం మానేసింది.

వెనుక వదిలివచ్చిన కుటుంబపు దిగుళ్ళు, ఉద్యోగపు ఒత్తిళ్ళు

దూదిపింజలై పోయాయి!

చుట్టుకున్న ఒంటరితనపు ఋతువు నన్నొదిలి వెళ్ళిపోయింది!

 

అపరిచితుడు ఆప్తుడైన క్షణాలు మీకెవరికైనా తెలుసోలేదో!

స్నేహపు చుట్టరికం నన్ను ఆ ఇంటివరకూ నడిపించింది.

మా ఇళ్ళ మధ్య గోడలు చిత్రంగా చెరిగిపోయాయి!

మా మనసులు సముద్రమంత విశాలమయ్యాయి

అతని చిన్నఇల్లు మా సాయంకాలపు సమావేశాలకి విశాలమైన వేదికైంది,

మా వినోదాలకి ప్రదర్శనశాలైంది,

నా ఆకలి తీర్చిన అన్నపూర్ణాలయమైంది.

 

ఆ ఇంటి ఇల్లాలు కొసరి కొసరి వడ్డించిన చెల్లెలైంది.

ఎక్కడివీ అనుబంధాలు?

ఏ జీడి కోసమో, పెరట్లో జామపిందె కోసమో తోడబుట్టినవాళ్ళతో

తగువు పడిన దృశ్యాలు కంటి ముందుకొచ్చాయి!

అన్నదమ్ములతో ప్రేమనే పంచుకొమ్మన్న అమ్మ

నాలో సజీవంగా ఉందన్నది అర్థమైంది!

బడి మొదటిగంట వేళ ప్రార్థన కోసం బారులు తీరినపుడు

గొంతెత్తి ఆ లేతవయసు లో చేసిన ప్రతిజ్ఞ

“భారతీయులంతా నా అన్నదమ్ములు…”

నన్ను అణువణువునా ఆవహించే ఉందని నమ్మకంగా తోచింది!

 

కలిసి నడిచిన దారుల్లో మిగుల్చుకుంటూ వచ్చిన ఆత్మీయతానురాగాల బంధం

జీవిత రహదారుల వెంట ఎత్తుపల్లాల్ని అధిగమించేందుకు ప్రాణవాయువైంది!

నిశ్శబ్దంగా తోసుకెళ్తున్న కాలప్రవాహం మా స్నేహానికి కొలమానం కాలేకపోయింది.

కాలం భలే గడుసరి!

ఎన్నో ఇస్తూ, మరెన్నో లాక్కుంటూ

బతికేందుకు కావలసిన తాయిలాల్ని మాత్రం మూట కట్టి ఇస్తూనే ఉంది!

పంచుకుందుకు ఆత్మీయుల్ని జత చేస్తూనూ ఉంది!

***

చిత్రం: సృజన్ రాజ్

అనురాధ నాదెళ్ళ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు