మొదటిసారిగా దేశం, ప్రజలు, దేశభక్తి అనేది ఆనాడు ఎట్లా తెలిసిందంటే, మా బాబాయి కాంగ్రెస్ ఉద్యమంలో పని చేస్తుండేవారు. నేను చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ ఉద్యమం గురించీ, బ్రిటిషు వాళ్ళు చేసే అరాచకాల గురించి పాటలు వింటే చిన్నతనంలోనే అసహ్యం పుట్టింది. ‘మా కొద్దీ తెల్లదొరతనం’ ‘వాడు కుక్కలతో పోరాడి కూడుతింటాడట’ అనే పాటలు వినే వాళ్ళం. అట్లాగే దేశాన్ని గురించి, దేశమంటే, దేశభక్తి గేయాలంటే నేను ప్రభావితమవుతూ దేశభక్తులుగా పుట్టటం కూడా ఒక అదృష్టమేనేమో అనుకుంటూ వచ్చేదాన్ని. అట్లాగే కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్‌కు ఓటు వేస్తానంటే పదేళ్ళ దానివి నీకు ఓటు హక్కు ఎక్కడ నుంచి వస్తుంది, వద్దు తర్వాత వేద్దువు గానీలే అనేవారు.
అట్లా నేను ప్రతి కాంగ్రెస్ మీటింగ్‌కి హాజరవడం, దేశభక్తి గేయాలు పాడుతూ రావటం… అట్లా వున్నప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అనేదొకటి ఉద్భవించింది. అదే కుర్రవాళ్ళందర్నీ కూడగట్టి మంత్రివారి పాలెంలో ఇంకా కొన్ని చోట్ల సమ్మర్ స్కూల్స్ పెట్టి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చింది. అప్పుడది కాంగ్రెస్ సోషలిస్టు పార్టీగా ఉండేది. వాళ్ళే కొన్నాళ్ళకు కమ్యూనిస్టులుగా మారారు. ఆ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో వుండే కుర్రాళ్ళని ఇట్లా దేశభక్తుండి, చక్కగా పాడగలిగి ఉత్సాహమున్న పిల్లల్ని తీసుకెళ్తే జీవితం రాణిస్తుంది, ఉద్యమం బలపడ్తుంది. ఆ ఉద్దేశంతో ఆలోచించి ఇలా యాక్టివిటీస్‌లో వున్న వాళ్ళందర్నీ తీసుకొచ్చి వివాహాలను కూడా ప్రోత్సహించారు. అట్లా నా వివాహం ఒక కమ్యూనిస్టుతోనే జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా, కమ్యూనిస్టు భావాలతోటి, దేశభక్తితోటి స్వరాజ్యం రావాలి, అందరూ సుఖపడాలి, తెల్లవాళ్ళు పోవాలి అనేవి మనసులో బాగా నాటుకున్నా, సంప్రదాయాలు, ఆచారాలు వాటికి ముడిపడి వున్న జీవితం కాబట్టి, కొన్ని విషయాల్లో ముందుకు రాలేకపోయాం.
స్త్రీలందరితో కూడా మేడే అనీ, విప్లవ దినోత్సవాలనీ పండుగలుగా చేసుకునే వాళ్ళం. ఆ పండుగ రోజుల్లో స్త్రీలందర్నీ కూడా పెద్దగా ఊరేగింపుల్లో తీసుకొచ్చే వాళ్ళం. చుట్టూరావున్న ఫిర్కా వాళ్ళంతా గుడివాడ సెంటరు కొచ్చేసి అక్కడ ఊరేగింపు, పెద్ద బహిరంగ సభ అన్నీ జరిపేవాళ్ళం. ఆ మీటింగుల్లో పాటలు పాట్టం, తర్వాత ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ ప్రజాసంఘాల్లో స్త్రీలందరు కూడా మహిళా సంఘాలుగా ఏర్పడాలి, మహిళలుగా కృషి చేసి సమస్యలపై పోరాడాలి. స్త్రీలకెవరేం చేశారు. ముందు తెల్సుకోవాలి. ఆ స్త్రీ సమస్యలెట్లా సమాజాన్ని బట్టి, మానవుని అవసరాల్ని బట్టి, ధర్మాలు మారుతూ వుంటాయి. కాబట్టి పూర్వం ఎన్ని ధర్మాలున్నా మారిపోయి ఇప్పుడు మానవత్వం మనుగడకు సమసమాజంలో ఏ ధర్మాలు కావాలనేది గుర్తించి దానికి దోహదం చేసే సాహిత్యం… వీరేశలింగం అన్నారు. ‘‘దేశభక్తియుతమైంది. వందేమాతరం కాదు. అంతకంటే మంచి గేయం, దేశభక్తి గేయం గురజాడ రాశారు చూడం’’డని మేము చదివి దాన్లో వున్న సారాన్ని అర్థం చేసుకుని అట్లాగే మేం కూడా వట్టి మాటలు కాదు, కొంతయినా సొంత లాభం కొంతమానుకుని…అంతా మానుకోవటం సాధ్యం కాదనుకోండి. కొంత మానుకునైనా ముందుకు రావాలని, అలా మహిళా ఉద్యమంలో పని చేశాం. తర్వాత ఉపన్యాసాలతో పాటుగా మనసుకి ఉల్లాసాన్ని, ఆనందాన్నిచ్చే పాటలు, నాటకాలు, బుర్ర కథలు కూడా కావాలి అనే దాంతోటి బయల్దేరాం. మీరురండి అనే ప్రోత్సాహం కమ్యూనిస్టు పార్టీ ఇచ్చింది.
మహిళా ఉద్యమంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా. అయితే అప్పట్లో స్త్రీలు నాటక రంగంలోకి వచ్చేది లేదు. కిరాయి స్త్రీలు వచ్చి నాటక రంగంలో పాల్గొనే వాళ్ళు. మహిళలు ఉద్యమంలోకి వచ్చినంత చొరవగా నాటక రంగంలోకి రాలేకపోయాం. మేం బెంగాల్‌నే ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. బెంగాల్‌లో రవీంద్రుని మనుమరాలు నాటకాల్లో యాక్ట్ చేసింది. ఇట్లా ‘ముందడుగు’ నాటకం స్టార్ట్ అయ్యింది. దీన్ని సుంకర, వాసిరెడ్డి రాశారు. ముందడుగు నాటకాన్ని మొగవాళ్ళే యాక్ట్ చేస్తే అది ముందడుగు అన్పించదు. స్త్రీ పాత్రలు స్త్రీలే యాక్ట్ చేయాలి. అప్పుడే అది ముందడుగు అన్పించుకుంటుంది.
ఆ రకంగా నాటకాలు వేశాం. దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సలహాలిచ్చే వారు. మొదట ఎవరూ రాలేకపోయాం. భయం, సంసార స్త్రీలు రంగం మీదికొస్తే ఏదో వేశ్యను చూసినట్లు చూస్తారేమో అనే భయం. రాత్రి యాక్ట్ చేసిన అమ్మాయి అదిగో అని వెక్కిరిస్తారని చెప్పి నేనురానంటే సీతారామయ్యగారు ఉపవాసం వుండి అసలు అన్నం తినకుండా వున్నారు. మరి పురుషునికున్నంత నిబ్బరం స్త్రీకి వుండదు కదా! భర్త అన్నం తినకపోతే చాలా బాధపడిపోతుంది. ఈ మనస్తత్వం బాగా జీర్ణించుకుని వున్నవాళ్ళం. మరి సోవియట్ రష్యాలో వాళ్ళ కల్చర్ ఎట్లా వుండేదో తెలియదు కానీ! భర్త తిడ్తుంటే సహించే వాళ్ళం. ఆయనెట్లా చెప్తే అట్లా వినాలి తప్పదు అనేదాంతో ఆ నాటకంలోకి వచ్చాం. అసలు ఇష్టంలేని పన్లు చేయిస్తున్నారనే బాధ ఎక్కువగా వుండేది. ఇక తప్పదు విధి అనుకునేవాళ్ళం. కొన్నిసార్లు మా ప్రక్కన భర్తగా ఎవరో వుంటే యాక్ట్ చేయలేకపోయేవాళ్ళం. నాటకమంతా చక్కగా వుండాలంటే మీరట్లాకాక నటన బాగా చేయాలి. నటన సహజంగా ఉండాలి. ఆయన మీ అన్నయ్యలాంటివాడే అని చెప్పేవారు. నటన కృత్రిమంగా లేదు. బాగుండేవరకి అభినందనలు ప్రదర్శించే సరికి మాకు ఉత్సాహం వచ్చేసింది. మేమంతా వున్నాం గదా అనే దాంతోటి తీసుకురావటం జరిగింది మా మిత్రులు, కామ్రేడ్స్ అంతా!
దీనికంటే ముందు అంటే ‘ముందడుగు’ కన్నా ముందు సాహిత్యంలో ఈ ఛందస్సు, గణాలు, కామాలు, ఫుల్‌స్టాపు, ఈ బండిర(ఱ) ఇవన్నీ అనవసరం అనే దాంతో తాపీ ధర్మారావు గారు రాసినవి గురజాడ ‘కన్యాశుల్కం’ లాంటి నాటకాలు కొన్ని వేశాం. అంటే పాతవాళ్ళు అభ్యుదయ భావాల్తో రాసిన నాటకాల్నే ముందువేశాం. అయితే గురజాడ, కందుకూరి నాటకాలు మావరకే వేసి చూపెట్టాం. బైట ప్రపంచానికి చూపెట్టలేదు. ‘ముందడుగు’, ‘మా భూమి’ నాటకాలు బైట ప్రపంచానికి వేయడానికి భయపడ్డాం. కమ్యూనిస్టు పార్టీ ఎంత బలంగా వుందో తెల్సుకదా! మనవాళ్ళే కాదు, ఇతర స్త్రీలపై కూడా ఈగవాల్తే మేం వూర్కోం అని చెప్పేసి ఒక పొలిటికల్ అవగాహన్తోనే కాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతోటి తీసుకొచ్చామన్నమాట.
మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాతమిత్రు కంటే కూడా. ఈ పార్టీలో వున్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’లోలాగా.. మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కల్సి పని చేశాం. కొందరు మహిళా సంఘాల్లో పని చేసినా, కొందరు ప్రజా నాట్యమండలిలో, కమ్యూన్లో బుల్లెమ్మకి సహకరించినా అందరం ఏకతాటి మీద వుండేవాళ్ళం. మన అభిరుచులకి అనుగుణంగా వున్నవాళ్ళతోటే దగ్గర సంబంధాలు ఏర్పడి మనం దేశ వ్యాప్తంగా వచ్చే దానికి కృషి చేయాలి అనే దాంతోటి మా రోజుల్లో వర్ణాంతర వివాహాలు జరిగాయి. వితంతు వివాహాలు కందుకూరి ప్రవేశ పెట్టారు. కానీ విస్తృత ప్రాతిపదిక మీద పార్టీ వాళ్ళే చేశారన్నమాట. వర్ణాంతర వివాహాలు కూడా ఉద్యమరీత్యా, ఉద్యమం బలపడ్డానికే…. దేశ వ్యాప్తంగా ఒకరొకరికి లింకు ఏర్పడటానికి గోదావరి జిల్లా అమ్మాయిని, కృష్ణాజిల్లా అమ్మాయిని, నందిగామ తాలూకా, గుంటూరు యిట్లా అన్ని చోట్లకీ సంబంధాలుండేలా! అయితే కమ్మోరిలో నాలుగు తెగలు, రెడ్డోరిలో పది తెగలుండేవి. కాపుల్లో యిట్లా తెగలుం డేవి. ఈ తెగలే కాకుండా కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాల దాకా తీసుకొచ్చారు. ఇవి కూడా ఉద్యమంలో భాగంగా జరిగేవి. వీళ్ళు కట్నాల్లేకుండా చేసుకున్నా కానీ బైట వ్యతిరేకత బాగా వుండేది. ఈ కమ్యూనిస్టు పిల్లలు ఉద్యోగాల్లేకుండా, జైళ్ళకే పోతారు. చేసుకుంటే మా పిల్లలు సుఖపడరేమోనని చాలా మంది తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయితే ఆ పిల్లలను, ధైర్యంగా వున్న వాళ్ళను ప్రోత్సహించి తీసుకొచ్చే వాళ్ళం.
తాపీ ధర్మారావుగారి కోడలు రాజమ్మ. ఆమె బ్రాహ్మిన్. ఆమెని ముసలాయనకిచ్చి పెళ్ళి చేయబోతుంటే ఏడుస్తూ చెప్పి వెళ్ళిపోయింది. చెప్తే నీకేం భయం లేదు అని చెప్పేసి తీసుకొచ్చేశారు. మాకు కమ్యూనుండేది. ఏ హోటల్లోనో, ఎవరింట్లోనో వుండాలి అనే భయం లేదు. కమ్యూన్లో వుండేది. అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉండేది. ప్రజా నాట్యమండలిలో కూడా పాల్గొనేది. కొంత కాలం తర్వాత తాపీ ధర్మారావుగారి కొడుకు యోషన్‌రావు గారు ఆమెను వివాహం చేసుకున్నారు. ఇంకా ఎన్నో చోట్ల అలా చేశాం అనుకోండి.
ఉదాహరణకి యిది చెప్తున్నా.
అట్లా కొంత కాలానికి కమ్యూనిస్టు పిల్లల్ని చేసుకుంటే మా పిల్లలు సుఖపడ్తారనేది మా కుటుంబాల్ని చూసిన తర్వాత అనుకున్నారు. వాళ్ళకు విమర్శన, ఆత్మ విమర్శన ఉండేది. అసలిట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేవనుకోండి. ఏదైనా తప్పు చేస్తే పెద్ద వాళ్ళు కోప్పడటం, వాళ్ళ సహకారం వుంది కాబట్టి మా పిల్లల్నిస్తే సుఖపడ్తారనే స్థితి దాక వచ్చారు.
ఇక సాహిత్యంలో చూస్తే స్త్రీలు ఎంత వరకు రాయగలిగారు అంటే అంత విస్తృతంగా అది వ్యాప్తిలోకి రాకపోవచ్చు. కానీ సాహిత్య వారమని జరుపుకునే వాళ్ళం. ఈ మహిళా కార్యకర్తలందరూ కూడా మన ప్రోగ్రెసివ్ సాహిత్యమంతా సంచుల్లో పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పటిలాగా బస్సు సౌకర్యాలు లేవు. మోయలేక, మోయలేక మోసే వాళ్ళం. ఊరూరికి తిరిగే వాళ్ళం. మాలపల్లి, శరత్, ప్రేమ్‌చంద్, వీరేశలింగం, గురజాడ. ఈ సాహిత్యంతో పాటు అభ్యుదయ సాహిత్యం. దాని తర్వాత యితర దేశాల సాహిత్యం కూడా ప్రవేశించింది. గోర్కీ రాసిన ‘అమ్మ’, ‘అన్నా కెరనీనా’, ‘నానా’ యిట్లా కొన్ని నావెల్స్ వచ్చాయి. అప్పుడు సాహిత్యంలో కాల్పనికోద్యమం ఉండేది. ఆ కాల్పనిక సాహిత్యం నుంచి అభ్యుదయ సాహిత్యం మొదలైంది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. కృష్ణశాస్త్రి, సోమసుందర్ లాంటి వాళ్ళందరూ కాల్పనికోద్యమం నుంచి వచ్చారు.
అభ్యుదయ సాహిత్యానికి శ్రీశ్రీ పెద్ద అన్నయ్యలాగ అన్పించే వారు. శ్రీశ్రీ ద్రోణాచార్యులైతే, తెలియని ఏకవ్యులెందరో. చలం సాహిత్యం కూడా కొంతమంది చదివేవారు. స్త్రీకి కూడా న్యాయం చేశాడు. అంటరాని వాళ్ళెంతో స్త్రీలూ అంతేకానీ, ఈ సాహిత్యం ఆచరణ సాధ్యం కాదేమో అన్పించేది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా స్త్రీకి యిబ్బందులు అలాగే వున్నాయని నా భావన. ఎంత కమ్యూనిస్టు పార్టీ వచ్చినా, రివల్యూషన్ వచ్చినా స్త్రీల బాధలు… గాధలు… తప్పవనే అనుకోండి. చలంగారు స్త్రీ, పురుషుల్ని సమానంగా చిత్రించిన సాహిత్యం మేమందరం చదివామనుకోండి, కానీ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు గదా! చలం ‘బిడ్డల శిక్షణ’, ‘స్త్రీ’ యింకా వున్నాయి కదా, అవన్నీ చదివి మనం ఎంతవరకు జీర్ణించుకుంటాం. ఇప్పుడిప్పుడే ఉద్యమంలోకి వచ్చేవాళ్ళకి ఇస్తే అది ఎంతవరకు రాణిస్తుంది అనే ఉద్దేశంతో పెద్దగా ఆ వైపుకి వెళ్ళలేదన్నమాట. ఈ సాహిత్యవారంలో, యితర దేశాల్నుంచి మార్క్సిస్ట్ ఔట్‌లుక్, సిద్ధాంతంతో పాటు స్త్రీల ను సభ్యులుగా చేర్పించి గ్రామాల్లో చదివించేవాళ్ళం – అభ్యుదయ రచయితల పాటలు పాడి విన్పించే వాళ్ళం. విన్పిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా వినేవాళ్ళు. మీటింగుల్లో పాటలే కాకుండా చందాలు కూడా వసూలు చేసేవాళ్ళం.
ఇక కల్చరల్‌గా ప్రజా నాట్యమండలి, మహిళా సంఘం, బాల సంఘం ఎవరివి వారికి ఉన్నాయి. ఈ ప్రజా సంఘాలన్నింటిని కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. ఈ పార్టీ అంటే భయపడే వాళ్ళంతా ప్రజా సంఘాల్లోకి రావొచ్చు. కొందరు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన సంఘాలే గదా ఇవి గూడా అనేవారు. అట్లా వుంటుండగానే జపాన్ ఫైట్, పీపుల్స్ వార్ ప్రకటించిన తర్వాత హిట్లర్, ముస్సోలినిలను దుయ్యబడ్తూ కొన్ని గేయాలు వచ్చాయి. ఆ గేయాలను కూడా ప్రచారం చేసేవాళ్ళం. సుంకర వాళ్ళు ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలా గేయాలు రాశారు. తెలంగాణా మీద గోపాలకృష్ణయ్య ఒక వ్యాసం కూడా రాశారు. కొన్ని పుస్తకాలు అర్థమయ్యేవి. కొన్ని కొన్ని అర్థమయ్యేవి కావు. సోమసుందర్ రాసిన ‘వజ్రాయుధం’ అర్థమయింది. కాని ఆరుద్ర ‘త్వమేవాహం’ అర్థం కాలేదు. అట్లా అర్థం కానప్పుడు దాంతోటి స్టార్ట్ చేస్తేనే బాగుంటుందని, గిడుగు రామ్మూర్తి పంతులుగారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వీళ్ళు ఆరాధ్యులుగా మన జాతికి ఎంతో మేలు చేశారు. అప్పుడే గిడుగు రామ్మూర్తి గారు చేశారు కానీ మనం యిప్పటికీ చేయలేకపోతున్నాం. అప్పట్లో పార్టీకి, ఆంధ్రపత్రిక మేమే పెట్టుకున్నాం.
అప్పట్లోనే బెంగాల్ కరువొచ్చింది. దాని కరువు నివారణకు మానవతా దృక్పథంతో మనమేం చేయాలి? దానికి చందాలు వసూలు చేయటమే కాకుండా, ప్రత్యక్షంగా కరువు గురించి గేయాలు రాసి పాడేవాళ్ళం. ‘ఇదీలోకం’ అని శ్రీరామచంద్రమూర్తి అని ఒకాయన రాశారు. ఆ నాటకాన్ని తీసుకపోయి ప్రజల్లో ప్రవేశ పెట్టాం. దాంట్లో ‘జీవచ్ఛవం’ పాత్ర వేశానన్నమాట. చాలా గుర్తింపు వచ్చింది. తర్వాత రాష్ట్ర కాన్ఫరెన్స్ జరిపినపుడు మా నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఉత్తమ నటిగా నాకు వెండికప్పు వచ్చింది. అట్లా అన్ని యాంగిల్స్ లోంచి, బెంగాల్ కరువు తర్వాత రాయలసీమ కరువు వచ్చింది. జి.వరలక్ష్మితో పాటు అందరూ వచ్చి చాలా చాలా వేశారు. పోటీలు మనవాళ్ళకే కాకుండా అన్ని వేపులా సాహిత్య ఎకాడమీ వాళ్ళు పోటీలు పెడ్తే మనవాళ్ళు గెలిచారు. అప్పుడు మన మిత్రుందరూ ఏమనుకున్నారంటే కిరాయి స్త్రీలు చేస్తూ వుండటం వల్ల యిట్లా అణగారి పోయింది. ‘ప్రజా నాట్యమండలి’ మంచి ఆర్గనైజేషన్, వాళ్ళు పెద్ద పెద్ద నాటకాలు వేయలేకపోయినా ఈ నాటకం రాణించడానికి చక్కగా దోహదం చేశారు. వాళ్ళంతా యింత ఆర్గనైజ్డ్‌గా ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి వాళ్ళు పాత్రల్లో మిళితమై యాక్ట్ చేశారు. దీనికి కారణం ఉద్యమమే అని యితరులు గుర్తించారు.
ఇట్లా ప్రజానాట్య మండలిలో పని చేశాను. పని చేసిన తర్వాత సీతారామయ్య గార్ని వేరే తాలూకాకి వేశారు. ఆ తాలూకా బలహీనమైన తాలూకా. ఆ తాలూకాకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి తాలూకా ప్రజానాట్య మండలి, అక్కడ మహిళా ఉద్యమంలో పని చేసేదాన్ని.
మేం తాలూకా సంఘాల్లో ప్రజా సంఘాల్లో, మహిళా సంఘాల్లో పని చేస్తూ, ఈ కార్యక్రమాన్నింట్లో పాల్గొంటూ కూడా మళ్ళీ పత్రిక వైపు. తాపీ ధర్మారావుగారు కొంత పని చేసేవారు. పీపుల్స్ వార్, ప్రజాశక్తి, యితర పత్రికలెన్నో వుండేవి. బోల్షివిక్ పోటీతో వున్నాయన్నమాట.
బోల్షివిక్ చరిత్ర అంటే పెద్దగా తెలియకపోయినా కమ్యూనిస్టు పార్టీ అనే భక్తి భావంతోటి చేశాం. ఒకరి కోటా పది పత్రికలైతే, ఒక్కోరు పాతిక దాకా అమ్మేవారు. యిట్లా వార, దినపత్రికలన్నీ ఉండేవి. అవన్నీ చేతుల మీద వేసుకుని బజార్లలో తిరిగి అమ్మేవాళ్ళం. రైల్వే స్టేషన్లో అమ్మేవాళ్ళం, చందాలు వసూలు చేసేవాళ్ళం. అయ్యో, ఎండకన్నెరగకుండా బ్రతికిన పిల్లవే తల్లీ, మీరెందుకే ఎండలో తిరిగి వచ్చేస్తారు. ఎండలో తిరిగి ఈ పత్రికమ్మటమంటే ఏం దరిద్రమొచ్చిందే, మీ నాన్నగారు చాలా భాగ్యవంతులు, మీ అత్తగారు భాగ్యవంతులు, మీకు రూపాయి, అర్థ రూపాయెందుకని చెప్పేసి సానుభూతి తెలిపేవారు కొంత మంది దగ్గరి వాళ్ళయితే. అదంతా మీకనవసరం. అంతగా అంటున్నారు కాబట్టి ఒక రూపాయి కాదు, పది రూపాయలవి వేసుకోండి అనేవాళ్ళం మేం. పది రూపాయలంటే నవ్వుకుంటూ ‘ఒప్పుకోం’ అనేది. మీరు పుట్టినప్పుడు పార్టీ తెలీదు, ఇప్పుడు చూడు ఎంత విస్తరించిందో, మీరు కూడా ఎప్పటికైనా కమ్యూనిస్టులై పోవల్సిందే అనంటే నవ్వేవాళ్ళు. కొందరు కొంటెతనంగా చెప్తుంటే ఏం చేసే వాళ్ళంటే మా దగ్గరలేని పత్రికలడుగుతుండే వాళ్ళు. అడిగినప్పుడు జస్ట్ వెయిట్ అని చెప్పేసి వేరేవాళ్ళ దగ్గర్నుంచి తెచ్చేవాళ్ళం. మీ ‘దుంపెల్దెగ’ మీరు లేరనుకున్నామమ్మా. మా కెందుకీ పత్రికలు అనేవాళ్ళు. వాటిలో ఏముందో చదవండి, తీసుకోండి అని యిచ్చేవాళ్ళం.
అట్లా ఇరవై రోజులకో, నెల రోజులకో ఎంత అమ్మాము! తప్పు చేశామా అని విమర్శ, ఆత్మవిమర్శ చేసుకునేవాళ్ళం. ఈ విమర్శ ఆత్మవిమర్శన పార్టీకి గుండెకాయలాంటిది అప్పుడు. మరి ఇప్పుడెట్లా వుందో నాకు తెలియదనుకోండి. మా రాజేశ్వరరావుగారు కూడా తప్పు చేస్తే మేం ధైర్యంగా వెళ్ళి అడిగేవాళ్ళం. ఇవన్నీ పెట్టీ బూర్జువా లక్షణాలని అనేవాళ్ళం. అర్థం తెలియకపోయినా తిట్టుగా అనుకునేవాళ్ళం. అప్పుడు మామూలుగా స్త్రీలు తిట్టుకునే తిట్లు మర్చిపోయాం. పార్టీ పుణ్యంతో కాస్త సంస్కారం ఏర్పడింది. అప్పుడు ఈ కులాల్లో తిట్లుండేవి కదా! చాకలిసచ్చినోడ, మంగలిసచ్చినోడ, మాదగసచ్చినోడ అని వుండేవి. వాట్ని నోటిమీద కొట్టినట్టుగా చెప్పి ఆ తిట్లన్నీ మాన్పించేశామన్నమాట. కొత్త తిట్టు ‘పెటీ బూర్జువా’ అన్నమాట.
తర్వాత కొంతకాలానికి పార్టీ పిలుపునిచ్చింది. కనుచూపుమేరలో సోషలిజం వుందనుకున్నాం. అంచేత అందరూ ఆస్తులన్నీ అమ్మేసేసి పార్టీకి పని చేయండి అని. ఎన్ని పత్రికులున్నాయి! అవన్నీ నడవాలన్నా, పార్టీ నడవాలన్నా ఈ ఆస్తులు శాశ్వతం కాదుకదా! అందరికీ సమానమైన ఆస్తులు, హక్కులు, ఆర్థిక ప్రతిపత్తి అన్నీ వచ్చేస్తాయనే దాంతోటి తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళకుంచేసి అట్లా అమ్మి వచ్చిన సంఘటనలు కూడా వున్నాయి. చాలా వరకు ముందు నాయకులు అమ్మేస్తే కొంతమంది కుర్రాళ్ళు ఆ ఉత్సాహాన్ని తట్టుకోలేక మేం కూడా ఇదిచేస్తాం, అది చేస్తామనే వాళ్ళు. చందాలు యివ్వగల్గితే యివ్వండి, ఈ ఉద్యమంలో శారీరకంగా పని చేయండి, తర్వాత చైతన్యంతో ఈ తాత్కాలికోద్రేకంతో చేయకండని తిప్పి యిచ్చేయటం, మీకు మార్క్సిస్ట్ ఔట్‌లుక్ బుర్రకి వంటబట్టాక యిద్దురు కానీ అంటే, ఏం వీళ్ళేనా త్యాగమూర్తులు మేం కాదా, మాదంతా తిప్పి యిచ్చేస్తారా అని వాళ్ళకి కోపం రావటం. వాళ్ళ పేరంట్స్ మాత్రం పిల్లలు తొందరపడ్డాకాని, వాళ్ళు మంచిగానే ఆలోచిస్తారని అర్థం చేసుకుని గుర్తించారన్నమాట.
నాకు నాలుగు సంవత్సరాలప్పుడు పెళ్ళి చేశారు. శారదా యాక్ట్ వస్తుందని భయపడి నాలుగు, అయిదు సంవత్సరాలకే పెళ్ళి చేశారు. నా అయిదో ఆరో ఏటనే మా మామయ్య చనిపోయారు. నాకు చనిపోయింది కూడా తెలియదు, పెళ్ళయ్యిందీ తెలియదు. అప్పట్నుంచి మా అమ్మ నాకు మళ్ళీ పెళ్ళి చేయాలని తాపత్రయపడ్తు వచ్చింది. ఈ కమ్యూనిస్టు కుర్రాళ్ళకియ్యాలనే దాంతోటి యిచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఒత్తిడే. అక్కడ సీతారామయ్యగారి ఊళ్ళో కూడా ఒత్తిడి. బైటివాళ్ళను చేసుకుంటే ఆస్తంతా బైటకుపోతుంది. మేనత్త కూతుళ్ళను చేసుకోలేదనే దాంతో ఆయన్ని ఒక బండ్లో ఘోషా స్త్రీలాగ తీసుకొచ్చారన్నమాట. మావూర్లో ఘోషా స్త్రీలకి బండికి ఇటూ అటూ తెరలు కట్టి తీసుకొస్తారు. కర్రలు పట్టుకుని వచ్చి ఆగం చేస్తారు, ఇలా గొడవైపోతుందనే దాంతోటి ఉద్యమం బలంగా వున్న ప్రాంతంలో, గ్రామంలో వుంచి ఉద్యమ నాయకుని యింట్లో పెళ్ళి చేసేవారు. ఇట్లా మా ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగేవి. కన్నారు, అత్తారు అంతా మేమే. బాగానే రియాక్షన్ వచ్చేది. తర్వాత తర్వాత కల్సిపోయేవారు.
అప్పుడు నాకు పదిహేడు, పద్దెనిమిదేళ్ళుండొచ్చు. నన్ను విడో అని తెలియకుండానే పెంచారు. పెద్దయ్యాక తెల్సింది అమ్మేడుస్తుంటే. తర్వాత కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కదా. నాకు పెళ్ళి చేస్తే అతను చచ్చిపోయాడు. నాకు పెళ్ళి వద్దు అనేదాన్ని తెలీక. కానీ, ఈ పార్టీ కుర్రాళ్ళంతా కాదు కాదు అనటం. వితంతు వివాహం చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళని చూపెట్టటం, కుటుంబాల్ని చూపెట్టటం, అప్పుడు నేను బాగా పాటలు పాడేదాన్ని. చక్కటి గొంతు, చొరవా, ధైర్యం వున్నాయి ఈ అమ్మాయిలో. ఈ అమ్మాయి జీవితం రాణించాలంటే మంచి కుర్రాణ్ణి చూడాలని అలా వెతికారు. మా మారేజీ అయి పోగానే పార్టీలోకి వెళ్ళాను. పార్టీ అంటే మార్క్సిస్టు ఔట్‌లుక్ లేకపోయినా వెళ్ళాను. మా మామయ్య ఇన్‌ఫ్ల్యూయెన్స్ బాగా వుండేది. విద్యార్థి సంఘాల్లో పని చేస్తున్నాడన్నమాట.
పెళ్ళిళ్ళు చేసుకుని విడిపొయ్యేవారికి ఆనాడు ఎట్లా సౌకర్యాలుండేవంటే, ఇప్పుడు కన్నోరువచ్చి పురుళ్ళు పోసేవారు కదా. అట్లా పురుళ్ళ కోసం డాక్టర్ అచ్చమాంబగారి ఇల్లు వుండేది. కన్నారిల్లులాగే వాడుకునే వాళ్ళం. మీకెందుకే పురుళ్ళొస్తే మీ అమ్మలేకపోతే నేను లేనా అనేవారు. ఆమె పురుళ్ళు పోసి, మందులిచ్చి అన్ని రకాలుగా చూసేవారు. ఇక్కడే కమ్యూనుండేది భోజనాలు పెట్టడానికి. మేం ఏ అర్థరాత్రి వచ్చినా వంట చేసుకోవల్సి వుండేది కాదు. ఒక్కోసారి ఫామిలీతో యిబ్బంది వచ్చి వంటాగింటా చేయటానికి బాధైతే కమ్యూనుంది తినొచ్చని వచ్చేవాళ్ళం. కమ్యూన్లో నూటయాభై, రెండు వందల మంది సభ్యులుండేవారు. బాచిలర్స్, విలేజెస్ లో కార్యక్రమాలుండి ఇక్కడే కొన్నాళ్ళుండాల్సిన వాళ్ళు వుండిపోయేవారు. మీటింగ్స్ కి వచ్చి కొందరు రెండు మూడు రోజులుండేవారు. కొందరు హోటళ్ళలో తినేవారు, కొందరు కమ్యూన్లో వుండేవారు. ఎప్పుడు ఎంతో కొంత మంది వుండేవారు. బుల్లెమాంబ ఆర్గనైజ్ చేసేవారు. మేమంతా గోర్కీ నవ ‘అమ్మ’ చదివి ఆ అమ్మ ఈ బుల్లెమ్మ అనుకునే వాళ్ళం.
మా ఆస్తులన్నీ అమ్మినపుడు భాగాలు చేసి పిల్లలకీ, భర్తకీ, భార్యకీ, తల్లిదండ్రులకీ అట్లా భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళకిచ్చే వాళ్ళం. మా భాగాన్నీ అమ్మి పార్టీకిచ్చేశాం. ఆస్తి దమ్మిడీ లేకుండా చేసుకుని ఇచ్చేశాం. బుల్లెమాంబ కూడా తన భాగం అమ్మేసి తనూయిచ్చేసింది. మీరంతా నా ఆస్తి అనేది. కమ్యూన్లో ఎంతమందున్నా కాని, ఎవరిరుచులేంటి, ఎవరు జబ్బు మనుషులు, ఎవరికెట్లా పెట్టాలి అవన్నీ ఆమెకే తెలుసు. ఆమె కమ్యూన్లోనే వుండేవారన్నమాట. మేం ఆలస్యంగా వచ్చాం. ఆమెని బాధ పెట్టడం ఎందుకని వస్తూ వస్తూ అరటి పళ్ళు తెచ్చుకుంటే, నాకు తెల్సే మీరు అన్నం తినరు, రాత్రి తినకుండా పడుకుంటే పొద్దున్నే నీరసపడిపోతారే అంటూ అంత పెరుగన్నం తినండి, అంత చద్దన్నం తినండి అని తల్లికంటే ఎక్కువగా ఆదరించేది. మర్నాడు పొద్దున్నే లేచి మేం ఆకలేస్తుందంటే నాకు తెల్సే మీరు రాత్రి వుంటుందో లేదో అని తిని వచ్చామని మీరబద్ధం చెప్తారని అనేది. ఎవరట్లా చూస్తారు?
రాజకీయ క్లాసులు పెట్టేవాళ్ళు. భారత మహిళా మండలి క్లబ్బులో ప్రతి సంవత్సరం పెట్టే వాళ్ళు. కాని నేననుకునేదేమంటే ఆ రాజకీయ క్లాసుల్ని వాళ్ళు ఎంత వరకు జీర్ణింప చేసుకున్నారు అనేది కాకుండా చకచకా రాజకీయాలు చెప్తూ వెళ్ళిపోయారేమో, మాకు అంతగా జీర్ణం కాలేదేమో అని యిప్పుడు అనుకుంటున్నానన్నమాట. అన్నప్రాశం నాడు ఆవకాయ పెట్టినట్టవుతుందేమో అన్పించింది. అదెట్లా అంటే జపాన్ ఫైట్ వాళ్ళనెట్లా ఎదుర్కోవాలని చెప్పి రష్యాలో సోషలిజమొచ్చింది. ఆ సోషలిజం ఏ బేసిస్ మీద వచ్చింది. అది దేశవ్యాప్తంగా ఎట్లా వచ్చింది. వాళ్లెట్లా అర్థం చేసుకుని ఆ పోరాటంలో పాల్గొన్నారనేది మాకు కిందికి వెళ్ళి చెప్పలేదేమో అని నా అనుమానం. ఇప్పుడు బాధపడ్తున్నాను. ఎందుకంటే అప్పుడు మూడడుగులు ముందుకేసి యిన్ని కార్యక్రమాలు చేసినా కమ్యూనిస్టు పార్టీ ఫామిలీస్ కొన్నిట్లో యిప్పటికీ దేవుడంటే నమ్మకాలున్నాయి. వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళల్లో (పిల్లల్ని) భర్తకులం వారి వైపు భర్త యివ్వాలనీ, భార్య కులం వారివైపు భార్యయివ్వాలని పోటీ అట్లా అట్లా వచ్చింది. ఇప్పుడు గతి తార్కిక భౌతిక వాదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జీర్ణింప చేసుకుంటే యిట్లా పూజలు చెయ్యరు గదా! అది కమ్యూనిస్టు పార్టీ ఎంత వరకు నేర్పింది? అది నేర్చుకోనివాళ్ళ బలహీనత చాలా వరకి కార్యకర్తల్లోనే వచ్చేసింది కదా ఈ మార్పు!
మరి కార్యకర్తల్లో రావటానికి కారణం? అంటే వీళ్ళు ఒక ఉత్సాహంతోటి, ఉద్రేకంతోటి వచ్చి పని చేశారు. ఆ ‘యాక్టివిటీస్’ పార్టీలో తగ్గిపోయేసరికి మళ్ళీ వెనక్కిపోయారు వీళ్ళంతాను. అవి ఎందుకు తగ్గాయనేది ‘ఫీల్డ్’లో వున్నవాళ్ళకి తెల్సనుకోండి. నేను పార్టీకి దూరమై బ్రతుకు తెరువు కోసం ఎక్కడికో దూరం వెళ్ళిపోయాను. తర్వాత చరిత్ర మీక్కొంత తెల్సే ఉంటుంది. నేనిప్పుడు అవగాహన చేసుకునేదేంటంటే యిది ప్రకృతి సహజమైంది. ఈ అపారమైన శక్తంతా ప్రకృతిలో వుంది. మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్ డెవలప్ అయ్యేటప్పటికీ, ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతే కాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు. ఈ రాజకీయాలు ‘ఇనుప గుగ్గిల్ల` లాగ మింగుడుపడేవి కావు. ఈ సిద్ధాంతం దేని మీద బేసయ్యింది. దేని మీద నిబడింది. పునాదుల్నించి తీసుకొచ్చి వీళ్ళ బుర్రల్లోయెక్కించినట్లయితే, యింకా చాలా మంది స్త్రీ, పురుష కార్యకర్తలు గట్టిగా నిబడే అవకాశం ఉండేది. కనీసం గట్టిగా నిలబడి ఉద్యమంతో టచ్ పెట్టుకోవటానికుండేది. చిన్న చిన్న అభిప్రాయబేదాలొచ్చి, అంతర్జాతీయంగా తగాదాలొచ్చి, అంతర్గతంగా తగాదాలొచ్చి విడిపోతే విడిపోవచ్చు. కానీ అసలీ మూఢ నమ్మకాలు, ఆచారాలు వీటిపై యింత ప్రచారం చేశాం, యింత పని చేశాం. మరి ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతోటి దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం వొంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను ఈ ఫ్యామిలీస్‌ని చూస్తూ.
మా రాజేశ్వరరావుగారు చెప్పారు కాబట్టి, సుందరయ్యగారు చెప్పారు కాబట్టి, మా ఆయన పోట్లాడి బైటికి తీసుకెళ్తున్నాడనే దాంతోటి వెళ్తున్నాం, అలాగే వెళ్ళాం కూడా! మొట్టమొదట భర్త అడుగుజాడల్లోనే ఉద్యమంలోకి వచ్చాం. సిద్ధాంతపరమైన లెనినిజం, మార్క్సిజం ఎంత వరకు తెలుసనేది కాదు. నాకు తెలిసినంత వరకు ముందు నాయకుల భార్యల్ని రమ్మనక వేరే వాళ్ళనెందుకు రమ్మంటారు అని అడిగేవాళ్ళు. ముందు మీ భార్యల్ని రమ్మనండి తర్వాత మేం వస్తామని అనేవారు. స్త్రీలతో వూరేగింపులు, గీరేగింపులు జరిపినపుడు వాళ్ళ భార్యలేమో చక్కగా మడికట్టుకుని కూర్చోవాలా, మేమేమో రావాలా యిట్లా అనే దాంతో ఫోర్స్ చేసి తీసుకొచ్చారన్నమాట. ఊరేగింపుల్లో, దీంట్లో నేనూ వచ్చాననుకోండి. నా పక్కనే మా అక్క, చెల్లి అంతా వస్తుంటే, పెద్ద ఊరేగింపు జరుపుతుంటే పెద్ద పండుగ, తర్వాత మా అంతట మేమే యింటరెస్టుగా ఊరేగింపుల్లో వస్తామంటే యివ్వాళ కాదు, కామ్రేడ్స్ వస్తారు, మీరంతా వంట చేసేయండి, ఊరేగింపుకి రాకపోయినా ఫరవాలేదులే, యింకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ వంటా, గింటా చేయాలి కదా అని అంటే కూడ యెందుకుచేయాలి, మేం కూడా రావాలిగా, ముందేమో ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. ఈ రోజున మేం రావాలంటే అడ్డుగా కనబడ్తున్నామా! వెళ్ళండి, హోటల్‌కి వెళ్ళండి, తినండి అనంటే, మాకు దగ్గరగా వుండేవాళ్ళు అది కాదు కోటేశ్వరమ్మ అన్నం వండిపడేసేయ్. ఆవకాయ ఉందిగా, ఒక్క చారుపెట్టు అన్నీ వద్దులే అని చెప్పేవారు. పదిమందని చెప్పి, పదిహేను మంది వచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ కోటేశ్వరమ్మతో వంట చేయించటం న్యాయం కాదని వస్తూ వస్తూ పళ్ళు తెచ్చేవారు. అన్నీ కలిపి అందరం తినేవాళ్ళం.
మేం పార్టీలో వున్నవాళ్ళం అక్క చెల్లెళ్ళం అన్నదమ్ముళ్ళం. పక్కింట్లో వున్నామె ఎవరో తెలియదు కానీ ఆమె మర్దిగారు, నేను పార్టీలో పని చేసేవాళ్ళం. అక్కాచెల్లెల్లాగ వున్నాం. ఆమెకు బాబు పుట్టాడు. నాకు పాప పుట్టింది. నేను మహిళా సంఘం కల్చరల్ యాక్టివిటీస్‌కి వెళ్తుంటే వచ్చేలోపల పాప ఏడుస్తుంటే తాను పాలిచ్చేది. వచ్చాక నేను వాడికి పాలిచ్చేదాన్ని. నేను పులుసు చేస్తే మా చెల్లె వేపుడు చేసేది. ఆమె యిడ్లీ చేస్తే నేను ఇంకోటి చేసేదాన్ని. మధ్య డోర్ తీసేవాళ్ళం. వాళ్ళు మేం బంధువునేది కాదు, అట్లా కల్సివున్నాం. మేం తగాదాలనేది ఎరుగం. ఈ పార్టీ చుట్టరికమే చుట్టరికమనుకున్నాం. మా చుట్టాల్ని మర్చిపోయాం.
అప్పుడు విజయవాడలో ఆత్మరక్షణ పాఠశాల వుండేది. జపాన్ పైకొస్తే ఏం చేయాలనే దానికోసం. కాకీ నిక్కర్లు వేసుకోవటానికి కొంత యిబ్బందే వుండేది. రౌడీల్ని అణిచిపెట్టేశారు. అయినా మొదట్లో భయమే ఉండేది. కొందరు సైకిళ్ళు నేర్చుకునేవారు. యివి నేర్చుకోవటానికి నచ్చచెప్పాల్సి వచ్చేది. పెరేడ్స్ చేసేప్పుడు కన్వీనియన్స్ కోసం నిక్కర్లు వేసుకునేవాళ్ళం. కానీ బైటున్నప్పుడు చీరలే కట్టుకునే వాళ్ళం. బూర్జువా లక్షణాల్లో పడి పట్టు చీరలు, నగలు పెట్టుకోవద్దని కూడా చూసేవారు. అట్లా అన్ని యాంగిల్స్ లో చూసేవారులెండి. రాజేశ్వరరావుగారి భార్య చంద్రహారం పెట్టుకుంది, గజ్జెల వడ్డాణం పెట్టుకుంది. ఆమె పెట్టుకోగాలేందీ మేమెందుకు పెట్టుకోకూడదూ అని తతిమ్మా వాళ్ళంటారు కదా! ముందు అన్ని బెడదలూ కార్యకర్తల భార్యలకే వచ్చేదన్నమాట. స్టేజీ ఎక్కి పాటపాడాలంటే అటు పాటపాడాలి, నాటకంలో యాక్ట్ చేయాలంటే ఆమె చేయాలి, నగలన్నీ ముందు తీయాలంటే ఆమే తీయాలి అని అనుకునే వారు. కార్యకర్తల భార్యలే మహిళా ఉద్యమానికి నిర్మాతలు. వాళ్ళే కదా చేసింది. అన్నపూర్ణమ్మ, హనుమాయమ్మ వీళ్ళంతా చేశారు.
ప్రజా నాట్యమండలి తర్వాత యిక నిషేధం దగ్గరికి వెళ్ళిపోతాం. గాంధీగారి సిద్ధాంతం ప్రకారంగా స్వరాజ్యం వచ్చిందన్నారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత యిది స్వరాజ్యం కాదని కమ్యూనిస్టులు చెప్పారు. దానికోసం ఫైట్ చేస్తూ ఎప్పటికైనా సోషలిజమే సరైంది. యిది స్వరాజ్యం కాదు. స్వరాజ్యం కావాలంటే సోషలిజమే శరణ్యమని కమ్యూనిస్టులు చెప్పిన తర్వాత అనేక యాంగిల్స్ లో ఉద్యమాలు తీసుకొస్తుండగా ప్రజాశక్తి మీద నిషేధం వచ్చింది. కార్యకర్తలందర్నీ జైళ్ళల్లో పెట్టటం, కామ్రేడ్స్ అంతా రహస్యంగా వెళ్ళిపోవటం, అక్కడ తెలంగాణా ఉద్యమం స్టార్ట్ అవటం, దాని ప్రక్కమ్మటే ఆంధ్ర ఉద్యమం కూడా. అంతటా కాదనుకోండి. అన్ని రాష్ట్రాల్లో వచ్చింది కదా! ‘‘ఇదే కంటికి కన్ను పంటికి పన్ను’’ అనే నినాదం. ప్రభుత్వం మన కన్ను పొడిస్తే, మనం ప్రభుత్వ గూండాల్ని, రౌడీల్నీ, అటుతరుపు తొత్తులందర్నీ పంటికి పన్ను, కంటికి కన్ను ఈ తుపాకీ గొట్టంలో నుంచే సోషలిజం వస్తుందని, వాళ్ళేం చేస్తే మనం కూడా అది చెయ్యొచ్చు. హింసకి ప్రతిహింస అనేదన్నమాట ఆనాటి నినాదం. దాన్ని తీసుకునేసరికి ప్రభుత్వం పత్రిక నిషేధించటం, కామ్రేడ్స్ నందర్నీ అరెస్ట్ చేయటం, బుర్రకథల్ని, నాటకాల్ని నిషేధించటం. దీన్ని ధిక్కరించి యికప్పుడు స్త్రీలందరం రంగంలోకి దిగామన్నమాట. ఆ 144 సెక్షన్‌ను ధిక్కరించి మహిళా కార్యకర్తలు ముందుండి, మహిళా సానుభూతిపరులందర్నీ ముందు పెట్టుకుని ఒకవేయి మందితోటి విజయవాడలో కలెక్టరాఫీసు ముందు ఊరేగింపుగా వెళ్ళామన్నమాట. ఎక్కడి వాళ్ళనక్కడ టియెర్‌గ్యాస్ పెట్టి లాఠీలతో పెట్టి కొట్టటం, కొన్ని వ్యాన్‌లు తీసుకొచ్చి ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్ళారు. నందిగామ జైళ్ళో పెట్టారు. అప్పుడు కూడా మాకేం భయం వేసేది కాదు. జైళ్ళకి వెళ్ళగానే ఆ టియర్ గ్యాస్‌తో ఒళ్ళంతా మంటలు బుట్టింది. గాలి, వెల్తురు లేని గదిలో పడేసేసరికి భయోత్పాతం కల్గింది, ఎప్పుడూ చూళ్ళేదు కదా!
సరే ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చిపడేస్తుంటే నులుగురితో చావు కూడా పెళ్ళిలాగానే అన్పించి మనవాళ్ళందరూ వచ్చేశారు. ఇంకేం భయమనుకుని, మేమే అల్లరిచేసి, పోలీసుల్ని గేలిచేయటం, ప్రభుత్వాన్ని గేలిచేయటం, తల్లీ వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, విసిగించేస్తున్నారని అనేవారు. అలా చేసిన తర్వాత అందర్నీ వదిలేసి మా మీద పదహారు మంది మీద కేసు నమోదు చేశారు. నందిగామ, జగ్గంపేట ఎక్కడెక్కడో పదిహేను, ఇరవై రోజులకి వాయిదా వేసి తిప్పటం మొదుపెట్టారు. అప్పుడు మేమేం చేశామంటే ‘డాక్యుమెంట్స్’ మీద సంతకాలు పెట్టలేదు. ఈ రోజు వాయిదా వేశారు. కాబట్టి మేం సంతకాలు పెట్టలేదు. ఈ రోజు వాయిదా వేశారు. కాబట్టి మేం సంతకాలు పెట్టం. ఈ కేసు విచారణ చేస్తారా, లేదా? లేకపోతే మమ్మల్ని ఇక్కడే కూర్చోమంటారా, మేం మట్టుకు వెళ్ళేది లేదు. సంతకాలు పెట్టేది లేదు అని మేం తిరగబడ్డాం. తిరగబడేసరికి మళ్ళీ జైల్లో పడేశారు. జైళ్ళో పారేసి కేసు విచారణ చేస్తామని హామీ యిచ్చి వదిలేశారు. మళ్ళీ, జైళ్ళో కూడా పోరాటం చేశామన్నమాట. కొంత మంది స్త్రీలనేమో రాయవెల్లూరు జైలుకి పంపించేశారు. పసిపిల్లల తల్లులు కూడా వచ్చారు జైలుకి అప్పుడు. ఈ అనసూయమ్మకు పదిహేను రోజుల కొడుకు. ఆమె కూడా వచ్చేసింది. వ్యాన్‌లో ఇక పట్టుకొని ఎక్కించలేక పౌరుషం వుంటే వ్యాన్ ఎక్కండి మీరు, అదేంటి సినిమా బొమ్మల్లాగ గంతులేయటానికి వచ్చారా? ఉద్యమం చేయటానికి వచ్చారా? అనేదో అన్నారు. అందరికి కోపాలొచ్చేసి గబాగబా వ్యానెక్కేశారు. పట్టుకొని ఎక్కించటానికి చాతగాక అట్లా ప్రొవోక్ చేశారన్నమాట! ఇక అక్కడ కూడా పసిపిల్లల తల్లుల్ని బైటికి రండని, పిల్లల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల్ని మాకు చూపెట్టటం, చేయటం, మాకనవసరమని పంపించేయటం, అక్కడ కూడా డిసిప్లీన్, జైల్ డిసిప్లిన్ వుండాలి. కమ్యూనిస్టులు ఎక్కడికి వచ్చినా వాళ్ళు చక్కగా, ఆదర్శంగా వుంటారన్పించాలి. మీరు పిచ్చి గంతులు వేయొద్దని, ఆఖరికి వాళ్ళే అన్నారన్న మాట. అట్లయితే మేం సర్దుకోవటం, మొఖాలు కడుక్కోవటానికి బైటికి వస్తే నందిగామ జైలు చుట్టూ నిండిపోయారన్నమాట. నందిగామ జైలు చుట్టూ పెద్ద పెద్ద నినాదాలు చేసేవారన్నమాట. నినాదాలు చేసి పాటు పాడేవారు.
మేం నిరాహార దీక్ష ఎందుకు చేశామంటే ఆగస్టు పదిహేను వచ్చింది. లడ్డూలు, గిడ్డూలు చేశారు. ఇవాళ ఆగస్టు పదిహేను. ఇవన్నీ చేయించామంటే ఈ ఆగస్టు పదిహేనును మేం గుర్తించం. అది స్వరాజ్యం వచ్చినట్టు లెక్కకాదు. కాబట్టి ఈ రోజు మేం అన్నం తినం అని అన్నాం. నిరాహార దీక్ష పడ్తే కొడ్తామన్నారు. కొట్టినా మంచిదే జెండావందనం చేయం మేం. ఈ జెండా మా జెండా కాదు అని అన్నాం. తినకుండా కూర్చుంటే బ్రతిమాలారు. తంతామన్నారు, ఏదో చేశారు. కేసు విచారణవగానే బైటికి వచ్చేశాం. శిక్ష అనుభవించలేదు. జరిమానా చెల్లించలేదు. తీసుకెళ్ళిపోయారు.
ఇక్కడుంటే మమ్మల్ని బతకనియ్యరు ఒకటి, తర్వాత స్త్రీలు కూడా అవసరం కదా! మరి స్త్రీలు లేంది ఎట్లా? ఒక డెన్ వుందనుకో, ఆ డెన్‌లో నలుగురు మగవాళ్ళు వుంటే అనుమానం కదా! ఫామిలీతో వుంటే అనుమానం వుండదు కదా! పిల్లా, పాపల్తో వుంటే అనుమానం వుండదు కదా! అనే దాంతో తీసుకెళ్ళారు.
స్త్రీలు ఏం చేశారనంటే, అసలు స్త్రీలు లేని చరిత్రలేదమ్మా, గతం నుంచి యిప్పటివరకి చూసుకోండి. స్త్రీల్లేని చరిత్ర లేదు. స్త్రీలు సగభాగం కాదు కదా జనాభాలో ఎక్కువ భాగం స్త్రీలే కదా! ఉద్యమం ప్రబటానికి కారణం స్త్రీలు, స్త్రీల పాత్ర చాలా వుంటుంది కానీ, స్త్రీల పాత్ర అణగారిపోతూ, పురుషుల పాత్రే పైకి పోతూ వుంది. దానికి కారణం తరతరాల నుంచున్న స్త్రీ వ్యతిరేకతే. మరి స్త్రీల పాత్ర బైటికి రాలేదు. కానీ చాలా ఉపయోగపడ్తారు కమ్యూనిస్టు పార్టీకి, మేం కామ్రేడ్స్ ని తీసుకెళ్ళి దాచిన రోజులున్నాయి. పురుషులైతే పట్టుకుంటారు, స్త్రీల నైతే పట్టుకోరని మేము ఏ స్టేషన్‌లో ఎక్కుతున్నామో, ఏ స్టేషన్‌లో దిగుతున్నామో ఎవరికీ తెల్సేది కాదు. ఆయుధాల్ని బెడ్స్ కింద దాచేసేవాళ్ళం. అట్లా రాష్ట్ర మంతటా డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. తిరగబడ్డ స్త్రీల లాగా వేషభాషలు మార్చేవాళ్ళం ` అవన్నీ టెక్నిక్స్. మాకు ‘షెల్టర్’ యిచ్చారు. ఎంతో మంది తంతారనీ తెల్సు, కొడ్తారనీ తెల్సు. మానవతా దృష్టితో కానీ, పార్టీ భక్తితో కానీ అయ్యో రెండు రోజుల్నించి అన్నం లేదని చెప్పేసి. అవతల మలబారు పోలీసులున్నా సరే మాకు ‘షెల్టర్’ యిచ్చారు. అన్నం దొరికింది. మరి స్త్రీలు ఆ రక్షణ ఇవ్వకపోతే మేమెట్లా బ్రతికేవాళ్ళం? అట్లా చూశారు. చేశారు. యిక వీళ్ళకు అన్నం వండి పెట్టడం, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురావాలన్నా స్త్రీలే తీసుకురావాలి. నగలు మార్చాలన్నా స్త్రీలే మార్చాలి. ఒక కార్యకర్త కాకుండా ఫామిలీలు ప్రయాణం బిడ్డలతో సహా వెళ్ళటం.
మరి నేను పార్టీలోకి ఎంత బంగారంతో వచ్చాను. నా మంగళసూత్రం, మట్టెలతో సహా చిన్నమెత్తు బంగారం లేకుండా పార్టీకి ఉపయోగపడింది. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన చైతన్యంతో చేశాం. పురుషులు చెప్తే చేయలేదు. మా కామ్రేడ్స్ అంతా నల్లుల్లా మాడిపోతున్నారు. చచ్చిపోతున్నారు. ఇంక మాకెందుకవన్నీ, వాళ్ళేపోగాలేందీ అని నేను నేనుగా యిచ్చేశానన్నమాట. కమ్యూనిస్టు పార్టీ అంతా జమీందార్లనీ, ఆస్తుల్ని దోచుకుంటుంటే మరి కోటేశ్వరమ్మ నగలు పార్టీ కెందుకిచ్చిందని అనుకునేవారు.
ఒక వండి పెట్టటమే కాదు, పత్రికలు బైటికి రాకూడదు. పార్టీకి సంబంధించిన పత్రికొస్తే తంతారు. మామూలు వాళ్ళను, పార్టీ వాళ్ళను కాల్చేసిన రోజున్నాయి కదా! అట్లాంటప్పుడు రహస్య పత్రికలన్నీ ఆడవాళ్ళు సైక్లోస్టయిల్ చేస్తుంటే కార్బన్ పేపర్స్ పెట్టి రాస్తుంటే రాష్ట్ర కమిటీ, ఆలిండియా కమ్యూనిస్టు పార్టీ ఏం చేస్తుంది? చరిత్రంతా మాకు తెలిసేది. అదొక టెక్నిక్, కాపీలు తీసేప్పుడు మానవునిలో వున్న సహజమైన బహీనతలు వీళ్ళల్లో వున్నట్లుగా మేము చూశాం. ఈడొచ్చిన స్త్రీని వీళ్ళు కోరటం, వాళ్ళు బుద్ది చెప్పటం, లెంపలేసుకోవటం, మీరు యిక్కడుంటే పనికిరారు. అడవిలోకి వెళ్ళండి, పోరాట కార్యక్రమాలకి వెళ్ళమని పంపించేశారు. ఇవన్నీ చెప్పగూడదనుకోండి, కానీ చెప్తున్నా! ఇంకా కూడా మనకు బుద్ధిలేదు అన్పించేది. హెల్ప్ ఇచ్చి తల్లి కంటే ఎక్కువగా ఆదరించి చంపుతారనే భయం కూడా లేకుండా వండిపెడ్తుంటే వాళ్ళకేమొచ్చింది మాయరోగం అని తిట్టుకునేవాళ్ళం.
ఇట్లా జరుగుతున్నప్పుడు నేను, సావిత్రక్కయ్య రాజేశ్వరరావుగార్ని అడిగాం, మేం వుండం వాళ్ళ దగ్గరా, వీళ్ళదగ్గరా, చావో బ్రతుకో మీ దగ్గరే పెట్టుకోండి, కామ్రేడ్స్ అంతా చస్తున్నారు. మేం కూడా చావడానికి సిద్ధమయ్యే వచ్చాం. ఇదంతాయేంటి హిందూ సెంటిమెంట్స్ అనండీ, ఏమన్నా అనండీ ఎవరి భర్త దగ్గర వాళ్ళని ఆ డెన్స్ లో పడేయండి. లేకపోతే అడవుల్లో తుపాకి పట్టుకుని సాయుధ పోరాటం చేస్తాం, అడవికెళ్ళి వుండగలం అని అన్నాం. ఈ తుపాకీ నువ్వేం పట్టుకుంటావమ్మా నీ పన్లు నీవు చేయి, తుపాకి పట్టుకునేవాళ్ళు వస్తున్నారు చాలా మంది. ఇవి ఎవరు చేస్తారు, యిది యింపార్టెంట్ మాకు, నువ్వెక్కడికి వెళ్తావమ్మా నీ జోలికెవరూ రారులే. ఎవరో పాపం పల్లెటూరి అమ్మాయిలు వాళ్ళు. మీ జోలికి రారు. వాళ్ళది గుండా, చెరువా! అయినా మేం కట్టుదిట్టాలు చేస్తున్నామంటే, మీరెందుకు భయపడ్తారు, గాబరా పడకండి అని అన్నారు. ఏమయ్యా, వాళ్ళకు యివన్నీ ఎట్లా తెల్సినై అని అడిగేవాళ్ళు కొన్నిసార్లు. ఎవరన్నా అరెస్టు అయినా మాకే ముందు తెల్సేది. ఎవరన్న అరెస్టు అయితే వెంటనే టెక్నిక్ మార్చేవాళ్ళం. ఒక్కోసారి మనలోని బలహీనతతో చెప్పేవారు. కొట్తేనో, తంతేనో, చెప్పేస్తే కామ్రేడ్సంతా బయటపడిపోతారు. అట్లా ఒకసారి పొద్దూరి సోమయ్య చెప్తే పద్దెనిమిది మందిని కాల్చేశారు. అప్పుడే అనసూయమ్మ భర్త కూడా ద్రోణాచలం దగ్గర కాల్చబడ్డారు. ఎవరన్నా అరెస్టు అయ్యేసరికి మాతో వున్న డెన్సన్నింటినీ, కామ్రేడ్స్ అందర్నీ కూడ ఒక దగ్గర్నుంచి ఒక దగ్గరికి మార్చేవాళ్ళం.
కానీ మా దురదృష్టం, యింత చాకిరీ చేసినా మమ్మల్ని డెన్‌లోనే వదిలి పెడ్తారు. మా అదృష్టం బావుండి ఆ డెన్ ఎక్స్ పోజ్ కాకుంటే వాళ్ళు అయిదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తారు. లేకుంటే లేదు. డెన్‌కి తాళం వేయటానికి మాత్రం వీల్లేదు. సి.ఐ.డి ఎంక్వయిరీ చేస్తారు కదా, అయితే మనవాళ్ళు వచ్చేవరకు మాకు నరకం అనిపించేది. మర్నాడు ఏ పదిగంటలకో కొరియర్ ఎవరో సిగ్నల్స్ యిచ్చి వెళ్తారు. ఏ క్షణంలో పోలీసులు వస్తారో అనే భయంతో స్నానాలు కూడా చేయకుండా వుండేవాళ్ళం, వచ్చి ఏ పిచ్చి పని చేస్తారో అనే భయం వుండేది.
మేం కాపీలు తీస్తాం కాబట్టి మాకు కొన్ని విషయాలు అర్థమయ్యేవి. స్టాలిన్ ముద్ర పడింది. కొందరు ఆలిండియా కార్యకర్తలు రష్యా వెళ్ళారని, స్టాలిన్‌ని కల్సారని, ఇది పోరాటకాలం కాదు, పోరాటానికి పరిపక్వత లేదు. పారిశ్రామిక కూలీలు, వ్యవసాయ కూలీలు, పీడితులు ఉద్యమంలోకి రావాలి. మధ్య తరగతి మేధావులే లీడర్లయ్యారు. చైనా వెనుకబడ్డ దేశమైనా, రష్యా సహకారం వుండబట్టి రివల్యూషన్ వచ్చింది. అది భారతదేశానికి లేదు. ప్రస్తుతం మీరు విరమించుకోవాలి, అని పెద్ద తీర్మానమన్నమాట. ఆ తీర్మానం వచ్చిన తర్వాత పోరాటం విరమించుకున్నారు. విరమించుకొని ఆయుధాలన్నీ యిచ్చేశారు. ‘‘అస్త్రసన్యాసం అప్పుడేనటనోయి, తుప్పుగడిచినాక గొప్పచెప్తున్నావు’’ అని రాశాం నమ్మకం లేక. ఇంతమందిని చంపుకున్న తర్వాత పోలేంగా! ఇక ఒక్కొక్కళ్ళనీ బైటపెట్టారు. తుప్పుపట్టిన ఆయుధాల్ని బైటపెట్టినపుడు కొందరు హారతులిచ్చారు.
ఇంక బైటికి రావటంతోటే మార్క్సిస్టు భార్యల్ని, తల్లుల్ని గ్రామాలకి వెళ్ళి మీటయ్యారు. కొన్ని రియాక్షన్స్ ఎట్లా వున్నాయంటే మీరంతా చల్లగానే వున్నారు. మా పిల్లలేగా చచ్చిపోయింది అన్నారు కొందరు! మీరు రహస్యంగా వుండి తిప్పలు బడ్డారు, మేం బైట వుండి ఎన్నో తిప్పలు పడ్డాం అని చెప్పిన సంఘటనలు న్నాయి. రేప్ చేసిన సంఘటనలు కూడా వున్నాయి. మధ్య తరగతి మనస్తత్వం చెప్పలేరు బైటికి, నార్ల చిరంజీవి భార్యనైతే కాంపులోకి తీసుకెళ్ళి మూడు రోజులకు వదిలిపెట్టారు. ఒళ్ళంతా గాయాల్తోటి మొత్తుకుంటూ వచ్చింది. అట్లా వాళ్ళ అనుభవాలు సంఘటనలు మాకు, మా అనుభవాలు సంఘటనలు వాళ్ళకు చెబ్తుంటే మాకంటే గ్రామాల వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారేమో అన్పించింది! కుప్పలు తగులబెట్టి, ఆస్తులు తగులబెట్టేశారు.
కనుచూపు మేరలో స్వరాజ్యం ఉందనుకున్నాం. ఆస్తులన్నీ నాశనం చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి. బిడ్డలు బతకాలి, ఏం చేయాలి? ఏదో బిజినెస్ చేసుకొమ్మని, నర్స్ ట్రైనింగ్, మిషన్ చేసుకుంటూ ఉద్యమాన్ని చూడండి…మాజీ కమ్యూనిస్టులు చేసినంత బాగా బిజినెస్ ఎవరూ చేయరు.
ఇక నా చరిత్ర యింకొక రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను బ్రతుకు తెరువు కోసం ఎక్కడికో వెళ్ళిపోవటం. నేను ‘ఫీల్డ్ ` లోలేను కాబట్టి, వాళ్ళందరూ నాకు మిత్రుల్లాగే కన్పిస్తారు. పాతవాళ్ళతో కలిసి బ్రతికాను కాబట్టి పాతచరిత్ర ఉంది.
మనది తెలుగుదేశమమ్మా!
మనది తెలుగుదేశమమ్మా!
మనది తెలుగు జాతి తల్లీ!
వీరులను కన్నదీ తల్లీ!
వీరమాత జన్మభూమి! ॥మ॥
మన పాపరాయుడె తల్లీ!
మరువలేమతనిని ఓ చెల్లీ!
బుద్ధవరమున బుట్టి ఈ
భువికి వెలుగులనిచ్చి స్వేచ్ఛ
కావాలనే లక్ష్యమున్నా వాడు
సమతకై పోరాడ యువశక్తిని బిలిచి
సాహసముతో తానె సారధిగ నిలిచాడు
పర ప్రభుత్వపు బాట పైనించు పాలకులు
మలబారు పోలీసు మందలను రాబిలిచి
ముసునూరు ప్రాంతాన ముదురు చీకటిలోన
నిరాయుధనిగ నిలిపినారె!
నీవెవ్వరని యడిగినారె!
ఆయుధం బిచ్చి నన్నుడుగురా యెవరని
అపుడదె తేల్చునన్నాడె హంతకులు
అడవి వీరునిగాల్చినారె!
ఆ వీరునిదలచుచు ఆశయము నిలుపుచు
కదలిముందుకు నడువవమ్మా!
మనమతని చెల్లెండ్రమమ్మా! ॥మ॥
అతడె జగన్నాధరావు
ప్రజలకొరకె పుట్టినాడు.
లంకలు పుంతలు రాజులబ్బనిసొమ్మ
రైతు కూలీలపాన్నడె పోరాట
రంగమున ముందు నిలచాడె!
భువిని దివిజేయగ దీక్షబూనినవాని
పగబట్టి గాలించినారె యెచటనొ
అగుపడక బంధించినారె! పార్టీ
గుట్టు తెలుపని వాని ఫాసిస్టు పోలీసు
చిత్రహింసలు పెట్టినారె! గతితప్పి
చివరికంతము జేసినారె క్రూరులుగ
ఆంగిలేయుల మించినారె!
ఆ రైతు వీరుని పుత్రికల మేమంచు
ఆ త్యాగ నిరతిని గళమెత్తి పాడుచు
కదలి ముందుకు నడువవమ్మా!
విప్లవ జోహారులందించుమమ్మా! ॥మ॥
అనుమర్లపూడి నెరుగుదవా? ఓ
యమ్మ హాస్యరసమతని సొమ్మమ్మా!
ఆలికుల నాయకుండమ్మ
అవినీతి పాలనకు వ్యతిరేకిగనిచి
పగవారి గుండెలో బల్లెమైనాడమ్మ
బానిసత్వము బాపనడుముగట్టిన వాని
చెరసాల బంధించినారె! చెప్పకనె
కడలూరుకె అంపినారె!
నాల్గుగోడల మధ్య న్యాయాన్ని విడనాడి
పోరుకొచ్చాడంటు నేరాన్ని మోపుచు
పిస్తోళ్ళతో కాల్చినారె యోధుని
ప్రాణాలనె తీసినారె!
ఆ అమర వీరుల ఆత్మశాంతించగ
ఆ వీర యోధుల ఆశయము సిద్ధించ
కదలి ముందుకు నడువవమ్మా
స్వేచ్ఛకై యర్రజెండానెత్తుమమ్మా ॥మ॥
దిగులొందకెతల్లీ! పగబూనవెచెల్లీ!
మన జాతి కోసమై మన హక్కు కోసమై
ఒకరిద్దరె కాదు వందలొరిగిరి యిటుల
ఈ త్యాగఫలితాల జనరాజ్యముదయించు
అసుర రాజ్యము మాయుటది తథ్యమమ్మా!
యువశక్తిని లేపుమమ్మా!
వీరులకు వారసులమని చాటువమ్మా
మన విశాలాంధ్రలో రణరంగ ధీరులకు
కొదువలేదని తెలుపుమమ్మా!
కదలి ముందుకు సాగుమమ్మా!
పళని యిప్పునలాంటి ప్రజాకంఠకుల
ప్రజల కోర్టుకు లాగి వురికంభమెక్కించ
కదలి ముందుకు నడువవమ్మా
తెలుగన్నకీర్తి జగతిని చాటుమమ్మా!
కొండపల్లి కోటేశ్వరమ్మ(‘‘వత్సల’’)
`మనకు తెలియని మన చరిత్ర` లో కొండపల్లి కోటేశ్వరమ్మ (విజయవాడ) ఇంటర్వ్యూ
*
Add comment