లోపలి మనిషికి చలనం నేర్పే కవిత్వం ఇది

అనేక సంఘటనలు, అనేక కథలను చూస్తున్నప్పుడు ఆ నేలతల్లి ప్రతి(తీ)స్పందనను కవితగా, ఆ వసుధకు ప్రతినిధిగా డాక్టర్ శైలజమ్మ కలం, మనసు మన మెదడు పైపొరల్లో పేరుకున్న మొద్దు, సోమరితనాల్ని తొలగించి, ఎప్పుడో… ఎక్కడో మర్చిపోయిన మానవీయతను చిన్న మెదడుకు inject చేసి చలనం తెప్పిస్తారు.

నేల పాట పాడడం మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు నేల పాట పాడగలదా? నేల అంటే వట్టి మట్టి మాత్రమేనా? నేలను చంటి బిడ్డలా సాకి, బంగారం పండించి, ఇతరుల కడుపులు నింపి మనుషులను ప్రాణాలతో నిలబెట్టే రైతులైతే అయితే కచ్చితంగా వింటారు. రైతులు నిత్యం ఆ నేల తల్లితో మాట్లాడుతూనే ఉంటారు.
మరి కవి…! అవును, కవే. ప్రకృతిని ప్రేమించే కవి, ప్రకృతిలో భాగమైన మట్టిని కూడా ప్రేమిస్తాడు. పంచభూతాలలో ఒకటైన మట్టితో తయారు చేయబడ్డ మనుషులను, మట్టినే నమ్ముకున్న మనుషులనూ ప్రేమిస్తాడు. అందుకే సృజనకారులు మట్టి పాడే పాటలను వినగలరు. ఇదిగో అలా ప్రకృతిలో భాగమైన ప్రతి పుట్ట – చెట్టు, పక్షి – పశువు, మానవులను, అన్నింటి స్వేచ్ఛను కలగనే వైద్య కవయిత్రి కాళ్లకూరి శైలజమ్మకు వినిపించిన “నేలపాట” తన అక్షర విత్తులు నాటుకుంటూ మన అరచేతుల్లోకి పుస్తక రూపంలో వచ్చి కూర్చుంది. అనేక సంఘటనలు, అనేక వేదనలు, అనేక స్మృతులు, అనేక కథలను చూస్తున్నప్పుడు ఆ నేలతల్లి ప్రతి(తీ)స్పందనను కవితగా, ఆ వసుధకు ప్రతినిధిగా డాక్టర్ శైలజమ్మ కలం, మనసు మన మెదడు పైపొరల్లో పేరుకున్న మొద్దు, సోమరితనాల్ని తొలగించి, ఎప్పుడో… ఎక్కడో మర్చిపోయిన మానవీయతను చిన్న మెదడుకు inject చేసి చలనం తెప్పిస్తారు. అది ఎలా అంటే–
తల్లికి ఎన్ని బాధలున్నా, తన బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ కంటికి రెప్పలా కాచుకున్నట్లే, నేలమ్మ ఎన్ని బాధలు పడుతున్నా, మన మీద ఎంతో ప్రేమ కురిపిస్తుంది. చాలా రకాల మట్టి గొంతుకలతో ‘నేలపాట’తో మన మనసుల్లో ఆనందభైరవి రాగాన్ని  వినిపించి లేలేత వెలుగును చొప్పిస్తుంది. ఆ పాట వినాలంటే…
“పాదాలు చెవులవ్వాలి
పగుళ్లలోంచి పచ్చగా నవ్వే భూమి గురించి తెలియాలి.”
నేల పాట వినలేని కొందరికి అనేక హంగులు – ఆర్భాటాలను పైపూతలుగా చేసుకుని, ప్రాణవాయువును తగ్గించే యంత్రాలతో తన పరిధిని నింపుకుని, పెద్ద పెద్ద కట్టడాల్లో మెరుపుల నడుమ, ఆకలిని, మనసును చంపేసుకుని…
“ఉన్నచోట ఉండేందుకు
శూన్యంలో వేలాడే బంతి మీద పోటా పోటీ
శకలాలుగా చిట్లి తళుకులీనే
నవ నాగరిక సమాజం”…. లో అనేక వ్యసనాలు, ఆందోళనలు మధ్య….
“కాలాన్ని కాస్త కాస్త కొరికి
నిద్ర రుణం తీర్చుకుంటూ డివైడర్ బలిపీఠంపై
తల బాదుకునే అంతులేని యుద్ధం
అదో ఏకపక్ష సమరం…”అంటూ జీవితం ముగిసిపోయే ‘నగర గర్వము’ పాడే పాట వినిపిస్తుంది.
ఇప్పుడు ‘దారి తప్పిన వారసత్వం’ డిజిటల్ యుగంలో, క్షణకాలపు డేటాల మోజులో ఆదరణ, క్రమబద్దీకరణ లేకపోతే మొక్క ఎలా పెరుగుతుందో అలా పెరిగిన వారసత్వం పట్ల ఆవేదన రాగం ఆలపిస్తుంటే-
మనుషుల బంధాలు కరువైన శారీరక వృద్ధాప్యం ‘పేరు లేని సాయంత్రం’ లో పాడే మరో పాటలో మానవ సంబంధాలను, వాటి మధ్య వచ్చిన పగుళ్ళను ఈ వైద్య కవయిత్రి శైలజమ్మ మన గుండెను తడిపేలా అక్షరబద్ధం చేశారు. ఈ పొత్తంలో అటువంటి మరిన్ని కవితలు చదువుతున్నప్పుడు …ఏ వయసు వారికి ఆ అనుభవం కచ్చితంగా కలుగుతుంది. కూసింత ఆలోచనా మార్పునకు నాందీవాచకం అవుతుంది.
ఈ డాక్టరమ్మ కవయిత్రి కూడా కావడంతో ఆ స్త్రీ గురించి, స్త్రీ శక్తి  గురించి ఎంత చక్కగా కవిత్వీకరించారో ‘మణులు’ కవితలోని మహిళామణులు మన ముందు ఇలా గానం చేస్తారు-
“అలసినా ఆగని గురువిణులు
అణచినా ఆపలేని అరుణిమలు
కరకుగా కాపలాకాసే సైనికులు
కఠినంగా తోచినా విలువైన గీటురాళ్లు” అంటూ….
మగువ మనసు మెత్తదనాన్ని ‘మగువా…మగువా’ వినిపిస్తుంది.
కవయిత్రి మరో చోట మగువ పట్ల ‘ఎక్కడో తప్పు జరుగుతోంది’ అని సందేహం వ్యక్తం చేస్తూ
“అతడి వికృత చేష్టల వైనం
‘లేడీ గాగా’ వేదనై
సుడులు తిరిగింది
అయినవాళ్ళే అమ్మకానికి పెడితే
‘అమీనా’ మౌనంగా రోదించింది.
చదువు చెప్పేవాడు
ఉపాధి చూపేవాడు
కలిసి ఆడుకున్న బాల్య స్నేహితుడు
అందరిలో నేరగాడు… ” ఒకవైపు ఇలా మగవాళ్లను నమ్మాలంటే భయపడే స్థితిని చిత్రీకరిస్తే… మరోవైపు మగాళ్లు తమ స్వలాభం కోసం స్త్రీ శక్తే ముఖ్యమని, సగ భాగం ఆమెదే అనే మేడిపండు కబుర్లు గురించి చెబుతూ-
“సగ భాగం వట్టి మాటై
కేటాయింపుల ముద్ద చప్పనైంది” అనే పంక్తులను రాయడం, యావత్ సమాజాన్ని ప్రశ్నిస్తుంది. స్త్రీని చూసే కోణాల్లో ఉన్న బేధభావాలను ఎత్తి చూపుతుంది. చివరకు-
“అగ్గి తగిలితే కాలినట్టు
అమ్మాయిని తాకినా స్వాభిమానం భగ్గుమనాలి
జాతిని నిలబెట్టేలా
తల పైకెత్తి జీవించేలా
తర్ఫీదు నివ్వాలి…” అని మనోధైర్యాన్ని నింపే సమాజానికి మార్గ దర్శనం చేస్తారు. ఎంత ఉన్నతికి చేరినా స్త్రీ పట్ల ఇంకా ఎంతో మారాల్సిన సమాజానికి ఈ పొత్తంలోని శైలజమ్మ కవితలు మరింత కనువిప్పుగా ఉంటాయి.
శైలజమ్మ కేవలం స్త్రీ, సామాజిక మానవ సంబంధాలు, యువత-సమాజ హీన, దీన, ఉన్నత, పతనస్థాయిల పట్లే కాదు, చెట్ల పట్ల, జంతువుల పట్ల, మనిషి చేసే ఘాతుకాల పట్ల కూడా తన ఆవేదనా పాటలను కవిత్వంతో ఆలపించారు ఈ ‘నేలపాట’ సంకలనంలో.
సృజనకారులు సమాజ హితాన్ని కోరుకుంటారంటారు.  తమ మాన, ప్రాణాలను మట్టి మనుషుల స్వేచ్ఛకోసం ఫణంగా పెట్టి పోరాడే వాళ్ళను కీర్తించడం కూడా నేల పాడే పాటల్లో భాగమే. అలా మట్టిని నమ్ముకున్న మట్టి మనిషికి మానవతావాదిగా, సాటి మనుషుల కోసం పోరాడిన వారికి స్మృతి కవనం అందించడం అనేది ఆ కవి ఆదర్శ భావాలకు ప్రతీక. అటువంటి ప్రతీకాత్మక కవనాలు ‘మన్యం కోసం ఒక మనిషి’, ‘దారి వెతికే కళ్ళు’ గా శైలజమ్మ ‘నేలపాట’లో మనకు కనిపిస్తాయి.
నేటి యువతరం సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకువెళుతోందో, అంతే వేగంగా పతన దిశకు దిగజారుతోంది. సమాజాన్ని నేడు పట్టి పీడిస్తున్న మరో సమస్య ఇది. అలా ఇబ్బందులు ఎదుర్కొనే యువతకు కనువిప్పు కలిగే కవితలు కవయిత్రి హృదయాన్ని చీల్చుకుని ఈ పొత్తంలో మొలకెత్తాయి.
నిత్యాగ్నిహోత్రంలా రెండు దేశాల సరిహద్దులే కాదు, దేశాల నడిబొడ్డులు కూడా మారడం నేడు చూస్తూనే ఉన్నాం. అధికార దాహం, అహం జూలు విదిలించినప్పుడల్లా అది చేసే రాజసూయ యజ్ఞంలో సమిధులు లోకం పోకడ తెలియని అమాయకులు, పసిపాపలు. కూడు, గూడు లేని ఓ పసి ప్రాణం చేసే ఆక్రందన ‘యుద్ధభూమిలో – ఇల్లులేని నేను’ కన్నీరు కారుస్తున్న అక్షరంగా కనబడుతూ మనకు వినిపిస్తుంది ఇలా..
“ఎన్ని గంటలు గడిచినా పల్చబడని పొగ మబ్బు చాటున
ఆబగా నోరు తెరిచిన పొరుగు దేశం
జోల పాట వినే చెవిలో
పేలుళ్లు మరీ మరీ మోగుతూ
తెల్లారేసరికి ఊరంతా ఏడుపు పాట!
నాన్న కుడికాలు ఎక్కడో పడిపోయింది
పాడు వాసనేదో పొట్టలో చేరి
పేగుల్ని చుట్టబెడుతోంది
మా బడి కూలిపోయింది.
ఇన్నాళ్ళు మురిపించే గాలి ఓడ
ఇప్పుడు నిప్పులు కక్కుతోంది
సొరంగాల్లో దాచుకున్న కాళ్ళు
అన్నం పొట్లం కోసం పరుగెడదామంటే
అడుగు పడక మొరాయించే ముడుకులు
బతకాలంటే పరుగు తీయాలి
కనుచూపుమేరలో కూలిపోయే వంతెన ఊగులాట.”
ఇలా ఈ ‘నేలపాట’లో కవిత్వం మనల్ని, మన మనసులను కదిలిస్తుంది.
కవయిత్రి ఎంత సున్నిత హృదయురాలో ఈ పొత్తం చదివితే మనకు తెలుస్తుంది. వైద్యం చేసేవారు, ముఖ్యంగా ఆపరేషన్స్ చేసేవారు చాలా కఠినంగా ఉంటారు అనుకునే దాన్ని. కానీ, ఈ డాక్టరమ్మ…. కవయిత్రి కావడం వల్లనో, లేదూ సున్నిత హృదయం చిన్నప్పటి నుండీ ఉండడంవలనో గాని, ఈమె వైద్య కవయిత్రిగా అటు శారీరక రోగులకు, ఇటు స్వార్థమున్న మానసిక రోగులకూ వైద్యం చేస్తున్నారు. ఆమె సున్నితత్వాన్ని ఎంత దగ్గరగా చూశానో, ఈ ‘నేలపాట’ సంకలనంలోనూ అంతే సున్నితమైన ఆమె మనసునూ చూశాను.
ఆమె మనసు పాడే నేల పాటను నేను ఆర్తిగా విన్నాను. మీరు కూడా వినాలి, ఎందుకంటే మనం మనుషులం కదా! భూమి మీద సంచరిస్తున్నాం కదా! అందుకే ఆ భూమి ఆలపించే ఆ పాటలను వినండి. అందుకోసం మీరు సంప్రదించవలసిన నెంబరు…9885401882
*

రాధకృష్ణ కర్రి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు