నీలం రంగు డస్ట్‌బిన్‌లో వెయ్యాల్సిన పొడి చెత్త

Episode: 24

కథా శకలాన్ని చదవండి –

>> మహానగరం

కెఫేలోకి వస్తూనే కిటికీ పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న రఫీని గమనించి అతని దగ్గరకు నడిచి వెళ్ళాడు అరవింద్.

సిటీలో ట్రాఫిక్ అస్సలు భరించలేనంతగా పెరిగిపోతోంది, అంటూ ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అవును, గత కొన్ని ఏళ్లలో హైదరాబాద్ చాలా మారిపోయింది, రఫీ బదులిచ్చాడు. కొన్నిసార్లు ఇది మనం చూసిన పాత ప్రదేశమేనా అనిపిస్తుంది. నిన్న నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ రద్దీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాత ప్రదేశాల్లో మునుపటి ప్రశాంతత లేదు. అన్నాడు అరవింద్.

నిజమే అంటూ రఫీ అంగీకరించాడు. సిటీలో డెవలప్మెంట్ సంగతి ఏమో కానీ, ఈ నగరానికి ఉండే ఫీల్‌ని మార్చేసింది. మనుషులు కూడా మారిపోతున్నారు కదా రఫీ, అన్నాడు అరవింద్. అందరూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు.

“అవును, ఆధునిక జీవనశైలి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోందని నేను అనుకుంటున్నాను,” రఫీ స్పందించాడు.

“నేను కూడా అది గమనించాను,” అరవింద్ ఆలోచనలో పడ్డాడు. “ఇంతకుముందు మనుషులు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు అందరి ధ్యాస ఎక్కడో ఉంటోంది.”

“టెక్నాలజీ, మొబైల్ అందుకు కారణం కావచ్చు,” రఫీ ప్రశాంతంగా చెప్పాడు.

“అవును, సోషల్ మీడియా, మనుషుల మధ్య సంబంధాలను బాగా ప్రభావితం చేసింది,” అరవింద్ బదులిచ్చాడు.

అంతలో ఒక వెయిటర్ వచ్చి టేబుల్ మీద రెండు చాయ్‌లు ఉంచాడు.

చాయ్ సిప్ చేస్తూ రఫీ ఇలా అన్నాడు – “కొన్నిసార్లు మనుషుల్లో సహజత్వం కనుమరుగవుతోందని నాకు అనిపిస్తుంది.”

“బాగా చెప్పావు రఫీ,” అరవింద్ అంగీకరించాడు. “ప్రస్తుత రోజుల్లో చాలా సంభాషణలు పైపైన సాగుతున్నట్టే అనిపిస్తాయి.”

“విజయం సాధించాలనే ఒత్తిడి కూడా మరీ ఎక్కువగా ఉంటోంది,” రఫీ జోడించాడు. “మనశ్శాంతి కంటే ఆశయాలకే ఎక్కువ ప్రాధాన్యత”

“అవును,” అరవింద్ తల ఊపాడు. “సంతోషం అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోకుండానే మనుషులు విజయం వెనుక పరుగులు తీస్తున్నారు.”

కొన్ని సెకన్ల పాటు వారిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత రఫీ కుర్చీలో కొంచెం వెనక్కి వాలాడు.

“అంతా ఎంత కృత్రిమంగా మారుతుందో చూస్తుంటే నీకు ఎప్పుడైనా విసుగు అనిపిస్తుందా?” అని అతను మెల్లగా అడిగాడు.

“అవును,” కాసేపు ఆగి అరవింద్ సమాధానమిచ్చాడు. “ఆధునిక మానవ జీవితం మానసిక అలసటను మాత్రమే మిగులుస్తుందని నేను అనుకుంటాను.”

“నువ్వు చెప్పేది నిజమే,” రఫీ అన్నాడు.

“ఈ పురోగతి నిజంగా మానవ జీవితాన్ని మెరుగుపరిచిందా అని నాకు ఒక సందేహం,” అరవింద్ అన్నాడు.

“అవును. భౌతికంగా మనం ఎదుగుతున్నాం కానీ, మానసికంగా ఎదగట్లేదేమో అనిపిస్తోంది.”

బయట మెయిన్ రోడ్డు నుండి వాహనాల హారన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. కెఫే లోపల వాళ్లిద్దరూ సమాజం, ఆశయాలు, బంధాలు, మానసిక ఆరోగ్యం, మారుతున్న నగర సంస్కృతి గురించి చాలా సేపు చర్చించుకుంటూనే ఉన్నారు. <<

***

ఇది చదివితే ఎలా అనిపించింది?

మీకు ఎక్కడైనా ఏ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి వచ్చిందా? రాకపోయిండచ్చు కూడా. కానీ మళ్లీ ఒకసారి చదవండి.

ఈ సంభాషణ గమనించండి –

>> అవును, గత కొన్ని ఏళ్లలో హైదరాబాద్ చాలా మారిపోయింది, రఫీ బదులిచ్చాడు. కొన్నిసార్లు ఇది మనం చూసిన పాత ప్రదేశమేనా అనిపిస్తుంది. నిన్న నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ రద్దీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాత ప్రదేశాల్లో మునుపటి ప్రశాంతత లేదు. అన్నాడు అరవింద్.

నిజమే అంటూ రఫీ అంగీకరించాడు. సిటీలో డెవెలప్మెంట్ సంగతి ఏమో కానీ, ఈ నగరానికి ఉండే ఫీల్‌ని మార్చేసింది. మనుషులు కూడా మారిపోతున్నారు కదా రఫీ, అన్నాడు అరవింద్. అందరూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు. <<

నేను కావాలనే ఈ వాక్యాల మధ్యలో కొటేషన్లు తీసేసి, డైలాగులకు తగ్గట్లుగా పేరగ్రాఫ్ డివిజన్ చెయ్యకుండా అలా ఇచ్చాను. ఈ మధ్యే ఒక యువ రచయిత, తన తొలి నవల మొత్తం ఇలాగే రాయడం చూశాను (తప్పు రచయితది కాదు, ఎడిటర్/పబ్లిషర్‌ది). పది పేజీలు చదివిన తరువాత రచయితకి మనసులోనే క్షమాపణ చెప్పి పుస్తకం పక్కన పడేశాను. మామూలుగా నేను చదివేసిన పుస్తకాన్ని, చదివే అలవాటున్నవాళ్లు ఉండే చోటుకి చేరుస్తాను. రచయిత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఈ పుస్తకాన్ని పాత పేపర్లతోపాటు అమ్మేయడమే మేలని నిర్ణయించుకున్నాను. సంభాషణ ఒక కథని, ఒక నవలని ఎలా చంపేస్తుందో చూసిన తరువాత, దాదాపు ఆపేసిన ఈ శిర్షికను కొనసాగిస్తున్నాను.

మనం మళ్లీ పైన చదివిన కథలో వద్దాం.

పైన ఉదహరించిన భాగం వదిలేసి మిగిలిన కథ చూడండి. హైదరాబాద్‌లో ఒక కెఫేలో ఇద్దరు విద్యావంతులు కూర్చుని మారుతున్న నగరం, సంస్కృతి, ఆధునిక జీవితం గురించి చర్చించుకుంటున్నారు. వ్యాకరణం బాగుంది, సంభాషణ ఎక్కడా ఆగకుండా సాగింది, వాతావరణం కూడా సహజంగానే అనిపిస్తుంది. పైపైన చూస్తే ఈ రచనలో పెద్ద లోపాలు ఏం లేవు కదా అనిపించచ్చు. కానీ, ఒక పాఠకుడిగా మీరు ఈ కథతో మమేకం కాగలిగారా? కష్టం. ఎందుకు? జాగ్రత్తగా గమనిస్తే ఇది చాలా సాదా సీదా సంభాషణ అని మీకే అర్థమౌతుంది. అంతేకాదు – మొదటి పేరాలలో ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి దని మనం చెప్పుకున్నాం కదా? నిజానికి ఆ సమస్య రచన మొత్తంలో ఉంది. అదెలాగో మీకు అర్థమయ్యేలా చెప్తాను.

రెండు పాత్రలు – అరవింద్, రఫీ. బహుశా స్నేహితులే అయ్యుంటారు. వీళ్లు చెప్పిన డైలాగ్స్ కింద ఇస్తున్నాను. మీకు కథ చదివారు కాబట్టి, ఈ డైలాగుల్లో ఏ డైలాగ్ అరవింద్ చెప్పాడో, ఏ డైలాగ్ రఫీ చెప్పాడో కనుక్కోగలరేమో ప్రయత్నించండి.

“ప్రస్తుత రోజుల్లో చాలా సంభాషణలు పైపైన సాగుతున్నట్టే అనిపిస్తాయి.”

“విజయం సాధించాలనే ఒత్తిడి కూడా మరీ ఎక్కువగా ఉంటోంది”

“ఈ పురోగతి నిజంగా మానవ జీవితాన్ని మెరుగుపరిచిందా అని నాకు ఒక సందేహం”

“ఆధునిక జీవనశైలి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోందని నేను అనుకుంటున్నాను”

ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇందులో ఉన్న రెండు పాత్రలు ఒకేలా మాట్లాడుతున్నాయి కాబట్టి. అందువల్ల ఏం జరిగింది? ప్రతి పాత్రకి సంభాషణలో ఎలాంటి ప్రత్యేకత (Individuality) లేదు. ప్రతి పాత్రని (అన్నాడు అరవింది. చెప్పాదు రఫీ అని) పేరు చెప్పకపోయినా కేవలం వాళ్ల మాటలని మాత్రమే చదివి ఎవరు మాట్లాడుతున్నారో పాఠకులు చెప్పగలగాలి. అలా రచయిత రాయగలగాలి. అదెలా చెయ్యాలి? చాలా సులభం. నేను మీకు ఉదాహరణ ఇస్తే పై రచనలో అలా చేసేందుకు ఉన్న బంగరం లాంటి అవకాశాన్ని రచయిత వదిలేసుకున్న సంగతి మీకూ అర్థమౌతుంది.

“విజయం సాధించాలనే ఒత్తిడి కూడా మరీ ఎక్కువగా ఉంటోంది” అనే బదులు

“హౌ భాయ్! ఎవలని జూశినా గెలవాలె, గెలవాలె అని ఉరుకులే. ఇది కూడా ఒత్తిడి పెంచుతది కదా?” అనీ

“ఈ పురోగతి నిజంగా మానవ జీవితాన్ని మెరుగుపరిచిందా అని నాకు ఒక సందేహం” అనే బదులు

“ఏమిటంట మనం పురోగతి, పురోగతి అని చెప్పుకునేది? ఎంత వెతికినా నాకేం కనపడటం లేదు. నీకేమైనా కనిపిస్తే చెప్పు.” అనీ రాశారనుకోండి. ఇప్పుడు ఈ రెండు పాత్రలలో ఏ డైలాగ్ ఇచ్చినా అది ఎవరు చెప్పారో వెంటనే చెప్పగలుగుతారా లేదా? ఇది పాత్రలని తెలంగాణా ముస్లిం, ఆంధ్రా హిందువు చెయ్యడం వల్ల, వాళ్లిద్దరి యాసలో ఉన్న తేడా వల్ల జరిగిందని మీకనిపిస్తోందా? కొంతవరకు నిజమే, కానీ దాన్ని మించినది ఇంకొకటి ఉంది. అది పాత్ర గొంతు.

మన ఉదాహరణలో ఉన్న రెండు పాత్రల గొంతులు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ సామాజిక విశ్లేషకులుగా మాట్లాడుతున్నారే తప్ప, వ్యక్తులుగా కాదు. రఫీని, అరవింద్‌ను వేరు చేసే వ్యక్తిత్వ లక్షణమేదీ కనపడటంలేదు. ఇద్దరూ మూసపోసినట్లు ఒకేలా ఎందుకు మాట్లాడాలి? ఆధునిక జీవితం మనమీద చూపిస్తున్న ప్రభావాం గురించి చర్చ. దానికి రఫీ, అరవింద్ ఒకేలా ఎందుకు ప్రతిస్పందించాలి? మన నిజ జీవితంలోనే తీసుకోండి. అలాంటి జీవితానికి అలవాటుపడిన వ్యక్తులు చాలామంది ఉంటారు. చిరాకుపడుతూ బతికేవాళ్లు ఉంటారు. కోపంతో కొంతమంది, ఇదంతా అంతర్జాతీయ రాజకీయల కుట్ర అని అసహనంతో ఇంకొంతమంది, మనం ఏమీ చెయ్యలేమనే నిస్పృహతో కొంతమంది, ఇవన్నీ ఇస్తున్న సుఖాలని అనుభవిస్తూ “ఎంజాయ్” అని బ్రతికేవాళ్లు ఇంకొంతమంది, అసహనాన్ని కప్పిపుచ్చుకోడానికి రోజూ నాలుగు గంటలు ఏదో పార్క్‌లో కూర్చుని ప్రశాంతమైన నగరం అని తమని తామే మోసం చేసుకుంటూ ఇంకోంతమంది – ఇలా ఎన్నో రకాలుగా రియాక్ట్ అయ్యేవాళ్లు ఉంటారు. మరి ఇన్ని రకాలుగా స్పందించే మనుషులు ఉండే అవకాశం ఉన్నప్పుడు, ఒకే రకంగా స్పందించే ఇద్దరు మనుషులని తీసుకొచ్చి ఒక కెఫేలో పడేసి మాట్లాడుకోమని చెప్తే, ఆ సంభాషణ పేలవంగా కాక ఇంకెలా ఉంటుంది?

“ఏమిటంట మనం పురోగతి, పురోగతి అని చెప్పుకునేది? ఎంత వెతికినా నాకేం కనపడటం లేదు. నీకేమైనా కనిపిస్తే చెప్పు.” అనీ రాసి ఉంటే అరవింద్ వెటకారంలో ఒక అసహనం వినపడేది. రఫీ మాటల్లో concern ఉండి, అరవింద్ మాటల్లో అసహనం వల్ల వచ్చిన వెటకారం ఉండి ఉంటే, ఈ సంభాషణ చదవటం ఎంత బాగుండేది? ఇంత చిన్న మార్పు రచయిత ఎందుకు చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? ఆలోచించి ఉంచండి. తరువాత చర్చిస్తాను. ఈలోగా మరో అడుగు ముందుకువేద్దాం.

అసలు ఈ సన్నివేశం ఉద్దేశ్యం ఏమిటి? ఆధునిక జీవితం – మానవ సంబంధాల మీద ప్రభావం అనే చర్చా కార్యక్రమమా? అదే నిజమైతే, ఆ విషయాన్ని పాఠకులకి చెప్పేందుకు కథ అనే ప్రక్రియ ఎంచుకున్నందుకు ఆ రచయితకి నా సానుభూతి, నివాళి. నిజంగా అదే విషయాన్ని పాఠకులకి చెప్పాలని అనుకుంటే కథ మొత్తంలో ఎక్కడా ఆధునిక జీవితం, మానవ సంబంధాలు అనే పదాలు లేకుండా కథ రాయాలి. సన్నివేశాల ద్వారా ఆధునిక జీవితం చూపించాలి, కథలో జరిగే సంఘటనల ద్వారా ఆ జీవితం మానవ సంబంధాల మీద చూపిస్తున్న ప్రభావాన్ని పాఠకులు గ్రహించేలా చెయ్యాలి. అంతే కానీ ఇద్దరి మధ్య సంభాషణ ద్వారా చెప్పాలనుకున్న వ్యాసాన్ని కథ చేద్దాం అనుకుంటే అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు.

కాదు, ఈ కథ / నవల దాని గురించి కాదు, కేవలం ఈ సన్నివేశంలో ఇద్దరు పాత్ర మిత్రులు కలిసి మాట్లాదుకోవాలి. అందుకు ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను అని రచయితగారు చెప్పారనుకోండి. ఆ దృష్టితో కూడా పై కథని చూద్దాం.

మీరు రాస్తున్న కథకి / నవలకి ఈ సన్నివేశం చేరుస్తున్నదేమిటి? Value add అంటారు కదా? అదేమిటి? కేవలం గాలిలో తేలుతున్న సంభాషణా? ఒక స్క్రిప్ట్ ప్రకారం చప్పగా సాగే చర్చా కార్యక్రమా? దాని వల్ల కథకి ఒరిగేదేమిటి? పాత్ర చిత్రణ జరుగుతోందా? ఆ పాత్రల స్వభావ చిత్రణ, ఆలోచనా తీరు పాఠకులకి అర్థమయ్యేందుకు కల్పించబడిందా? కథ టోన్ ఎలా ఉండబోతుందో చెప్తోందా? తరువాత కథలో ఎప్పుడో శత్రువులుగా మారబోయే ఇద్దరు మిత్రుల స్వభావ, లక్షణాలను ప్రదర్శించడానికి వాడబడుతోందా? ఒక నాటకీయ ఉత్కంఠ (Dramatic tension) కల్పించడానికి ఉపయోగపడుతోందా? కనీసం పాఠకులు మరో రెండు పేజీలు చదివేందుకు అవసరమైన ఉత్సుకతను, ఆసక్తిని కలిపించడానికి వాడబడుతోందా? వీటన్నింటికి రచయిత సమాధానం “కాదు” అయితే ఈ సన్నివేశాన్ని కథలో పెట్టాకుండా, పొడి చెత్త వేసే నీలం రంగు డస్ట్‌బిన్‌లో వేయడం రచయితకి, పాఠకులకి శ్రేయస్కరం.

ఇంతకు ముందు మనం విశ్లేషణలో రెండు పాత్రల గొంతులు ఒకేలా ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ గొంతుల్లో కొంత వైవిధ్యాన్ని తీసుకురావడం ద్వారా సంభాషణని ఆసక్తికరంగా మార్చవచ్చని చెప్పుకున్నాం. పైన చెప్పినట్లు ఆ సన్నివేశం కథకి/నవలకి ఎలాంటి ప్రయోజనకారి కాలేదు అంటే దానికి ఉండే అనేక కారణాలలో ఒకటి – అ సంభాషణలో ఎలాంటి ఘర్షణ (conflict) లేకపోవటం. మన కథలో ఎక్కడా అరవైంద్, రఫీ ఒకరి మాటను ఒకరు అడ్డుకోవడం జరగలేదు లేదు. రెండు పాత్రలు ఒకే రకంగా మాట్లాడటం మాత్రమే కాదు, ఒకే రకంగా ఆలోచించడం ఇందుకు కారణం. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను –

రఫీ మాటల్లో concern ఉండి, అరవింద్ మాటల్లో అసహనం వల్ల వచ్చిన వెటకారం ఉండి ఉంటే, ఈ సంభాషణ చదవటం ఎంత బాగుండేది? ఇంత చిన్న మార్పు రచయిత ఎందుకు చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? అని అడిగాను

సమాధానం తట్టిందా?  నా అభిప్రాయం వినండి.

అసలు అక్కడ రఫీ, అరవింద్ అని రెండు పాత్రలు లేవు. రచయితే రెండు పాత్రలుగా మారి, ఎదురెదురుగా కూర్చుని ఈ చర్చ జరుపుతున్నట్లు ఉంది. ఎవరూ తమని తామే ఖండించుకోలేరు కాబట్టే, రఫీ, అరవింద్ ఒకరితో ఒకరు ఎంతో శాంతంగా, ఏ మాత్రం స్పర్థ లేకుండా “అవును నువ్వు చెప్పేది నిజం” అని ఒకరి ఒకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఈ సన్నివేశంలో ఉన్న సంభాషణలో ఉన్న ప్రధాన సమస్య. ఒక పాత్ర ఒక అభిప్రాయాన్ని చెప్తే ఆ అభిప్రాయాన్ని వంద శాతం అంగీకరించే మరో పాత్ర ఏ రచనకైనా ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పూర్తి వ్యతిరేకత కాకపోయినా, కనీసం స్వల్ప అనంగీకారం ఉంటేనే సంభాషణ ముందుకు సాగుతుంది (నిజానికి పైకి సాగుతుంది – escalation of conversation).

ఇదెలా చెయ్యాలో చెప్పే ముందు మరో మాట.

గతంలో నేను రాసిన వ్యాసాలలో మీజాన్‌సెన్ లాంటివి, ఇంద్రియ అనుభవాల గురించి, ఇలాంటివే మరికొన్ని చెప్పాను. అవి కూడా పాటించని లోపాలు మన ఉదాహరణలో ఉన్నాయి. రెండు పాత్రల మధ్య సంభాషణ అంతా “మానవ జీవన సరళి” ” ఆధునిక సమాజం,” “మానవ సంబంధాల తీరు తెన్నులు ” లాంటి అరూప (Abstract) ఆలోచనల చుట్టూ తిరుగుతున్నాయే తప్ప, భౌతిక చర్యలు లేదా ఇంద్రియ అనుభవాలు ఏమీ లేవు. ఫలితంగా, ఆ కెఫే కేవలం స్టేజ్ వెనుక వేసిన బాక్‌గ్రౌండ్ తెరలాగా మిగిలిపోయింది. దీని వల్ల కూడా సన్నివేశానికి ఒక భావశూన్యత వచ్చింది.

ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని ఎలా మార్చి రాయచ్చో చూద్దాం – అరవింద్ మోడ్రన్ లైఫ్‌కి వ్యతిరేకంగా, రఫీ అందుకు అనుకూలంగా ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని, సంభాషణని ఎలా రాయచ్చు?

>> రఫీ చెప్పిన కెఫేలోకి అడుగుపెట్టబోతూ బయట నిలబడి ఉన్న పదేళ్ల పిల్లాడిని చూశాడు అరవింద్. వంటి మీద చొక్కాలేదు. వంటినిండా మట్టి, గ్రీజులాంటి మరకలు. కుడిచేతిని ఏదో తినాలి అన్నట్లు చూపించి, ముందుకు చాచాడా పిల్లాడు. అరవింద్ ఒక్క క్షణం ఆ పిల్లాడి వైపు చూసి జేబులో నుంచి పది రూపాయలనోట్లు రెండు తీసి చేతులో పెట్టాడు. ఆ పిల్లాడి ముఖం వెలిగిపోయింది.

లోపలికి వెళ్లగానే ఇరానీ చాయ్ సువాసన, గోలగోలగా ఉన్న సంభాషణలు అతనిని చుట్టుముట్టాయి. కిటికీ దగ్గర కూర్చుని ఉన్న రఫీ దగ్గరకి వెళ్లి “ఎలా ఉన్నావ్” అంటూ కూర్చున్నాడు.

“మంచిగున్నా” అన్నాడు రఫీ. రెండు క్షణాల తరువాత “ఎంత ఇచ్చినవ్ ఆ పోరగానికి?” అన్నాడు

వెయిటర్ వచ్చి టేబుల్ మీద రెండు చాయ్‌లు ఉంచాడు.

“పాపంరా! ఇంత పెద్ద మహానగరంలో, ఈ ఉరుకుల పరుగుల మధ్య, వాడు కూడా బతకాలి కదా?” అరవింద్ అన్నాడు.

“ఇంత పెద్ద మహానగరం కాబట్టే వాడు కూడా బతగ్గలుగుతున్నాడు. ఉరుకులు పెట్టేటోళ్లు ఇంతమంది ఉన్నరు కాబట్టే వానికి అంత గనం పైసలు దొరుకుతున్నాయ్” రఫీ టీ కప్ అందుకోని చెప్పాడు.

“ఇది మహానగరం కాదురా కొండచిలువ. ఎంతటి వాళ్లనైనా మింగేసి, మెత్తగా చెట్టుకు చుట్టుకుని పడుకుంటుంది,” అరవింద్ మాటల్లో అసహాయత రఫీకి అర్థమైంది.

“జానే దే! ఇప్పుడు నువ్వేమన్నా ఆ కొండచిలువని జంపాల్నా? సమాజాన్ని మార్చాల్నా? ఇది ఇట్లే ఉంటది. దాన్ని మనం ఏం జెయ్యలేం. మనం ఎట్లా ఉండాలె అనేటిది మాత్రం మనం డిసైడ్ జేసుకోవాలె” అన్నాడు రఫీ సిగరెట్ వెలిగిస్తూ.<<

మొదటి ఇచ్చిన ఉదాహరణలో ఉన్న సంభాషణకీ, ఈ సంభషణకి ఉన్న వ్యత్యాసం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.

ఈ భాగాన్ని ఇక్కడితో ఆపుతున్నాను. మళ్లీ కలిసినప్పుడు మరికొన్ని “సమ్‌భాషణలు”

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు