కవిత్వానికీ వచనానికీ మధ్య సరిహద్దురేఖలు

నేను కవిత్వం చదివాను. వచనం కూడా చదివాను. కాని యేది యెందుకు వచ్చనమో, యేది యెందుకు కవిత్వమో చెప్పలేను. నేను వయసులో వున్నప్పుడు చదివిన ఇంగ్లీషు నవల “మై కజిన్ రేచెల్” మొదటి అధ్యాయం ఆ సరిహద్దు రేఖలను తుడిచి పెట్టినట్టు తోస్తుంది. అది వెన్నాడుతూ వుంది. మరచిపోలేనంతగా. వ్రాసింది డేఫ్నే డు మోరియే. ఈ మొదటి అధ్యాయం లో వున్న కవితాత్మకత తర్వాత వుండదు. వొక సస్పెన్స్ కథ లా సాగిపోతుంది. మనల్ని కూడా నిలవనివ్వదు. చివరికొచ్చేసరికి మ్రాంపడిపోతాం. శరీరానికి వస్తే కేన్సరు, మరి మనసుకు వస్తేనో? ఒక సమాధానం దొరకని ప్రశ్న. మీమాంస.
   ఇలాంటి కొన్ని సందర్భాలు వున్నాయి. Fiction-Non fiction ల మధ్య కూడా సరిహద్దులు చెరిపేసిన సందర్భాలూ వున్నాయి. అవి మరో సారి. ఈ పక్షం పైన చెప్పిన నవల లోని మొదటి అధ్యాయం. గమ్మత్తుగా ఈ నవల చివరి వాక్యాలు కూడా :
పాత రోజుల్లో నాలుగు రోడ్ల కూడలిలో మనుషులను ఉరి తీసేవారు.
    అదంతా పాత రోజుల్లో. ఇప్పుడు కాదు.
          చదివి మీకేమనిపిస్తుందో వ్రాయండి. ఇది వొక సంభాషణా ఆరంభం.
    పాత రోజుల్లో నాలుగు రోడ్ల కూడలిలో మనుషులను ఉరి తీసేవారు.
    అదంతా పాత రోజుల్లో. ఇప్పుడు కాదు. ఇప్పుడు హంతకుడు కోర్టులో సరిగ్గా న్యాయ విచారణ జరిగిన తర్వాత గాని జైల్లో ఉరితీయబడడు. అదీ చట్టం తీర్పు వినిపించే ముందే అతని అతరాత్మ అతన్ని చంపివుండకపోతేనే. అదే నయం. వో ఆపరేషనులాగా. కనీసం మర్యాదపూర్వక ఖననం అయినా దక్కుతుంది, అనామక గోరీ కింద. నా చిన్నప్పుడు కథ వేరేలా వుండేదిలే. నా చిన్నతనపు వొక జ్ఞాపకం : నాలుగు రోడ్ల కూడలిలో వొకతని శవం వేలాడుతూ వుంది. యెక్కువ రోజులుండాలని అతని ముఖానికీ, వొంటికీ తారు పూశారు. అయిదు వారాలపాటు అది అక్కడ అలాగే వేలాడుతూ వుంది. నేను చూసినప్పటికి నాలుగో వారం.
    ఆకాశానికీ, భూమికీ మధ్య ఉరిమానుకు వేలాడుతుంది అతని శవం, లేదా అన్న ఆంబ్రోస్ అన్నట్టు స్వర్గానికీ నరకానికీ మధ్య వేలాడుతుంది అతని శవం.
స్వర్గమా అతనికి యెప్పటికీ అందదు. అతను చూసిన నరకం నుంచి ఇపుడతను నిర్వాసితుడు. ఆంబ్రోస్ వో కర్రతో పొడిచాడు అతన్ని. ఒకప్పుడు ప్రాణంతో వుండి మనిషనిపించుకున్న ఆ దిష్టిబొమ్మ ఇప్పుడు ఉరిమానుకున్న తుప్పు పట్టిన వొంకీకి వేలాడుతూ, వూగుతూ వుండడం చూశాను. వర్షానికి అతని పంట్లాము చివికిపోయి, వాచిన జబ్బల పైని అతని అంగవస్త్రం పీలికలు వేలాడుతూ వున్నాయి.
   అది చలికాలం. యెవరో తుంటరోడు అతని బట్టలకు వో మోదుగ కొమ్మ గుచ్చినట్టున్నాడు అలంకారంలా. యేడేళ్ళ నా వయస్సులో అది చాలా అవమానకర చర్య అనిపించింది, కానీ యేం మాట్లాడలేదు. ఆంబ్రోస్ నన్ను యేదో కారణంతోనే అక్కడికి తీసుకెళ్ళివుంటాడు. నేను భయపడతానా లేదా, భయపడి పారిపోతానా, నిలబడి యెదురుకొంటానా, నేను నవ్వుకుంటానా యేడుస్తానా, నా ధైర్యం లేదా పిరికితనం యేపాటిదో చూద్దామని నన్ను తీసుకెళ్ళి వుంటాడు. నా సంరక్షకుడు, అన్న, తండ్రి, నా సలహాదారు క్లుప్తంగా చెప్పాలంటే నా సమస్త ప్రపంచం అయిన ఆంబ్రోస్ నన్ను యెప్పుడూ పరీక్షలకు గురి చేస్తూనే వున్నాడు. కాసేపు మేమిద్దరం ఆ ఉరిమాను చుట్టూ తిరిగాము. ఆంబ్రోస్ కర్రతో అతన్ని పొడుస్తూనే వున్నాడు. తర్వాత తన పైప్ వెలిగించుకుని, నా భుజం మీద చేయి వేసి అన్నాడు : అదీ ఫిలిప్. మనందరం చివరికి ఇలానే జీవితాన్ని ముగిస్తాం. కొంతమంది యుధ్ధభూమిలో, మరికొంతమంది పడకలో, ఇతరులు తమ కర్మానుసారం. తప్పించుకోలేము. నువ్వు చిన్నపిల్లవాడివి. నీకు అర్థం కాదు. వీడు చూడు, యెలాంటి మృత్యువును పొందాడో. నీకూ నాకూ వొక హెచ్చరికలా, తాగుడుకు బానిసవకుండా, వివేకంతో బతకమని.
    మేమిద్దరం ఆ వూగుతున్న శవం యెదుటే నుంచుని వున్నాము. అది నాకు, దాని తలకు గురి చూసి బాణం వేయగలిగితే బహుమతి వచ్చే  సర్కస్సులో శాలీ విగ్రహం లానే వుంది. ఆంబ్రోస్ ఇలా అన్నాడు : ఉద్రేకం మనిషిని యెలాంటి పరిస్థితులకు తీసుకొస్తుందో చూశావా. ఈ టాం జెంకిన్స్ స్వతహాగా మంచివాడే, కాస్త మొద్దు, కానీ పక్కా తాగుబోతు. అతని భార్య గయ్యాళే అనుకో. అయితే మాత్రం చంపేస్తారా? అదే నిజమైతే యెన్ని హత్యలైవుండాలో కదా. మగాళ్ళందరూ హంతకులయ్యేవారు కాదా.
     ఆంబ్రోస్ అతని పేరు చెప్పి వుండాల్సింది కాదు. అప్పటిదాకా అది వొక అనామక శవం. ఇప్పుడు దాని ఉనికి తెలిసింది. ఇప్పుడిక ఇది నా కలల్లో వచ్చి భయభ్రాంతుల్ని చేస్తుందేమో. ఇప్పుడు ఇందాక దాకా అనామకమైన ఈ శవం బదులుగా నా కళ్ళ ముందు టవునులో యెండ్రకాయలు అమ్ముకునే మనిషి తడి కళ్ళు తేలుతున్నాయి.రేవు మెట్ల మీద పక్కన బుట్ట పెట్టుకుని కూర్చునేవాడు. పిల్లలు వస్తే కొన్ని యెండ్రకాయలని బుట్టలోంచి తీసి నేల మీద వదిలేవాడు. అవి పరుగు  పోటీ చేస్తే పిల్లలు నవ్వుకునేవారు. ఇది చూసి యెంతో కాలం కాలేదు.
    నీకు ఇది చూస్తే యేమనిపిస్తుంది? అడిగాడు ఆంబ్రోస్.
    తెలీదు అని సూచిస్తూ నా భుజాలు యెగరేశాను. కాలితో ఉరిమానును తన్నాను. నాలోపల భయమూ, వివరించలేని అస్వస్థత వున్నట్టు ఆంబ్రోస్ కి తెలియకూడదని ఆ చర్య. తెలిస్తే నన్ను నిరసనగా చూస్తాడు 27 యేళ్ళ ఆంబ్రోస్, నా జీవితానికే దేవుడు లాంటి వాడు, నా ఆదర్శపు నమూనా.
   నేను చివరిసారి చూసినప్పుడు అతని ముఖం వెలుగుతూ వుండేది, ఇప్పుడు అది అతని యెండ్రకాయలు కూడా తాకవేమో అన్నట్టుంది అన్నాను.
   ఆంబ్రోస్ నవ్వాడు. నా చెవి లాగుతూ అన్నాడు : తత్త్వవేత్తలా మాట్లాడావే. నీకంత రోతగా వుంటే అక్కడ ఆ కంచె దగ్గర కూర్చో. నేను నిన్ను కలవలేదనుకో.
   ఆంబ్రోస్ వెనుతిరిగి ఇంటి ముఖం పట్టాడు. అప్పటికి నేను కంచె వరకూ వెళ్ళనే లేదు. కాస్త స్వస్థత చేకూరినట్టు అనిపించింది. చలికో మరెందుకో పళ్ళు పటపట లాడుతూనే వున్నాయి. టాం జెంకిన్ తిరిగి తన ఉనికిని కోల్పోయాడు. మరలా వో ప్రాణంలేని బస్తాలా వేలాడుతూ కనిపిస్తున్నాడు. చేతికందిన రాయిని తీసుకుని దానితో కొట్టాను. క్షణం పాటు వూగింది అది. అంతే. మరేం కాలేదు. నాకే సిగ్గేసి ఆంబ్రోస్ వెళ్ళిన దారంట పరుగు తీశాను.
    అది జరిగి 18 యేళ్ళు. గత కొద్ది రోజుల్లో తప్ప యెప్పుడూ దాన్ని తలచుకోనూ లేదు. జీవితంలోని అసమంజస క్షణాల్లో మనస్సు బాల్యంలోకి చెరుకుంటుందేమో. పాపం టాం జెంకిన్ అలా గొలుసులకు కట్టివేయబడి వేలాడుతూ. అతని గురించి యెవరూ తలచుకోవట్లేదేమో. వూళ్ళో వాళ్ళు కూడా అతని గురించి చర్చించుకున్నట్టు వినలేదు. తన భార్యని చంపేశాడన్నాడు ఆంబ్రోస్. అంతే తెలుసు. ఆమె గయ్యాళట. కాని అంతమాత్రానికే చంపేస్తారా? బాగా తాగి వున్నాడేమో, ఆ మత్తులో చేసుండాలా పని. కాని యెలా చంపాడో? దేనితో చంపాడో? కత్తితోనా? వుత్త చేతులతోనా? బహుశా బారు నుంచి బయటికొచ్చి రేవు వైపు వెళ్ళాడేమో ఆ చల్లని వెన్నెల రాత్రి. అలలు తీరానికేసి కొట్టుకుంటున్నాయి. నీళ్ళల్లో చంద్రుడు మెరుస్తున్నాడు. అతని అశాంత మనస్సులో యెలాంటి కలలు విజయోత్సాహంతో నింపాయో. ఆ అలలతోటే అతని మనసులో యెలాంటి స్వాప్నిక ఉద్వేగాలు లేచాయో.
    చర్చి వెనుక వున్న తన ఇంటికి తూలుతూ వెళ్ళి వుంటాడు. తడి, మురికి కాళ్ళతో ఇంట్లోకొచ్చినందుకు భార్య కయ్యి మని వుంటుంది. ఆ దెబ్బకి అతను కంటున్న స్వప్నం విరిగి వుంటుంది. అంతే, అతను ఆమె హత్య చేసి వుంటాడు. అంతే అయి వుండాలి అతని కథ. మనం నమ్ముతున్నట్టు మరణానంతరం కూడా వొక అవస్థ వుంటే నేను టాం ను కలవాలనుకుంటాను. ఇద్దరం పాపవిమోచన బూమి మీద కలుస్తాము. అరవై యేళ్ళ అతనూ, పాతికేళ్ళ నేనూ. ఇద్దరి కలలు మాత్రం వేర్వేరు. లేదులే, టాం ఆ నీడలలోనే వుండాలి, నాకు కాస్త మనస్సాంతి మిగలాలి. ఆ ఉరి నీతోనే పోయింది, టాం. నీ మీద అజ్ఞానంతో రాయి విసిరాను. నన్ను క్షమించు.
    అసలు విషయం యేమిటంటే జీవితం అది యలా వున్నా భరిచాలి, జీవించాలి. రోజువారి జీవన వ్యాపారం కష్టం కాదు. ఆంబ్రోస్ లా శాంతి కాముకుడుగా మారి పార్లమెంటుకెళ్ళగలను. నా కుటుంబసభ్యులందరి లాగానే గౌరవ మర్యాదలు పొందగలను. జనాలను చూసుకుంటూ, పొలం పనులు కూడా చేసుకోగలను. కానీ యెవ్వరూ వూహించనైనా వూహించలేరు నేను మౌనంగా మోస్తున్న నిందారోపణ భారాన్ని, నా సందేహాలని. నేను రోజూ నన్ను నేను అడుగుతాను రేచెల్ అమాయకురాలా, అపరాధినా? నాకే సమాధానమూ దొరకదు. బహుశా పాప పాపవిమోచన లోకంలో దొరుకుతుందేమో.
    ఎంత మెత్తగా పలుకుతుంది ఆమె పేరు నేను పిలిచినపుడు. వొక విషబిందువులా నెమ్మదిగా నా నాలుక మీద నుంచి జారుతూ, పేరుకు తగ్గట్టుగా. ఆ చుక్క నా నాలుక నించి నా యెండిన పెదవి దాకా ప్రయాణించి అక్కడినుంచి నేరుగా నా హృదయంలోకి జారుతుంది. శరీరాన్ని, మెదడునీ శాశించే హృదయంలోకి. యెప్పుడు నాకు విముక్తి? నలభై యేళ్ళకా? యాభై యేళ్ళకా? లేదా దాని ఆనవాలు కొంత నా మెదడులో మిగిలే వుంటుందా? పాలిపోయి, అస్వస్థగా. కొన్ని రక్తకణాలు పరుగు పందెంలో చివరిదాకా స్త్రోతహృదయానికి చేరుకోనే లేవు. చివరాఖరికి నాకు విముక్తి కాంక్ష కూడా మిగలకపోవచ్చు. నేను ఇప్పుడేం చెప్పలేను.
     ఆంబ్రోస్ నాకోసం వదిలిన ఇల్లు వుంది. చెమ్మగిల్లిన గోడలను బాగు చేయవచ్చు. కొండ వాలులో మొక్కలు నాటవచ్చు. నేను పోయే లోగా అందమైన లొగిలిని వదిలి పోవచ్చు. కాని వో వొంటరి మనిషి అసహజుడు. ఆ అసహజత్వం నుంచే క్లిష్టత వస్తుంది. ఆ క్లిష్టతలోంచి ఊహా ప్రపంచం. అందులోంచి కాస్త పిచ్చి. ఇక అక్కడినుంచి నేను టాం జెంకిన్స్ ను చేరుకుంటాను. బహుశా అతనుకూడా ఇంతే నరకాన్ని అనుభవించి వుంటాడు.
    పద్దెనిమిది యేళ్ళ క్రితం ఆ ఉరిమాను నుంచి జాకెట్ తొడుక్కున్న ఆంబ్రోస్ ఇంటిదారి పట్టాడు. ఇప్పుడు నేను వేసుకున్న జాకెట్ అదేనేమో. ఈ దుస్తులలో నేను అతనిలా యెంతగా మారిపోయానంటే అతని దయ్యంలా అనిపిస్తుంది. నా కను ముక్కు తీరు అతని కను ముక్కు తీరూ ఒక్క తీరే. నేనెప్పుడూ అతనిలాగే కావాలనుకున్నాను. అతని ఎత్తు, అతని భుజాలు కాస్త వంగినవి, పొడువైన చేతులు, అతని నవ్వు, కొత్తవాళ్ళని కలిసినపుడు అతని బిడియం ఒకటేమిటి అన్నీ. తనని ప్రేమించి, సేవించిన వారి పట్ల అతని స్నేహపూరిత ప్రతిచర్య కూడా. ఆ బలమే చివరికి వొక భ్రాంతిగా నిరూపణ అయి, ఇద్దరమూ వొకే ప్రమాదంలో పడ్డాము. కొన్నాళ్ళుగా ఆలోచిస్తున్నాను. భయమూ, సందేహమూ నరకాన్ని చూపిస్తుండగా వదిలేయబడ్డవానిగా, వొంటరిగా భావిస్తూ, నేను వేళకు చేరుకోలేకపోయిన ఆ ముదనష్టపు ఇంట తన చివరి శ్వాసను వదిలాడా? అందుకని అతని ఆత్మగాని అంత దూరమూ ప్రయాణించి నా దగ్గరకొచ్చి నాలో నివాసముండి చేసిన తప్పులే చేశిందా? ఆ విధంగా మరలా అదే జబ్బుకు లోనై, మరలా మరణాన్ని పొందాడా? కావచ్చు. అతనని లాగే వుండడం నాకు చాలా ఇష్టం, బహుశా ఇదే ఈ అంతానికి కారణమేమో. నేను అలా వుండి వుండకపోతే, తెలివైన మనిషిగా వుండి నా పని నేను చూసుకునే రకం అయి వుంటే, గత సంవత్సరం అంటే అలా వచ్చి అలా పోయిన పన్నెండు నెల్లకు మించి మరేమీ అయి వుండేది కాదు. వో వివాహానికి, వో చక్కని సంసారానికి, మంచి భవిష్యత్తు వైపుకు అడుగులు వేస్తూ వుండే వాణ్ణి.
     కానీ నేను అవేమీ కాదు. ఆంబ్రోస్ కూడా. ఇద్దరమూ పగటి కలలు కనేవాళ్ళమే. మేల్కొన్న ప్రపంచంలో నిద్రపోతూ కలలు కనే వాళ్ళు. ఆచరణాత్మకత యెరుగని, యెప్పుడూ నిగ్గు తేల్చని చాలా సిధ్ధాంతాలతో, ఇతరుల పట్ల అయిష్టతతో, ప్రేమ కొరకు దాహంతో, నిండా సిగ్గు బిడియాలతో . కానీ ఆ ప్రేమే పొందిన నాడు ఇద్దరమూ స్వర్గలోకాన్ని చేరుకున్నట్టు భావించాం. కాని మేము మామూలు మనుషులు గా వుండి వుంటే కథ మరోలా వుండేది. రేచెల్ వచ్చి పోయేది. వో రెండు రోజులు వుండేదేమో. వ్యాపార లావాదేవీలు, చట్ట ప్రకారంగా ఆమెకు అందవలసినవి అందించి వుంటే తన దారిన తను వెళ్ళి పోయేది.
     కానీ అలా జరగలేదు. కారణం నేను ఆంబ్రోస్ లా వుండటమే. మొదటిసారి ఆమె గది తలుపు తట్టి యెత్తు తక్కువ వున్న గుమ్మంలోంచి తల వంచుకుని లోపలికెళ్తుంటే కిటికీ పక్కగా వున్న కుర్చీలో కూర్చున్న తను లేచొచ్చి నా కళ్ళల్లో చూసింది. పరిచయమున్నట్టు. ఫిలిప్ని కాకుండా ఆంబ్రోస్ ను చూస్తున్నట్టు. తను అప్పుడే వెళ్ళిపోయి వుండాల్సింది. తన సామానంతా సర్దుకుని, తన స్వస్థలానికి. ఆమెకు యేదో అంతఃప్రేరణ స్ఫురించి నాతో వుండడం అంటే నా ఆత్మే కాకుండా తను కూడా సర్వనాశనం అవుతుందని ఆమెకు హెచ్చిరిక అంది వుండాల్సింది.
    నన్ను వో పరిచయస్తుణ్ణి చూస్తున్నట్టు నిలబడింది ఆమె మాత్రమే కాదు, మొన్న రైనాల్డి కూడా. బహుశా పాతికేళ్ళ వయసులో ఆంబ్రోస్ కూడా నాలాగే వుండి వుంటాడు.
    కాని చెయ్యగలిగింది యేమీ లేదు. జీవితంలో వెనక్కు ప్రయాణించలేము. జీవితం లో వెనుతిరగడం వుండదు, రెండవ అవకాశమూ వుండదు. వాక్కూ తిరిగి రాదు. చేసిన చర్య కూడా మాసిపోదు. నేను ఇక్కడే ప్రాణంతో కూర్చుని వున్నా ఆ వేలాడుతున్న టాం జెంకిన్స్ వలె వున్నాను.
    కొన్ని నెల్ల క్రితమే, కొన్ని నెలలా కొన్ని యుగాలలా వుంటేనూ, నా ఇరవై అయిదో పుట్టినరోజు నాడు నా సంరక్షకుడూ, జ్ఞానపిత అయిన నిక్ కెండాల్ యెలాంటి శషబిషలు లేకుండా చెప్పాడు. “ఫిలిప్, ఇది యెందుకు చెప్తున్నానో నాకే తెలీదు కాని చెప్పలేకుండా వున్నాను. కొందరు ఆడవాళ్ళు వుంటారు. కారణం యేమిటో కాని వాళ్ళు ముట్టుకున్న ప్రతీదీ వాళ్ళ తప్పిదం లేకుండానే సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు ముట్టుకున్న ప్రతీదీ విషాదానికి దారి తీస్తుంది.” నా దగ్గర దస్తావేజు మీద సంతకం తీసుకుని సాక్షి సంతకం పెట్టాడు.
     ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళడానికి మార్గాలు మూసివేయబడ్డాయి. ఆమె పుట్టినరోజు నాడు ఆమె కిటికీ కింద నిలబడ్డ ఆ కుర్రాడు, ఆ సాయంత్రం ఆమె వస్తున్న దారిలో యెదురైన ఆ కుర్రాడు ఇప్పుడు లేడు. లేని ధైర్యాన్ని ప్రదర్శించడానికి ఆ శవం మీద రాయి రువ్విన ఆ బాలుడిలాగే వెళ్ళిపోయాడు.  టాం జెంకిన్, చావు దెబ్బలు తిని ఉనికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మానవత్వమా, యెవరూ గుర్తుపట్టలేని, యెవరూ బాధపడని టాం జెంకిన్, ఇన్నేళ్ళూ వెనుతిరిగి భవిష్యత్తులోకి పారిపోతున్న నన్ను నువ్వు జాలిగా చూస్తూ వుండినావా?

నేను గనుక ఆ క్షణంలో వెనుతిరిగి చూసి వుంటే ఆ గొలుసులకు కట్టివేయబడి వేలాడుతున్న నిన్ను కాదు, నా నీడను చూసి వుండేవాడిని.

*
పరేశ్ దోశి

పరేశ్ దోశి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు