ఉదయాలు అనేకం 

III
మూడో విదూషకుని రంగప్రవేశం
విదూషకుడు చిద్విలాసంగా నవ్వుతూ పాదాలకి మ్రొక్కి జాతక గాథ చెప్పటం మొదలుపెట్టెను.
దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నట్లు
వారు దేశాన్ని దోచుకుంటారు
శ్రోతల రంజింప కూనిరాగాల తబలా మీద
కొత్తరాగంతో పాడుతున్న వర్తమాన చారిత్రక పౌరాణిక గాథ
ఇది తళుకులీనుతున్న గాథ
వికటాట్టహాసం చేస్తున్న గాథ
భవిష్యత్తుని నిలవేసి నుదిటిరేకలు, అస్తరేకలు చూసి చెప్తున్న జాతకగాథ
దేవుళ్ళ విందులో మన నాయకులు కీర్తించబడతారు
వ్యాపారస్తులు అడవులకి కాపలాగా ఉంటారు
రాక్షసుల్ని పురాణ పురుషులు హతమొందిస్తూ ఉంటారు
రామరాజ్యంలో వానరసేనంతా తమ హృదయాలను చీల్చి ప్రభువుల చిత్రపటాలు తగిలించుకుంటారు
దేశానికి రూపురేఖలు గీస్తూ పరిశోధనల్లో మునిగిపోతారు పత్రికాధీరులు
నెత్తుటి బొట్లతో కత్తులను సానబెడుతూ ఉంటారు సూద్రపుత్రులు
పుష్పక విమానాలు రెక్కలు విప్పుకుంటూ ఉంటాయి
మన శాస్త్రజ్ఞులు మంత్రాలతో చింతకాయలు రాల్పుతూ ఉంటారు
వైద్యశాలల్లో గోవులు సంచరిస్తూ జనులను శుద్ధి చేస్తాయి
సాధు పుంగవులు దివ్య చరణాలు తాకి వ్యాధులు మటుమాయవుతాయి
చీకటిపారే చోటు లేకుండా పట్టు వస్త్రాల ఆభరణ అలంకారంతో వీధులు శోభిల్లుతాయి
సుభిక్షమైన పొలాలల్లో రత్నాల రాశుల ఊట ఉబుకుతూ ఉంటుంది
ప్రజలు కంఠముల నిండుగా అమృతం తాగి తూగుతూ ఉంటారు
మరణం వెలివేయబడి దీనంగా ప్రతి గడప ముందూ భిక్షాటన చేస్తుంది
వేదఘోష నిత్యం ప్రాణసద్మములను తన్మయం చేస్తుంటే ఏలుకోటి నాట్యం చేస్తూ ఉంటుంది
రాక్షస సంహారంలో శరణు వేడిన అసురులు
యుద్ధంలో దయతలచి పడవేసిన శవాలను తింటూ డొక్కలు పట్టుకు తిరుగుతుంటారు
పాప పరిహారం జరిగిన దేశం
అగరొత్తుల పొగతో చల్లగా కనుకుతీస్తుంది
వేకువన మహాజలాలలో ప్రవిత్రస్నానం ఆచరించి
ఇంద్రధనస్సూర్యునికి నమస్కారాలు అర్పించి
ఋషిపుణ్యుడు గంటముతో మహేతిహాసం రాస్తూ ఉంటాడు.
తొలి వసంతానికి వేవిళ్ళు
తొలి ఉదయానికి వెక్కిళ్ళు
తొలి మెలుకువల చిద్విలాసాలు
ఇది మహాయుగపు ద్వారాలు తెరిచిన కాలం
యుగ పురుషులు అవతరించు సుప్రభాత వేళ
కల్కి నడయాడిన దివ్యభూమి
కలి నశించిన శుభదినపు తరుణఛాయ
ఆనందం రంకేసిన బృందావనం
సంతోషం బుగ్గల్లో కుక్కుకున్న గంగాతీరం
ఆకాంక్షలు పురి విప్పిన సభా ప్రాంగణం
అడవుల హారతి వెలుగులో దేవుడు నైవేద్యం ఆరగిస్తున్న ఝాము
ఇది నవ వసంతం
ఇది నవ ధరణము
ఇది నవ కింకిరం వేళ
శోభిల్లు శోభిల్లు ప్రియా భారతావని
వేల్పు యోనిన పుష్పించిన శిశు పారిజాతమా
యాగాలమాల ధరించిన పావని
మమ్మేలుకొనుమా మమ్మేలుకొనుమా
వర్థిల్లు వర్థిల్లు
వర్థిల్లు వర్థిల్లు
విదూషకుడు ఆ సంధ్యాసమయమున
కరుణాకటాక్షహృదయములు కిక్కిరిసిన ఇరుకుదనంలో ఊపిరి సలపక అసువులు బాసెను.
IV
నాలుగో విదూషకుని రంగప్రవేశం
కాళ్ళకి గజ్జెలు కట్టెను.
వనములు పిడికిలి పట్టెను
మెరుపులు నడుముకి చుట్టెను
ఆడెను ఆడెను చిందాడెను
మబ్బులు డప్పును కొట్టెను
తుఫాను బూరలు మోగించెను
ఆడెను ఆడెను సిగముడిచి ఆడెను
కుంకుమ నది పొంగెను
నెత్తురులా కుత్తెకలో ఊపిరిలా
ప్రవహించెను ఆడి ఆడి
ఎగసోస దిగసోస తీసుకొనెను
మోచేతులు దగ్గరకి చేర్చి మొక్కెను
గాండ్రించి పాడెను:
తూరుపు కురిసెను అగ్గి వర్షమూ
పిడుగులు రాలెను వడగండ్లయ్యీ
జనము కూడెను వెలుతురు పోగై
పోదు వెలుతురు చెరిగి
పోదు వెలుతురు చెరిగి
నదులు పారెను పాల గువ్వలై
ఆవులు బర్రెలు మేకలు మడుసులు చల్లగ పండెరు ఆదమరచి
మాయలమారి దేవుడు హతమ్మయ్యే ఈ ఎర్రనిజామున
వాకిలంతా పొడిచే పొద్దు
వాకిలంతా పొడిచే పొద్దు
కొత్త స్వప్నాల మాయ పగిలెను
కొత్త సమాజాల పేగు కోసెను
బతుకులకి తొలి వెక్కిళ్లు
ఉదయాలు అనేకం
ఉదయాలు అనేకం
ఇంధ్రధనస్సుల మాలకట్టెను లోకం
సకల జగతి నవ్వెను సంకెళ్లు తెంపి
చమురు దీపాల మీద అంటుకునే వెన్నెల
పాడుతున్నాయి సెలయేరులు
పాడుతున్నాయి సెలయేరులు
నిండు ఆకాశం నేలకొంగెను
అడవి కొమ్మల పిరికిట్లో నక్షత్రాలు పంచి పోయెను
కనం కనం వసంతం పొగిలెను
పోరాటాలు మరణించవు
పోరాటాలు మరణించవు
*

గూండ్ల వెంకట నారాయణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.